right to information commission
-
సీఐసీ వద్ద 19 వేల దరఖాస్తులు పెండింగ్
న్యూఢిల్లీ: కేంద్ర సమాచార హక్కు కమిషన్ (సీఐసీ) వద్ద గత ఏప్రిల్ నాటికి 19,233 దరఖాస్తులు, అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్రం బుధవారం లోక్‌సభకు తెలిపింది. పది మంది సభ్యులుండే సీఐసీలో నాలుగు ఖాళీలు ఉన్నాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. 2021–22లో 29,213 దరఖాస్తులు, 2020–21లో 35,178 , 2018–19లో 29,655 పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. -
ఒకే ఉత్తర్వుతో 545 ఆర్టీఐ దరఖాస్తులకు విముక్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సమాచార హక్కు కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక వ్యక్తి దాఖలు చేసిన 545 దరఖాస్తులకు సంబంధించి ఒకే ఉత్తర్వుతో వాటికి మోక్షం కల్పించింది. శ్రీనివాస్‌రెడ్డి అనే న్యాయవాది రాష్ట్ర ఆర్థిక శాఖకు సంబంధించి బడ్జెట్లో వివిధ పద్దుల కింద ఎంతెంత బడ్జెట్ కేటాయించారు..ఎంత ఖర్చు చేశా రో వివరాలు ఇవ్వాలంటూ ఒక్కో అంశంపై పది పేజీలతో కూడిన మొత్తం 545 దరఖాస్తులను ఆర్టీఐ చట్టం కింద దాఖలు చేశారు. సమాచారంకోసం ఒక వ్యక్తి పరి మిత సంఖ్యలోనే దరఖాస్తులు ఇవ్వాలన్న నిబంధనేదీ లేకపోవడంతో న్యాయవాది శ్రీనివాస్‌రెడ్డి వాటిని దాఖలు చేశా రు. ఆర్టీఐ చీఫ్ కమిషనర్ బు ద్దా మురళి ఏడాది కాలంగా ఆ న్యాయవాది ఇచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి.. వాటన్నిటికీ ఒకే ఉత్తర్వునిస్తూ ఆయన కోరిన సమాచారం ఇవ్వాలంటూ ఆర్థిక శాఖను ఆదేశించారు. ఆర్థిక శాఖ అధికారులను ఆర్టీఐ కార్యాలయానికి పిలిపించి ఆ దరఖాస్తులు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకున్నారు. వివరాలు బడ్జెట్ పుస్తకాల్లో ఉంటాయని అధికారులు సమాచారం ఇవ్వగా.. వ్యయం వివరాలు కూడా ఇవ్వాలని చీఫ్ కమిషనర్ ఆదేశించారు. కాగా, ఒకే వ్యక్తి వందల సంఖ్యలో దరఖాస్తులు ఇవ్వడం వల్ల అధికారుల సమయం వృథా అవడమేకాక, కమిషన్‌పై భారం పడుతుందని ఈ సందర్భంగా చీఫ్ కమిషనర్ వ్యాఖ్యానించారు. మరో వ్యక్తి పురపాలక శాఖలో వివరాలు కావాలంటూ రెండు వందలకు పైగా దరఖాస్తులు సమర్పించారని చీఫ్ కమిషనర్ తెలిపారు. వాటికి కూడా ఒకే ఉత్తర్వు జారీ చేశామని చెప్పారు. -
విచారణలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు
టీటీడీకి స్పష్టం చేసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందా? రాదా? అనే అంశం పై సమాచార హక్కు కమిషన్(ఆర్టీఐ) చేస్తున్న విచారణను నిలిపేయడానికి హైకోర్డు నిరాకరించింది. ప్రస్తుత దశలో కమిషన్ విచారణలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో కమిషన్ ఇచ్చే ఉత్తర్వులు కోర్టు తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. తాను కోరిన సమాచారాన్ని ఇచ్చేం దుకు టీటీడీ నిరాకరించడంపై డాక్టర్ వి.రాజగోపాల్ కమిషన్‌ను ఆశ్రయించారు. విచారణ సందర్భంగా పలు రికార్డులను తమ ముందు ఉంచాలని టీటీడీని కమిషన్ ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ టీటీడీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. టీటీడీ ప్రభుత్వ సంస్థ కాదని, అందువల్ల సమచార హక్కు చట్టం పరిధిలోకి రాదని టీటీడీ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి కమిషన్ చేస్తున్న విచారణలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు. -
తాంతియా హల్చల్
కామారెడ్డి, న్యూస్‌లైన్: సమాచార హక్కు చట్టం కమిషనర్ తాంతియా కుమారి శుక్రవారం కామారెడ్డి పట్టణంలో పలు కార్యాలయాలను తనిఖీ చేశారు. అధికారుల పనితీరును ఎండగట్టారు. ముందుగా ఆమె మున్సిప ల్ కార్యాలయాన్ని సందర్శించారు. సమాచార హక్కు చట్టం అమలు తీరుకు సంబంధించిన దరఖాస్తులు, వాటికి ఇచ్చిన సమాధాలు తదితర విషయాలను తెలుసుకున్నారు. దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడంపై ప్రశ్నించారు. చట్టంపై అధికారులకే అవగాహన లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో.. కమిషనర్ ఏరియా ఆస్పత్రికి వెళ్లి వార్డులను పరిశీలించారు. ఆయా వార్డుల్లో రోగులు తమ వెంట తెచ్చుకున్న బెడ్షీట్లే కనిపించడంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు బెడ్షీట్లు ఇవ్వడం లేదా అంటూ ఆస్పత్రి సూపరింటెండెంట్ అజయ్‌కుమార్‌ను ప్రశ్నించారు. గతంలో వచ్చిన బెడ్షీట్లు మాత్రమే ఉన్నాయని, వాటిని ఉతకడానికి పంపామని సూపరింటెండెంట్ చెప్పే ప్రయత్నం చేశారు. వంద పడకల ఆస్పత్రికి ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయిస్తున్నా.. కనీసం బెడ్షీట్లు సమకూర్చకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద పడకల ఆస్పత్రిలో అందుకు రెట్టింపు సంఖ్యలో బెడ్షీట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. సమాచార హక్కు చట్టానికి సంబంధించిన రిజిస్టర్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో సంబంధిత ఉద్యోగి యాదగిరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 23 కాలమ్స్ ఉండే రిజిస్టర్లను వాడాలని సూచించారు. ఆస్పత్రిలో కనీసం సిటిజన్ చార్టర్ లేకపోవడం శోచనీయమన్నారు. వచ్చే నెలలో మళ్లీ కామారెడ్డికి వస్తానని, అప్పటి వరకు రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. వైద్యునిపై ఆగ్రహం ఆస్పత్రిలో వైద్యులతో మాట్లాడుతున్న సమయంలో తనకు కరెంటు షాక్‌తో రెండు చేతులు పోయాయని, తనకు సర్టిఫికెట్టు కావాలని వస్తే ఇవ్వడం లేదని శాబ్దిపూర్ తండాకు చెందిన పంతులు నాయక్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అక్కడే ఉన్న వైద్యుడు సుధీర్.. ‘నీ ప్రాణాలు నిలిపిన నాపైనే ఫిర్యాదు చేస్తావా’ అంటూ కోపానికి వచ్చారు. దీంతో కమిషనర్ తాంతియాకుమారి సదరు వైద్యునిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రెండు చేతులు కోల్పోయిన వ్యక్తి సర్టిఫికెట్ కోసం వస్తే నా ముందే దూషిస్తావా’ అంటూ పది నిమిషాల పాటు క్లాస్ తీసుకున్నారు. రోగి విషయంలో సానుభూతితో వ్యవహరించి, సేవలందించాలని సూచించారు. కమిషనర్ వెంట డీపీఆర్ఓ ఘనీ, కామారెడ్డి ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తహశీల్దార్ సుదర్శన్, ఎంపీడీఓ జయదేవ్ ఆర్య, మున్సిపల్ కమిషనర్ బాలోజీనాయక్, సీఐలు దరావత్ కృష్ణ, సుభాష్‌చంద్రబోస్, ప్రొబెషనర్ డీఎస్పీ రమణారెడ్డి, ఎస్ఐ సాయన్నయాదవ్, ఐసీడీఎస్ సీడీపీఓ శశికళ, పంచాయతీరాజ్ ఈఈ సునీత తదితరులున్నారు. కార్యాలయాల ప్రారంభం సమాచారహక్కు చట్టం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని విద్యానగర్, అజంపురాలో ఏర్పాటు చేసిన కార్యాలయాలను కమిషనర్ ప్రారంభించారు. పట్టణంలోని పలు కార్యాలయాలను తనిఖీ చేశారు. ఆమె శుక్రవారం రాత్రి కామారెడ్డిలో బస చేశారు. శనివారం గాంధారి మండలంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ సభ్యులు ఎంఏ సలీం, ఎంఏ హమీద్, నారాయణ, రవీందర్, విఠల్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శ్యాంగోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.