సాక్షి, హైదరాబాద్: థర్మల్ విద్యుత్ కేంద్రాల కనీస విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని మూడేళ్లలో 55 శాతం నుంచి 40 శాతానికి కుదించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. థర్మల్ విద్యుత్‌కు ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. విద్యుత్ కేంద్ర, రాష్ట్ర పరిధిలోని ఉమ్మడి అంశం. అంటే ఏ నిర్ణయమైనా రెండు ప్రభుత్వాల అంగీకారం మేరకు జరగాలి. కానీ కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, తమ అభ్యంతరాలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా విద్యుత్ రంగంలో తన నిర్ణయాలను అమలు చేయాల్సిందిగా బలవంతం చేస్తోందని తెలంగాణ సహా అనేక రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. తన నిర్ణయాలను అమలు చేయని రాష్ట్రాలపై ఆర్థిక పరమైన ఆంక్షలు విధిస్తోందని మండిపడుతున్నాయి.
2025–26 నాటికల్లా..
కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) మార్గదర్శకాల ప్రకారం.. సాంకేతికంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల కనీస ఉత్పత్తి (టెక్నికల్ మినిమమ్) సామర్థ్యం 55 శాతం ఉండాలి. కానీ వచ్చే మూడేళ్లలో దీనిని 40 శాతానికి తగ్గించాలని, థర్మల్ విద్యుత్‌కు ప్రత్యామ్నాయంగా సౌర, పవన తరహా పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. కేంద్ర, రాష్ట్రాల, ప్రైవేటు థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ద్వారా సుమారు 58,000 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్ ఉత్పత్తిని తగ్గించి ఆ మేరకు పునరుత్పాదక విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవడం సాధ్యమేనని కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు 2025–26 నాటికి థర్మల్ ఉత్పత్తిని తగ్గించాలని ఆదేశించింది.
జెన్‌కో, సింగరేణి, ఎన్టీపీసీకి నష్టాలే..
రాష్ట్రంలో ఎన్టీపీసీ, సింగరేణి, రాష్ట్ర జెన్‌కోల యాజమాన్యంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు సాధారణంగా 70–85 శాతం వార్షిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్) సామర్ధ్యంతో విద్యుదుత్పత్తి చేస్తాయి. స్థాపిత సామర్థ్యంతో పోల్చితే వాస్తవిక ఉత్పత్తి శాతాన్ని పీఎల్‌ఎఫ్ అంటారు. ఉదాహరణకు..100 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ సగటున 80 మెగావాట్ల సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తే 80 శాతం పీఎల్‌ఎఫ్ సాధించిందని సాంకేతిక పరిభాషలో చెబుతారు. కాగా సాధ్యమైనంత అధిక పీఎల్‌ఎఫ్‌తో విద్యుదుత్పత్తి చేస్తేనే జెన్‌కో, ఎన్టీపీసీ, సింగరేణి వంటి సంస్థలు లాభాలు ఆర్జించగలుగుతాయి. ఈ విధంగా అధిక పీఎల్‌ఎఫ్‌తో ఉత్పత్తి చేసినందుకు గతంలో కేంద్ర ఇంధన శాఖ నుంచి సింగరేణి థర్మల్ ప్లాంట్ పురస్కారాలను సైతం అందుకుంది. ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం కనీస ఉత్పత్తి సామరŠాధ్యన్ని తగ్గించాలని ఆదేశించడం గమనార్హం. కాగా కేంద్రం నిబంధనలను అమలు చేస్తే నష్టాలు తప్పవని జెన్‌కో, సింగరేణి వంటి సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ప్రజలపై ఫిక్స్‌డ్ చార్జీల మోత?
విద్యుదుత్పత్తి సంస్థలకే కాదు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లతో పాటు వినియోగదారులకు సైతం కేంద్ర ప్రభుత్వ నిబంధనలు భారంగా మారబోతున్నాయి. థర్మల్ విద్యుత్ ప్లాంట్ల కనీస జీవిత కాలం 25 ఏళ్లు. పెట్టుబడి రుణాలతో కలిపి వీటి మొత్తం నిర్మాణ వ్యయాన్ని 25 ఏళ్ల కాలంలో రాబట్టుకునేందుకు వీలుగా వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌కు సంబంధించిన స్థిర చార్జీలు (ఫిక్స్‌డ్ కాస్ట్) నిర్ణయిస్తారు. మొత్తం వ్యయాన్ని ఈ 25 ఏళ్ల గడువులోగా రాబట్టుకోవడానికి వీలుగా జెన్‌కో, ఎన్టీపీసీ, సింగరేణి వంటి ఉత్పత్తి కంపెనీలు డిస్కంలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) చేసుకుంటాయి. సాధారణంగా 85 శాతం పీఎల్‌ఎఫ్‌ను ప్రామాణికంగా తీసుకుని ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్‌పై స్థిర చార్జీలను లెక్కిస్తారు. ఈ విధంగా ఒక్కో యూనిట్ థర్మల్ విద్యుత్ స్థిర వ్యయం రూ.2–3 వరకు అవుతోంది. ఇప్పుడు కేంద్ర ఆదేశాల మేరకు కనీస పీఎల్‌ఎఫ్‌ను 40 శాతానికి తగ్గిస్తే.. విద్యుత్ స్థిర చార్జీలు రెట్టింపవుతాయని ,ఇవి వినియోగదారుల నుంచే వసూలు చేస్తారు కాబట్టి భవిష్యత్తులో విద్యుత్ బిల్లులు భారీగా పెరిగిపోక తప్పదని విద్యుత్‌రంగ నిపుణులు చెబుతున్నారు.
బొగ్గు వినియోగం ప్రశ్నార్ధకం
రాష్ట్రంలో బొగ్గు నిల్వలు అపారంగా ఉన్నాయి. రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లకు అవసరమైన బొగ్గు పూర్తిగా సింగరేణే సమకూరుస్తోంది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. ఇక్కడ వేరియబుల్ కాస్ట్ (విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించే ముడిసరుకులకు అయ్యే వ్యయం) కూడా కాస్త తక్కువే. కేంద్రం తాజా నిర్ణయంతో ఈ బొగ్గు వినియోగం కూడా ప్రశ్నార్ధకంగా మారుతుందని అంటున్నారు.
తగ్గనున్న ప్లాంట్ల జీవిత కాలం...
కొత్త విధానం ప్లాంట్ల జీవిత కాలాన్ని కుదిస్తుందన్న అభిప్రాయాన్ని కూడా విద్యుత్ రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. తక్కువ సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసే విధానం వల్ల థర్మల్ ప్లాంట్ల యంత్రాల పనితీరు సామర్థ్యం గణనీయంగా తగ్గుతుందని అంటున్నారు. తెలంగాణ జెన్‌కో ప్రస్తుతం 4042 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లను కలిగి ఉంది. వచ్చే ఏడాది, రెండేళ్లలో మరో 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ అందుబాటులోకి రానుంది. రామగుండంలో ఎన్టీపీసీ నిర్మిస్తున్న మరో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం మరో కొన్ని నెలల్లో అందుబాటులోకి రానుంది. వీటిద్వారా రాష్ట్రం మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుతుందన్న ధీమాతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ పరిస్థితుల్లో కనీస ఉత్పత్తి సామరŠాధ్యన్ని 40 శాతానికి కుదించడం ప్రస్తుత ప్లాంట్లతో పాటు కొత్త ప్లాంట్ల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పేర్కొంటున్నారు.
సంప్రదాయేతర విద్యుత్ మేలు: కేంద్రం
థర్మల్ విద్యుత్‌తో పోల్చితే పునరుత్పాదక విద్యుత్ తక్కువ ధరలకు లభిస్తోందని కేంద్రం పేర్కొంటోంది. కాలుష్య కారకమైన థర్మల్ స్టేషన్ల కంటే సంప్రదాయేతర విద్యుత్ మేలని చెబుతోంది. అయితే ఇప్పటికే భారీ వ్యయంతో నిర్మించిన విద్యుత్ ప్లాంట్లు, కొత్తగా ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమవుతున్న ప్లాంట్ల పరిస్థితేంటని రాష్ట్రాలు ప్రశ్నిస్తున్నాయి. 2020–21లో జెన్‌కో 72.35 శాతం సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేసింది. గత ఐదేళ్లుగా 72–80 శాతం సామర్థ్యంతో ఉత్పత్తి సాధిస్తోంది. అయితే థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరాలో కోతపెట్టైనా సరే థర్మల్ విద్యుదుత్పత్తిని తగ్గించాలని కేంద్రం పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గించడం వల్ల..సంప్రదాయేతర ఇంధన విద్యుత్ సామర్థ్యం ప్రస్తుతం ఉన్నదానికి అదనంగా 30 వేల మెగావాట్లు పెంచాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.
‘థర్మల్’కు కళ్లెం!.. ఆ మేరకు కేంద్రం ఆదేశాలు
Published Mon, Jul 25 2022 2:26 AM | Last Updated on Mon, Jul 25 2022 8:15 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment