⇒ ఫిబ్రవరిలో 95% పీఎల్‌ఎఫ్ నమోదు
⇒ 100 శాతం పీఎల్‌ఎఫ్ సాధించిన రెండో యూనిట్
సాక్షి, హైదరాబాద్: విద్యుదుత్పత్తిలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం రికార్డు సృష్టించింది. ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో 1200 (2x600) మెగావాట్ల సామర్థ్యంతో సింగరేణి బొగ్గు గనుల సంస్థ నిర్మించిన ఈ విద్యుదుత్పత్తి కేంద్రంలోని తొలి యూనిట్ గత సెప్టెంబర్, రెండో యూనిట్ గత నవంబర్ నుంచి విద్యుదుత్పత్తి ప్రారంభించింది. తాజాగా మంగళవారంతో ముగిసిన ఫిబ్రవరి నెలలో సింగరేణి విద్యుదుత్పత్తి కేంద్రంలోని రెండో యూనిట్ పూర్తి సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి జరిపి 100 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్) సాధించగా, తొలి యూనిట్ 90 శాతం పీఎల్‌ఎఫ్ సాధించింది. దీంతో ఫిబ్రవరిలో విద్యుత్ కేంద్రం సగటు పీఎల్‌ఎఫ్ 95 శాతంగా నమోదైంది.
విద్యుదుత్పత్తి కేంద్రాల స్థాపక విద్యుదుత్పత్తి సామర్థ్యంతో పోల్చితే వాస్తవంగా జరిగిన విద్యుదుత్పత్తి శాతాన్ని పీఎల్‌ఎఫ్ అంటారు. ఫిబ్రవరిలో రెండో యూనిట్ 389 మిలియన్ యూనిట్లు (ఎంయూలు), తొలి యూనిట్ 348 ఎంయూల విద్యుదుత్పత్తి జరిపాయి. మొత్తానికి ఈ విద్యుత్ కేంద్రం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 3,443 ఎంయూల విద్యుదుత్పత్తి జరగగా, అందులో 3,191 ఎంయూల విద్యుత్ రాష్ట్ర అవసరాలకు సరఫరా చేశారు. తొలి యూనిట్ 2,157 ఎంయూలు, రెండో యూనిట్ 1,286 ఎంయూల విద్యుదుత్పత్తి చేశాయి. ఏపీ జెన్‌కో, టీఎస్ జెన్‌కో విద్యుదుత్పత్తి కేంద్రాలతో పోల్చితే సింగరేణి విద్యుత్ కేంద్రం పీఎల్‌ఎఫ్ మెరుగ్గా ఉందని సింగరేణి యాజమాన్యం పేర్కొంది. పూర్తి సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామని, దీనిలో భాగంగానే ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో పీఎల్‌ఎఫ్ సాధించామని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు.
విద్యుదుత్పత్తిలో ‘సింగరేణి’ రికార్డు
Published Wed, Mar 1 2017 1:38 AM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM
Advertisement
Advertisement