సాక్షి, అమరావతి : తెలంగాణ జెన్‌కో తీరు మారలేదు. కృష్ణా నదిలో వరద ప్రవాహం కనిష్ట స్థాయికి చేరింది. దిగువన సాగు, తాగు నీటి అవసరాలు లేవు. అయినా, తెలంగాణ జెన్‌కో శ్రీశైలం, సాగర్‌లలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తోంది. దాంతో శ్రీశైలం, సాగర్‌లలో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. కృష్ణా నది నికర జలాలు వృథాగా సముద్రంలోకి పోతున్నాయి.
ఇదే అంశాన్ని వివరిస్తూ, తక్షణమే విద్యుదుత్పత్తిని నిలిపివేసేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్‌కు శుక్రవారం లేఖ రాశారు. లేదంటే రిజర్వాయర్లలో నీరు తగ్గిపోయి, సీజన్ చివర్లో సాగు, తాగు నీటికి ఇబ్బందులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది మే 27న జరిగిన బోర్డు సమావేశంలో తాగు, సాగు నీటికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యుత్తుకు కాదని తీసుకున్న నిర్ణయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆ
లేఖలో ప్రధానాంశాలు ఇవీ..
► ఈ నెల 24 నాటికి శ్రీశైలం ప్రాజెక్టులో 884.4 అడుగుల్లో 213.401 టీఎంసీలు నిల్వ ఉండేవి. వరద కనిష్ట స్థాయికి చేరడంతో స్పిల్ వే గేట్లు మూసేశాం. తెలంగాణ జెన్‌కో, ఏపీ జెన్‌కోలు విద్యుదుత్పత్తిని కొనసాగిస్తూ.. దిగువకు నీటిని వదిలేస్తుండటం వల్ల గురువారం ఉదయం 6 గంటలకు శ్రీశైలంలో నీటి మట్టం 881.3 అడుగుల్లో 195.21 టీఎంసీలకు తగ్గిపోయింది. అంటే.. 18 టీఎంసీలను శ్రీశైలం నుంచి దిగువకు వదిలేశారు.
► గురువారం ఉదయం 6 గంటలకు నాగార్జునసాగర్‌లో 589.7 అడుగుల్లో 311.150 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. దిగువన ఎలాంటి తాగు, సాగునీటి అవసరాలు లేకున్నా.. తెలంగాణ జెన్‌కో విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని దిగువకు వదిలేస్తోంది. ఆ జలాలు నదిలో కలుస్తున్నాయి.
► పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌లో గరిష్ట స్థాయిలో నీటి నిల్వ ఉంది. దాంతో.. ఎగువ నుంచి విడుదల చేస్తున్న నీటిని సముద్రంలోకి వదిలేయాల్సి వస్తోంది.
► ఈ ఏడాది మే 27న జరిగిన బోర్డు సమావేశంలో దిగువన సాగు, తాగునీటి అవసరాలు ఉన్నప్పుడే.. బోర్డు అనుమతితో విద్యుదుత్పత్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ అవసరాలు లేకపోతే విద్యుదుత్పత్తి నిలిపివేయాలని నిర్ణయించారు.
► బోర్డు నిర్ణయాన్ని, విభజన చట్టాన్ని తెలంగాణ జెన్‌కో ఉల్లంఘించి యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేస్తోంది. దాంతో కృష్ణా నికర జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment