రూ. 1,200 చెల్లిస్తే ‘ఆరోగ్య రక్ష’ | CM Chandrababu launched a new health insurance plan | Sakshi
Sakshi News home page

రూ. 1,200 చెల్లిస్తే ‘ఆరోగ్య రక్ష’

Published Mon, Jan 2 2017 2:11 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

రూ. 1,200 చెల్లిస్తే ‘ఆరోగ్య రక్ష’ - Sakshi

రూ. 1,200 చెల్లిస్తే ‘ఆరోగ్య రక్ష’

- కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- నెలకు రూ. 100 చెల్లిస్తే రూ. 2 లక్షల వరకూ బీమా


సాక్షి, అమరావతి: ఏటా రూ. 1,200 చెల్లించిన వారికి ఆరోగ్య భద్రత కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలో అందరికీ ఆరోగ్య భద్రత, భరోసా కల్పించేందుకు ‘ఆరోగ్య రక్ష’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఆదివారం ఆయన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా ఆవశ్యకమన్నారు. నూతన సంవత్సర కానుకగా ‘హెల్త్‌ ఫర్‌ ఆల్‌’ (అందరికీ ఆరోగ్యం) ఇస్తున్నట్టు చెప్పారు.

ఈ ఆరోగ్య బీమా కావాలనుకునే వారు నెలకు రూ.100 అంటే ఏడాదికి రూ.1,200 చెల్లించాలని తెలిపారు. ఈ పథకంలో చేరిన ప్రతీవ్యక్తికి రూ. 2 లక్షల వరకూ ఆరోగ్యబీమా సౌకర్యం ఉంటుందన్నారు. ఫిబ్రవరి 28 లోగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఆధార్‌ నంబర్‌ ఆధారంగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చన్నారు. ప్రస్తుతం పేదలకు తెల్లరేషన్‌ కార్డు ద్వారా ఎన్టీఆర్‌ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) పథకంలో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపిన సీఎం.. ఏ ఆరోగ్య పథకంలో లేని, ప్రభుత్వ భరోసా అందని వారికి తక్కువ ప్రీమియంతో ఆరోగ్యరక్ష అందిస్తున్నామని తెలిపారు.

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి..
రాష్ట్ర వ్యాప్తంగా 436 ఆస్పత్రుల్లో ఆరోగ్య రక్ష సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పాజిటివ్‌గా ఆలోచించే ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందన్నారు. పరిసరాలే ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్య సమస్యలు రావని సీఎం ఉద్బోధించారు. వైద్య రంగంలో కీలక మార్పులు వచ్చాయని, ఎలాంటి వ్యాధికైనా నొప్పిలేకుండా వైద్యం అందించే రోజులు ఇప్పుడున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందరూ ఆర్థికరంగం, పేదరికం గురించి మాట్లాడుతున్నారని, కానీ ఆరోగ్యం గురించి మాట్లాడటం లేదని సీఎం అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement