సంజీవనికి సుస్తీ..
♦ అక్కరకు రాని ఎన్టీఆర్ వైద్యసేవ ఊ సేవల పరిధి విస్తరించినా..
అనుమతుల్లో తీవ్ర జాప్యం
♦ నిలిచిన అత్యవసర శస్త్ర చికిత్సలు
♦ ఏడాదిగా ఊసేలేని వైద్య శిబిరాలు
♦ పేదలకు అందని కార్పొరేట్ వైద్యం
ఆరోగ్య శ్రీ... నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే సత్సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకం. వైఎస్ హయాంలో అపర సంజీవనిలా పేదల ప్రాణాలు నిలిపిన ఈ పథకం.. ఆయన మరణానంతరం క్రమంగా పేదలకు దూరమైంది. టీడీపీ ప్రభుత్వం మరిన్ని రోగాలకు సేవలందిస్తామంటూ పథకం పరిధి విస్తరించి..ఎన్టీఆర్ వైద్యసేవగా పేరు మార్చినా అనుమతుల్లో తీవ్ర జాప్యంతో పథకం లక్ష్యం నెరవేరడం లేదు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు సెంట్రల్ : ఒకనాడు పేదవాడు ఏ జబ్బు వచ్చినా ఆరోగ్యశ్రీ కార్డు ఉందన్న భరోసాతో బతికేశాడు. ఇప్పుడు పథకానికి పేరు మార్చినా అనేక కారణాల వల్ల వైద్య సేవ అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. పథకానికి పేరు మారినా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకమే జనానికి వాడుకలో నిలిచిపోయింది. అంతగా పేదలను ప్రభావితం చేసిన ఈ పథకం నేడు పేదలకు అందకుండా పోతోంది. కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ వైద్యసేవ పథకం అమలు తీరు వివరాలు కూడా ఆరోగ్యమిత్రల వద్ద సమాచారం లేనంతగా ఈ పథకం నీరుగారిపోయింది.
పేద ప్రజల సంజీవనిగా పేరొందిన ఆరోగ్యశ్రీ పథకానికి, నేటి ఎన్టీఆర్ వెద్య సేవ పథకానికి పొంతన లేదని ప్రజలంటున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో తెల్ల రేషన్‌కార్డులు మంజూరు కాక, ప్రభుత్వాస్పత్రులకు వెళ్లిన ఎన్టీఆర్ ఆరోగ్యసేవా కార్యక్రమాలు అందక పేద ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
ప్రభుత్వం నిధులు తగ్గించటంతో ప్రైవేటు వైద్యశాలలు ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు చేయటానికి రోగులను నానా ఇబ్బందులు పెడుతున్నారు. కొద్దిపాటి ఆపరేషన్‌లను రిమ్స్‌కు, ప్రభుత్వ వైద్యశాలలకు కేటాయించటంతో రోగులకు అక్కడ సక్రమంగా వైద్యసేవలు అందక ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు. పక్షవాతం వంటి జబ్బులు వస్తే మంచి వైద్యం కోసం కార్పొరేటు ఆస్పత్రులకు వెళ్లే అవకాశం ఉండటం లేదు.
కేవలం ప్రభుత్వ వైద్యశాలలోనే రోగాన్ని నయం చేసుకోవాలని సూచించారు. అయితే ప్రభుత్వాసుపత్రుల్లో న్యూరాలజిస్టులు అందుబాటులో ఉండటం లేదు. ప్రధానంగా 24 గంటల కడుపునొప్పి వస్తే సొంత ఖర్చులతో ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తోంది. అలాగే, కాన్పు సమయంలో ఆపరేషన్లకు కూడా ఆరోగ్యశ్రీ వర్తించటం లేదు. ఈ పథకాన్ని ఇటీవలే ఎన్టీఆర్ వైద్యసేవగా మార్పు చేసినప్పటికీ కొన్ని కార్పొరేట్ వైద్యశాలలు జబ్బులకు వైద్యం చేసేందుకు ఆసక్తి చూపటం లేదు.
వైద్య శిబిరాలు ఎక్కడ...
గతంలో ఈ పథకం కింద ప్రతి నెలా మండల కేంద్రం లేదా గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, ఈ పథకం కింద ఏవిధంగా వైద్యం చేయించుకోవాలి, ఎవరిని సంప్రదించాలనే విషయాలను ప్రజలకు వివరించేవారు. ఈ శిబిరాలకు ప్రముఖ హాస్పటల్స్‌కి చెందిన వైద్యులు హాజరై ప్రజలకు వైద్యపరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్స అవసరమైన వారిని హాస్పిటల్‌కు తరలించే వారు. కానీ ఏడాది కాలంగా ఎన్‌టీఆర్ వైద్య సేవ పథకం వైద్యశిబిరాలు నిర్వహించిన దాఖలాలు లేవు.
నాడు... రాజీవ్ ఆరోగ్యశ్రీని దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2007 జూలై 7న ప్రారంభించారు. తెల్లకార్డు కలిగిన ప్రతి కుటుంబం ఆరోగ్యశ్రీ సేవలకు అర్హులుగా నిర్ణయించారు. ఈ సేవలకు ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ పథకం కింద గుండె, మెదడు, ఊపిరితిత్తులు, కాలేయం, పిత్త కోశం, మూత్ర పిండాలు, పుట్టుకతో వచ్చే అవయవ లోపాలకు శస్త్ర చికిత్సలు, క్యాన్సర్ చికిత్సలు, అన్ని రకాల ప్రమాద గాయాలకు శస్త్ర చికిత్సలు, కనీసం 7 రోజులు వైద్యశాలలో ఉండాల్సిన గాయాలకు చికిత్సలకు, పూర్తిగా చెవుడు ఉన్న ఆరేళ్లలోపు పిల్లలకు ఈ పథకం ఉపయోగపడుతుంది. ఆపరేషన్ చేసిన అనంతరం 125 రకాల శస్త్రచికిత్సలకు ఏడాదిపాటూ మందులు వాడితేనే తగ్గుతుంది అని, వీటికి నగదు చెల్లించేవారు. ఆరోగ్య శ్రీ కింద రూ.2 లక్షల వరకూ ఉచిత వైద్య సేవలను పేదవారు కార్పొరేట్ వైద్యశాలల్లో పొందే అవకాశం ఉండేది.
నేడు.. తెలుగుదేశం ప్రభుత్వం రాకతో ఆరోగ్య శ్రీ అనారోగ్యం బారిన పడింది. గతంలో ఆరోగ్య శ్రీ ఆపరేషన్‌లు చేయించుకునే రోగులకు ఒక్క రోజులోపు అనుమతి వచ్చేది. ప్రస్తుతం వారం నుండి పది రోజులు కూడా అనుమతులకు సమయం పడుతుంది. దీంతో పేద వారు వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగులకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు అనుమతి ఇవ్వకపోతుండటంతో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ వైద్యశాలలో అత్యవసర శస్త్ర చికిత్సలను దాదాపుగా నిలిపేశారు.
గత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేస్తున్న 133 రకాల ఆపరేషన్లను ప్రైవేటు వైద్యశాలల నుండి తొలగించి ప్రభుత్వ ఆస్పత్రులలోనే చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. గత సంవత్సరం సెప్టెంబర్ 27న టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవగా పేరు మార్చింది. అదే విధంగా పథకంలో మరో వంద జబ్బులకు ఆరోగ్య శ్రీ పరిధిని విస్తరించింది. ఇకపై 1038 జబ్బులకు ఉచిత ఆరోగ్య సేవలు అందుతున్నా, అనుమతులు ఇవ్వడంలో మాత్రం తీవ్ర జాప్యం చేస్తున్నారు.