జీపు జాతాను ప్రారంభిస్తున్న సీపీఎం నాయకులు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు కలసి ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి.షడ్రక్, వి.వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజి, కర్నూలు జిల్లా అభివృద్ధికి రూ.10 వేల కోట్ల నిధుల సాధన కోసం సీపీఎం తలపెట్టిన జీపుజాతాను గురువారం పాతబస్టాండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత కేంద్రప్రభుత్వం నాలుగు బడ్జెట్‌లు ప్రవేశపెట్టినా ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయకపోవడం దారుణమన్నారు. విభజన హామీల అమలు కోసం సీఎం చంద్రబాబు ముందు నుంచి కాకుండా ఇప్పుడు పోరాటం ప్రారంభించడం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రప్రభుత్వం తెగేసి చెప్పిన నేపథ్యంలో బీజేపీపై తిరుగుబాటు కోసం రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. జిల్లాకు సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులు, గుండ్రేవుల, వేదవతి, నగరడోణ నిర్మాణం తదితర డిమాండ్లతో మార్చి 14న కలెక్టరేట్ ఎదుట పికెటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జీపుజాతాలో జిల్లా కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి, టి.షడ్రక్, బి.రామాంజనేయులు, పీఎస్ రాధాకృష్ణ, గౌస్‌దేశాయ్, కేవీ నారాయణ, జేఎన్ శేషయ్య, సి.గోవిందు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment