ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఉద్యోగ జేఏసీలో చీలిక ఏర్పడిందా...? తెలంగాణ ఉద్యమంలో ఇప్పటిదాకా ఐక్యంగా పోరాడిన జేఏసీ చీలిపోయిందా...? గురువారం బంద్ సందర్భంగా వేర్వేరుగా జరిగిన కార్యక్రమాలను చూసిన ఉద్యోగులకు వచ్చిన సందేహాలివి. రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ గురువారం బంద్ సందర్భంగా ఉద్యోగ జేఏసీలో విభేదాలు బయటపడ్డాయి. తెలంగాణ సాధన, ఉద్యోగ సమస్యల పరిష్కారానికి కోసం ఏర్పడిన ఉద్యోగ జేఏసీలో చీలిక వచ్చిన సూచనలు కనిపించాయి. బంద్‌ను విజయవంతం చేయాలని ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించిన నేతలు.. గురువారం వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించి ప్రత్యక్ష బల ప్రదర్శనకు దిగారు.
జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగ సంఘూలన్నీ కలిసి గత ఎడాది ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి, తెలంగాణ సాధన కోసం నిరంతర ఉద్యమాలకు శ్రీకారం చుట్టాయి. ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్‌గా కూరపాటి రంగరాజు, ప్రధాన కార్యదర్శిగా నడింపల్లి వెంకటపతిరాజు, కో-చైర్మన్లుగా ఎస్‌కె.ఖాజామియా, నాగిరెడ్డి, కోడి లింగయ్య వ్యవహరిస్తున్నారు. చైర్మన్ తమకు కొద్ది రోజులుగా ఏ విషయం చెప్పడం లేదని, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మిగిలిన నాయకులు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బంద్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో చైర్మన్ పాల్గొనలేదు. తన శాఖయిన టీఎన్‌జీఓ సంఘం ప్లకార్డులతో వేరుగా ర్యాలీ నిర్వహించారు. ఇది ఉద్యోగుల్లో చర్చనీయాంశమైంది. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రదర్శనలో భాగస్వామ్య సంఘాలైన టీజీఓ అసోసియేషన్, టీటీ జేఏసీ, పంచాయతీరాజ్ జేఏసీ, టీ-నాలుగోతరగతి ఉద్యోగుల సంఘం పాల్గొన్నారు. టీఎన్‌జీఓ సంఘం ఆధ్వర్యంలో మరో ప్రదర్శన జరిగింది.
ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్‌లో మానవహారం, ఆందోళన జరిగినంతసేపు టీఎన్‌జీఓ సంఘం ఉద్యోగులు కొందరు, నాయకులు కొద్దిదూరంలో టీఎన్‌జీఓ సంఘం ప్లకార్డులతో నిల్చున్నారు. ఉద్యోగ జేఏసీ నాయకులు వెళ్లిన కొద్దిసేపటి తరువాత టీఎన్‌జీఓ సంఘం నాయకులు అదే సెంటర్‌కు వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సభ నిర్వహించారు. ఉద్యోగ జేఏసీ, టీఎన్‌జీఓ సంఘం వేర్వేరుగా ప్రదర్శనలు నిర్వహించడంతో ఎటువైపు వెళ్లాలో తెలియక ఉద్యోగులు అయోమయానికి లోనయ్యారు. ఉద్యోగ సంఘాల నేతల మధ్య సమన్వయం లేకపోవడం, నాయకుల ఏకపక్ష నిర్ణయాల వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. జేఏసీ పిలుపులో భాగంగా ఏ కార్యక్రమం చేపట్టినా భాగస్వామ్యపక్షాలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఒక నాయకుడు ఇష్టానుసారంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, అందుకే ఇలా వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఉద్యోగులు చెబుతున్నారు. రాజకీయ పక్షాలు సైతం ఆ నాయకుడి వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. చైర్మన్ తీరుతో విసిగివేసారిన ఉద్యోగ జేఏసీ నాయకులు వేరేగా ప్రదర్శనలు నిర్వహించినట్టు ఉద్యోగులు చెబుతున్నారు. ఆ నాయకుడు వేరుగా ప్రదర్శన నిర్వహించడంపై ఉద్యోగుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఉద్యోగ జేఏసీలో చీలిక..!
Published Fri, Dec 6 2013 4:21 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM
Advertisement
Advertisement