బోధన్ టౌన్, న్యున్‌లైన్ : రిజిష్టర్‌లలో రోగుల పేర్లు నమోదు చేయడం లేదు. ఏ మందులు ఇస్తున్నారో పేర్కొనడం లేదు. ఇదేమైనా సీ గ్రేడ్ ఆస్పత్రా అంటూ బోధన్ ఏరియా ఆస్పత్రి సిబ్బందిపై వైద్య విధాన పరిషత్ కమిషనర్ స్వర్ణ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులు సరిగా నిర్వహించాలని సూచించారు. జీతాలపైనే కాకుండా సేవలందించడంపైనా దృష్టి సారించాలంటూ మందలించారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఏ గ్రేడ్ ఆస్పత్రిని సీ గ్రేడ్‌గా మార్చేస్తామని హెచ్చరించారు. స్వర్ణ నాగార్జున శుక్రవారం బోధన్ ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి పాలన, మందుల పంపిణీ సరి గాలేకపోవడం, సానిటేషన్ లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాబ్‌లో రోగులకు చేసిన పరీక్షల వివరాలు లేకపోవడంతో టెక్నీషియన్‌పై మండిపడ్డారు. అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు ఖాళీగా ఉందని ఆమె దృష్టి కి తీసుకురాగా త్వరలో భర్తీ చేస్తామన్నారు. అనంతరం మందుల పంపి ణీ విభాగానికి వెళ్లారు. మందుల పంపిణీ వివరాలను ఐదు నెలలుగా నమోదు చేయకపోవడంతో ఫార్మాసిస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటినుంచైనా రిజిష్టర్‌లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఆస్పత్రిలో పారిశుధ్యలోపంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. సానిటేషన్ కాంట్రాక్టర్‌కు బడ్జెట్‌లో 30 శాతం కోత విధించి బిల్లు చెల్లించాలని డీసీహెచ్‌ఎస్ బాలకిషన్, ఇన్‌చార్జి సూపరింటెండెంట్ శివదాస్‌లను ఆదేశించారు. రోగికి అందించే చికిత్స, ఇచ్చే మందుల వివరాలను ప్రతినెల ఉన్నతాధికారులకు పంపితే దానిని బట్టి నిధులు మంజూరు చేస్తారని, రికార్డులు సరిగా నిర్వహించకపోతే నిధులు తక్కువగా వస్తాయని హెచ్చరించారు. ఆర్‌ఎమ్‌ఓ పోస్టును త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ వార్డులో రెండు ఏసీలు అమర్చాలని, పేషంట్‌కు ఇచ్చే చికిత్సతో పాటు రోగి వ్యాధి కేస్ షీట్‌ను మెయిన్‌టెయిన్ చేయాలని సూపరింటెండెంట్‌కు సూచించారు. ఆమె వెంట వైద్య విధాన పరిషత్ డిప్యూటీ కమిషనర్ రామ్‌నాయక్ ఉన్నారు.
సేవల్లో నిర్లక్ష్యం వద్దు..
దేవునిపల్లి : రోగులకు సేవలందించడంలో నిర్లక్ష్యం పనికిరాదని వైద్య విధాన పరిషత్ కమిషనర్ స్వర్ణ నాగార్జున పేర్కొన్నారు. ఆమె శుక్రవారం కామారెడ్డి ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. ఇన్ పేషంట్స్ వార్డులో పర్యటించి రోగులకు అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు. అనంతరం సూపరింటెండెంట్ చాంబర్‌లో వైద్యులతో సమావేశమయ్యారు. ఇన్‌పేషంట్స్‌కు అందిస్తున్న భోజనం విషయమై ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌష్టికాహారం అందించాలని సూచించారు. జేఎస్‌వై, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చే యించుకున్న మహిళలకు డబ్బులు చెల్లించడంలో జాప్యం జరుగుతుండడంపై మండిపడ్డారు. ఆస్పత్రిలో నీటి సమస్య శాశ్వత పరిష్కారంపై దృష్టి సారించాలని సూపరింటెండెంట్ అజయ్‌కుమార్‌కు సూచించారు. ట్రామా కేర్ సెంటర్‌ను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. నాలుగో తరగతి ఉద్యోగులు లేక చాల ఇబ్బందులు పడుతున్నామని నర్సులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. కాంట్రాక్టర్ నుంచి తమకు జీతాలు ఇప్పించాలని సానిటేషన్ సిబ్బంది వేడుకున్నారు. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కమిషనర్ పేర్కొన్నారు. ఆమె వెంట డిప్యూటీ కమిషనర్ లోకనాయక్, ఆర్‌ఏంవో రమణాదేవి, వైద్యులు శ్రీనివాస్, విజయలక్ష్మి, ఉషారాణి, ఫార్మసిస్టు సంతోష్, యూడీసీ యాదగిరి తదితరులున్నారు.
ఇదేమైనా సీ గ్రేడ్ ఆస్పత్రా?
Published Sat, Sep 14 2013 5:07 AM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM
Advertisement
Advertisement