ఏవీ నాటి కుయ్ కుయ్‌లు... | no use of 108 Vehicles | Sakshi
Sakshi News home page

ఏవీ నాటి కుయ్ కుయ్‌లు...

Published Fri, Jun 5 2015 2:44 AM | Last Updated on Sun, Sep 3 2017 3:13 AM

ఏవీ నాటి కుయ్ కుయ్‌లు...

ఏవీ నాటి కుయ్ కుయ్‌లు...

ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఫోన్ చేయగానే క్షణాల్లో ప్రత్యక్షమయ్యే 108 కుయ్ కుయ్‌లు ఇపుడెక్కడా వినిపించడం లేదు...గ్రామాల్లో వైద్యపరీక్షలు నిర్వహిస్తూ గర్భిణుల బాగోగులు చూసే 104 సేవలూ ఇపుడు మూలకు చేరాయి. కొన్ని వాహనాలు రిపేరుతో మూలకు చేరగా ఉన్న వాహనాల్లో కనీస సౌకర్యాలు లేవు. ఇక సిబ్బంది కూడా అవసరాలకు తగిన సంఖ్యలో లేకపోవడంతో మారు మూల గ్రామాలకు సేవలందడం లేదు. మాతా శిశు మరణాలు పెరిగాయి. ఇక సౌకర్యాల లేమి, పథకంలో స్పష్టత కొరవడడంతో ఎన్టీఆర్ వైద్యసేవ పేదలకు ఉపయోగపడడం లేదు. దీంతో మొత్తంగా ప్రజారోగ్యంపై చీకటి కమ్ముకుంది.
- చతికిల పడ్డ 108, 104
- అక్కరకు రాని ఎన్టీఆర్ వైద్యసేవ
- ఆరోగ్యశ్రీ వార్డుల్లో కనీస వసతులు కరువు
- అందుబాటులో ఉండని వైద్యులు
- ఆందోళనకరంగా మాతా శిశు మరణాలు

ఒకప్పుడు ఫోన్ చేసిన 20 నిమిషాలకే కుయ్..కుయ్ అంటూ వచ్చే 108 వాహనాలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. గ్రామాల్లో ప్రజలకు వైద్యపరీక్షలు నిర్వహిస్తూ వారికి అవసరమైన మందులను అందజేస్తూ, ముఖ్యంగా గర్భిణుల బాగోగులు చూసుకునే 104 వాహనాలు ఎక్కడున్నాయో తెలియడం లేదు. రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలును ఎన్టీఆర్ ఆరోగ్యసేవగా పేరు మార్చినా నిరుపేదలకు అక్కరకు రావడం లేదు. మరోవైపు జిల్లాలో మాతా శిశుమరణాల సంఖ్య ఊహించని రీతిలో పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పాలకులు, అధికారులు సమీక్షలు..సమావేశాలకే పరిమితమవుతున్నారు. ఫలితంగా ప్రజారోగ్యం పడకేసింది.
 
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో 85 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 584 సబ్‌సెంటర్లు, 15 కమ్యూనిటీ హెల్త్, న్యూట్రీషియన్ క్లష్టర్స్, 13 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 35 రౌండ్ ది క్లాక్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 17 అర్బన్ హెల్త్ సెంటర్లు, 7 టీచింగ్ హాస్పటల్స్ ఉన్నాయి. కానీ 108 వాహనాలు మాత్రం కేవలం 41 మాత్రమే ఉన్నాయి. వీటిలో కొన్ని ఎప్పుడూ రిపేరులోనే ఉంటాయి. 390 మంది సిబ్బంది ఏ మూలకూ సరిపోవడం లేదు. అనకాపల్లి, నర్శీపట్నం, పాడేరు, చోడవరం ప్రాంతాల్లో రిఫరల్ కేసులు ఎక్కువగా ఉంటాయి.

వాటికి సరిపడా 108 వాహనాలు ఉండడం లేదు. నిర్ణీత సమయానికి ఎక్కడా వాహనాలు రావడం లేదు. ఫలితంగా సకాలంలో వైద్యం అందక రోగులు మృత్యువాత పడుతున్నారు. వాహనాలు పెంచాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నిజానికి 108లో ఉండాల్సిన అత్యవసర వైద్య పరికరాలు కూడా లేవు. రక్తంలో ఆక్సిజన్ శాతం పరీక్షించే యంత్రం, విషాన్ని కక్కించే యంత్రాలు అందుబాటులో లేవని 108 జిల్లా కో ఆర్డినేటర్ కె.ఉమామహేశ్వరరెడ్డి ధ్రువీకరించారు.

ఆరోగ్య ప్రదాయనికి ఎంత కష్టం
వైద్య సదుపాయాలకు ఆమడ దూరంలో ఉండే ఏజెన్సీ, గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యవర వైద్య సేవలు అందించేందుకు ప్రారంభించిన 104 సేవలు జిల్లాలో నామమాత్రంగా నడుస్తున్నాయి. మొత్తం 95 మంది సిబ్బందితో 20 వాహనాలు ఉంటే వాటిలో కోటవురట్ల, పాడేరు, ముంచింగ్‌పుట్టులో మరమ్మతులకు గురయ్యాయి. దీంతో ప్రస్తుతం 17 వాహనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా 2008 నుంచి సేవలు ఉండటంతో శిధిలావస్థకు చేరుకున్నాయని 104 జిల్లా కో ఆర్డినేటర్, డిప్యూటీ డిఎంహెచ్‌ఓ సూర్యనారాయణ చెబుతున్నారు.    

ఆందోళనకరంగా మాతా శిశుమరణాలు
జిల్లాలో 108, 104 సేవలు పడకేయడంతో మాతా, శిశు మరణాలు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 692 మంది శిశువులు, 60మంది తల్లులు ప్రాణాలు కోల్పోయారు. 2014-15లో ఇప్పటి వరకూ దాదాపు 1100 మంది శిశువులు, 130 మంది మాతృమూర్తులు చనిపోయారు.  ప్రసవానికి వారం ముందే వైద్యుల సంరక్షణలో ఉండేలా పాడేరు డివిజన్‌లో 4 బర్త్ వెయిటింగ్ హోమ్‌లు నెలకొల్పారు. కానీ అక్కడకు ఎవరూ వెళ్లడం లేదు. సెకండ్ ఏఎన్‌ఎంలు కూడా 409 మంది మాత్రమే ఉన్నారు. 111 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
 
అందని ఆరోగ్యశ్రీ
ఎన్టీఆర్ ఆరోగ్య సేవగా మారిన తర్వాత ఆరోగ్యశ్రీ సేవలు జిల్లాలో పేదలకు అందని ద్రాక్షలా మారాయి. 1034 రకాల పెద్ద పెద్ద జబ్బులు సైతం పైసా ఖర్చు లేకుండా తగ్గించుకునే అవకాశం ఉన్నప్పటికీ పథకంలో స్పష్టత లేకపోవడంలో వైద్యం అందడం లేదు. జిల్లాలో 8 ప్రభుత్వ, 24 ప్రైవేట్ కలిపి మొత్తం 32 ఆరోగ్యశ్రీ ఆస్పత్రులున్నాయి. ప్రతి హాస్పటల్‌లోనూ ఓ ఆరోగ్యమిత్రతో పాటు జిల్లాలో ఐదుగురు డివిజన్ టీంలీడర్లు, ఐదుగురు నెట్‌వర్క్ టీంలీడర్లు, ఓ మేనేజర్ ఆపైన కో ఆర్డినేటర్ ఉన్నారు.

కానీ చాలా ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేవు. ఇటీవల తనిఖీలు చేసిన ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ పాత్రుని మనోజ్ ఈ విషయాన్ని గుర్తించారు. 21 ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు. తాను వెళ్లినపుడు ఆరోగ్యశ్రీ వైద్యులు కనిపించలేదని ఆయనే అంటున్నారు. అలాంటిది సామాన్యులకు అందుబాటులో ఎక్కడుంటారు. కొన్ని ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వార్డులు కూడా ఉండడం లేదు. సకాలంలో సర్జరీ చేయట్లేదు. అసలు ఇక్కడ ఆరోగ్యశ్రీ లేదని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లండని కార్పొరేట్ ఆస్పత్రులు కొన్ని రోగులను గెంటేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement