చేవ తగ్గిన ఎన్టీఆర్ వైద్య సేవ! | NTR medical service ceva reduced | Sakshi
Sakshi News home page

చేవ తగ్గిన ఎన్టీఆర్ వైద్య సేవ!

Published Sun, Aug 23 2015 11:40 PM | Last Updated on Sat, Sep 22 2018 8:06 PM

చేవ తగ్గిన ఎన్టీఆర్ వైద్య సేవ! - Sakshi

చేవ తగ్గిన ఎన్టీఆర్ వైద్య సేవ!

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేదల కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎందరో బతికి బట్టకట్టారు.
 కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్షగా ఉండే నిరుపేదలకు పైసా ఖర్చు లేకుండా వైద్యం చేయించారు. ప్రాణాంతక జబ్బులతో మరణమే శరణ్యమనేబెంగ నుంచి ఆరోగ్యశ్రీ ఉందన్న భరోసా కల్పించారు. తెలుగుదేశం పాలన వచ్చాక ఆరోగ్యశ్రీ పేరును ఎన్టీఆర్ వైద్యసేవగా మార్చారు.అయితే కొన్ని కార్పొరేట్ కళాశాలలు ప్రాణాంతక క్యాన్సర్ వంటి జబ్బులకు వైద్యమందించడానికి ముందుకు రావడం లేదు.
 ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభమైన ఎనిమిదేళ్ల క్రితం నాటి సొమ్మునే ప్రభుత్వం ఇప్పటికీ చెల్లిస్తుండడం వల్ల కార్పొరేట్ ఆస్పత్రులు
 ఏదో వంకతో ససేమిరా అంటున్నాయి. దీంతో బాధిత రోగులు అన్యాయమైపోతున్నారు. విధిలేని పరిస్థితుల్లో అంతగా సౌకర్యాలు లేని ప్రభుత్వాస్పత్రుల్లోనే రోగులు వైద్యం చేయించుకుంటున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో పెద్ద ఎముకలు విరిగితేనే తప్ప చిన్న ఎముకలకు శస్త్రచికిత్సకు అర్హత లేదని చెప్పి తిప్పి పంపుతున్నారు. మోకాలి చిప్ప మార్పిడికిఇందులో చేర్చకపోవడం వల్ల చాలామంది నడి వయస్కులు, వయసు మళ్లిన వారు లబ్ది పొందలేకపోతున్నారు. జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవ తీరుతెన్నులపై ఈ ప్రత్యేక కథనం..!          - సాక్షి, విశాఖపట్నం
 
నాటి కుయ్‌కుయ్ సేవలేవీ!
తొలుత ఆరోగ్యశ్రీలో 938 జబ్బులను చేర్చారు. వీటిలో 133 జబ్బులు ప్రభుత్వాస్పత్రుల్లోనే విధిగా చేయించుకోవాలని కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక రాజీవ్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్యసేవగా మార్చాక వ్యాధుల అర్హత సంఖ్య 1040కు పెంచారు. 2008లో ఇచ్చిన వైద్య చార్జీలనే నేటికీ కొనసాగిస్తున్నందున పెంచాలని కార్పొరేట్ ఆస్పత్రులు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల విశాఖలో జరిగిన సమావేశంలో మంత్రి కామినేని పెంపుదలకు హామీ ఇచ్చారు. ప్రతినెలా ఒకటి నుంచి ఐదో తేదీ వరకు ఒక్కో నెట్‌వర్క్ ఆస్పత్రికి ఇద్దరు చొప్పున ఐదు కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి పదిమంది వైద్యులు రెవెన్యూ డివిజన్‌కు ఒకటి చొప్పున వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఓపీ, రక్త పరీక్షలు, ఈసీజీలు చూస్తారు. ఐదు రోజులకు సరిపడిన మందులిస్తారు. వైద్యం అవసరమైన వారికి ఆయా ఆస్పత్రులకు రిఫర్ చేసి చికిత్స చేస్తారు. ఏజెన్సీలో ఐటీడీఏ సూచించిన ప్రాంతాల్లో ప్రతి నెలా ఐదు క్యాంపులు పెడతారు.

గిరిజన ప్రాంతంలో సీజనల్ వ్యాధులతోపాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సకాలంలో మందులందకపోవడంతో ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో గిరి గ్రామాలకు 104 వెళ్లి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ జరిగేది. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో గిరిజనులు వైద్యం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. 104 సిబ్బందికి జీతాలందక, వాహనాలు కండీషన్‌లో లేకపోవడం, మందులు పూర్తి స్థాయిలో లేకపోవడంతో వైద్య సేవలు అంతంత మాత్రంగా ఉన్నాయి. దీర్ఘకాలిక రోగులు ప్రయివేటు మెడికల్ స్టోర్‌లను ఆశ్రయించాల్సిన పరిస్థితి. కొంత మంది గిరిజనులు మందులు కొనుక్కోలేక వ్యాధి తీవ్రత పెరిగి మృత్యువాత పడుతున్నారు.
 
 సకాలంలో సేవలందడం లేదు
 ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు సకాలంలో వైద్య పరీక్షలు జరిగేది. ఎన్‌టీఆర్ ఆరోగ్య పథకంలో సకాలంలో వైద్య పరీక్షలు జరగడం లేదు.  పది రోజుల క్రితం నా భార్య పాంగి సరస్వతికి తలకు దెబ్బ తగలడంతో స్కేనింగ్ నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు ఎన్‌టీఆర్ ఆరోగ్య పథకం ద్వారా చికిత్సకు తరలించాను. అయితే సకాలంలో స్కేనింగ్ కాక పోవడంతో ప్రైవేటు ఆసుపత్రికి రూ.2600 ఇచ్చి స్కేనింగ్ చేయించడంతో పాటు మందులు కొనుక్కోవాల్సి వచ్చింది. ఆస్పత్రికి వెళ్తే రోజు మొత్తం నిరీక్షించాల్సివస్తోంది. దూర ప్రాంతల నుంచి వచ్చే రోగులకు త్వరితగతిన తనిఖీలు నిర్వహిస్తే బాగుంటుంది.
 - పాంగి భాగ్య, ముంచంగిపుట్టు
 
వసతుల్లేని ప్రభుత్వాస్పత్రులే దిక్కు
వైఎస్ హయాంలో రోగులకు జనరల్ సర్జరీ కేసులు నచ్చిన కార్పొరేట్ ఆస్పత్రిలో నిర్భయంగా ఆపరేషన్లు చేయించుకునేవారు. నేడు ప్రభుత్వ ఆస్పత్రులకు ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రిలో అరుదుగా వచ్చే జబ్బులకు మాత్రమే ఆపరేషన్లు నిర్వహించే విధంగా కట్టడి చేస్తున్నారు. ఫలితంగా పేద ప్రజలు తప్పనిసరిగా సదుపాయాల్లేని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆపరేషన్లు చేయించుకోవలసిన దుస్థితి ఏర్పడింది. ఉదాహరణకు ఎన్టీఆర్ ఆస్పత్రిలో ఒక ఒక్క ఆపరేషన్ థియేటర్ ఉంది. ఒక్కొక్క విభాగానికి చెందిన డాక్టర్లకు ఒక్కొక్క రోజు ఆపరేషన్ థియేటర్ అందుబాటులో ఉంటుంది. దీంతో ఆపరేషన్ కోసం వచ్చే రోగులు ఆయా డాక్టర్లకు అవకాశం వచ్చే వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ కనీసం నాలుగు ఆపరేషన్ థియేటర్లు అవసరం ఉన్నప్పటికీ కేవలం ఒక్క ఆపరేషన థియేటర్‌తోనే కాలం వెల్లబుచ్చుతున్నారు. దీంతో రోగులు ప్రాధాన్యం ప్రకారం వారాల కొద్దీ ఆపరేషన్ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆపరేషన్ చేయించుకునే గ్రామీణ నిరుపేదల కోసం ఆయా గ్రామాలలో ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య శిబిరాలు రెండు నెలలకోసారి నిర్వహించి ఆపరేషన్ అవసరమైన వారికి వ్యాదిని బట్టి ఆస్పత్రులను ఎంపిక చేసి ఆయా ఆస్పత్రులకు ఎటువంటి పత్రాలు లేకుండా పంపించేవారు. నేడు కనీసం తూతూ మంత్రంగానైనా ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించకపోవడం కొసమెరుపు.
 
సేవలు అంతంతమాత్రమే

 ఎన్టీఆర్ వైద్యసేవ వార్డులో 20 రోజుల క్రితం కుడి కాలుకు ఆపరేషన్ చేయించుకున్నాను. డ్యూటీ డాక్టర్ రోజుకోసారి వస్తారు. సంబంధిత డాక్టర్ రెండుమూడు రోజులకోసారి వస్తారు. భోజనాలు, ఇతర సదుపాయాలు అంతంత మాత్రమే. సిబ్బంది పర్యవేక్షణ అంతంతమాత్రమే.
 - దొమ్మేసి ఈశ్వరరావు (45),

 
ప్రతి నెలా మందులకు రూ.వెయ్యి ఖర్చు

2007లో నాకు ఆరోగ్యశ్రీలో గుండె ఆపరేషన్ జరిగింది. నిరుపేద కుటుంబం కావడంతో ఉచితంగా ఆపరేషన్ చేసినా రోజూ మందులు వాడాలి. ప్రస్తుతం మందులు కొనుగోలు చేసుకొనే స్థోమత లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాను. ప్రతి నెలా రూ. 700 నుంచి 1000 వరకు ఖర్చవుతుందని తల్లిదండ్రులు చెపుతున్నారు.
 - అయ్యంకుల లోవ

 
ఆరోగ్యశ్రీతోనే లబ్ధి
దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి పాలనలో ఆరోగ్య శ్రీ ద్వారా ప్రజలు లబ్ది పొందారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన ఎన్‌టీఆర్ వైద్య సేవలు మచ్చుకైనా కానరావడం లేదు.        - మన్యాల మాధవి
 
కార్పొరేట్ హాస్పటల్ వైద్యం కలే

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో పేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందేది. ఆరోగ్యశ్రీతో పేదలకు చక్కటి వైద్యం అందేది. ఇప్పుడు కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఎన్‌టీఆర్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి.
 -వియ్యపు దేవకి, కుమ్మరవీధి
 
కొన్ని సేవలను తొలగించారు
ఆరోగ్య శ్రీ పథకంలో చాలా సేవలు అందుబాటులో ఉండేవి. ఎన్‌టీఆర్ వైద్య సేవలో చాలా సేవలు తొలగించారు. దీంతో పేదలకు వైద్య సేవలు అందుబాటులో లేక పోవడంతో పేదలు అవస్థలు పడుతున్నారు. ఎన్‌టీఆర్ వైద్య సేవతో పేదలకు ఒరిగిందేమీ లేదు.
 - తిరపతి తాయార మ్మ, అమ్మవారివీధి
 
ఖర్చెక్కువైతే సేవలు కష్టమే

నర్సీపట్నం :  రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎన్టీఆర్ వైద్యసేవగా మార్పు చేసిన ప్రభుత్వం సేవలను కుదించింది. ఆరోగ్యశ్రీ ద్వారా 932 వ్యాధులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం ఆందించేవారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 1040 వ్యాధులకు వైద్య సేవలు అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా...వీటిలో 133 వ్యాధులకు ప్రభుత్వాస్పత్రుల్లోనే వైద్యం చేయించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. వైద్యుల కొరత, అపరేషన్‌కు అవసరమయ్యే పరికరాలు లేక 133 రకాల వ్యాధులకు ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు సక్రమంగా అంద డం లేదు. రూ.50 వేల లోపు ఖర్చయ్యే వ్యాధులను ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ, రూ, లక్ష నుంచి రూ.2 లక్షలు ఖర్చయ్యే వ్యాధులకు మాత్రమే కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యాన్ని అందిస్తున్నారు. 125 రకాల వ్యాధులకు మాత్రమే ఫాలోఅప్ ఉంటోంది. ప్రజలను నిత్యం వేధించే వ్యాధులను ప్రత్యేకం చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలో వైద్యం చేయించుకున్నాక వారి గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement