
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ రెండు పథకాలను కలిపి అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో గవర్నర్ గురువారం నిర్వహించిన సమావేశానికి ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ డాక్టర్ యోగితారాణా, ఆరోగ్యశ్రీ సీఈవో మాణిక్‌రాజ్, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ..తాను ఇటీవల సీఎం కేసీఆర్‌తో సమావేశమైనప్పుడు ఆయుష్మాన్ భారత్ అమలుపై చర్చించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను పంపిస్తానని, వారితో చర్చించాలని సీఎం చెప్పారన్నారు. వివిధ రాష్ట్రాలు అక్కడున్న ఆరోగ్య పథకాలతో కలిపి కొన్ని మార్పులతో అమలు చేస్తున్నాయని ఆయుష్మాన్ భారత్‌ను గవర్నర్ తెలిపారు. పట్టింపులకు పోకుండా ప్రజలందరికీ ఆరోగ్య సేవలు ఎలా అందించాలో ఆలోచించాలన్నారు. కేసీఆర్ కిట్, కంటివెలుగు తదితర పథకాల అమలుతీరును గవర్నర్ ప్రశంసించారు.
ఈ సమావేశానికి హాజరైన నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్‌హెచ్‌ఏ) డిప్యూటీ సీఈవో డాక్టర్ ప్రవీణ్ గోయి మాట్లాడుతూ.. హైదరాబాద్ హెల్త్ హబ్ గా రూపుదిద్దుకున్నందున మహారాష్ట్ర, కర్ణాటక సహా పలు రాష్ట్రాల నుంచి ఆయుష్మాన్ భారత్ లబ్దిదారులు చికిత్స కోసం వస్తుంటారన్నారు.
లాభదాయక పదవుల జాబితాపై గెజిట్
ఇదిలా ఉండగా..లాభదాయకపదవుల జాబితా నుంచి 29 రాష్ట్ర ప్రభుత్వ సంస్థలను, కార్పొరేషన్ చైర్మన్ పదవులను తొలగిస్తూ తెలంగాణ జీతాలు, పింఛన్ చెల్లింపు, నిరర్హతల తొలగింపు చట్టం 1953 నిబంధనలను సవరిస్తూ గవర్నర్ తమిళిసై గెజిట్ విడుదల చేశారు.
గురువారం వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో గవర్నర్ తమిళి సై
Comments
Please login to add a commentAdd a comment