చెన్నై, సాక్షి ప్రతినిధి:రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు ధర్మసంకటంలో పడిపోయాయి. థర్మల్ కేంద్రాలకు అవసరమైన నేలబొగ్గు దిగుమతుల టెండర్ల దిగాలులో పడిపోయాయి. ఇదేపరిస్థితి కొనసాగితే రాబోయే వేసవిలో విద్యుత్ ఉత్పత్తికి విఘాతం ఏర్పడే ప్రమాదం ఉంది. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఏడాదికి 2.78 కోట్ల టన్నుల నేల బొగ్గు అవసరం. ఇందులో 1.35 కోట్ల టన్నుల నేలబొగ్గు కేంద్రప్రభుత్వ పరిధిలోని సొరంగాల ద్వారా లభ్యం అవుతోంది. మిగతా బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.
తమిళనాడు విద్యుత్ సంస్థ ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు థర్మల్ కేంద్రాల అవసరానికి 45 లక్షల టన్నుల నేల బొగ్గు దిగుమతికి 2015లో టెండర్లు పిలిచారు. సహజంగా ఐదారు కంపెనీలు టెండరులో పాల్గొంటాయి. అయితే ఈసారి తమిళనాడుకు చెందిన ఓకే ఒక సంస్థ మాత్రమే టెండరు దాఖలు చేసింది. ఆ సంస్థ ఆరు లక్షల టన్నులను నేలబొగ్గును మాత్రమే సప్లయి చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఒక టన్ను బొగ్గు 62 డాలర్లు అంటే రూ.3,720లకు సరఫరా చేసేలా విద్యుత్ సంస్థ ఆర్డర్ ఇచ్చింది. మరో 39 లక్షల టన్నులను దిగుమతి కోసం మరోసారి టెండర్లు పిలవాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో థర్మల్ కేంద్రానికి అవసరమైన నేలబొగ్గు సరైన సమయానికి అందేనా అనే సందేహం ఏర్పడింది.
నేలబొగ్గు సరఫరాలో లోటు ఏర్పడినట్లయితే దాని ప్రభావం రాబోయే వేసవిలో వినియోగదారులపై పడే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిపై ఇంధనశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ, ధర్మల్ కేంద్రాలకు వినియోగించే నేలబొగ్గు ప్రపంచ మార్కెట్‌లో టన్ను రూ.3,600ల కంటే తక్కువ ధర పలుకుతోందని చెప్పారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అవసరమైన 45 టన్నుల నేలబొగ్గును దిగుమతికి గత ఏడాది డిసెంబర్‌లో టెండర్లు పిలిచామని తెలిపారు. అయితే తమిళనాడుకు చెందిన ఒక సంస్థ మాత్రమే టెండరు దాఖలు చేసిందని అన్నారు. మిగిలిన సంస్థలు నేలబొగ్గుకు అధిక ధర పొందేందుకు విద్యుత్ సంస్థపై ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగంగానే టెండరు దాఖలు చేయలేదని వివరించారు. ఒత్తిడి తెస్తున్నవారిలో అధికార పార్టీకి చెందిన వ్యక్తి కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు.
రూ.4.90 టెండర్లపై అధికార జులుం:
ఇదిలా ఉండగా, చెన్నై సమీపం మాడపాక్కం పంచాయితీ కార్యాలయ పరిధిలో రూ.4.90 కోట్ల విలువైన పనులను దక్కించుకోవడంలో అధికార పార్టీ కౌన్సిలర్ జులుం ప్రదర్శించినట్లు ఆరోపణలు వచ్చాయి. మాడపాక్కం పంచాయతీ పరిధిలో 15 వార్డులు ఉండగా అన్నాడీఎంకే కు చెందిన విమలా శ్రీకాంత్ పంచాయతీ అధ్యక్షురాలిగా ఉన్నారు. అ యితే పేరుకే ఆమె అధ్యక్షురాలు, పెత్తనమంతా ఆమె తండ్రి లోకనాథన్‌దే అనే విమర్శలు ఉన్నాయి. మంత్రి చిన్నయ్యకు వీరు సన్నిహితులు. ఈ పంచాయితీలో కాలువ, రోడ్డు, ఇతర నిర్మాణ పనులకు రూ.4.90 కోట్లతో టెండర్లు పిలవగా మంగళవారం సాయంత్రం ఖరారు చేసేందుకు సిద్ధమయ్యారు. అన్నాడీఎంకే కౌన్సిలర్లతోపాటు పలువురు కాంట్రాక్టర్లు సైతం హాజరయ్యారు. ఇరువర్గాల మధ్యవాగ్వివాదం చోటుచేసుకుని ఘర్షణ వాతావరణం నెలకొనడంతో సేలయ్యూర్ పోలీసులు రంగప్రవేశం చేసి అదుపులోకి తెచ్చారు. పనుల పంపకాలపై వివాదం నెలకొనగా ప్రతిష్టంభన ఏర్పడింది.
థర్మల్‌కు టెండర్ల దెబ్బ
Published Thu, Feb 11 2016 1:58 AM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM
Advertisement