ఎండవేడిమి పెరిగిపోతోంది. ఏసీలు, ఫ్రిజ్‌ల వాడకం ఎక్కువైపోయింది. కరోనా అదుపులోనికి రావడంతో పరిశ్రమల్లో ఉత్పత్తి సాధారణ స్థితికి వచ్చింది. దీంతో విద్యుత్ వాడకం ఎక్కవైపోయింది. డిమాండ్‌కి తగ్గట్టుగా సప్లయ్ చేయడానికి థర్మల్ కేంద్రాలను బొగ్గు కొరత వేధిస్తోంది. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా కోల్ ఇండియా దగ్గర సమృద్ధిగా బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ కేంద్రంలో శాఖల మధ్య సమన్వయ లోపంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.
వేసవి వచ్చిందంటే చాలు ఉక్కబోత, విద్యుత్ కోతతో జనాలు అల్లాడిపోవాల్సిందే. దేశంలోని విద్యుత్ అవసరాలను 70% థర్మల్ పవర్ కేంద్రాలే తీరుస్తూ ఉంటే ఆయా కేంద్రాల్లో బొగ్గుకి కొరత ఏర్పడడంతో చాలా రాష్ట్రాలు పవర్ కట్‌లు విధిస్తున్నాయి. మహారాష్ట్ర, రాజస్తాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, హరియాణా, బిహార్ జమ్మూ కశ్మీర్, తమిళనాడు, కర్ణాటకలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ విద్యుత్ కోతల ప్రభావం పరిశ్రమలపై పడి ఆర్థిక రంగం కూడా కుదేలైపోతుందన్న ఆందోళనలు ఉన్నాయి. వేసవికాలం కావడంతో హఠాత్తుగా దేశవ్యాప్తంగా పెరిగిపోయిన విద్యుత్ వినియోగంతో పాటు బొగ్గు పంపిణీలో లోపాలు సమస్యని మరింత పెంచాయి.
విద్యుత్‌కి డిమాండ్ ఎలా పెరిగింది ?
ప్రతీ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు విద్యుత్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్నాళ్లూ రోజుకి సగటున 187 గిగావాట్ల విద్యుత్‌కు డిమాండ్ ఉంటే ఏప్రిల్ 1–12 తేదీ మధ్యలో సగటున రోజుకి 194 గిగావాట్లకు పెరిగిపోయింది. దీంతో కొన్ని రాష్ట్రాల్లో రోజుకి ఎనిమిది గంటలు విద్యుత్ కోతలు విధించే పరిస్థితులు వచ్చాయి.
బొగ్గు కొరత ఎలా ఉంది ?
దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో రాను రాను బొగ్గుకి కొరత ఏర్పడింది. నేçషనల్ పవర్ పోర్టల్ గణాంకాల ప్రకారం ఇంపోర్టెడ్ కోల్ బేస్డ్ (ఐసీబీ) విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు పాతాళానికి పడిపోయాయి. అదే విధంగా 79 దేశీయ పవర్ ప్లాంట్లు కూడా తీవ్ర బొగ్గు కొరతని ఎదుర్కొంటున్నాయి. ఏప్రిల్ 19 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న 700కిపైగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 2.2 కోట్ల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఇవి కేవలం తొమ్మిది రోజులకే సరిపోతాయి.
శాఖల మధ్య సమన్వయ లోపం
గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో భారీ వర్షాల కారణంగా బొగ్గు తవ్వకాలు నిలిచిపోవడంతో దేశంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. ఇప్పుడు బొగ్గు తవ్వకాలు సమృద్ధిగా జరుగుతున్నప్పటికీ కేంద్రంలోని శాఖల మధ్య సమన్వయ లోపమే దేశంలో విద్యుత్ కోతలకి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ మొదట్లో కోల్ ఇండియా 27% అదనంగా బొగ్గు తవ్వకాలు జరిపింది. విద్యుత్, బొగ్గు గనులు, రైల్వే శాఖ అధికారులతో కూడిన ఒక అంతర్గత కమిటీ బొగ్గు పంపిణీ వ్యవహారాలు చూస్తుంది. బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ బొగ్గు పంపిణీకి సరిపడనంత రాక్స్‌ని కేటాయించడం లేదని ఆరోపిస్తూ ఉంటే, లోడింగ్, అన్‌లోడింగ్‌లో కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) అవకతవకలకు పాల్పడుతోందని రైల్వే శాఖ ఎదురుదాడికి దిగింది.
► థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో 17 నుంచి 26 రోజులకు సరిపడే నిల్వలుంటేనే అవి పూర్తయ్యేలోగా తిరిగి బొగ్గు నిల్వలు చేరుకుంటాయి. కానీ ప్రస్తుతం తొమ్మిది రోజులకి సరిపడా నిల్వలు మాత్రమే ఉండడం ఆందోళనకరంగా మారింది.
► ప్రతిరోజూ రైల్వే శాఖ 453 రాక్స్‌ను కేటాయిస్తేనే విద్యుత్ ప్లాంట్ల అవసరాలకు సరిపడా బొగ్గు పంపిణీ సాధ్యమవుతుంది. ప్రస్తుతం రైల్వే శాఖ కేవలం 412 రాక్స్ ద్వారా మాత్రమే బొగ్గుని పంపిణీ చేస్తూ ఉండడంతో కొరతకి దారి తీసింది.
► ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్, హరియాణాలలో బొగ్గు నిల్వలు కేవలం ఆరు రోజులకు సరిపడా ఉన్నాయని ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) చైర్మన్ శైలేంద్ర దూబే వెల్లడించారు.
► రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. ఇన్నాళ్లుగా టన్ను బొగ్గుకి 100 డాలర్లు ఇస్తే, ఇప్పుడు అది ఏకంగా 300 డాలర్లకు చేరుకుంది.
► విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గుని వాడే విద్యుత్ ప్లాంట్లలో 6.6 కోట్ల టన్నుల బొగ్గు అవసరమైతే ప్రస్తుతం 2.2 కోట్ల టన్నులు మాత్రమే ఉంది.
► విదేశీ బొగ్గు కొరతని అధిగమించడానికి కేంద్రం రష్యా నుంచి డిస్కౌంట్ ధరలకి బొగ్గుని దిగుమతి చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. ప్రపంచంలో బొగ్గు ఎగుమతుల్లో మూడో స్థానంలో రష్యా ఉక్రెయిన్‌పై దాడికి దిగడంతో యూరప్ దేశాలు బొగ్గు దిగుమతులపై నిషేధం విధించారు. దీంతో భారత్ రష్యా నుంచి బొగ్గుని దిగుమతి చేసుకొని సమస్యను పరిష్కరించాలని భావిస్తోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Power Crisis: ముంచుకొస్తున్న విద్యుత్ సంక్షోభం
Published Fri, Apr 22 2022 6:16 AM | Last Updated on Fri, Apr 22 2022 1:45 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment