TS Genco
-
ఏడాది నుంచి ఇదే తంతు.. సిబిల్ స్కోర్ పడిపోతోంది, సారూ.. జీతాలు ప్లీజ్!
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది కాలంగా విద్యుత్ ఉద్యోగులకు జీతాల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయూస్ జేఏసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. పెద్దసంఖ్యలో విద్యుత్ ఉద్యోగులు బ్యాంకుల నుంచి గృహ, వాహన, వ్యక్తిగత, విద్యారుణాలను తీసుకున్నారని, ప్రతి నెలా 1 నుంచి 10వ తేదీలోగా బ్యాంకులకు కిస్తీలు చెల్లించాల్సి ఉండగా, జీతాలు ఆలస్యం కావడంతో గడువులోగా చెల్లించలేకపోతున్నారని పేర్కొంది. దీంతో ఉద్యోగుల సిబిల్ స్కోర్ పడిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. జూన్ నెల జీతాలు 11వ తేదీనాటికి కూడా చెల్లించలేదని వాపోయింది. ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ జి.సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్‌రావు మంగళవారం ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావుకు వినతిపత్రం సమర్పించారు. బ్యాంకులకు కిస్తీలు చెల్లించేందుకు విద్యుత్ ఉద్యోగులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నారని వారు వాపోయారు. జీతాల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యంతో ఉద్యోగులు మానసిక స్థైర్యం కోల్పోతున్నారని తెలిపారు. -
తీరు మార్చుకోని తెలంగాణ జెన్కో.. కృష్ణా బోర్డుకు ఏపీ ఈఎన్సీ లేఖ
సాక్షి, అమరావతి : తెలంగాణ జెన్కో తీరు మారలేదు. కృష్ణా నదిలో వరద ప్రవాహం కనిష్ట స్థాయికి చేరింది. దిగువన సాగు, తాగు నీటి అవసరాలు లేవు. అయినా, తెలంగాణ జెన్కో శ్రీశైలం, సాగర్‌లలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తోంది. దాంతో శ్రీశైలం, సాగర్‌లలో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. కృష్ణా నది నికర జలాలు వృథాగా సముద్రంలోకి పోతున్నాయి. ఇదే అంశాన్ని వివరిస్తూ, తక్షణమే విద్యుదుత్పత్తిని నిలిపివేసేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్‌కు శుక్రవారం లేఖ రాశారు. లేదంటే రిజర్వాయర్లలో నీరు తగ్గిపోయి, సీజన్ చివర్లో సాగు, తాగు నీటికి ఇబ్బందులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది మే 27న జరిగిన బోర్డు సమావేశంలో తాగు, సాగు నీటికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యుత్తుకు కాదని తీసుకున్న నిర్ణయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆ లేఖలో ప్రధానాంశాలు ఇవీ.. ► ఈ నెల 24 నాటికి శ్రీశైలం ప్రాజెక్టులో 884.4 అడుగుల్లో 213.401 టీఎంసీలు నిల్వ ఉండేవి. వరద కనిష్ట స్థాయికి చేరడంతో స్పిల్ వే గేట్లు మూసేశాం. తెలంగాణ జెన్కో, ఏపీ జెన్కోలు విద్యుదుత్పత్తిని కొనసాగిస్తూ.. దిగువకు నీటిని వదిలేస్తుండటం వల్ల గురువారం ఉదయం 6 గంటలకు శ్రీశైలంలో నీటి మట్టం 881.3 అడుగుల్లో 195.21 టీఎంసీలకు తగ్గిపోయింది. అంటే.. 18 టీఎంసీలను శ్రీశైలం నుంచి దిగువకు వదిలేశారు. ► గురువారం ఉదయం 6 గంటలకు నాగార్జునసాగర్‌లో 589.7 అడుగుల్లో 311.150 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. దిగువన ఎలాంటి తాగు, సాగునీటి అవసరాలు లేకున్నా.. తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని దిగువకు వదిలేస్తోంది. ఆ జలాలు నదిలో కలుస్తున్నాయి. ► పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌లో గరిష్ట స్థాయిలో నీటి నిల్వ ఉంది. దాంతో.. ఎగువ నుంచి విడుదల చేస్తున్న నీటిని సముద్రంలోకి వదిలేయాల్సి వస్తోంది. ► ఈ ఏడాది మే 27న జరిగిన బోర్డు సమావేశంలో దిగువన సాగు, తాగునీటి అవసరాలు ఉన్నప్పుడే.. బోర్డు అనుమతితో విద్యుదుత్పత్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ అవసరాలు లేకపోతే విద్యుదుత్పత్తి నిలిపివేయాలని నిర్ణయించారు. ► బోర్డు నిర్ణయాన్ని, విభజన చట్టాన్ని తెలంగాణ జెన్కో ఉల్లంఘించి యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేస్తోంది. దాంతో కృష్ణా నికర జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి. -
జెన్కోలో 250 ఏఈ పోస్టుల భర్తీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) నుంచి త్వరలో సుమారు 250 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రానుంది. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, టెలికమ్యూనికేషన్ విభాగాల్లో ఏఈ పోస్టులను భర్తీ చేయాలని సంస్థ యాజమాన్యం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కసరత్తు ఇంకా పూర్తికాకపోవడంతో పోస్టుల సంఖ్యపై స్పష్టత రాలేదు. దాదాపు 150 ఏఈ(ఎలక్ట్రికల్), 88 ఏఈ (సివిల్) పోస్టులు ఉండనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. మిగిలిన పోస్టులు మెకానికల్, టెలికమ్యూనికేషన్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ జారీకి కనీసం నెల రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. జెన్కో స్వయంగా నోటిఫికేషన్ జారీ చేయనుండగా, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో నియామక ప్రక్రియ జరగనుంది. రాతపరీక్ష నిర్వహణ బాధ్యతను రాష్ట్రంలోని ఏదైనా యూనివర్సిటీకి అప్పగించనున్నారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన 1,080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్వహణ అవసరాల కోసం ఏఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. నిర్మాణ దశలో ఉన్న 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ కోసం ఇప్పుడు ఏఈలను భర్తీ చేయాలని భావిస్తే.. మరో 130 పోస్టులు పెరిగే అవకాశం ఉంది. త్వరలో నియామకాలపై జెన్కో యాజమాన్యం నిర్ణయం తీసుకోనుంది. -
4 రోజుల విద్యుదుత్పత్తికి సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో బొగ్గు కొరత రోజురోజుకు తీవ్రమవుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు 108 థర్మల్ విద్యుత్ కేంద్రాలు తీవ్ర బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. వివిధ ప్రాంతాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద బుధవారం నాటికి సగటున 4 రోజుల విద్యుదుత్పత్తికి సరిపడ బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. బొగ్గు లభ్యత లేక గురువారం ఇతర రాష్ట్రాల్లోని 14,500 మెగావాట్ల సామర్థ్యం గల 15 థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో విద్యుదుత్పత్తి జరగలేదు. మరోవైపు బొగ్గు కొరత ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై కూడా పడింది. అయితే జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సింగరేణి బొగ్గు గనుల సంస్థ.. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాను తగ్గించి ఇతర రాష్ట్రాల్లోని ప్లాంట్లకు మళ్లిస్తోంది. రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాల్లో ప్రస్తుత అవసరాలకు మించి బొగ్గును వృథాగా నిల్వ ఉంచడానికి బదులుగా, ఇతర రాష్ట్రాల్లో ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఎదుర్కొంటున్న విద్యుత్ కేంద్రాలకు సింగరేణి బొగ్గును తరలిస్తున్నారు. అయితే సింగరేణి బొగ్గు సరఫరా తొలి ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రమేనని, రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతే ఇతర రాష్ట్రాలకు బొగ్గును సరఫరా చేస్తున్నట్లు సింగరేణి సంస్థ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. దేశంలో బొగ్గు కొరత ఎంత పెరిగినా, రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాలకు కొరత రాకుండా చూసుకుంటామని పేర్కొన్నారు. (చదవండి: విద్యుత్ సంక్షోభం.. జనాలకు ఢిల్లీ ప్రభుత్వం వింత రిక్వెస్ట్) మనవద్దా నాలుగైదు రోజులకు సరిపడా నిల్వలే.. రాష్ట్రంలోని తెలంగాణ జెన్కో, సింగరేణి, ఎన్టీపీసీల థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సాధారణంగా 15 రోజులకు సరిపడ బొగ్గు నిల్వలు ఉండాల్సి ఉండగా, బుధవారం నాటికి నాలుగైదు రోజులకు సరిపడ నిల్వలే ఉన్నాయి. 810 మెగావాట్ల భద్రాద్రి టీపీపీ, 1,000 మెగావాట్ల కొత్తగూడెం టీపీఎస్(న్యూ), 2,600 మెగావాట్ల ఎన్టీపీసీ రామగుండం, 1,200 మెగావాట్ల సింగరేణి టీపీపీ వద్ద 4 రోజులకు సరిపడ బొగ్గు నిల్వలే ఉన్నాయి. పిట్‌హెడ్ ప్లాంట్లలో 5 రోజులు, అంతకన్న తక్కువ రోజులకు సరిపడ బొగ్గు నిల్వలు మాత్రమే ఉంటే ‘ఆందోళనకర (క్రిటికల్)’ పరిస్థితిగా పరిగణిస్తారు. రాష్ట్రంలోని తెలంగాణ జెన్కో, ఎన్టీపీసీ, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సజావుగా ఉత్పత్తి జరగడానికి రోజుకు 96 వేల టన్నుల బొగ్గు అవసరం. కనీసం 15 రోజుల అవసరాలకు 14.37 లక్షల టన్నుల బొగ్గు నిల్వ ఉండాల్సి ఉండగా, 5.98 లక్షల టన్నుల బొగ్గు నిల్వలే ఉన్నట్లు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ గురువారం తన వెబ్సైట్లో పేర్కొంది. పిట్‌హెడ్ ప్లాంట్లు కాబట్టి ఇబ్బంది లేదు.. బొగ్గు గనులకు 50 కి.మీ.ల పరిధిలో ఉంటే ‘పిట్‌హెడ్’థర్మల్ విద్యుత్ ప్లాంట్లు అంటారు. వీటికి బొగ్గు రవాణా చేసేందుకు.. అయ్యే వ్యయం, పట్టే సమయం తక్కువగా ఉంటుంది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 4వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం తప్పిస్తే.. మిగిలిన థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ ‘పిట్‌హెడ్’ప్లాంట్లే. సింగరేణి గనులకు సమీపంలో ఉండటంతో వీటికి బొగ్గు సరఫరాకు చాలా తక్కువ సమయం పట్టనుంది. అందువల్ల వీటిల్లో బొగ్గు నిల్వలు తగ్గినా ఆందోళన అవసరం లేదని, గనులకు సమీపంలో ఉండటంతో తక్షణమే అవసరమైన బొగ్గును సరఫరా చేయగలమని సింగరేణి అధికారులు పేర్కొంటున్నారు. కొరత ఎందుకంటే? కరోనా మహమ్మారి, లాక్డౌన్ల అనంతరం అన్ని రంగాలు కుదుటపడుతున్నాయి. మళ్లీ పారిశ్రామిక ఉత్పత్తి పుంజుకోవడం, ఇతర రంగాలూ సాధారణ స్థితికి చేరుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెరిగింది. దీంతో విద్యుదుత్పత్తికి వినియోగించే బొగ్గుకు సైతం డిమాండ్ పెరిగి కొరత ఏర్పడింది. పొరుగు దేశం చైనాలో గత వారం రోజులుగా తీవ్ర బొగ్గు కొరతతో విద్యుత్ ఉత్పత్తి తగ్గి పరిశ్రమలు మూతపడే పరిస్థితులు నెలకొన్నాయి. (చదవండి: విద్యుత్ సంక్షోభంపై తక్షణం స్పందించండి) గతేడాదితో పోల్చితే అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు సైతం 100 శాతానికి మించి పెరిగిపోయాయి. దేశంలో సైతం విద్యుత్ డిమాండ్ పెరిగి బొగ్గు వినియోగం పెరిగిపోయింది. దీంతో ఇక్కడా బొగ్గు కొరత నెలకొంది. విదేశీ బొగ్గు ధరలు భారీగా పెరిగిపోవడంతో .. దేశీయంగా తక్కువ ధరకు లభిస్తున్న కోల్ ఇండియా, సింగరేణి బొగ్గుకు డిమాండ్ పెరిగింది. -
నీరంతా వృథాగా సముద్రంలో కలుస్తోంది: ఎస్ఈ గంగరాజు
సాక్షి,నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సాగర్ జలవిద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేస్తున్న తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిని ఆపాలంటూ ఏపీ అధికారులు గురువారం మెమొరాండం ఇవ్వడానికి వచ్చారు. కాగా తెలంగాణ పోలీసులు ఏపీ అధికారులను సాగర్ బ్రిడ్జిపైనే అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సాగర్ రైట్ కెనాల్ ఎస్ఈ గంగరాజు ఆధ్వర్యంలోని ఏపీ అధికారుల బృందం ఇచ్చిన మెమొరాండంను తెలంగాణ జెన్కో అధికారులు తిరస్కరించారు. ఫ్యాక్స్‌లో లేఖ పంపాలంటూ ఏపీ అధికారులతో పేర్కొన్నారు. దీంతో వారు అక్కడినుంచి వెనుదిరిగారు. ఈ సందర్భంగా రైట్ కెనాల్ ఎస్ఈ గంగరాజు మాట్లాడుతూ.. ''విద్యుత్ ఉత్పత్తి కోసం సాగర్ మెయిన్ కెనాల్ ద్వారా.. తెలంగాణ అధికారులు నీటిని కిందికి వదులుతున్నారు. సాగర్ నుంచి వెళ్లిన నీరు పులిచింతల వద్ద వదిలేయడంతో.. నీరంతా వృథగా సముద్రంలో కలుస్తుంది. మనం ఇంకా వ్యవసాయ సీజన్ మొదట్లోనే ఉన్నాం. రైట్ కెనాల్ కింద 11 లక్షల 15 వేల ఎకరాల సాగు చేస్తున్నారు. వచ్చిన నీటిని వచ్చినట్టే వదిలేయడంతో రైతుల ఆశను ఒమ్ము చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి ఆపాలని తెలంగాణ అధికారులకు మెమోరాండం ఇచ్చేందుకు వెళ్లాం. తెలంగాణ పోలీసులు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు’’ అని తెలిపారు. -
టీఎస్ జెన్ కో అధికారులకు పులిచింతల ఎస్ఈ మెమోరాండం
-
టీఎస్ జెన్కో అధికారులకు పులిచింతల ఎస్ఈ మెమోరాండం
సాక్షి, విజయవాడ: ప్రొటోకాల్ ప్రకారం పులిచింతల ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని ఎస్ఈ రమేష్‌బాబు ఆదేశించారు. విద్యుదుత్పత్తికి, నీటి కేటాయింపులకు ప్రొటోకాల్ ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించి తెలంగాణ అధికారులు, ఏపీ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. గడిచిన రెండేళ్లలో ప్రొటోకాల్ ప్రకారమే విద్యుదుత్పత్తి జరిగింది.. కానీ ఇప్పుడు తెలంగాణ అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని తెలిపారు. జూన్ 29 నుంచి టీఎస్ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తోందన్నారు. డెల్టాలో ఇప్పటివరకు నారుమళ్లు ప్రారంభం కాలేదు, నీటి అవసరాలు లేవని.. ఈ పరిస్థితుల్లో నీటిని కిందకు వదిలితే సముద్రంలో కలుస్తాయని తెలిపారు. ఇరిగేషన్ అవసరాలు ప్రారంభమైన తర్వాతే.. విద్యుదుత్పత్తి ప్రారంభించాలని తెలంగాణ అధికారులను కోరాం అని ఎస్ఈ రమేష్ బాబు తెలిపారు. చదవండి: తెలంగాణను నియంత్రించండి -
విద్యుత్ వివాదం వీడింది!
సాక్షి, హైదరాబాద్ : ఏపీ, తెలంగాణ మధ్య ఐదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదం ఎట్టకేలకు ముగింపు దశకు వచ్చింది. తెలంగాణ నుంచి ఏపీకి 655 మంది ఉద్యోగులు వెళ్తుండగా ఏపీ నుంచి తెలంగాణకు సైతం సమాన సంఖ్యలో ఉద్యోగులు రావాలని సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ డి.ఎం. ధర్మాధికారి ఏకసభ్య కమిటీ గతేడాది నవంబర్‌లో తుది నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు సైతం తీర్పునివ్వడంతో ఆ మేరకు ఏపీ, తెలంగాణ జెన్కోలు, ట్రాన్స్‌కోల మధ్య ఉద్యోగుల పరస్పర కేటాయింపులపై తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ జెన్కో నుంచి ఏపీ జెన్కోకు 252 మంది ఉద్యోగులను రిలీవ్ చేయడంతోపాటు ఏపీ జెన్కో నుంచి 252 మంది ఉద్యోగులను చేర్చుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి తెలంగాణ జెన్కో నుంచి ఏపీ జెన్కోకు 300 మందిని కేటాయించాలని, అంతే సంఖ్యలో ఏపీ జెన్కో నుంచి తెలంగాణ జెన్కోకు తీసుకోవాలని ధర్మాధికారి కమిటీ నివేదికలో పేర్కొంది. అయితే వారిలో రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న వారిని తుది కేటాయింపుల నుంచి మినహాయించాలని కోరింది. దీంతో తెలంగాణ జెన్కో నుంచి ఏపీ జెన్కోకు వెళ్లే వారిలో 48 మంది రిటైర్మెంట్కు దగ్గరగా ఉండటంతో వారిని మినహాయించి మిగిలిన 252 మందిని ఏపీ జెన్కోకు కేటాయించింది. తెలంగాణ ట్రాన్స్‌కోకు.. ఇక తెలంగాణ ట్రాన్స్‌కో నుంచి ఏపీ ట్రాన్స్‌కోకు 173 మంది ఉద్యోగులను ధర్మాధికారి తుది నివేదికలో కేటాయించగా, అంతే సంఖ్యలో ఏపీ నుంచి తెలంగాణకు కేటాయించారు. తెలంగాణ నుంచి ఏపీకి కేటాయించిన 173 మందిలో 39 మంది పదవీ విరమణకు సమీపంలో ఉండటంతో వారిని నిబంధనల ప్రకారం కేటాయింపు నుంచి మినహాయింపునిచ్చారు. తుదకు తెలంగాణ నుంచి ఏపీకు 134 మందిని రిలీవ్ చేస్తూ తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ట్రాన్స్‌కో నుంచి తెలంగాణ ట్రాన్స్‌కోకు ఇప్పటికే 30 మంది ఉద్యోగులు వచ్చి చేరడంతో మిగిలిన 104 మంది ఏపీ ట్రాన్స్‌కో ఉద్యోగులను తెలంగాణ ట్రాన్స్‌కోలో చేర్చుకుంటున్నట్టు ఈ ఉత్తర్వుల్లో తెలిపారు. -
కేటీపీఎస్‌లో కాలుష్య నియంత్రణ ప్లాంట్
పాల్వంచ: విద్యుత్ కర్మాగారాల నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కొత్తగా నిర్మాణం చేస్తున్న కర్మాగారాల్లో ఫ్లూ గ్యాస్ డిసల్ఫరైజేషన్ ప్లాంట్ (ఎఫ్‌జీడీ) నిర్మాణాలు చేపట్టింది. తెలంగాణ స్టేట్ పొల్యూషన్ సెంట్రల్ బోర్డు ఆదేశాల మేరకు తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) కేంద్రంగా ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నా రు. ఈ మేరకు టీఎస్ జెన్కో అధికారులు స్థల సేకరణ పనులు చేపట్టారు. నిర్మాణ పనులను సుమారు రూ.300 కోట్లతో బీహెచ్ఈఎల్ సంస్థ ఆధ్వర్యంలో పూర్తి చేయనున్నారు. దీని వల్ల కర్మాగారం నుంచి వెలువడే పొగలో హానికర వాయువులను పూర్తిగా నివారించే అవకాశం ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ డిమాండ్ దృష్ట్యా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ కేంద్రంగా కేటీపీఎస్ 7వ దశ (800మెగావాట్లు), మణుగూరు వద్ద బీటీపీఎస్ (1080 మెగావాట్లు), నల్లగొండ జిల్లా దామరచర్ల వద్ద యాదాద్రి పవర్ ప్లాంట్ (4వేల మెగావాట్లు) నిర్మాణ పనులు చేపట్టింది. ఈ క్రమంలో కేటీపీఎస్ 7వ దశ నిర్మాణ పనులు 2015లో ప్రారంభమై 2018 డిసెంబర్ 26న సీవోడీ (కమర్షియల్ ఆపరేషన్ డిక్లరేషన్) చేశారు. అప్పటి నుంచి 800 మెగావాట్ల ఉత్పత్తి నిరంతరాయంగా వస్తోంది. భద్రాద్రి, యాదాద్రి ప్లాంట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే ఉత్పత్తి సాధిస్తున్న కేటీపీఎస్ 7వ దశ సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ కేంద్రంగా కాలుష్య నియంత్రణ కోసం ఇప్పుడు పాటిస్తున్న ప్రమాణాలతో పాటు కొత్తగా ఫ్లూ గ్యాస్ డిసల్ఫరైజేషన్ ప్లాంట్ నిర్మించి కాలుష్యాన్ని మరింత తగ్గించేందుకు చర్యలు చేపడుతుండటం గమనార్హం. దీని ద్వారా బొగ్గు మండినప్పుడు వచ్చే సల్ఫర్ వాయువు (పొగ)లో నార్మల్ మీటర్ క్యూబ్ 50 మిల్లి గ్రామ్స్‌కు మించకుండా ఈ ప్లాంట్ ఉపయోపడుతుంది. దీని వల్ల హానికర వాయువులు తగ్గుతాయి. స్థల సేకరణకు యాజమాన్యం కసరత్తు బీహెచ్ఈఎల్ సంస్థ ఆధ్వర్యంలో రూ.300 కోట్లతో నిర్మించే ఈ ప్లాంట్ నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఇందుకు గాను కేటీపీఎస్ కాంప్లెక్స్ పరిధిలో స్థల సేకరణ పనుల్లో జెన్కో అధికారులు నిమగ్నమయ్యారు. సుమారు 420 ఎకరాల్లో కేటీపీఎస్ 7వ దశను నిర్మించగా పక్కనే ఉన్న సెక్యూరిటీ కాలనీని ఎఫ్‌జీడీ ప్లాంట్ కోసం కేటాయించారు. సుమారు ఆరు దశాబ్దాల క్రితం సెక్యూరిటీ కాలనీలో నిర్మించిన క్వార్టర్లలో సిబ్బందిని ఖాళీ చేయించారు. వెంటనే వాటిని నేలమట్టం చేసే పనులు చేపట్టారు. 16 బ్లాక్‌లు(92 క్వార్టర్లు) గతంలో చాలా వరకు శిథిలావస్థకు చేరడంతో వీటిని తొలగించి నిర్మిస్తే మేలనే నిర్ణయంతో వీటిని తొలగిస్తున్నారు. క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు కర్మాగారాల వల్ల వెలువడుతున్న కాలుష్యం వల్ల సమీప జీవరాశులు అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉండటంతో ఎఫ్‌జీడీ ప్లాంట్‌తో పాటు ఆంబియస్ట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్ల (ఎఎక్యూఎంఎస్)ను ఏర్పాటు చేస్తున్నారు. కేటీపీఎస్ 7వ దశ పరిధిలో గల సురారం, పునుకుల, పుల్లాయిగూడెం, పాత ప్లాంట్, కూలింగ్ టవర్, బొల్లేరుగూడెం ఏరియాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. గాలిలో వచ్చే కాలుష్యాన్ని అంచనా వేయడం జరుగుతుంది. దీనిని ఇక్కడి అధికారులతో పాటు ఆన్లైన్ ద్వారా హైదరాబాద్‌లో ఉండే పొల్యూషన్ సెంట్రల్ బోర్డు అధికారులు కూడా మానిటరింగ్ చేయనున్నారు. ఎఫ్‌జీడీ ప్లాంట్‌తో కాలుష్య నియంత్రణ విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాల్లో వెలువడే కాలుష్యాన్ని ఎఫ్‌జీడీ ప్లాంట్ నియంత్రిస్తుంది. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలతో పాటు కొత్తగా ఈ ప్లాంట్ నిర్మాణం తప్పక చేయాలని పొల్యూషన్ బోర్డు అధికారుల ఆదేశాలు స్పష్టంగా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి రూ.300కోట్లతో ఏర్పాటు చేస్తున్నాం. సెక్యూరిటీ కాలనీ వద్ద స్థలాన్ని కేటాయించాం. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఖర్చు అధికమైనా ఈ ప్లాంట్ నిర్మాణం చేస్తున్నాం. జె.సమ్మయ్య, సీఈ కేటీపీఎస్ ఓఅండ్ఎం, 7వ దశ -
ఉత్పత్తిలో అగ్రగామి.. జైపూర్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సింగరేణి ఆధ్వర్యంలోని జైపూర్ థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాల్లోనే అగ్రగామిగా దూసుకుపోతోంది. ఏపీ.. టీఎస్ జెన్కో, ఎన్జీ పీసీల కన్నా అధికంగా ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ (పీఎల్ఎఫ్) సాధించి రికార్డు నెలకొల్పింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్‌తో ముగి సిన 7 నెలల కాలంలో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ) 89 శాతం పీఎల్ఎఫ్ సాధించగా, తెలంగాణ జెన్కో 71%, ఏపీ జెన్కో 67% సాధించాయి. రామగుండంలోని ఎన్టీపీసీ 79% పీఎల్‌ఎఫ్‌ను నమోదు చేసుకుంది. కాగా, జైపూర్ ఎస్టీపీపీ గడిచిన అక్టోబర్ నెలలో 96.5% పీఎల్‌ఎఫ్‌ను సాధించడం గమనార్హం. ప్లాంట్‌లోని రెండో యూనిట్ 98.92%, మొదటి యూని ట్ 94.13% పీఎల్ఎఫ్ నమోదు చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా గత ఆగస్టులో ప్లాంట్‌లో 98.43 % పీఎల్ఎఫ్ నమోదైంది. సింగరేణి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైన గత సంవత్సరం ఆగస్టు నుంచి ఇప్పటివరకు 9,724 మిలియన్ యూనిట్లను రాష్ట్రానికి సరఫరా చేసింది.దీనిలో మొదటి యూనిట్ నుంచి 4,839 యూనిట్లు, రెండో యూనిట్ నుంచి 4,248 మిలియన్ యూనిట్లను గజ్వేల్ పవర్ గ్రిడ్‌కు సరఫరా చేసింది. కాగా, విద్యుదుత్పత్తి, సరఫరాలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్న ఎస్టీపీపీ ఉద్యోగులు, అధికారులను సీఎండీ ఎన్.శ్రీధర్ అభినందించారు. -
విద్యుదుత్పత్తిలో ‘సింగరేణి’ రికార్డు
⇒ ఫిబ్రవరిలో 95% పీఎల్ఎఫ్ నమోదు ⇒ 100 శాతం పీఎల్ఎఫ్ సాధించిన రెండో యూనిట్ సాక్షి, హైదరాబాద్: విద్యుదుత్పత్తిలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం రికార్డు సృష్టించింది. ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో 1200 (2x600) మెగావాట్ల సామర్థ్యంతో సింగరేణి బొగ్గు గనుల సంస్థ నిర్మించిన ఈ విద్యుదుత్పత్తి కేంద్రంలోని తొలి యూనిట్ గత సెప్టెంబర్, రెండో యూనిట్ గత నవంబర్ నుంచి విద్యుదుత్పత్తి ప్రారంభించింది. తాజాగా మంగళవారంతో ముగిసిన ఫిబ్రవరి నెలలో సింగరేణి విద్యుదుత్పత్తి కేంద్రంలోని రెండో యూనిట్ పూర్తి సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి జరిపి 100 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) సాధించగా, తొలి యూనిట్ 90 శాతం పీఎల్ఎఫ్ సాధించింది. దీంతో ఫిబ్రవరిలో విద్యుత్ కేంద్రం సగటు పీఎల్ఎఫ్ 95 శాతంగా నమోదైంది. విద్యుదుత్పత్తి కేంద్రాల స్థాపక విద్యుదుత్పత్తి సామర్థ్యంతో పోల్చితే వాస్తవంగా జరిగిన విద్యుదుత్పత్తి శాతాన్ని పీఎల్ఎఫ్ అంటారు. ఫిబ్రవరిలో రెండో యూనిట్ 389 మిలియన్ యూనిట్లు (ఎంయూలు), తొలి యూనిట్ 348 ఎంయూల విద్యుదుత్పత్తి జరిపాయి. మొత్తానికి ఈ విద్యుత్ కేంద్రం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 3,443 ఎంయూల విద్యుదుత్పత్తి జరగగా, అందులో 3,191 ఎంయూల విద్యుత్ రాష్ట్ర అవసరాలకు సరఫరా చేశారు. తొలి యూనిట్ 2,157 ఎంయూలు, రెండో యూనిట్ 1,286 ఎంయూల విద్యుదుత్పత్తి చేశాయి. ఏపీ జెన్కో, టీఎస్ జెన్కో విద్యుదుత్పత్తి కేంద్రాలతో పోల్చితే సింగరేణి విద్యుత్ కేంద్రం పీఎల్ఎఫ్ మెరుగ్గా ఉందని సింగరేణి యాజమాన్యం పేర్కొంది. పూర్తి సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామని, దీనిలో భాగంగానే ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో పీఎల్ఎఫ్ సాధించామని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. -
పాత విద్యుత్కేంద్రాలు మూసేయండి
* టీఎస్ జెన్కోకు కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశం * 720 మెగావాట్ల 8 యూనిట్లు మూసేయాలని స్పష్టీకరణ * 60, 120 మెగావాట్ల థర్మల్ ప్లాంట్లు కూడా... * 2019 వరకు గడువు ఇచ్చిన కేంద్రం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాలం చెల్లిన థర్మల్ విద్యుత్ కేంద్రాలను మూసివేయాలని తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (టీఎస్జెన్కో)కు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. పాత సాంకేతిక పరిజ్ఞానంతో దశాబ్దాల కింద నిర్మించిన 60 మెగావాట్లు, 120 మెగావాట్ల థర్మల్ విద్యుత్ యూనిట్లను దశల వారీగా 2018-19 లోపు మూసేయాలని స్పష్టం చేసింది. ఖమ్మం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ విద్యుత్కేంద్రం (కేటీపీఎస్) ఏడో దశ విస్తరణలో భాగంగా 800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త యూనిట్ నెలకొల్పేందుకు పర్యావరణ అనుమతులు జారీ చేస్తూనే, 720 మెగావాట్ల సామర్థ్యం గల 8 పాత కేటీపీఎస్ యూనిట్లను 2018-19 లోగా మూసివేయాలని మెలిక పెట్టింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పట్టుబట్టడంతో కేటీపీఎస్ పాత ప్లాంట్ల మూసివేతపై జెన్కో తలొగ్గక తప్పలేదు. రాష్ట్రంలో విద్యుత్ కొరత నేపథ్యంలో 2019 చివరి నాటికి ఈ ప్లాంట్లను మూసివేస్తామని తెలంగాణ జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు గత నెల 2న కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు హామీ పత్రం రాసిచ్చారు. దీంతో గత నెల 19, 20 తేదీల్లో సమావేశమైన కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ కేటీపీఎస్ ఏడో దశ విస్తరణకు మరికొన్ని షరతులతో అనుమతులు జారీ చేయాలని సిఫారసు చేసింది. ఈ మేరకు వారం రోజుల్లో పర్యావరణ అనుమతుల ఉత్తర్వులు వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం కేటీపీఎస్ విద్యుత్కేంద్రం పూర్తి సామర్థ్యం 1,720 మెగావాట్లు. మరో 800 మెగావాట్లతో ఏడో దశ విస్తరణకు జెన్కో రెండేళ్లుగా పర్యావరణ అనుమతుల కోసం ప్రయత్నిస్తోంది. తొలుత 1966-67లో ఒక్కొక్కటి 60 మెగావాట్ల సామర్థ్యంతో 4 యూనిట్లను నిర్మించి మొత్తం 240 మెగావాట్లతో జెన్కో కేటీపీఎస్‌ను నెలకొల్పింది. ఆ తర్వాత 1974-78 మధ్య కాలంలో ఒక్కొక్కటి 120 మెగావాట్లతో మరో 4 యూనిట్లను నిర్మించి 480 మెగావాట్లను జత చేసింది. తదనంతరం ఈ విద్యుత్కేంద్రం ఐదు, ఆరు దశల విస్తరణలో భాగంగా మరో 1,000 మెగావాట్లతో మూడు యూనిట్లను నిర్మించడంతో కేటీపీఎస్ సామర్థ్యం 1,720 మెగావాట్లకు పెరిగింది. 1998-2004 మధ్యలో కాలం చెల్లిన 60 మెగావాట్లు, 120 మెగావాట్ల పాత యూనిట్ల ఆధునికీకరణ కోసం రూ.604 కోట్లను జెన్కో ఖర్చు చేసింది. భారీ పెట్టుబడి పెట్టినందున 60 మెగావాట్ల యూనిట్లను 2023-24 వరకు, 120 మెగావాట్ల యూనిట్లను 2018-19 వరకు నడపాలని జెన్కో భావించింది. ఏడో దశ విస్తరణ ప్రతిపాదనల్లో సైతం ఇదే అంశాన్ని పర్యావరణ శాఖకు తెలియజేసింది. కానీ, పర్యావరణ శాఖ ఒప్పుకోకపోవడంతో పాత యూనిట్ల మూసివేతకు జెన్కో సంసిద్ధత వ్యక్తం చేయక తప్పలేదు. కాలుష్యంపై ఆందోళన.. కేటీపీఎస్ విద్యుత్కేంద్రం నుంచి ఉత్పత్తి అవుతున్న బూడిద వ్యర్థాలపై పర్యావరణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడి బూడిదలో 15.89 శాతాన్ని మాత్రమే ఇటుకలు, సిమెంట్ తయారీకి వినియోగిస్తున్నారని, 2020-21 నాటికి 100 శాతం బూడిదను వినియోగంలోకి తేవాలని స్పష్టం చేసింది. ఆ మేరకు సిమెంటు, ఇటుకల పరిశ్రమలను ప్రోత్సహించాలని సిఫారసు చేసింది. కొత్త యూనిట్ నుంచి ఉత్పత్తి అయ్యే బూడిద కోసం కొత్త యాష్ పాండ్ ఏర్పాటును వ్యతిరేకించింది. పాత యూనిట్ల యాష్ పాండ్లనే కొత్త యూనిట్‌కూ వినియోగించుకోవాలని కోరింది. బూడిద కోసం కొత్తగా స్థలాలను సేకరించరాదని ఆంక్షలు విధించింది. కాలుష్య నివారణ చర్యలపై ప్రతి 6 నెలలకు ఒకసారి తెలంగాణ పీసీబీతో కలిసి పర్యవేక్షణ జరపాలని తమ ప్రాంతీయ కార్యాలయాన్ని ఆదేశించింది. -
ప్రత్యామ్నాయ గ్యాస్‌తో సర్దుబాటు
హైదరాబాద్: గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్లకు ఆర్ఎల్ఎన్జీ గ్యాస్‌ను పరస్పర బదిలీ పద్ధతిలో సర్దుబాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఏపీలో గ్యాస్ కొరతతో మూతపడ్డ మూడు పవర్ ప్లాంట్లకు గ్యాస్‌ను కేటాయించేందుకు అనుమతించింది. రెండు నెలల కిందట టీఎస్ జెన్కో చేసిన అభ్యర్థన మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీలోని జీవీకే, స్పెక్ట్రమ్, లాంకో, కోనసీమ, వేమగిరి గ్యాస్ ఆధారిత ప్లాంట్లలో మొత్తం 2499 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యముంది. సరిపడా గ్యాస్ అందుబాటులో ఉంటే ఇందులో నుంచి 53.89 శాతం (1346 మెగావాట్లు) విద్యుత్తు తెలంగాణకు పంపిణీ అయ్యే వీలుంది. ప్రస్తుతం కేజీ బేసిన్ నుంచి గ్యాస్ సరఫరా లేకపోవటంతో ఈ ప్లాంట్ల నుంచి తెలంగాణకు అందుతున్న విద్యుత్తు 150 మెగావాట్లకు మించటం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో రీ గ్యాసిఫైడ్ లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ (ఆర్ఎల్ఎన్జీ) ధర గతంలో ఒక్కో యూనిట్‌కు 20 నుంచి 25 డాలర్లుండగా, ప్రస్తుతం 10 నుంచి 15 డాలర్లకు పడిపోయింది. గ్యాస్‌ను ద్రవ రూపంలోకి మార్చి బ్యారెళ్లలో దిగుమతి చేసుకొని తిరిగి ద్రవాన్ని గ్యాస్‌గా మార్చడమే ఆర్ఎల్ఎన్జీ. ప్రస్తుతం కేజీ బేసిన్ నుంచి మహారాష్ట్ర, గుజరాత్‌లోని ఫెర్టిలైజర్ కంపెనీలకు గ్యాస్ సరఫరా అవుతోంది. అక్కడి నుంచి తూర్పు తీరంలో ఉన్న ఏపీకి గ్యాస్ సరఫరా చేసుకునేందుకు పైపులైన్లు లేవు. అందుకే ఆర్ఎల్ఎన్జీని అక్కడి కంపెనీలకు కేటాయించి కేజీ బేసిన్ నుంచి సరఫరా అవుతున్న గ్యాస్‌ను ఇక్కడ వినియోగించుకునేలా గ్యాస్ స్వాపింగ్ (పరస్పర గ్యాస్ కేటాయింపుల బదిలీ)కు అనుమతించాలని రాష్ట్ర ఇంధన శాఖ నెల రోజుల కిందట కేంద్రాన్ని అభ్యర్థించింది. మూడు గ్యాస్ ఆధారిత కేంద్రాలకు 2.4 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను అందించేందుకు కేంద్రం అంగీకరించింది. దీంతో దాదాపు 450 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. గ్యాస్ ప్లాంట్లలో విద్యుదుత్పత్తి ప్రారంభమైతే తెలంగాణకు 242 మెగావాట్ల విద్యుత్తు అందే అవకాశముంది. -
విద్యుత్ ఉద్యోగులకు ఆరు లక్ష్యాలు
సిబ్బందికి ఇంధన శాఖ నిర్దేశం పనితీరే భవితకు ప్రామాణికం సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శాఖ ఉద్యోగులకు రాష్ట్ర ఇంధన శాఖ ఆరు లక్ష్యాలను నిర్దేశించింది. పని తీరే భవిష్యత్తుకు ప్రామాణికమని తేల్చి చెప్పింది. రాబోయే నాలుగేళ్లలో ఉద్యోగులు, సంబంధిత కంపెనీలు నిర్ణీత లక్ష్యాలను సాధించాలని స్పష్టంచేసింది. ప్రస్తుత వేతన సవరణ ఉద్యోగుల పనితీరు, ప్రమాణాలకు లోబడి ఉంటుందని తెలిపింది. 2017-18 నాటికి విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలను రెండు శాతం తగ్గించాలని, ఏటా నూటికి నూరు శాతం బిల్లులు వసూలు చేయాలని సూచించింది. దీంతో పాటు ప్రస్తుతం జెన్కో అధ్వర్యంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నింటా సగటున 85 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (వాస్తవ సామర్థ్యంలో విద్యుత్ ఉత్పాదకత)ను సాధించాలని నిర్దేశించింది. వేతన సవరణకు అధికారికంగా అనుమతిస్తూ... ఉద్యోగ సంఘాలతో ఒప్పందం చేసుకునేందుకు రాసిన లేఖలో ఇంధన శాఖ ఈ లక్ష్యాలను ప్రత్యేకంగా పొందుపరిచింది. ‘‘నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, చేపట్టబోయే ప్లాంట్ల అంచనా వ్యయం పెరిగిపోకుండా నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలి. నిర్వహణ ఖర్చులు, సాధారణ మరమ్మతుల వ్యయాన్ని రాబోయే నాలుగేళ్లలో ఏటా 5 శాతం చొప్పున తగ్గించాలి. ప్రతి కేటగిరీలో ఏటా 5 శాతం చొప్పున మీటర్ సేల్స్ పెంచాలి’’ అని లేఖలో ఇంధన శాఖ పేర్కొంది. టీఎస్ జెన్కో, టీఎస్ ట్రాన్స్‌కో, డిస్కంల పరిధిలో పని చేస్తున్న విద్యుత్ ఉద్యోగులందరికీ వేతన సవరణ అమలు చేస్తున్నట్లు ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రకటించారు. 30 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణకు ఆదేశాలు జారీ చేశారు. 15 ఏళ్ల సర్వీసు నిండిన ఉద్యోగులకు మూడు ఇంక్రిమెంట్లు, 15 సంవత్సరాల లోపు సర్వీసు ఉన్న ఉద్యోగులకు రెండు ఇంక్రిమెంట్లు ఇస్తామని ప్రకటించారు. పెన్షనర్లు, వారి కుటుంబీకులకు కూడా 30 శాతం ఫిట్మెంట్ ప్రయోజనం వర్తించే పెన్షన్‌కు అంగీకరించారు. ఈ వేతన సవరణకు అధికారికంగా అనుమతి జారీ చేస్తున్నట్లు ఇంధన శాఖ టీఎస్ ట్రాన్స్‌కో, టీఎస్ జెన్కోకు లేఖ రాసింది. భవిష్యత్తు పీఆర్సీపై పీటముడి భవిష్యత్తులో విద్యుత్ విభాగానికి ప్రత్యేకంగా పీఆర్సీ ఉండదని ఇంధన శాఖ ఇదే లేఖలో స్పష్టం చేసింది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వ పీఆర్సీతో అనుసంధానమై ఉంటుందని పేర్కొంది. ఈ నిబంధనను విద్యుత్ శాఖలోని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాయి. మంగళవారం టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకరరావు వేతన సవరణ ఒప్పందంపై గుర్తింపు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఇంధన శాఖ లేఖలోని అంశాలన్నింటికీ సమ్మతి తెలిపిన ఉద్యోగ సంఘాలు... ప్రత్యేక పీఆర్సీ తొలగింపు నిబంధనపై మాత్రం తీవ్ర అభ్యంతరం తెలిపాయి. 327, 1104, టీఎన్టీయూసీ సంఘాల ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేసేందుకు నిరాకరించారు. రేయిం బవళ్లు.. ఆకస్మిక విధులు నిర్వహించే విద్యుత్ విభాగానికి ఇప్పుడున్న పీఆర్సీ యథాతథంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.