సాక్షి, హైదరాబాద్: దేశంలో బొగ్గు కొరత రోజురోజుకు తీవ్రమవుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు 108 థర్మల్ విద్యుత్ కేంద్రాలు తీవ్ర బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. వివిధ ప్రాంతాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద బుధవారం నాటికి సగటున 4 రోజుల విద్యుదుత్పత్తికి సరిపడ బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. బొగ్గు లభ్యత లేక గురువారం ఇతర రాష్ట్రాల్లోని 14,500 మెగావాట్ల సామర్థ్యం గల 15 థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో విద్యుదుత్పత్తి జరగలేదు. మరోవైపు బొగ్గు కొరత ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై కూడా పడింది.
అయితే జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సింగరేణి బొగ్గు గనుల సంస్థ.. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాను తగ్గించి ఇతర రాష్ట్రాల్లోని ప్లాంట్లకు మళ్లిస్తోంది. రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాల్లో ప్రస్తుత అవసరాలకు మించి బొగ్గును వృథాగా నిల్వ ఉంచడానికి బదులుగా, ఇతర రాష్ట్రాల్లో ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఎదుర్కొంటున్న విద్యుత్ కేంద్రాలకు సింగరేణి బొగ్గును తరలిస్తున్నారు. అయితే సింగరేణి బొగ్గు సరఫరా తొలి ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రమేనని, రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతే ఇతర రాష్ట్రాలకు బొగ్గును సరఫరా చేస్తున్నట్లు సింగరేణి సంస్థ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. దేశంలో బొగ్గు కొరత ఎంత పెరిగినా, రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాలకు కొరత రాకుండా చూసుకుంటామని పేర్కొన్నారు. (చదవండి: విద్యుత్ సంక్షోభం.. జనాలకు ఢిల్లీ ప్రభుత్వం వింత రిక్వెస్ట్)
మనవద్దా నాలుగైదు రోజులకు సరిపడా నిల్వలే..
రాష్ట్రంలోని తెలంగాణ జెన్‌కో, సింగరేణి, ఎన్టీపీసీల థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సాధారణంగా 15 రోజులకు సరిపడ బొగ్గు నిల్వలు ఉండాల్సి ఉండగా, బుధవారం నాటికి నాలుగైదు రోజులకు సరిపడ నిల్వలే ఉన్నాయి. 810 మెగావాట్ల భద్రాద్రి టీపీపీ, 1,000 మెగావాట్ల కొత్తగూడెం టీపీఎస్(న్యూ), 2,600 మెగావాట్ల ఎన్టీపీసీ రామగుండం, 1,200 మెగావాట్ల సింగరేణి టీపీపీ వద్ద 4 రోజులకు సరిపడ బొగ్గు నిల్వలే ఉన్నాయి. పిట్‌హెడ్ ప్లాంట్లలో 5 రోజులు, అంతకన్న తక్కువ రోజులకు సరిపడ బొగ్గు నిల్వలు మాత్రమే ఉంటే ‘ఆందోళనకర (క్రిటికల్)’ పరిస్థితిగా పరిగణిస్తారు.
రాష్ట్రంలోని తెలంగాణ జెన్‌కో, ఎన్టీపీసీ, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సజావుగా ఉత్పత్తి జరగడానికి రోజుకు 96 వేల టన్నుల బొగ్గు అవసరం. కనీసం 15 రోజుల అవసరాలకు 14.37 లక్షల టన్నుల బొగ్గు నిల్వ ఉండాల్సి ఉండగా, 5.98 లక్షల టన్నుల బొగ్గు నిల్వలే ఉన్నట్లు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ గురువారం తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
పిట్‌హెడ్ ప్లాంట్లు కాబట్టి ఇబ్బంది లేదు..
బొగ్గు గనులకు 50 కి.మీ.ల పరిధిలో ఉంటే ‘పిట్‌హెడ్’థర్మల్ విద్యుత్ ప్లాంట్లు అంటారు. వీటికి బొగ్గు రవాణా చేసేందుకు.. అయ్యే వ్యయం, పట్టే సమయం తక్కువగా ఉంటుంది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 4వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం తప్పిస్తే.. మిగిలిన థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ ‘పిట్‌హెడ్’ప్లాంట్లే. సింగరేణి గనులకు సమీపంలో ఉండటంతో వీటికి బొగ్గు సరఫరాకు చాలా తక్కువ సమయం పట్టనుంది. అందువల్ల వీటిల్లో బొగ్గు నిల్వలు తగ్గినా ఆందోళన అవసరం లేదని, గనులకు సమీపంలో ఉండటంతో తక్షణమే అవసరమైన బొగ్గును సరఫరా చేయగలమని సింగరేణి అధికారులు పేర్కొంటున్నారు.
కొరత ఎందుకంటే?
కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ల అనంతరం అన్ని రంగాలు కుదుటపడుతున్నాయి. మళ్లీ పారిశ్రామిక ఉత్పత్తి పుంజుకోవడం, ఇతర రంగాలూ సాధారణ స్థితికి చేరుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెరిగింది. దీంతో విద్యుదుత్పత్తికి వినియోగించే బొగ్గుకు సైతం డిమాండ్ పెరిగి కొరత ఏర్పడింది. పొరుగు దేశం చైనాలో గత వారం రోజులుగా తీవ్ర బొగ్గు కొరతతో విద్యుత్ ఉత్పత్తి తగ్గి పరిశ్రమలు మూతపడే పరిస్థితులు నెలకొన్నాయి. (చదవండి: విద్యుత్ సంక్షోభంపై తక్షణం స్పందించండి)
గతేడాదితో పోల్చితే అంతర్జాతీయ మార్కెట్‌లో బొగ్గు ధరలు సైతం 100 శాతానికి మించి పెరిగిపోయాయి. దేశంలో సైతం విద్యుత్ డిమాండ్ పెరిగి బొగ్గు వినియోగం పెరిగిపోయింది. దీంతో ఇక్కడా బొగ్గు కొరత నెలకొంది. విదేశీ బొగ్గు ధరలు భారీగా పెరిగిపోవడంతో .. దేశీయంగా తక్కువ ధరకు లభిస్తున్న కోల్ ఇండియా, సింగరేణి బొగ్గుకు డిమాండ్ పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment