ఆంధ్రా సింగరేణిగా మారనున్న ‘చింతలపూడి’
బొగ్గు గనుల వేలం జాబితాలో చింతలపూడి రెండు సెక్టార్లకు చోటు
ఇక్కడ భూ ఉపరితలానికి 500 మీటర్ల లోతులోనే నాణ్యమైన గ్రేడ్–1 బొగ్గు
బొగ్గు తవ్వకాలు ప్రారంభమైతే ఏలూరు జిల్లాకు దేశవ్యాప్తంగా గుర్తింపు
వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఆంధ్రా సింగరేణిగా ఏలూరు జిల్లా చింతలపూడి ప్రాంతం వెలుగొందనుంది. నల్ల బంగారు గనులతో రాష్ట్రానికి కాసుల పంట పండించనుంది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనుంది. నవ్యాంధ్ర అభివృద్ధికి ఊతం అందించనుంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 80 బొగ్గు గనుల వేలానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ జాబితాలో ఏలూరు జిల్లా చింతలపూడి సెక్టార్ ఏ–1 (ఎస్‌డబ్ల్యూ), చింతలపూడి సెక్టార్ ఏ–1 (ఎస్‌ఈ)లు 44, 45 స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు సెక్టార్లు కూడా చింతలపూడి మండలంలోనే ఉండటం విశేషం. దీంతో చింతలపూడి మండలంలో నాణ్యమైన బొగ్గు తవ్వకాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
గతంలోనే వేలంలో చోటు దక్కినా...!
చాట్రాయి మండలం సోమవరం గ్రామం నుంచి చింతలపూడి వరకు 2వేల మిలియన్ టన్నుల నుంచి 3వేల మిలియన్ టన్నుల బొగ్గు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తెలంగాణలోని సింగరేణి తరహాలో ఇక్కడ బొగ్గు తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి 2015లో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏపీఎండీసీ) లేఖ రాసింది. దానిపై కేంద్రం స్పందించలేదు.
కానీ, గతంలో కేంద్రం దేశవ్యాప్తంగా నిర్వహించిన బొగ్గు గనుల వేలంలో ప్రస్తుతం ఏలూరు జిల్లా చాట్రాయి మండలం సోమవరం, తడికలపూడితోపాటుగా చింతలపూడి బ్లాక్‌లోని జంగారెడ్డిగూడెం కూడా ఉన్నాయి. ఈ వేలంలో సింగరేణి సంస్థ పోటీలో లేక పోవడంతో బొగ్గు గనుల వేలం వాయిదా పడింది.
తాజాగా ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి దేశవ్యాప్తంగా నూతన బొగ్గు గనుల వేలం జాబితాను ప్రకటించగా, చింతలపూడి సెక్టార్ ఏ–1 (ఎస్‌డబ్ల్యూ), చింతలపూడి సెక్టార్ ఏ–1 (ఎస్‌ఈ)లకు చోటు దక్కింది. దీంతో బొగ్గు తవ్వకాలు ప్రారంభమైతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రజలు భావిస్తున్నారు.
60 ఏళ్ల నుంచి అన్వేషణ..
» ఉమ్మడి పశ్చిమ, కృష్ణా జిల్లాల పరిధిలో బొగ్గు గనులను కనుగొనేందుకు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్‌ఐ)తోపాటు వివిధ సంస్థలు 60 ఏళ్ల నుంచి సర్వేలు చేశాయి. తొలి దశలో 1964 నుంచి 2006 వరకు నాలుగు దఫాలుగా సర్వేలు నిర్వహించారు.
2006 నుంచి 2016 వరకు మళ్లీ సర్వేలు కొనసాగాయి.
» అన్ని సర్వేల్లోనూ చింతలపూడి ప్రాంతంలో నాణ్యమైన బొగ్గు గనులు ఉన్నట్లు గుర్తించారు. ఆయా సర్వే సంస్థల నివేదికల్లో కొన్ని స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ చింతలపూడి మండలంలో 30 కిలో మీటర్ల వ్యాసార్థంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు దాదాపు అన్ని
సంస్థలు అంచనా వేశాయి.
» లక్నోకు చెందిన బీర్బల్ సహానీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలియో బోటనీ అనే సంస్థ 2013లో నాటి కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బొగ్గు గనులపై అధ్యయనం చేసింది. చాట్రాయి మండలం సోమవరం నుంచి చింతలపూడి, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం మండలాల మీదుగా రాజమండ్రి వరకు నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది. ఇతర రాష్ట్రాల్లో లభించే బొగ్గుతో పోల్చితే ఇక్కడ అత్యంత నాణ్యమైన గ్రేడ్–1 రకం బొగ్గు ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది. అది కూడా భూ ఉపరితలానికి 500 మీటర్ల లోతులోనే బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని వెల్లడించింది.
» సౌత్ వెస్ట్ పినాకిల్ సంస్థ మరో సంస్థతో కలిసి చింతలపూడి ప్రాంతంలో 120 పాయింట్లను గుర్తించి అధునాతన రిగ్గులతో డ్రిల్లింగ్ చేపట్టింది. ఈ 120 పాయింట్ల ద్వారా సుమారు 65,000 మీటర్ల లోతున బొగ్గు అన్వేషణ చేపట్టి సుమారు 40,000 మీటర్ల పనులు పూర్తి చేసింది.
» ఇక్కడ గనుల్లో తవ్వకాలు ప్రారంభమైతే ఏడాదికి 8 వేల మెగావాట్లు చొప్పున 60 సంవత్సరాల వరకు విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు సరిపోతుందని వివిధ సర్వే రిపోర్టుల ఆధారంగా అధికారులు అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment