తెలంగాణ విద్యుత్‌ దోపిడీని ఆపండి | AP ENC Narayanareddy letter to KRMB Member Secretary | Sakshi
Sakshi News home page

తెలంగాణ విద్యుత్‌ దోపిడీని ఆపండి

Published Tue, Aug 31 2021 2:28 AM | Last Updated on Tue, Aug 31 2021 2:28 AM

AP ENC Narayanareddy letter to KRMB Member Secretary - Sakshi

సాక్షి, అమరావతి: నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్, శ్రీశైలం నుంచి ఏకపక్షంగా చేస్తున్న విద్యుత్‌ ఉత్పత్తిని తక్షణం నిలిపివేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ)ను కోరింది. కృష్ణా జలాల కేటాయింపుతోపాటు సాగర్, శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టుల వద్ద  జరిగే విద్యుదుత్పత్తిపై తెలంగాణ ప్రభుత్వ వాదనల్లో సహేతుకం లేదని, శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని తెలంగాణ ఉద్దేశపూర్వకంగా తప్పుగా అన్వయిస్తోందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఉమ్మడి ప్రాజెక్టులైన సాగర్, శ్రీశైలం నుంచి ఏపీ సర్కార్‌ సాగు, తాగు నీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని కోరినప్పుడు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుల నుంచి విద్యుదుత్పత్తి చేయాలని.. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా అక్కడ  విద్యుదుత్పత్తి చేస్తోందని కేఆర్‌ఎంబీ దృష్టికి తీసుకువెళ్లింది.

ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శికి ఏపీ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) నారాయణరెడ్డి సోమవారం లేఖ రాశారు. సాగర్, శ్రీశైలం జలాశయాల నుంచి విద్యుదుత్పత్తిపై తెలంగాణ జెన్‌కో కేఆర్‌ఎంబీకి ఇచ్చిన వివరణపై కేఆర్‌ఎంబీ ఏపీ ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. దీనిపై ఏపీ ఈఎన్‌సీ స్పందిస్తూ.. తెలంగాణ వాదన సహేతుకంగా లేదంటూ.. విద్యుత్‌ దోపిడీకి సంబంధించిన వాస్తవ విషయాలను లేఖ ద్వారా కేఆర్‌ఎంబీ దృష్టికి తీసుకువెళ్లారు. కృష్ణాడెల్టా సాగు, తాగునీరు అవసరాల కోసం ఉమ్మడి ప్రాజెక్టులైన సాగర్, శ్రీశైలం నుంచి నీటి విడుదలను కోరినప్పుడే తెలంగాణ విద్యుదుత్పత్తి చేయాలని ఈఎన్‌సీ స్పష్టంచేశారు. అలాగే, పులిచింతలలోనూ తెలంగాణ చేస్తున్న విద్యుదుత్పత్తిని నిలిపివేసేలా ఆ రాష్ట్రాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. 

ఆ రెండూ ఏపీలోనే ఉన్నాయి
నాగార్జునసాగర్‌ కుడికాలువ పవర్‌హౌస్, టెయిల్‌పాండ్‌ పవర్‌హౌస్‌ భౌగోళికంగా ఏపీ పరిధిలో ఉన్నాయని, ఆ ప్రాజెక్టుల దిగువన నీటి అవసరాలు ఉన్న ప్రాంతాలు కూడా ఏపీలోనే ఉన్నాయని ఈఎన్‌సీ వివరించారు. కాబట్టి ఈ రెండుచోట్ల ఉత్పత్తి చేసే విద్యుత్‌ పూర్తిగా ఏపీకి సంబంధించిందన్నారు. నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ పవర్‌హౌస్‌ వద్ద 60 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో నీటిని విడుదల చేస్తారు. ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించినది. ఇక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్‌ను రెండు రాష్ట్రాలు పంచుకోవాలని ఈఎన్‌సీ తెలిపారు.
 
ఏపీపై తెలంగాణ ఆంక్షలకు ఆస్కారం లేదు
ఇక రాష్ట్ర పునర్విభజన చట్టం 11వ షెడ్యూల్లో పేర్కొన్న ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకుని 1,059 టీఎంసీల ఏపీ ప్రభుత్వ డిమాండ్‌ కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌ ముందుంచిందని ఏపీ ఈఎన్‌సీ ఆ లేఖలో గుర్తుచేశారు. ఈ అంశం కృష్ణా జల వివాదాల రెండో ట్రిబ్యునల్‌ ముందు ఉందని, ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రస్తావించడం సమంజసం కాదన్నారు. ఏపీకి కేటాయించిన నీటిని ఏ విధంగానైనా ఏపీ భూభాగంలో వినియోగించుకునే హక్కు తమ రాష్ట్రానికి ఉందని, కేటాయించిన నీటిని వినియోగించుకోవడంలో ఏపీపై తెలంగాణ ఎలాంటి ఆంక్షలు, అభ్యంతరాలకు ఆస్కారంలేదని నారాయణరెడ్డి అందులో స్పష్టంచేశారు. 

రెండు విడతల్లో చెన్నైకు 15 టీఎంసీలు
చెన్నై నీటి సరఫరాకు సంబంధించి.. 1983లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఒప్పందం ఉందని ఏపీ ఈఎన్‌సీ ఆ లేఖలో గుర్తుచేశారు. చెన్నై నగర తాగునీటి అవసరాల కోసం 15 టీఎంసీలను రెండు విడతల్లో కృష్ణా జలాలను సరఫరా చేయాల్సి ఉందన్నారు. జూలై నుంచి అక్టోబర్‌ వరకు 9.90 టీఎంసీలను ఒక్కో రాష్ట్రం 3.30 టీఎంసీల చొప్పున మూడు రాష్ట్రాలు చెన్నైకి సరఫరా చేయాలని.. అలాగే, జనవరి–ఏప్రిల్‌ మధ్య 5.10 టీఎంసీలు ఒక్కో రాష్ట్రం 1.70 టీఎంసీల చొప్పున ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ఇక వరద జలాలపై ఎస్‌ఆర్‌బీసీ ఆధారపడలేదని.. 1981లోనే సీడబ్ల్యూసీ దీనిని ఆమోదించిందన్నారు. అలాగే, 75 శాతం నికర జలాల ఆధారంగా 19 టీఎంసీల వినియోగానికీ కేంద్ర జలవనరుల కమిషన్‌ ఆమోదించిందని ఈఎన్‌సీ తెలిపారు. 

నీటి మళ్లింపు అధికారం ఏపీకి ఉంది
మరోవైపు.. పోతిరెడ్డిపాడు ద్వారా 2019–20లో 170 టీఎంసీలను, 2020–21లో 124 టీఎంసీలను మళ్లించినట్లు నారాయణరెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. ఎస్‌ఆర్‌బీసీ, చెన్నైకి నీటి సరఫరాకే కాకుండా వరద జలాలపై ఆధారపడిన తెలుగుగంగ, జీఎన్‌ఎస్‌ఎస్‌కి కూడా ఈ నీటిని వినియోగించినట్లు ఈఎన్‌సీ తెలిపారు. వరద సమయంలో మిగులు జలాలను వరద నిర్వహణతో పాటు అవసరమైన వాటికి మళ్లించుకునే అధికారం రాష్ట్ర పునర్విభజన చట్టం–2014 ప్రకారం ఏపీకి ఉందని ఆయన తన లేఖలో స్పష్టం చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement