
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ, తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(టీఎస్‌ఎండీసీ)ల సంయుక్త ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటైంది. రాష్ట్ర గనులు, ఖనిజాల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ చైర్మెన్‌గా రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కన్వీనర్‌గా గనులు, ఖనిజాలు, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి, సభ్యులుగా సింగరేణి సంస్థ సీఎండీ, టీఎస్‌ఎండీసీ వైస్ చైర్మెన్, ఎండీ, గనుల శాఖ డైరెక్టర్లను నియమించారు.
ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయంలో నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్‌ఎండీసీ), ఎంఈసీఓఎన్, రైల్ వికాస్ నిగమ్ సంస్థలకు చెందిన అధికారులు, నిపుణులతో సంప్రదింపులు జరపాలని ఈ కమిటీకి సూచించారు. కర్మాగారం డిజైన్, అంచనా వ్యయం, నిధుల లభ్యత, ఉద్యోగావకాశాలు తదితర అంశాలపై అధ్యయనం జరిపి నెలలోగా నివేదిక సమర్పించాలని ఈ కమిటీని ఆదేశించారు.
ఛత్తీస్‌గఢ్ నుంచి ముడి ఉక్కు ఖనిజం
ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మిస్తామని రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ అమలు సాధ్యం కాదని కేంద్రం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో స్వయంగా తామే ఈ పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఖమ్మం జిల్లా అనువైన ప్రాంతమని, ఇక్కడికి సమీపంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో నాణ్యత కలిగిన ముడి ఇనుము లభ్యత ఉందని తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment