సాక్షి, అమరావతి: కృష్ణా జలాలను ప్రస్తుత నీటి సంవత్సరంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు 79.88:20.12 నిష్పత్తిలో పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ప్రతిపాదించింది. చిన్న నీటి వనరుల విభాగంలో తెలంగాణ సర్కారు 89.15 టీఎంసీల వినియోగానికే పరిమితమైతే అప్పుడు ఏపీ, తెలంగాణలకు 70:30 నిష్పత్తిలో కృష్ణా జలాలను పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ–2) తీర్పు నోటిఫై అయ్యే వరకూ బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) తీర్పే అమల్లో ఉంటుందని కేంద్ర జల్ శక్తి శాఖ స్పష్టం చేయడాన్ని ఎత్తిచూపిందని తెలిపింది.
బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చే వరకు 512.04, 298.96 టీఎంసీల చొప్పున పంపిణీ చేసుకునేలా రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం కొనసాగుతుందని తేల్చి చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా జలాలను చెరి సగం పంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ ప్రతిపాదించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) విచారణ చేస్తోందని గుర్తు చేసింది. నీటి పంపిణీ బోర్డు పరిధిలోకి రాదని.. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ చేసిన ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవద్దని స్పష్టం చేస్తూ కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురేకు ఏపీ జల వనరుల శాఖ ఇంజనీర్–ఇన్–చీఫ్ (ఈఎన్‌సీ) సి.నారాయణరెడ్డి బుధవారం లేఖ రాశారు.
లేఖలోని ప్రధానాంశాలివీ..
► 2020 జూన్ 4న జరిగిన కృష్ణా బోర్డు 12వ సమావేశంలో చిన్న నీటి వనరుల విభాగంలో కేటాయించిన 89.15 టీఎంసీలకుగానూ 45 టీఎంసీలను మాత్రమే వాడుకుంటున్నాం. వీటిని పరిగణనలోకి తీసుకుని నీటిని పంపిణీ చేయాలి.
► అంతర్ రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల జోలికి వెళ్లడం చట్టవిరుద్ధం. చిన్న నీటి వనరుల విభాగంలో 89.15 టీఎంసీల వినియోగానికే తెలంగాణ సర్కార్ పరిమితమైతే 70:30 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణకు కృష్ణా జలాలను పంపిణీ చేయాలని కోరాం. దీనిపై కృష్ణా బోర్డు చైర్మన్ జోక్యం చేసుకుని 66:34 నిష్పత్తిలో పంచుకోవాలని చేసిన సూచనకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి.
► చిన్న నీటి వనరుల విభాగంలో తెలంగాణకు 89.15 టీఎంసీల కేటాయింపులు ఉంటే 175 టీఎంసీలను వాడుకుంటోంది. ఈ విషయాన్ని జూలై 6, 9 తేదీల్లో బోర్డు దృష్టికి తీసుకొచ్చాం. ఈ దృష్ట్యా మధ్య, భారీతరహా ప్రాజెక్టుల్లో 79.88: 20:12 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణలకు నీటిని పంపిణీ చేయాలి.
► ఒకే తరహా నీటి లభ్యత సూత్రాన్ని అన్ని నదులకు అమలు చేయలేం. ఒక్కో నది స్వరూపాన్ని బట్టి నీటి లభ్యత సూత్రం ఆధారపడి ఉంటుందని బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే 70.8: 29.2 నిష్పత్తిలో తెలంగాణ, ఏపీలో కృష్ణా పరీవాహక ప్రాంతం ఉంది. దాన్ని ప్రామాణికంగా తీసుకుని నీటిని పంపిణీ చేయాలన్న తెలంగాణ వాదన అసంబద్ధం.
► విభజన చట్టంలో 11వ షెడ్యూల్‌లో పేర్కొన్న ప్రాజెక్టుల అవసరాలతో కలుపుకుని 1,059 టీఎంసీలను కేటాయించాలనే డిమాండ్లను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీ ప్రభుత్వం పెట్టింది. ఇతర బేసిన్‌లకు మళ్లిండం, ఇతర బేసిన్‌ల నుంచి కృష్ణా బేసిన్‌కు మళ్లించడం, బేసిన్‌లను ప్రామాణికంగా తీసుకుని ఎక్కువ నీటి వాటా కోసం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ డిమాండ్లు పెట్టగా బోర్డు విచారిస్తోంది. చెరి సగం నీటిని పంపిణీ చేయాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరడం సహేతుకం కాదు.
కృష్ణా జలాల్ని 80:20 నిష్పత్తిలో కేటాయించండి
Published Thu, Aug 26 2021 3:45 AM | Last Updated on Thu, Aug 26 2021 3:45 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment