రైతుల కడుపు కొడుతున్న సీఎం
అభివృద్ధిపేరుతో సారవంతమైన భూముల సేకరణ
బలవంతంగా రైతుల భూములు లాక్కుంటే సహించం
ఆల్ ఇండియా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి తిరునావక్కరసు
జూపాడుబంగ్లా: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొని వారి కడుపుకొడుతున్నారని ఆల్‌ఇండియా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి తిరునావక్కరసు విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ సీపీఎం, సీపీఐ, బీకేఎంయూ, భూహక్కుల పరిరక్షణ సమితి అధ్వర్యంలో బస్సుయాత్రను ప్రారంభించారు. బుధవారం జూపాడుబంగ్లా, తంగెడంచ, మండ్లెం గ్రామాలలో యాత్ర సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి పేరిట ప్రభుత్వం రెండుకార్లు మంచి పంటలు పండే భూములను రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటే సహించమన్నారు. భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా పొలాలను లాక్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన: సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన చేస్తున్నాడని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కన్వీనర్ విల్సన్ మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతన్నల ఓట్లు దండుకొని గెలిచిన చంద్రబాబు రుణాలు మాఫీచేయకుండా వారికే అన్యాయం చేస్తున్నారన్నారు. సాగుకు పనికిరాని భూములను వదిలేసి సారవంతమైన నేలలను రైతులనుంచి లాక్కొని పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టడం సమంజసం కాదన్నారు. జైన్ ఇరిగేషన్ కంపెనీ వ్యవసాయ పరికరాలు తయారుచేసే పరిశ్రమ మాత్రమేనని తెలిపారు. అలాంటి కంపెనీకి ఫుడ్‌ప్రాసెస్ స్కీం కింద వందలాది ఎకరాల భూములను తక్కువ ధరకు ఎలా దారాధత్తం చేస్తారని ప్రశ్నించారు.
అనంతరం వారు అంబుజా, జైన్ ఇరిగేషన్ కంపెనీలకు కేటాయించిన తంగెడంచ ఫారం భూములను పరిశీలించారు. ఈకార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్లు, రామచంద్రయ్య, నరసింహరావు, షడ్రక్, రాధాకృష్ణ, మోహన్‌రావు, జగన్నాథం, నాగేశ్వరరావు, రాజశేఖరు, మద్దిలేటి, తాలూకా నాయకులు వెంకటేశ్వర్లు, భాస్కరరెడ్డి, నాగేశ్వరరావు, రమేష్‌బాబు, రఘురామ్మూర్తి, లాజరేష్, కృష్ణ, పుల్లన్న, స్వామన్న తదితరులు పాల్గొన్నారు.