thermal power stations
-
మూసివేత దిశగా రామగుండం బీ– థర్మల్ విద్యుత్ కేంద్రం?
రామగుండం: నిర్వహణ భారం..జీవితకాలం ముగియడంతో పెద్దపల్లి జిల్లా రామగుండంలోని 62.5 మెగావాట్ల బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం మూసివేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. వారంరోజులు క్రితం 38 మంది ఇంజనీర్లు, ఐదుగురు సబ్ ఇంజనీర్లు, ఒకరు సీనియర్ కెమిస్ట్, నలుగురు కెమిస్ట్‌లను యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)కు డిప్యుటేషన్ పేరిట బదిలీ చేశారు. దీంతో మూసివేత తప్పదనే ప్రచారం జరుగుతోంది. యూనిట్ ట్రిప్ అయినా... ఈ నెల 4వ తేదీన యూనిట్‌లోని మిల్స్ విభాగంలో సాంకేతిక సమస్యతో తలెత్తింది. దీంతో యూనిట్ ట్రిప్ అయ్యి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. విద్యుత్ సౌధ నుంచి అనుమతులు రాకపోవడంతో పునరుద్ధరణ చేపట్టలేదు. పదిరోజులుగా ఖాళీగా ఉంటున్న ఇంజనీర్లు, ఉద్యోగులను యాదాద్రి, భద్రాద్రి, కేటీపీఎస్ తదితర జెన్కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బదిలీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. 1965లో ప్లాంట్ ప్రారంభం » అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం కాసు బ్రహా్మనందరెడ్డి 1965 జూలై 19న రామగుండంలో 62.5 మెగావాట్ల సామర్థ్యంగల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభించారు. కరెంట్ ఉత్పత్తితోపాటు పీఎల్ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) సాధిస్తూ రికార్డులు నమోదు చేసింది. అయితే విద్యుత్ కేంద్రం స్థాపించి ఆరు దశాబ్దాలు కావడంతో నిర్వహణ భారంగా మారింది. » బాయిలర్, టర్బయిన్, మిల్స్, ట్రాన్స్ఫార్మర్ తదితర విభాగాల్లో ఏడాదిగా తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో తరచూ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతోంది. » ఈ జనవరి నుంచి సమస్య మరింత జటిలమైంది. కాలం చెల్లిన విద్యుత్ కేంద్రం కావడంతో విడిభాగాల లభ్యత లేదు. పాతవాటితోనే సర్దుబాటు చేసి విద్యుత్ కేంద్రాన్ని ఉత్పత్తి దశలోకి తీసుకొస్తున్నారు. » సాంకేతిక సమస్యలతో మళ్లీమళ్లీ ట్రిప్పవుతూనే ఉంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణకు రూ.25 లక్షలకుపైగా వ్యయం అవుతోంది. ఆదాయం కన్నా వ్యయమే అధికంగా ఉండడంతో మూసివేతే పరిష్కారమని భావిస్తున్నట్టు సమాచారం. ∙వాస్తవానికి థర్మల్ విద్యుత్ కేంద్రాల జీవితకాలం 25 ఏళ్లే. రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ జీవితకాలం ఎప్పుడో ముగిసిపోయింది. కొత్త ప్లాంటు ఏర్పాటు తప్పనిసరిరామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం సమీపంలోనే 800 మెగావాట్ల సామర్ధ్యం గల కొత్త విద్యుత్ కేంద్రం స్థాపిస్తాం. అప్పటివరకు పాత విద్యుత్ కేంద్రాన్ని కొనసాగించాలని ఎనర్జీ సెక్రటరీ రిజ్వీ, డైరెక్టర్లను కలిసి విన్నవించా. అత్యధిక సంఖ్యలో ఇంజనీర్లు ఉండడంతో కొందరిని యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాలకు డిప్యుటేషన్‌పై బదిలీ చేస్తున్నారు. – మక్కాన్‌సింగ్ ఠాకూర్, రామగుండం, ఎమ్మెల్యే -
బొగ్గుకు బకాయిలేం లేవు.!
సాక్షి, అమరావతి: అవే పైత్యపు కథనాలు.. నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు.. విలువలు లేకుండా అడ్డగోలుగా అచ్చేస్తున్న అవాస్తవాల పరంపరలో మరో నీతిమాలిన వార్తను రామోజీరావు ‘బొగ్గు రాదు.. బకాయిలే కారణం’ శీర్షికతో ఈనాడులో వండివార్చారు. కళ్లముందు నిజాలు కనిపిస్తున్నా.. టీడీపీ హయాంలో బొగ్గు సేకరణ ఇప్పటి కన్నా తక్కువే ఉన్నా ఆ నిజాన్ని దాచి ప్రజలను మభ్యపెట్టేందుకు ఆ కథనంలో విశ్వప్రయత్నం చేశారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేసిన కంపెనీలకు ఇంధన సరఫరా ఒప్పందాల (ఫ్యూయల్ సప్లయి అగ్రిమెంట్స్–ఎఫ్ఎస్ఏ) ప్రకారం సకాలంలో బకాయిలు చెల్లిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుదుత్పాదక సంస్థ (ఏపీజెన్కో) మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు స్పష్టం చేశారు. ఈనాడు కథనంలో వాస్తవం లేదని ఆయన తెలిపారు. ఈ మేరకు ‘సాక్షి’కి ఏపీజెన్కో ఎండీ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ‘ఎఫ్ఎస్ఏ’ ప్రకారం సకాలంలో చెల్లింపులు మహానది కోల్ ఫీల్డ్స్ (ఎంసీఎల్)కు ఏపీజెన్కో సెప్టెంబర్‌లో రూ. 554.57 కోట్ల బకాయిలు చెల్లించింది. గడువులోగా చెల్లించాల్సిన బకాయిలు ఏమీలేవు. సింగరేణి కాలరీస్ కంపెనీస్ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)కు చెల్లింపులకు ‘బిల్ ఆఫ్ ఎఎక్స్చేంజ్’ విధానం వల్ల ఆ సంస్థకు పెండింగ్ బకాయిలు లేవు. ఎస్సీసీఎల్, ఎంసీఎల్ నుంచి ఎఫ్ఎస్ఏ ప్రకారం ఏపీజెన్కో బొగ్గు సేకరిస్తోంది. ఈ ఒప్పందాల ప్రకారం నిర్ణీత గడువులో బకాయిలు చెల్లిస్తోంది. ఇక ఈ ఏడాది దేశవ్యాప్తంగా పెరిగిన విద్యుత్ డిమాండ్ మేరకు బొగ్గు సరఫరా కానందున అన్ని రాష్ట్రాలు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. పైగా నైరుతీ రుతుపవనాల సీజన్లో బొగ్గు తవ్వకాలకు అంతరాయం కలిగింది. ఈ పరిస్థితిని ముందే అంచనా వేసిన ఏపీజెన్కో వారం వారం జరిగే కేంద్ర ఉపసంఘం సమీక్షల్లో, ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ (ఐఎంసీ) సమావేశాల్లో బొగ్గు సరఫరా పెంచాలని పదేపదే విజ్ఞప్తి చేస్తూ వస్తోంది. ప్లాంట్లలో బొగ్గు నిల్వలు పెంచుకోవడానికి, పెరిగిన ఏపీ గ్రిడ్ డిమాండ్ మేరకు విద్యుదుత్పత్తి పెంచేందుకు ఏపీజెన్కో ప్రణాళికాబద్ధంగా అన్ని ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందులో భాగంగానే అదనపు బొగ్గు సేకరణ కోసం కోల్ కంపెనీలతో నిత్యం సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుత బొగ్గు కొరత పరిస్థితుల్లో సైతం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) ఎఫ్ఎస్ఏ లక్ష్యంలో 95.67 శాతం మేరకు బొగ్గును ఏపీ జెన్కో సేకరించగలగడం విశేషం. టీడీపీ అధికారంలో ఉన్న 2018 ఇదే కాలంలో ఒప్పందంలోని 81.02 శాతం బొగ్గు మాత్రమే సేకరించడం గమనార్హం. పెరిగిన విద్యుత్ ఉత్పత్తికి తగ్గట్టు ప్రణాళిక ఈ ఏడాది విద్యుత్ ఉత్పత్తి పెరిగినందున ఏపీజెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు వినియోగం కూడా పెరిగింది. మరోవైపు ఏపీజెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలు 75 శాతం పవర్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)తో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడమే లక్ష్యంగా విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు, థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు పెంచుకునేందుకు, బొగ్గు నిర్వహణ యూనిట్‌ను ఏపీజెన్కో పటిష్టం చేస్తోంది. ఇందుకు అనుగుణంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించుకుని లక్ష్యాల సాధన దిశగా ముందుకెళుతోంది. జెన్కోను దెబ్బతీసింది చంద్రబాబే చంద్రబాబు హయాంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలను బలవంతంగా మూసివేయడం వల్ల ఏపీ జెన్కోకు భారీ నష్టం వాటిల్లింది. నాసిరకం బొగ్గును అధిక ధరకు గత టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. కాగ్ సైతం ఈ విషయాన్ని బయటపెట్టింది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్టీటీపీఎస్), రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం (ఆర్టీపీపీ) 2011–12లో 22.235 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశాయి. కానీ 2015–16 నాటికి విద్యుదుత్పత్తి 19.359 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. దీనివల్ల విద్యుదుత్పత్తి ధర యూనిట్‌కు రూ. 2.94 నుంచి రూ. 4.34కు పెరిగింది. బలవంతంగా మూసివేయడం వల్ల ఆ రెండు విద్యుత్ కేంద్రాలకు రూ. 675.69 కోట్లు నష్టం వాటిల్లింది. మహానది కోల్ లిమిటెడ్ (ఎంసీఎల్) బొగ్గు సరఫరా చేయడం లేదనే సాకు చూపి 2014 జూలైలో 26.61 లక్షల మిలియన్ టన్నుల బొగ్గును, 2015–16లో ఎలాంటి అవగాహనా ఒప్పందం కుదుర్చుకోకుండానే 63.5 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి నుంచి ప్రీమియం ధరకు టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. 2014 నుంచి 2016 వరకూ కోల్ ఎనాలిసిస్ నివేదికలు, కోల్ ఇన్వాయిస్లను సమీక్షిస్తే జెన్కో కొనుగోలు చేసిన బొగ్గు నాణ్యతలో భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు తేలింది. నాణ్యతలేని రూ. 3,179.32 కోట్ల విలువైన 86.02 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును అధిక ధరను కొనుగోలు చేయడం వల్ల జెన్కోకు రూ. 918.61 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కాగ్ తేల్చింది. అప్పట్లో విదేశీ బొగ్గునూ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరకు కొనుగోలు చేశారు. ప్రభుత్వ సంస్థలను ముందు పెట్టి తెరవెనుక కోల్‌మాఫియా చక్రం తిప్పింది. రూ. 500 కోట్లకు పైగా ప్రజాధనం వృథా అయ్యింది. -
‘థర్మల్’కు కళ్లెం!.. ఆ మేరకు కేంద్రం ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: థర్మల్ విద్యుత్ కేంద్రాల కనీస విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని మూడేళ్లలో 55 శాతం నుంచి 40 శాతానికి కుదించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. థర్మల్ విద్యుత్‌కు ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. విద్యుత్ కేంద్ర, రాష్ట్ర పరిధిలోని ఉమ్మడి అంశం. అంటే ఏ నిర్ణయమైనా రెండు ప్రభుత్వాల అంగీకారం మేరకు జరగాలి. కానీ కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, తమ అభ్యంతరాలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా విద్యుత్ రంగంలో తన నిర్ణయాలను అమలు చేయాల్సిందిగా బలవంతం చేస్తోందని తెలంగాణ సహా అనేక రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. తన నిర్ణయాలను అమలు చేయని రాష్ట్రాలపై ఆర్థిక పరమైన ఆంక్షలు విధిస్తోందని మండిపడుతున్నాయి. 2025–26 నాటికల్లా.. కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) మార్గదర్శకాల ప్రకారం.. సాంకేతికంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల కనీస ఉత్పత్తి (టెక్నికల్ మినిమమ్) సామర్థ్యం 55 శాతం ఉండాలి. కానీ వచ్చే మూడేళ్లలో దీనిని 40 శాతానికి తగ్గించాలని, థర్మల్ విద్యుత్‌కు ప్రత్యామ్నాయంగా సౌర, పవన తరహా పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. కేంద్ర, రాష్ట్రాల, ప్రైవేటు థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ద్వారా సుమారు 58,000 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్ ఉత్పత్తిని తగ్గించి ఆ మేరకు పునరుత్పాదక విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవడం సాధ్యమేనని కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు 2025–26 నాటికి థర్మల్ ఉత్పత్తిని తగ్గించాలని ఆదేశించింది. జెన్కో, సింగరేణి, ఎన్టీపీసీకి నష్టాలే.. రాష్ట్రంలో ఎన్టీపీసీ, సింగరేణి, రాష్ట్ర జెన్కోల యాజమాన్యంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు సాధారణంగా 70–85 శాతం వార్షిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) సామర్ధ్యంతో విద్యుదుత్పత్తి చేస్తాయి. స్థాపిత సామర్థ్యంతో పోల్చితే వాస్తవిక ఉత్పత్తి శాతాన్ని పీఎల్ఎఫ్ అంటారు. ఉదాహరణకు..100 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ సగటున 80 మెగావాట్ల సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తే 80 శాతం పీఎల్ఎఫ్ సాధించిందని సాంకేతిక పరిభాషలో చెబుతారు. కాగా సాధ్యమైనంత అధిక పీఎల్‌ఎఫ్‌తో విద్యుదుత్పత్తి చేస్తేనే జెన్కో, ఎన్టీపీసీ, సింగరేణి వంటి సంస్థలు లాభాలు ఆర్జించగలుగుతాయి. ఈ విధంగా అధిక పీఎల్‌ఎఫ్‌తో ఉత్పత్తి చేసినందుకు గతంలో కేంద్ర ఇంధన శాఖ నుంచి సింగరేణి థర్మల్ ప్లాంట్ పురస్కారాలను సైతం అందుకుంది. ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం కనీస ఉత్పత్తి సామరŠాధ్యన్ని తగ్గించాలని ఆదేశించడం గమనార్హం. కాగా కేంద్రం నిబంధనలను అమలు చేస్తే నష్టాలు తప్పవని జెన్కో, సింగరేణి వంటి సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలపై ఫిక్స్డ్ చార్జీల మోత? విద్యుదుత్పత్తి సంస్థలకే కాదు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లతో పాటు వినియోగదారులకు సైతం కేంద్ర ప్రభుత్వ నిబంధనలు భారంగా మారబోతున్నాయి. థర్మల్ విద్యుత్ ప్లాంట్ల కనీస జీవిత కాలం 25 ఏళ్లు. పెట్టుబడి రుణాలతో కలిపి వీటి మొత్తం నిర్మాణ వ్యయాన్ని 25 ఏళ్ల కాలంలో రాబట్టుకునేందుకు వీలుగా వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌కు సంబంధించిన స్థిర చార్జీలు (ఫిక్స్డ్ కాస్ట్) నిర్ణయిస్తారు. మొత్తం వ్యయాన్ని ఈ 25 ఏళ్ల గడువులోగా రాబట్టుకోవడానికి వీలుగా జెన్కో, ఎన్టీపీసీ, సింగరేణి వంటి ఉత్పత్తి కంపెనీలు డిస్కంలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) చేసుకుంటాయి. సాధారణంగా 85 శాతం పీఎల్‌ఎఫ్‌ను ప్రామాణికంగా తీసుకుని ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్‌పై స్థిర చార్జీలను లెక్కిస్తారు. ఈ విధంగా ఒక్కో యూనిట్ థర్మల్ విద్యుత్ స్థిర వ్యయం రూ.2–3 వరకు అవుతోంది. ఇప్పుడు కేంద్ర ఆదేశాల మేరకు కనీస పీఎల్‌ఎఫ్‌ను 40 శాతానికి తగ్గిస్తే.. విద్యుత్ స్థిర చార్జీలు రెట్టింపవుతాయని ,ఇవి వినియోగదారుల నుంచే వసూలు చేస్తారు కాబట్టి భవిష్యత్తులో విద్యుత్ బిల్లులు భారీగా పెరిగిపోక తప్పదని విద్యుత్‌రంగ నిపుణులు చెబుతున్నారు. బొగ్గు వినియోగం ప్రశ్నార్ధకం రాష్ట్రంలో బొగ్గు నిల్వలు అపారంగా ఉన్నాయి. రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లకు అవసరమైన బొగ్గు పూర్తిగా సింగరేణే సమకూరుస్తోంది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. ఇక్కడ వేరియబుల్ కాస్ట్ (విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించే ముడిసరుకులకు అయ్యే వ్యయం) కూడా కాస్త తక్కువే. కేంద్రం తాజా నిర్ణయంతో ఈ బొగ్గు వినియోగం కూడా ప్రశ్నార్ధకంగా మారుతుందని అంటున్నారు. తగ్గనున్న ప్లాంట్ల జీవిత కాలం... కొత్త విధానం ప్లాంట్ల జీవిత కాలాన్ని కుదిస్తుందన్న అభిప్రాయాన్ని కూడా విద్యుత్ రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. తక్కువ సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసే విధానం వల్ల థర్మల్ ప్లాంట్ల యంత్రాల పనితీరు సామర్థ్యం గణనీయంగా తగ్గుతుందని అంటున్నారు. తెలంగాణ జెన్కో ప్రస్తుతం 4042 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లను కలిగి ఉంది. వచ్చే ఏడాది, రెండేళ్లలో మరో 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ అందుబాటులోకి రానుంది. రామగుండంలో ఎన్టీపీసీ నిర్మిస్తున్న మరో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం మరో కొన్ని నెలల్లో అందుబాటులోకి రానుంది. వీటిద్వారా రాష్ట్రం మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుతుందన్న ధీమాతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ పరిస్థితుల్లో కనీస ఉత్పత్తి సామరŠాధ్యన్ని 40 శాతానికి కుదించడం ప్రస్తుత ప్లాంట్లతో పాటు కొత్త ప్లాంట్ల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పేర్కొంటున్నారు. సంప్రదాయేతర విద్యుత్ మేలు: కేంద్రం థర్మల్ విద్యుత్‌తో పోల్చితే పునరుత్పాదక విద్యుత్ తక్కువ ధరలకు లభిస్తోందని కేంద్రం పేర్కొంటోంది. కాలుష్య కారకమైన థర్మల్ స్టేషన్ల కంటే సంప్రదాయేతర విద్యుత్ మేలని చెబుతోంది. అయితే ఇప్పటికే భారీ వ్యయంతో నిర్మించిన విద్యుత్ ప్లాంట్లు, కొత్తగా ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమవుతున్న ప్లాంట్ల పరిస్థితేంటని రాష్ట్రాలు ప్రశ్నిస్తున్నాయి. 2020–21లో జెన్కో 72.35 శాతం సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేసింది. గత ఐదేళ్లుగా 72–80 శాతం సామర్థ్యంతో ఉత్పత్తి సాధిస్తోంది. అయితే థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరాలో కోతపెట్టైనా సరే థర్మల్ విద్యుదుత్పత్తిని తగ్గించాలని కేంద్రం పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గించడం వల్ల..సంప్రదాయేతర ఇంధన విద్యుత్ సామర్థ్యం ప్రస్తుతం ఉన్నదానికి అదనంగా 30 వేల మెగావాట్లు పెంచాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. -
ముంచుకొస్తున్న విద్యుత్ సంక్షోభం
ఎండవేడిమి పెరిగిపోతోంది. ఏసీలు, ఫ్రిజ్‌ల వాడకం ఎక్కువైపోయింది. కరోనా అదుపులోనికి రావడంతో పరిశ్రమల్లో ఉత్పత్తి సాధారణ స్థితికి వచ్చింది. దీంతో విద్యుత్ వాడకం ఎక్కవైపోయింది. డిమాండ్‌కి తగ్గట్టుగా సప్లయ్ చేయడానికి థర్మల్ కేంద్రాలను బొగ్గు కొరత వేధిస్తోంది. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా కోల్ ఇండియా దగ్గర సమృద్ధిగా బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ కేంద్రంలో శాఖల మధ్య సమన్వయ లోపంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి వచ్చిందంటే చాలు ఉక్కబోత, విద్యుత్ కోతతో జనాలు అల్లాడిపోవాల్సిందే. దేశంలోని విద్యుత్ అవసరాలను 70% థర్మల్ పవర్ కేంద్రాలే తీరుస్తూ ఉంటే ఆయా కేంద్రాల్లో బొగ్గుకి కొరత ఏర్పడడంతో చాలా రాష్ట్రాలు పవర్ కట్లు విధిస్తున్నాయి. మహారాష్ట్ర, రాజస్తాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, హరియాణా, బిహార్ జమ్మూ కశ్మీర్, తమిళనాడు, కర్ణాటకలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ విద్యుత్ కోతల ప్రభావం పరిశ్రమలపై పడి ఆర్థిక రంగం కూడా కుదేలైపోతుందన్న ఆందోళనలు ఉన్నాయి. వేసవికాలం కావడంతో హఠాత్తుగా దేశవ్యాప్తంగా పెరిగిపోయిన విద్యుత్ వినియోగంతో పాటు బొగ్గు పంపిణీలో లోపాలు సమస్యని మరింత పెంచాయి. విద్యుత్‌కి డిమాండ్ ఎలా పెరిగింది ? ప్రతీ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు విద్యుత్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్నాళ్లూ రోజుకి సగటున 187 గిగావాట్ల విద్యుత్‌కు డిమాండ్ ఉంటే ఏప్రిల్ 1–12 తేదీ మధ్యలో సగటున రోజుకి 194 గిగావాట్లకు పెరిగిపోయింది. దీంతో కొన్ని రాష్ట్రాల్లో రోజుకి ఎనిమిది గంటలు విద్యుత్ కోతలు విధించే పరిస్థితులు వచ్చాయి. బొగ్గు కొరత ఎలా ఉంది ? దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో రాను రాను బొగ్గుకి కొరత ఏర్పడింది. నేçషనల్ పవర్ పోర్టల్ గణాంకాల ప్రకారం ఇంపోర్టెడ్ కోల్ బేస్డ్ (ఐసీబీ) విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు పాతాళానికి పడిపోయాయి. అదే విధంగా 79 దేశీయ పవర్ ప్లాంట్లు కూడా తీవ్ర బొగ్గు కొరతని ఎదుర్కొంటున్నాయి. ఏప్రిల్ 19 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న 700కిపైగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 2.2 కోట్ల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఇవి కేవలం తొమ్మిది రోజులకే సరిపోతాయి. శాఖల మధ్య సమన్వయ లోపం గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో భారీ వర్షాల కారణంగా బొగ్గు తవ్వకాలు నిలిచిపోవడంతో దేశంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. ఇప్పుడు బొగ్గు తవ్వకాలు సమృద్ధిగా జరుగుతున్నప్పటికీ కేంద్రంలోని శాఖల మధ్య సమన్వయ లోపమే దేశంలో విద్యుత్ కోతలకి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ మొదట్లో కోల్ ఇండియా 27% అదనంగా బొగ్గు తవ్వకాలు జరిపింది. విద్యుత్, బొగ్గు గనులు, రైల్వే శాఖ అధికారులతో కూడిన ఒక అంతర్గత కమిటీ బొగ్గు పంపిణీ వ్యవహారాలు చూస్తుంది. బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ బొగ్గు పంపిణీకి సరిపడనంత రాక్స్‌ని కేటాయించడం లేదని ఆరోపిస్తూ ఉంటే, లోడింగ్, అన్‌లోడింగ్‌లో కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) అవకతవకలకు పాల్పడుతోందని రైల్వే శాఖ ఎదురుదాడికి దిగింది. ► థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో 17 నుంచి 26 రోజులకు సరిపడే నిల్వలుంటేనే అవి పూర్తయ్యేలోగా తిరిగి బొగ్గు నిల్వలు చేరుకుంటాయి. కానీ ప్రస్తుతం తొమ్మిది రోజులకి సరిపడా నిల్వలు మాత్రమే ఉండడం ఆందోళనకరంగా మారింది. ► ప్రతిరోజూ రైల్వే శాఖ 453 రాక్స్‌ను కేటాయిస్తేనే విద్యుత్ ప్లాంట్ల అవసరాలకు సరిపడా బొగ్గు పంపిణీ సాధ్యమవుతుంది. ప్రస్తుతం రైల్వే శాఖ కేవలం 412 రాక్స్ ద్వారా మాత్రమే బొగ్గుని పంపిణీ చేస్తూ ఉండడంతో కొరతకి దారి తీసింది. ► ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్, హరియాణాలలో బొగ్గు నిల్వలు కేవలం ఆరు రోజులకు సరిపడా ఉన్నాయని ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) చైర్మన్ శైలేంద్ర దూబే వెల్లడించారు. ► రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. ఇన్నాళ్లుగా టన్ను బొగ్గుకి 100 డాలర్లు ఇస్తే, ఇప్పుడు అది ఏకంగా 300 డాలర్లకు చేరుకుంది. ► విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గుని వాడే విద్యుత్ ప్లాంట్లలో 6.6 కోట్ల టన్నుల బొగ్గు అవసరమైతే ప్రస్తుతం 2.2 కోట్ల టన్నులు మాత్రమే ఉంది. ► విదేశీ బొగ్గు కొరతని అధిగమించడానికి కేంద్రం రష్యా నుంచి డిస్కౌంట్ ధరలకి బొగ్గుని దిగుమతి చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. ప్రపంచంలో బొగ్గు ఎగుమతుల్లో మూడో స్థానంలో రష్యా ఉక్రెయిన్‌పై దాడికి దిగడంతో యూరప్ దేశాలు బొగ్గు దిగుమతులపై నిషేధం విధించారు. దీంతో భారత్ రష్యా నుంచి బొగ్గుని దిగుమతి చేసుకొని సమస్యను పరిష్కరించాలని భావిస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బొగ్గు వినియోగం వద్దు
గ్లాస్గో/లండన్: శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని యూకేలోని గ్లాస్గోలో జరిగిన భాగస్వామ్య పక్షాల (కాప్–26) శిఖరాగ్ర సదస్సు ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. వాతావరణ మార్పులు, వాటి దుష్ప్రభావాలు, వాటిని ఎదుర్కొనేందుకు అమలు చేయాల్సిన వ్యహాలపై చర్చించేందుకు గత రెండు వారాలుగా కొనసాగిన ఈ సదస్సులో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలపై ముసాయిదా తుది ప్రకటనను నిర్వాహకులు శుక్రవారం విడుదల చేశారు. దీన్ని ఐక్యరాజ్యసమితి క్లైమేట్ ఛేంజ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. పర్యావరణాన్ని, తర్వాత భూగోళాన్ని కాపాడుకోవాలంటే బొగ్గు వాడకాన్ని దశల వారీగా నిలిపివేయాలని కాప్–26 సూచించింది. విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇంకా బొగ్గును ఉపయోగిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ఎంతమాత్రం మంచి పరిణామం కాదని వెల్లడించింది. థర్మల్ విద్యుత్ కేంద్రాలు కాలుష్యానికి కారణమవుతున్నాయని గుర్తుచేసింది. చాలావరకు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కర్బన ఉద్గారాలను నియంత్రించే సాంకేతిక పరిజ్ఞానం లేదని తెలిపింది. శిలాజ ఇంధనాల వాడకాన్ని నిరుత్సాహపర్చాలని ఇందుకోసం, సబ్సిడీల్లో పెద్ద ఎత్తున కోత విధించాలని పేర్కొంది. కాప్–26లో ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల నుంచి ప్రతినిధులు పాలుపంచుకున్నారు. ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 నుంచి 2 డిగ్రీల పరిమితం చేయాలన్న ప్రతిపాదనపై చర్చించారు. కర్బన ఉద్గారాల తగ్గింపుపై కీలక ఒప్పందం భారత్ సారథ్యం వహిస్తున్న అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్ఏ), వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్(యూఎన్ఎఫ్సీసీసీ) మధ్య కీలకమైన అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) కుదిరింది. యూకేలోని గ్లాస్గోలో కాప్–26 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా శుక్రవారం ఈ అవగాహనా ఒప్పందంపై ఐఎస్ఏ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ మాథుర్, యూఎన్ఎఫ్సీసీసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ ఓవైస్ సర్మాద్ సంతకాలు చేశారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడానికి, నేషనల్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ అమలుకు ప్రపంచ దేశాలతో కలిసి పని చేస్తామని, తమవంతు సహకారం అందిస్తామని ఐఎస్ఏ హామీ ఇచ్చింది. ఒప్పందంలో భాగంగా.. దీర్ఘకాలంలో కర్బన ఉద్గారాల తగ్గింపునకు ఈ రెండు సంస్థలు ఉమ్మడిగా వ్యూహాలు రూపొందించనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సోలార్, క్లీన్ ఎనర్జీ వినియోగానికి పెద్దపీట వేయడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించాలన్నదే లక్ష్యమని అజయ్ మాథుర్ చెప్పారు. నిర్దేశిత గడువు కంటే ముందే ఈ లక్ష్యాన్ని సాధిస్తామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సౌర కూటమిని 2015 నవంబర్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ప్రకటించారు. -
వేసవికల్లా మరో 1,600 మెగావాట్లు రెడీ
సాక్షి, అమరావతి: వచ్చే వేసవికల్లా మరో 1,600 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం (ఒక్కొక్కటీ 800 మెగావాట్లు)లోని కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాలు మార్చి ఆఖరు నాటికి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేలా ఏపీ జెన్కో సన్నాహాలు చేస్తోంది. దీంతో ప్రస్తుతం 5 వేల మెగావాట్లున్న జెన్కో విద్యుత్ ఉత్పత్తి 6,500 మెగావాట్లకు చేరుతుంది. థర్మల్ ప్లాంట్ల వల్ల పర్యావరణానికి ఎలాంటి హానీ కలగకుండా ప్రతి చోటా కర్బన ఉద్గారాలు తగ్గించే (ప్యూయెల్ గ్యాస్ డీ సల్ఫరైజేషన్) ప్లాంట్ల ఏర్పాటును కేంద్ర పర్యావరణ శాఖ తప్పనిసరి చేసింది. వీటి ఏర్పాటుకు సంబంధించిన కాంట్రాక్టు నిబంధనలను న్యాయ సమీక్షకు పంపామని, అనుమతి రాగానే మరో వారం రోజుల్లో ఎఫ్‌జీడీ ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్లు పిలుస్తామని జెన్కో ఎండీ శ్రీధర్ తెలిపారు ఎఫ్‌జీడీ పనులు జరుగుతుండగానే థర్మల్ ప్లాంట్ల వాణిజ్య కార్యకలాపాలు చేపట్టే అవకాశం ఉందని చెప్పారు. ఆ ఐదేళ్లూ నత్తనడకే ► కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో, అలాగే నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కొత్త ప్లాంట్ల ఏర్పాటును 2015లో ప్రారంభించారు. ఇవి 2018 నాటికే పూర్తవ్వాలి. కానీ అప్పటి ప్రభుత్వం ఇష్టానుసారంగా కాంట్రాక్టులు ఇచ్చింది. మరోవైపు కాంట్రాక్టు సంస్థలకు సకాలంలో డబ్బులు చెల్లించలేదు. పనులు ముందుకు సాగకపోవడంతో ప్లాంట్ల నిర్మాణం ఆలస్యమైంది. దీనివల్ల మరోవైపు ప్రాజెక్టు వ్యయం కూడా పెరిగింది. స్పీడ్ పెంచిన జగన్ సర్కార్ ► ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టులపై దృష్టి సారించింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చేనాటికి జెన్కోకు స్థాయికి మించిన అప్పులున్నాయి. దీంతో కొత్తగా అప్పులు అందే పరిస్థితి లేకుండా పోయింది. కానీ పనుల్లో మరింత జాప్యం వల్ల నిర్మాణ వ్యయం పెరిగిపోతుంది. విద్యుత్ ధర కూడా ఎక్కువయ్యే వీలుంది. ధర ఎక్కువ ఉంటే తరచూ ఉత్పత్తిని ఆపేసి, తక్కువ ధర విద్యుత్‌ను తీసుకోవాల్సి వస్తుంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం ప్లాంట్ల నిర్మాణ ప్రక్రియలో వేగం పెంచింది. ఒక్కో ప్లాంట్‌కు రూ.1,000 కోట్ల చొప్పున ప్రభుత్వమే గ్యారెంటీగా ఉండి అప్పు ఇప్పించేందుకు ముందుకొచి్చంది. ఈ నేపథ్యంలో జెన్కోకు రుణమిచ్చేందుకు పలు ఆర్థిక సంస్థలు ముందుకొచ్చాయి. -
కరెంటుకు.. కొత్త వెలుగు!
కొత్తగూడెం జిల్లాలో సిద్ధమవుతున్న 2 భారీ థర్మల్ విద్యుత్ కేంద్రాలు ► కేటీపీఎస్ 7వ దశ ప్లాంట్ నిర్మాణం 70 శాతం పూర్తి ► ఈ ఏడాది డిసెంబర్‌లోగా విద్యుదుత్పత్తి దిశగా చర్యలు.. ► వివాదాలు, అడ్డంకులను అధిగమించిన భద్రాద్రి ప్లాంట్ ► వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా పూర్తికి లక్ష్యం రాష్ట్రానికి వెలుగులు అందించేందుకు రెండు భారీ థర్మల్ విద్యుత్ కేంద్రాలు సిద్ధమవుతున్నాయి. కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నిర్మిస్తున్న 800 మెగావాట్ల కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీఎస్) 7వ దశ ప్లాంట్ నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తి కానున్నాయి. ఇదే జిల్లాలోని మణుగూరులో నిర్మిస్తున్న 1,080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం (బీటీపీఎస్) వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తిని ప్రారంభించనుంది. పర్యావరణ అనుమతులు ఆలస్యంగా రావడం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) కేసుల వల్ల ముందుగా నిర్దేశించుకున్న భద్రాద్రి ప్లాంట్ నిర్మాణ గడువు తీరిపోయింది. గత ఏప్రిల్‌లోనే భద్రాద్రి ప్లాంట్ పనులు ప్రారంభించగా, వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా పనులు పూర్తి చేసి విద్యుదుత్పత్తి ప్రారంభించాలని రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) కొత్త గడువును పెట్టుకుంది. అలాగే దాదాపు 70 శాతం నిర్మాణం పూర్తయిన కేటీపీఎస్ 7వ దశ ప్లాంట్‌ను ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తి చేసేందుకు జెన్కో యుద్ధప్రాతిపదికన పనులు చేస్తోంది. – సాక్షి, హైదరాబాద్ అడ్డంకులు అధిగమించిన భద్రాద్రి.. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో మూడేళ్ల కింద తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొని ఉన్న సమయంలో, కేవలం 24 నెలల కాలంలో భద్రాద్రి విద్యుత్ కేంద్రం నిర్మిస్తామని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ‘బీహెచ్ఈఎల్’ముందుకు వచ్చింది. అప్పటికే బీహెచ్ఈఎల్ వద్ద 270 మెగావాట్ల సామర్థ్యం గల నాలుగు యూనిట్లతో మొత్తం 1,080 మెగావాట్ల సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి అవసరమైన యంత్రాలు, పరికరాలు సిద్ధంగా ఉండడంతో అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం బీహెచ్ఈఎల్ ప్రతిపాదనకు అంగీకరించింది. 24 నెలల్లోపు భద్రాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తి చేసేందుకు 2015 మార్చి 21న జెన్కో, బీహెచ్ఈఎల్ మధ్య ఒప్పందం జరిగింది. రూ.7,290.60 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ విద్యుత్ కేంద్రం గత మార్చి 31లోపే పూర్తి కావాల్సి ఉండగా వివాదాలు, ఎన్జీటీ కేసులతో ఈ ప్లాంట్ చిక్కుల్లో పడింది. పర్యావరణ అనుమతులు రావడానికి ముందే జెన్కో నిర్మాణ పనులు చేపట్టడంతో ఎన్జీటీ కేసులు చుట్టుముట్టాయి. సబ్ క్రిటికల్ టెక్నాలజీపై కేంద్ర విద్యుత్ శాఖ ఆంక్షలు ఉండడంతో పర్యావరణ అనుమతులు ఆలస్యంగా లభించాయి. ఈ అవాంతరాలను అధిగమించి గత ఏప్రిల్ 1న పనులను ప్రారంభించగా, ఇప్పటి వరకు 5 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలతో మళ్లీ పనులకు అంతరాయం కలిగింది. రూ.7,290.60 కోట్ల అంచనా వ్యయంలో రూ.5,044 కోట్లను ప్లాంట్ నిర్మాణం కోసం బీహెచ్ఈఎల్కు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటికే యంత్రాలు, పరికరాల కోసం జెన్కో రూ.1,975.25 కోట్లను బీహెచ్ఈఎల్కు చెల్లించింది. ఈ యంత్రాలు, పరికరాలను ప్లాంట్ నిర్మాణ స్థలానికి రెండేళ్ల కిందే తరలించినా, అడ్డంకుల వల్ల పనులు 5 శాతానికి మించి జరగలేదు. చిమ్నీలు, కూలింగ్ టవర్ల కోసం తవ్విన భారీ గుంతల్లో చేరిన వర్షపు నీటిని బయటకు తోడి మళ్లీ పనులను పునః ప్రారంభించారు. కొత్తగూడెం.. కేవలం మూడేళ్లలో పూర్తి అధునాతన సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో రాష్ట్రంలో నిర్మిస్తున్న తొలి విద్యుత్ ప్లాంటైన 800 మెగావాట్ల కేటీపీఎస్ 7వ దశ విద్యుత్ కేంద్రాన్ని కేవలం మూడేళ్లలో నిర్మించి రికార్డు సృష్టించాలని జెన్కో లక్ష్యంగా పెట్టుకుంది. థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి గతంలో కనీసం 8 ఏళ్ల సమయం పట్టగా, కేటీపీఎస్ 7వ దశను మాత్రం మూడేళ్లలోపు నిర్మించేందుకు జెన్కో యుద్ధప్రాతిపదికన పనులు నిర్వహిస్తోంది. రూ.5,548 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్లాంట్ నిర్మించేందుకు బీహెచ్ఈఎల్తో జెన్కో ఒప్పందం కుదుర్చుకుంది. 2015 జనవరి 1 నుంచి 24 నెలల్లోపు ఈ ప్లాంట్ పనులు పూర్తి చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.2,634 కోట్ల వ్యయంతో 70 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. బాయిలర్ పనులు 90 శాతం పూర్తికాగా, టర్బైన్, జనరేటర్ స్టాటర్, కోల్ ప్లాంట్ పనులు సైతం దాదాపు సగానికి పైగా పూర్తయ్యాయి. 5 వేల మంది కార్మికులతో రాత్రింబవళ్లు పనులు జరుగుతుండగా, ఈ ఏడాది చివరిలోగా బాయిలర్‌ను లైటప్ చేయాలని జెన్కో లక్ష్యంగా పెట్టుకుంది. ఏవైనా కారణాలతో ఆలస్యమైతే వచ్చే మార్చిలోగా నిర్మాణం పూర్తి చేసి విద్యుదుత్పత్తి ప్రారంభిస్తామని అధికారవర్గాలు తెలిపాయి. మార్చిలోగా భద్రాద్రి లైటప్ చేస్తాం ఎన్జీటీ కేసుతో భద్రాద్రి నిర్మాణం రెండేళ్లు జాప్యమయింది.అయినా యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసి వచ్చే మార్చిలోగా ఈ ప్లాంట్‌కి సంబంధించిన బాయిలర్లను లైటప్ చేస్తాం. ఇప్పటికే 70% పనులు పూర్తయిన కేటీపీఎస్ 7వ దశ ప్లాంట్ పనులను డిసెంబర్‌లోగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. వర్షాలతో కొన్ని రోజులుగా అంతరాయం కలుగుతోంది. వర్షాలు తగ్గిన తర్వాత కార్మికుల సంఖ్యను మరింత పెంచి పనుల వేగాన్ని పెంచుతాం. – ప్రభాకర్‌రావు, జెన్కో సీఎండీ -
పర్యావరణంలో అదో మైలురాయి
బీజింగ్: ‘బొగ్గు అంటే చైనా, చైనా అంటే బొగ్గు’ అంతర్జాతీయ ఇంధన సంస్థ 2012లో చైనా గురించి చేసిన వ్యాఖ్యలివి. అప్పుడు మొత్తం ప్రపంచంలో సగం బొగ్గును చైనానే ఉత్పత్తి చేసేది. విద్యుత్ ఉత్పత్తి కోసం దాన్ని ఉపయోగించేది. ప్రపంచంలో రెండవ బలమైన ఆర్థిక దేశంగా ఘనతికెక్కిన చైనాలో అప్పుడు 2,600 థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉండేవి. 2014 సంవత్సరం నుంచి చైనా వైఖరి ఊహించని విధంగా మారింది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని తగ్గిస్తూ జల విద్యుత్, సౌర విద్యుత్, పవన విద్యుత్ కేంద్రాలను పెంచుతూ వచ్చింది. థర్మల్ విద్యుత్ రంగంలో ఉత్పత్తిని తగ్గిస్తూ కాలుష్యరహిత ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తి రంగంలో పురోభివృద్ధి సాధిస్తున్న దేశాల్లో బ్రిటన్, అమెరికా తర్వాత చైనానే నిలబడింది. 2013లో చైనా 420 టన్నుల బొగ్గును విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించగా, 2014లో దానిలో 2.9 శాతాన్ని, 2015లో 3.6 శాతాన్ని చైనా తగ్గించిందని ‘నేచర్ జియోసైన్స్ జర్నల్’ వెల్లడించింది. అదే సమయంలో చైనా సౌర విద్యుత్ రంగంలో 28 శాతం, పవన, జల విద్యుత్ రంగాల్లో 13 శాతం ఉత్పత్తిని పెంచిందని చైనాకు చెందిన ‘రినీవబుల్ ఎనర్జీ ఇండస్ట్రీస్ అసోసియేషన్’ తెలియజేసింది. భూతాపోన్నతిపై అంతర్జాతీయంగా కుదురిని అవగాహన మేరకు 2014 నుంచి బ్రిటన్, అమెరికా, చైనాలతోపాటు జపాన్, కెనడా, జర్మనీ, ఇండోనేషియా, మెక్సికో లాంటి దేశాలు కూడా విద్యుత్ కోసం బొగ్గు వినియోగాన్ని గణనీయంగా తగ్గించాయి. కనుక ఆ సంవత్సరాన్ని ›ప్రపంచ ఆర్థిక, పర్యావరణ చరిత్రలో ఓ మైలురాయిగా పరిగణిచ్చవచ్చని వ్యాసకర్తలు అభివర్ణించారు. -
జెన్కో సొమ్ము ‘బొగ్గు’ పాలు
నాణ్యతలేని బొగ్గు, అధిక ధరలు, రవాణా లోపాలపై కాగ్ మొట్టికాయలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఇంధన నిర్వహణ లోపాలను కాగ్ ఎత్తిచూపింది. 2010-15 మధ్య బొగ్గు నాణ్యతలో లోపాలతో రూ. 2,082.44 కోట్లు, అధిక ధరతో అదనపు బొగ్గు కొనుగోళ్లతో రూ.170 కోట్లు, మండకుండా మిగిలిన బొగ్గును బూడిద పాలు చేసి రూ.66.73 కోట్లు, బొగ్గు రవాణాలో లోపాలతో సుమారు రూ.20 కోట్లను జెన్కో యాజమాన్యం దుబారా చేసిందని స్పష్టం చేసింది. బొగ్గు కొనుగోలు చేసి బిల్లులో పేర్కొన్న ‘స్థూల కెలోరిఫిక్ విలువ(జీసీవీ)’కు, విద్యుత్ కేంద్రంలో వినియోగించినప్పుడు వచ్చిన ‘జీసీవీ’కి వ్యత్యాసం అధికంగా ఉందని.. దాంతో 2010-15 మధ్య ఏకంగా రూ.2,082.44 కోట్ల విలువైన 76.02 లక్షల టన్నుల బొగ్గును అదనంగా వినియోగించాల్సి వచ్చిందని కాగ్ ఆక్షేపించింది. బొగ్గులోని మండే సామర్థ్యాన్నే కెలోరిఫిక్ విలువ అంటారు. దీన్నే బొగ్గు నాణ్యతగా పరిగణించి ధరను నిర్ణయిస్తారు. కేంద్ర విద్యుత్ పరిశోధన సంస్థ (సీపీఆర్ఐ) మార్గదర్శకాల ప్రకారం బిల్లు చేసినప్పటితో పోలిస్తే... వినియోగ సమయంలో బొగ్గు జీసీవీ విలువ వ్యతాస్యం 150 కిలో కేలరీస్/కేజీలోపు మాత్రమే ఉండాలి. కానీ పలు విద్యుత్ కేంద్రాల్లో ఈ వ్యత్యాసం ఏకంగా 300-500 జీసీవీ వరకూ ఉందని కాగ్ స్పష్టం చేసింది. బొగ్గు నాణ్యతలో భారీ వ్యత్యాసమున్నట్లు జెన్కో యాజమాన్యం అంగీకరించినట్లు తెలిపింది. ఇక కేంద్ర ప్రభుత్వ నూతన బొగ్గు విధానం 100 శాతం బొగ్గు సరఫరాకు హామీ ఇచ్చినా... బొగ్గు అవసరమైనప్పుడు కేంద్రాన్ని సంప్రదించకుండా జెన్కో అధిక ధరతో బొగ్గు కొనుగోళ్లు చేసిందని కాగ్ ఎత్తిచూపింది. తద్వారా 2011-12 నుంచి 2014-15 మధ్య రూ.170.56 కోట్లను అదనంగా ఖర్చు చేసిందని తప్పుబట్టింది. జెన్కో విద్యుత్ కేంద్రాల వద్ద 2010-15 మధ్యకాలంలో రూ.66.73 కోట్లు విలువ చేసే 3.53 లక్షల టన్నుల బొగ్గు బూడిద పాలైంది. విద్యుత్ కేంద్రంలో మండిపోకుండా ఫ్లైయాష్, బాటమ్ యాష్‌లో మిగిలిపోయిన బొగ్గు పరిమాణం అధికంగా ఉందని కాగ్ తేల్చింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో 20 మెగావాట్ల క్యాప్టివ్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో భాగంగా సలహాలు, సివిల్ పనుల కోసం సింగరేణి సంస్థ రూ.4.35 కోట్లను ఖర్చు చేసిందని... కానీ ఆ ప్రాజెక్టు నిర్మాణ ఆలోచనను విరమించుకుందని కాగ్ పేర్కొంది. 78 శాతం పెరిగిన విద్యుదుత్పత్తి వ్యయం ఐదేళ్లలో జెన్కో విద్యుత్ కేంద్రాల విద్యుదుత్పత్తి వ్యయం 78% పెరిగిందని కాగ్ తేల్చింది. 2010-11లో రూ.2.01గా ఉన్న యూనిట్ విద్యుదుత్పత్తి వ్యయం 2014-15 నాటికి రూ.3.58కి పెరిగిపోయిందని పేర్కొంది. విద్యుదుత్పత్తి ధరలో ఇంధనం (బొగ్గు) ధర కీలకం కావడం వల్ల ప్రభావం పడుతోం దని వెల్లడించింది. 2014-15 మధ్య ఉత్పత్తి చేసిన విద్యుత్‌లో 84% బొగ్గు ఆధారితమేనని పేర్కొంది. -
థర్మల్‌కు టెండర్ల దెబ్బ
చెన్నై, సాక్షి ప్రతినిధి:రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు ధర్మసంకటంలో పడిపోయాయి. థర్మల్ కేంద్రాలకు అవసరమైన నేలబొగ్గు దిగుమతుల టెండర్ల దిగాలులో పడిపోయాయి. ఇదేపరిస్థితి కొనసాగితే రాబోయే వేసవిలో విద్యుత్ ఉత్పత్తికి విఘాతం ఏర్పడే ప్రమాదం ఉంది. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఏడాదికి 2.78 కోట్ల టన్నుల నేల బొగ్గు అవసరం. ఇందులో 1.35 కోట్ల టన్నుల నేలబొగ్గు కేంద్రప్రభుత్వ పరిధిలోని సొరంగాల ద్వారా లభ్యం అవుతోంది. మిగతా బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. తమిళనాడు విద్యుత్ సంస్థ ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు థర్మల్ కేంద్రాల అవసరానికి 45 లక్షల టన్నుల నేల బొగ్గు దిగుమతికి 2015లో టెండర్లు పిలిచారు. సహజంగా ఐదారు కంపెనీలు టెండరులో పాల్గొంటాయి. అయితే ఈసారి తమిళనాడుకు చెందిన ఓకే ఒక సంస్థ మాత్రమే టెండరు దాఖలు చేసింది. ఆ సంస్థ ఆరు లక్షల టన్నులను నేలబొగ్గును మాత్రమే సప్లయి చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఒక టన్ను బొగ్గు 62 డాలర్లు అంటే రూ.3,720లకు సరఫరా చేసేలా విద్యుత్ సంస్థ ఆర్డర్ ఇచ్చింది. మరో 39 లక్షల టన్నులను దిగుమతి కోసం మరోసారి టెండర్లు పిలవాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో థర్మల్ కేంద్రానికి అవసరమైన నేలబొగ్గు సరైన సమయానికి అందేనా అనే సందేహం ఏర్పడింది. నేలబొగ్గు సరఫరాలో లోటు ఏర్పడినట్లయితే దాని ప్రభావం రాబోయే వేసవిలో వినియోగదారులపై పడే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిపై ఇంధనశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ, ధర్మల్ కేంద్రాలకు వినియోగించే నేలబొగ్గు ప్రపంచ మార్కెట్లో టన్ను రూ.3,600ల కంటే తక్కువ ధర పలుకుతోందని చెప్పారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అవసరమైన 45 టన్నుల నేలబొగ్గును దిగుమతికి గత ఏడాది డిసెంబర్లో టెండర్లు పిలిచామని తెలిపారు. అయితే తమిళనాడుకు చెందిన ఒక సంస్థ మాత్రమే టెండరు దాఖలు చేసిందని అన్నారు. మిగిలిన సంస్థలు నేలబొగ్గుకు అధిక ధర పొందేందుకు విద్యుత్ సంస్థపై ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగంగానే టెండరు దాఖలు చేయలేదని వివరించారు. ఒత్తిడి తెస్తున్నవారిలో అధికార పార్టీకి చెందిన వ్యక్తి కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు. రూ.4.90 టెండర్లపై అధికార జులుం: ఇదిలా ఉండగా, చెన్నై సమీపం మాడపాక్కం పంచాయితీ కార్యాలయ పరిధిలో రూ.4.90 కోట్ల విలువైన పనులను దక్కించుకోవడంలో అధికార పార్టీ కౌన్సిలర్ జులుం ప్రదర్శించినట్లు ఆరోపణలు వచ్చాయి. మాడపాక్కం పంచాయతీ పరిధిలో 15 వార్డులు ఉండగా అన్నాడీఎంకే కు చెందిన విమలా శ్రీకాంత్ పంచాయతీ అధ్యక్షురాలిగా ఉన్నారు. అ యితే పేరుకే ఆమె అధ్యక్షురాలు, పెత్తనమంతా ఆమె తండ్రి లోకనాథన్దే అనే విమర్శలు ఉన్నాయి. మంత్రి చిన్నయ్యకు వీరు సన్నిహితులు. ఈ పంచాయితీలో కాలువ, రోడ్డు, ఇతర నిర్మాణ పనులకు రూ.4.90 కోట్లతో టెండర్లు పిలవగా మంగళవారం సాయంత్రం ఖరారు చేసేందుకు సిద్ధమయ్యారు. అన్నాడీఎంకే కౌన్సిలర్లతోపాటు పలువురు కాంట్రాక్టర్లు సైతం హాజరయ్యారు. ఇరువర్గాల మధ్యవాగ్వివాదం చోటుచేసుకుని ఘర్షణ వాతావరణం నెలకొనడంతో సేలయ్యూర్ పోలీసులు రంగప్రవేశం చేసి అదుపులోకి తెచ్చారు. పనుల పంపకాలపై వివాదం నెలకొనగా ప్రతిష్టంభన ఏర్పడింది. -
పాత విద్యుత్కేంద్రాలు మూసేయండి
* టీఎస్ జెన్కోకు కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశం * 720 మెగావాట్ల 8 యూనిట్లు మూసేయాలని స్పష్టీకరణ * 60, 120 మెగావాట్ల థర్మల్ ప్లాంట్లు కూడా... * 2019 వరకు గడువు ఇచ్చిన కేంద్రం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాలం చెల్లిన థర్మల్ విద్యుత్ కేంద్రాలను మూసివేయాలని తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (టీఎస్జెన్కో)కు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. పాత సాంకేతిక పరిజ్ఞానంతో దశాబ్దాల కింద నిర్మించిన 60 మెగావాట్లు, 120 మెగావాట్ల థర్మల్ విద్యుత్ యూనిట్లను దశల వారీగా 2018-19 లోపు మూసేయాలని స్పష్టం చేసింది. ఖమ్మం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ విద్యుత్కేంద్రం (కేటీపీఎస్) ఏడో దశ విస్తరణలో భాగంగా 800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త యూనిట్ నెలకొల్పేందుకు పర్యావరణ అనుమతులు జారీ చేస్తూనే, 720 మెగావాట్ల సామర్థ్యం గల 8 పాత కేటీపీఎస్ యూనిట్లను 2018-19 లోగా మూసివేయాలని మెలిక పెట్టింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పట్టుబట్టడంతో కేటీపీఎస్ పాత ప్లాంట్ల మూసివేతపై జెన్కో తలొగ్గక తప్పలేదు. రాష్ట్రంలో విద్యుత్ కొరత నేపథ్యంలో 2019 చివరి నాటికి ఈ ప్లాంట్లను మూసివేస్తామని తెలంగాణ జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు గత నెల 2న కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు హామీ పత్రం రాసిచ్చారు. దీంతో గత నెల 19, 20 తేదీల్లో సమావేశమైన కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ కేటీపీఎస్ ఏడో దశ విస్తరణకు మరికొన్ని షరతులతో అనుమతులు జారీ చేయాలని సిఫారసు చేసింది. ఈ మేరకు వారం రోజుల్లో పర్యావరణ అనుమతుల ఉత్తర్వులు వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం కేటీపీఎస్ విద్యుత్కేంద్రం పూర్తి సామర్థ్యం 1,720 మెగావాట్లు. మరో 800 మెగావాట్లతో ఏడో దశ విస్తరణకు జెన్కో రెండేళ్లుగా పర్యావరణ అనుమతుల కోసం ప్రయత్నిస్తోంది. తొలుత 1966-67లో ఒక్కొక్కటి 60 మెగావాట్ల సామర్థ్యంతో 4 యూనిట్లను నిర్మించి మొత్తం 240 మెగావాట్లతో జెన్కో కేటీపీఎస్‌ను నెలకొల్పింది. ఆ తర్వాత 1974-78 మధ్య కాలంలో ఒక్కొక్కటి 120 మెగావాట్లతో మరో 4 యూనిట్లను నిర్మించి 480 మెగావాట్లను జత చేసింది. తదనంతరం ఈ విద్యుత్కేంద్రం ఐదు, ఆరు దశల విస్తరణలో భాగంగా మరో 1,000 మెగావాట్లతో మూడు యూనిట్లను నిర్మించడంతో కేటీపీఎస్ సామర్థ్యం 1,720 మెగావాట్లకు పెరిగింది. 1998-2004 మధ్యలో కాలం చెల్లిన 60 మెగావాట్లు, 120 మెగావాట్ల పాత యూనిట్ల ఆధునికీకరణ కోసం రూ.604 కోట్లను జెన్కో ఖర్చు చేసింది. భారీ పెట్టుబడి పెట్టినందున 60 మెగావాట్ల యూనిట్లను 2023-24 వరకు, 120 మెగావాట్ల యూనిట్లను 2018-19 వరకు నడపాలని జెన్కో భావించింది. ఏడో దశ విస్తరణ ప్రతిపాదనల్లో సైతం ఇదే అంశాన్ని పర్యావరణ శాఖకు తెలియజేసింది. కానీ, పర్యావరణ శాఖ ఒప్పుకోకపోవడంతో పాత యూనిట్ల మూసివేతకు జెన్కో సంసిద్ధత వ్యక్తం చేయక తప్పలేదు. కాలుష్యంపై ఆందోళన.. కేటీపీఎస్ విద్యుత్కేంద్రం నుంచి ఉత్పత్తి అవుతున్న బూడిద వ్యర్థాలపై పర్యావరణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడి బూడిదలో 15.89 శాతాన్ని మాత్రమే ఇటుకలు, సిమెంట్ తయారీకి వినియోగిస్తున్నారని, 2020-21 నాటికి 100 శాతం బూడిదను వినియోగంలోకి తేవాలని స్పష్టం చేసింది. ఆ మేరకు సిమెంటు, ఇటుకల పరిశ్రమలను ప్రోత్సహించాలని సిఫారసు చేసింది. కొత్త యూనిట్ నుంచి ఉత్పత్తి అయ్యే బూడిద కోసం కొత్త యాష్ పాండ్ ఏర్పాటును వ్యతిరేకించింది. పాత యూనిట్ల యాష్ పాండ్లనే కొత్త యూనిట్‌కూ వినియోగించుకోవాలని కోరింది. బూడిద కోసం కొత్తగా స్థలాలను సేకరించరాదని ఆంక్షలు విధించింది. కాలుష్య నివారణ చర్యలపై ప్రతి 6 నెలలకు ఒకసారి తెలంగాణ పీసీబీతో కలిసి పర్యవేక్షణ జరపాలని తమ ప్రాంతీయ కార్యాలయాన్ని ఆదేశించింది. -
ఏమోనయా..?!
కొత్త గనులు.. ఆ మాటెత్తితే చాలు.. ఏమో.. ఎప్పటికి ప్రారంభమవుతాయో..! అనే సందేహం సింగరేణివ్యాప్తంగా వ్యక్తమవుతోంది. గతంలో ప్రతిపాదించిన వాటికి అనుమతులు రావడంలో జాప్యం చోటు చేసుకుంటుండడంతో నూతన ప్రాజెక్టుల ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారుతోంది. - కొత్తగూడెం (ఖమ్మం) - కొత్త గనుల ఏర్పాటుపై సర్వత్రా సందేహం.. - పెండింగ్‌లో 21 ప్రాజెక్టులు.. - పదేళ్లుగా అనుమతుల కోసం నిరీక్షణ - ప్రారంభమైతే మరో 39 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అవకాశం రోజురోజుకూ పెరుగుతున్న కరెంట్ వినియోగం, అందుకు అనుగుణంగా జల విద్యుత్ ఉత్పత్తి లేకపోవడం.. థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటు అవసరాన్ని సూచిస్తున్నాయి. అదీగాక, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో సర్కారు కొత్త థర్మల్ పవర్ స్టేషన్ల ఏర్పాటుకు మొగ్గు చూపితే, వాటికి సరిపడా బొగ్గును కూడా ఉత్పత్తి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం సింగరేణి సంస్థ ఆధీనంలో 15 ఓపెన్ కాస్ట్ గనులు, 34 భూగర్భ గనులు ఉన్నాయి. వీటి ద్వారా ఏడాదికి 54మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. అయితే, కొత్తగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు నెలకొల్పితే.. వాటికి సరిపడా బొగ్గును అందించాలంటే నూతన గనుల ఏర్పాటు తథ్యమని సింగరేణి యాజమాన్యం పదేళ్ల కిందటే సూచించింది. దాదాపు 21 ప్రాజెక్టులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి సర్కారుకు నివేదించింది. కారణాలేమిటో గానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి నేటికీ ఒక్కదానికి కూడా అనుమతులు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం సైతం అనుమతుల అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. భూ సేకరణే సమస్యా? అనుమతుల సంగతేమిటో గానీ, కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు కావలసిన భూ సేకరణ సింగరేణికి సవాల్‌గా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసినప్పటికీ స్థానిక సమస్యల కారణంగా నూతన గనుల ఏర్పాటుకు యాజమాన్యం ఆచీతూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. పెండింగ్‌లో ఉన్న 21 ప్రాజెక్టుల్లో 13 ఓపెన్ కాస్టు గనులే. వీటిని నెలకొల్పే ప్రదేశంలోని ప్రజలను మరోచోటికి తరలించాల్సి ఉంటుంది. అక్కడి ప్రజలు స్వచ్ఛందంగా అంగీకరిస్తేనే భూ సేకరణ సులువవుతుంది. పరిహారం విషయంలో స్థానికుల డిమాండ్, సర్వే నిర్వహణలో జాప్యం ఇతరత్రా ఎదురయ్యే సమస్యలతో భూసేకరణ సింగరేణికి ఒకింత భారంగా మారుతోంది. కొంగొత్త ఆశలు..! పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే... అదనంగా 39.31 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. అదే క్రమంలో ఇటు సింగరేణిలోనూ, అటు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోనూ ఉద్యోగావకాశాలు ఏర్పడుతాయి. ఫలితంగా నిరుద్యోగ సమస్య తీరడంతో పాటు రాష్ట్రం విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించనుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు వచ్చేలా చూడాల్సిన అవసరం ఉంది. -
సౌర విద్యుత్ హబ్‌గా ఏపీ!
కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి జజ్జర్ ప్లాంటు నుంచి 200 మె.వా. అదనపు విద్యుత్ రాష్ట్రంలో బొగ్గు కొరత రానీయం హైదరాబాద్: ఏపీని సౌర విద్యుత్ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్టు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. రాష్ట్రానికి అదనంగా కేటాయించిన 200 మెగావాట్ల విద్యుత్‌ను జజ్జర్ ప్లాంటు నుంచి అందించనున్నట్టు తెలిపారు. 2015 వరకు ఈ సరఫరా కొనసాగుతుందన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుతో ఆదివారం ఆయన భేటీ అయ్యారు. అనంతరం, మీడియాతో మాట్లాడుతూ.. గృహాలు, పరిశ్రమలకు 24 గంటలూ విద్యుత్ సరఫరా చేయాలని ప్రధాని నరేంద్రమోడీ, సీఎం చంద్రబాబులు లక్ష్యంగా నిర్ణయించుకున్నారని, అది త్వరలోనే సాకారమవుతుందని ఉద్ఘాటించారు. రాష్ట్రానికి విద్యుత్తు సమస్య తలెత్తకుండా ఉండేందుకు సెప్టెంబర్ వరకు 500 మెగావాట్లు, జనవరికి మరో 500 మెగావాట్లు ఉత్పత్తికి వీలుగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. గత 3 నెలలుగా రాష్ట్రంలో విద్యుత్ కోతలు తగ్గాయని, విద్యుత్ సమస్యల పరిష్కారానికి తెలంగాణ, ఏపీలు సహకరించుకోవాలని సూచించారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి ఇది వరకే ఓ కమిటీని నియమించామని, మరో 15 రోజుల్లో ఈ కమిటీ తన నివేదిక అందించనుందని వివరించారు. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరతను అధిగమించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి బొగ్గును తరలిస్తున్నామని, దీనికిగాను అదనంగా ర్యాక్‌లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి(ఢిల్లీ) కంభంపాటి రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ కరెంట్ కోతలు
గుంటూరు ఈస్ట్, న్యూస్‌లైన్: థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గిన కారణంగా జిల్లాలో కరెంట్ కోత విధిస్తున్నట్టు ఆ శాఖ ఎస్ఈ సంతోషరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్ర పరిధిలో మూడు గంటలు, మున్సిపాల్టీల్లో నాలుగు గంటలు, మండల కేంద్రాల పరిధిలో ఆరు గంటలు రెండు విడతలుగా కోత అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఉదయం 6 నుంచి 7.30 గంటల వరకు మధ్యాహ్నం 12 నుంచి 1.30 వరకు, మున్సిపాల్టీ పరిధిలో ఉదయం 7 నుంచి 9 వరకు, ఒంటి గంట నుంచి 3 వరకు, మండల కేంద్రాల పరిధిలో ఉదయం 7 నుంచి 10 వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు వరకు విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు వివరించారు.వ్యవసాయానికి... గ్రామీణ ఫీడర్స్ పరిధిలో ఎ-గ్రూప్‌కు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ కోత విధిస్తున్నట్టు తెలిపారు. తెల్లవారుజామున 4 నుంచి ఉదయం 9 వరకు తిరిగి రాత్రి 10 నుంచి 12 వరకు త్రీఫేస్ సరఫరా ఉం టుందని తెలిపారు. బి-గ్రూప్‌కు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మధ్యాహ్నం 2 నుంచి 6 వరకు కోత విధించడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాత్రి 12 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు విద్యుత్ సరఫరా జరుగుతుందని తెలిపారు. సి-గ్రూప్‌కు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కోత విధించడం జరుగుతుందని తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 వరకు తిరిగి తెల్లవారు జామున 2 నుంచి 4 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉంటుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో గృహ వినియోగానికి సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉంటుందని తెలిపారు. అత్యవసర సమయాల్లో మాత్రమే కోత విధించడం జరుగుతుందని తెలిపారు. పరిశ్రమలకు ప్రకటించిన సమయాల్లో మాత్రమే విద్యుత్ కోత అమలులో ఉంటుందన్నారు. మహానది బొగ్గు గనుల్లో ఉద్యోగుల సమ్మె కారణంగా సింహాద్రి థర్మల్ పవర్ స్టేషన్ రెండవ యూనిట్, వీటీపీఎస్ మొదటి యూనిట్, ఆర్టీపీపీ ఐదవ యూనిట్ మరమ్మతుల రీత్యా సుమారు 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని తెలిపారు. మొత్తం ఆరు జిల్లాల్లో విద్యుత్ కోత విధిస్తున్నట్టు తెలుపుతూ వినియోగదారులు సహకరించాలని కోరారు.