థర్మల్ విద్యుత్‌కేంద్రాలకు బొగ్గు కొరత
వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. దాంతో ఏసీ, కూలర్, ఫ్రిజ్ వంటి గృహోపకరణాల వాడకం పెరుగుతోంది. రానున్న రోజుల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటిస్తే వాటి వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. కానీ పీక్ అవర్స్‌లో సరఫరా చేసేందుకు సరిపడా విద్యుత్ మాత్రం తయారుకావడం లేదని నిపుణులు చెబుతున్నారు. దానికితోడు థర్మల్ విద్యుత్‌తయారీ కేంద్రాలకు బొగ్గుకొరత ఉందని కేంద్రం ఇటీవల సూచించడంతో ఆందోళన వ్యక్తమవుతుంది.
దేశవ్యాప్తంగా ఉన్న 22 థర్మల్ విద్యుత్కేంద్రాల్లో తీవ్ర బొగ్గు కొరత నెలకొంది. ఫలితంగా పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి కావడం లేదు. రోజువారీ విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుండటంతో థర్మల్ విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తి పెంచాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం తాజాగా సూచించింది. దేశవ్యాప్తంగా 2.09 లక్షల మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ విద్యుత్కేంద్రాల్లో పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరగాలంటే.. వాటిలో ఎప్పుడూ 6.86 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలుండాలి. కానీ, ఈ నెల 8 నాటికి అందులో 68 శాతమే అంటే 4.65 కోట్ల టన్నులే ఉన్నట్లు కేంద్ర విద్యుత్ మండలి(సీఈఏ) తెలిపింది.
ముందస్తు నిల్వల్లో తగ్గుదల
తెలంగాణలోని థర్మల్ విద్యుత్కేంద్రాల్లో ముందస్తు నిల్వల కోటా 16.34 లక్షల టన్నులు ఉండాల్సి ఉండగా.. 8.61 లక్షల టన్నులే (53 శాతం) ఉన్నట్లు వెల్లడించింది. అన్ని చోట్ల కనీస ఉత్పత్తి జరిగేందుకు వీలుగా ప్రతి విద్యుత్కేంద్రంలో వినియోగించే బొగ్గులో 6 శాతం వచ్చే జూన్ వరకూ విదేశాల నుంచి తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాలంటూ కేంద్ర విద్యుత్‌శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తెలంగాణలో సింగరేణి గనులుండటంతో రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్కేంద్రాలకు విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోబోమని రాష్ట్ర జెన్‌కో చెబుతోంది.
ఇదీ చదవండి: ‘విజయం తనకే దక్కాలనే ఉద్దేశంతో కట్టుకథలు’
సింగరేణిలో అంతంతమాత్రంగానే..
సింగరేణి సంస్థ నుంచి తెలంగాణ మినహా ఇతర రాష్ట్రాలకు అవసరమైనంత బొగ్గు సరఫరా చేయలేకపోతున్నారు. రోజుకు 2.40 లక్షల టన్నులు పంపాలని పలు రాష్ట్రాల నుంచి డిమాండ్ ఉంది. అంతకన్నా పాతిక వేల టన్నుల దాకా ఉత్పత్తి తక్కువగా ఉండటంతో ఆమేరకు సంస్థ సరఫరా చేయలేకపోతోంది. తెలంగాణ కోసం ప్రత్యేకంగా రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన 1,600 మెగావాట్ల విద్యుత్కేంద్రానికి సంస్థ రోజుకు 21,900 టన్నుల బొగ్గు ఇవ్వాలి. ఈ కేంద్రంలో కనీసం 26 రోజులకు అవసరమైనంత ముందస్తు నిల్వ కోటా కింద 5,68,500 టన్నులు ఉండాలి. ప్రస్తుతం 2,24,800 టన్నులే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment