పార్టీ మారిన ఎమ్మెల్యేలు నీళ్లులేని బావిలో దూకాల్సిందే! | Rayalaseema of mole Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

పార్టీ మారిన ఎమ్మెల్యేలు నీళ్లులేని బావిలో దూకాల్సిందే!

Published Sat, Mar 5 2016 3:06 AM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM

పార్టీ మారిన ఎమ్మెల్యేలు   నీళ్లులేని బావిలో దూకాల్సిందే! - Sakshi

పార్టీ మారిన ఎమ్మెల్యేలు నీళ్లులేని బావిలో దూకాల్సిందే!

టీడీపీని నమ్ముకుంటే కష్టమే
సీమ ద్రోహి చంద్రబాబు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు

 
 
 నంద్యాలటౌన్:   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నమ్ముకొని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. నీళ్లు లేని బావిలో దూకాల్సిందేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. రాయలసీమ సమస్యలపై సీపీఎం, సీపీఐలు చేపట్టిన బస్సు యాత్ర శుక్రవారం నంద్యాల పట్టణంలోని గాంధీచౌక్ చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటైన బహిరంగ సభలో మధు మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ నుంచి ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడం సరైంది కాదన్నారు. అభివృద్ధి కోసమే పార్టీ ఫిరాయించామని చెబుతున్న ఎమ్మెల్యేలు.. హంద్రీనీవా, తెలుగుగంగ, గాలేరు నగరి ప్రాజెక్టులు ఏ మేరకు పూర్తయ్యాయో తెలుసుకోవాలన్నారు. కేవలం అధికారం, కాంట్రాక్ట్‌లు, వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికే పార్టీని ఫిరాయించారని విమర్శించారు. ఏడాదిలో సీమలోని ప్రాజెక్టులను పూర్తి చేస్తానని ఇచ్చిన హామీని చంద్రబాబునాయుడు  విస్మరించారన్నారు.

 రాజధానికి సీమ భూములను ఇచ్చే ప్రసక్తే లేదు...
రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి రాయలసీమ భూములను ఇచ్చే ప్రసక్తే లేదని మధు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైఎస్సార్ జిల్లాలో బ్రహ్మంగారి మఠం ప్రాంతంలో ఉన్న 50 వేల ఎకరాల అటవీ భూమిని రాష్ట్ర రాజధాని కోసం తీసుకోవడానికి యత్నిస్తున్నారని, ైవైఎస్సార్ జిల్లా వారు త్యాగాలు చేయాలని మభ్యపెడుతున్నారని చెప్పారు. అయితే ఈ భూములను ఇవ్వడానికి తాము అంగీకరించబోమని, అవసరమైన ఉద్యమాన్ని నడుపుతామని చెప్పారు.
 
 మాటల గారడీ
 తాను నిప్పునని, కనీసం ఉంగరం కూడా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాయ మాటలతో మభ్యపెడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఓబులేసు విమర్శించారు. సహకార రంగంలోని పాల ఫ్యాక్టరీలు, చక్కెర ఫ్యాక్టరీలు నష్టాలతో మూతపడుతున్నా సీఎం స్పందించడం లేదన్నారు. అయితే సీఎం చంద్రబాబునాయుడు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ నిర్వహిస్తున్న హెరిటేజ్ ఫుడ్ ప్రాడెక్ట్స్ సంస్థకు మాత్రం ఏటా రూ.100కోట్లు ఆదాయాలు వస్తున్నాయన్నారు.  రాయలసీమ అభివృద్ధి వేదిక నేత ఓబుల కొండారెడ్డి, సీపీఎం రాష్ట్ర నేత షడ్రక్, జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 సీమ ద్రోహి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాయలసీమ ద్రోహి అని విమర్శించారు. కర్నూలు జిల్లాలో ఎర్రబస్సులు కూడా లేని గ్రామాలు ఉన్నాయని, కాని విమానాశ్రయాన్ని తీసుకొస్తానని మభ్యపెట్టారని విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వని ముఖ్యమంత్రి, కాపునాడు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష చేస్తే రూ.500కోట్లు విడుదల చేస్తానని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. సీమలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, వైఎస్సార్ జిల్లాలో  ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాలని డిమాండ్ చేశారు. లేకపోతే సీమ బంద్ చేస్తామని, ఉద్యమాన్ని ఊరూరా నిర్వహిస్తామని హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement