కార్పొరేట్ శక్తుల తొత్తులుగా పాలకులు
పేదల జీవితాలు బాగుచేయండి
సీపీఎం నేత బీవీ రాఘవులు
విజయవాడ సబ్‌కలెక్టరేట్ వద్ద ధర్నా
విజయవాడ : పాలకులు కార్పొరేట్ శక్తులకు తొత్తులుగా మారారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు ధ్వజమెత్తారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కుదిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సీపీఎం దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆ పార్టీ కృష్ణాజిల్లా విభాగం శ్రేణులు బుధవారం నగరంలోని సబ్-కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని విమర్శించారు. పేదలు, కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. విదేశీ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తోందన్నా రు. ్రపధాని మోదీ ఆహ్వానిస్తున్న విదేశీ కంపెనీలు భవిష్యత్‌లో దేశాన్ని కొల్లగొట్టే ప్రమాదం ముంచుకొస్తోందన్నారు. విదే శీ యంత్రాలు, యంత్ర యజమానులకు వేలకోట్లు ధారాదత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకాన్ని నీరుగార్చేందుకు యత్నిస్తోందన్నా రు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో రాజధాని ఏర్పాటు చేస్తామని చెబుతున్నారన్నారు.
చంద్రబాబు ఆర్నెల్ల పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయని రాఘవులు విమర్శించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎన్‌ఆర్‌ఈజీ ఎస్ పథకాన్ని కుదించవద్దని, ప్రభుత్వరంగం సంస్థలను ప్రైవేటు పరం చేయవద్దని మంత్రిమండలిలో తీర్మానం చేసి పార్లమెంటు సమావేశాలకు పంపాలని రాఘవులు సూచించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పిన్నమనేని మురళీ కృష్ణ మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. పేదల పక్షాన సీపీఎం పోరాటం చేస్తుందని ఆయన అన్నారు. ఆందోళన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు యు.ఉమామహేశ్వరరావు, పార్టీ జిల్లా కార్యదర్శి ఆర్.రఘు, నగర కార్యదర్శి సిహెచ్ బాబూరావు, రైతు సంఘం కార్యదర్శి వై.కేశవరావు తదితరులు పాల్గొన్నారు.