Energy crisis
-
PM Narendra Modi: కలిసి పనిచేద్దాం.. సవాళ్లను ఎదిరిద్దాం
న్యూఢిల్లీ/ఢాకా: ప్రపంచవ్యాప్తంగా అనిశి్చత పరిస్థితులు ఏర్పడుతుండడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆహార, ఇంధన భద్రత విషయంలో సంక్షోభాలను ఎదుర్కోవడానికి కలిసికట్టుగా పనిచేద్దామని గ్లోబల్ సౌత్ దేశాలకు పిలుపునిచ్చారు. ఉమ్మడి శత్రువైన ఉగ్రవాదాన్ని అరికట్టడానికి చేతులు కలుపుదామని సూచించారు. శనివారం వర్చువల్‌గా నిర్వహించిన ‘వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ శిఖరాగ్ర సదస్సు’లో ప్రధాని మోదీ ప్రసంగించారు. గ్లోబల్ సౌత్ దేశాల్లో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం ‘సోషల్ ఇంపాక్ట్ ఫండ్’కు 25 మిలియన్ డాలర్లు అందజేయబోతున్నట్లు ప్రకటించారు. పరస్పర వాణిజ్యం, సమగ్రాభివృద్ధిని ప్రోత్సహించడంతోపాటు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించడమే లక్ష్యంగా తమ శక్తిసామర్థ్యాలను అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. ఐకమత్యంతోనే మన బలం కోవిడ్–19 మహమ్మారి ప్రభావం నుంచి ప్రపంచ దేశాలు ఇంకా పూర్తిగా బయటపడలేదని, ఇంతలో యుద్ధాలు ముంచుకొచ్చాయని మోదీ విచారం వ్యక్తంచేశారు. అబివృద్ధికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. వాతావరణ మార్పులు, ఆరోగ్య భద్రత, ఆహార భద్రత, ఇంధన భద్రత వంటి సవాళ్లు ఇప్పటికే ఉండగా, టెక్నాలజీకి సంబంధించి కొత్తగా ఆర్థిక, సామాజిక సవాళ్లు మొదలయ్యాయని తెలిపారు. గత శతాబ్దంలో ఏర్పాటైన పాలనా వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థలు ఈ శతాబ్దపు సవాళ్లను పరిష్కరించలేకపోతున్నాయని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ ఒక్కటి కావాలన్నారు. ఒకే గళం వినిపించాలని, ఒకరికొకరు తోడుగా నిలవాలని సూచించారు. ఒకరి అనుభవాలను మరొకరు పాఠాలు నేర్చుకోవాలన్నారు. మన ఐకమత్యంలోనే మన బలం దాగి ఉందన్నారు. ఈ ఐకమత్య బలంతో నూతన దశలో ప్రయాణం సాగించాలని పిలుపునిచ్చారు. ‘గ్లోబల్ డెవలప్మెంట్ కాంపాక్ట్’ గ్లోబల్ సౌత్ దేశాల ప్రగతి కోసం మానవ కేంద్రీకృత ‘గ్లోబల్ డెవలప్మెంట్ కాంపాక్ట్’ ఏర్పాటు చేద్దామని ప్రధాని మోదీ ప్రతిపాదించారు. భారతదేశ అభివృద్ధి యాత్ర, అభివృద్ధి భాగస్వామ్య అనుభవాలను స్ఫూర్తిగా తీసుకొని వ్యాపారం–వాణిజ్యంతోపాటు సాంకేతికతను పంచుకోవడానికి, అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించుకోవడానికి ఈ వేదిక దోహదపడుతుందని వెల్లడించారు. భాగస్వామ్య దేశాల సమతుల, సుస్థిరాభివృద్ధికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాలపై మరింత అప్పుల భారం పడకుండా ఇలాంటి చర్యలు అవసరమని పేర్కొన్నారు. ట్రేడ్ ప్రమోషన్ కార్యకలాపాలను బలోపేతం చేయడానికి 2.5 మిలియన్ డాలర్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయబోతున్నామని నరేంద్ర మోదీ ప్రకటించారు. అంతర్జాతీయంగా నెలకొన్న పలు సంఘర్షణలు, ఉద్రిక్తతలకు పరిష్కార మార్గాలు సమగ్ర ప్రపంచాభివృద్ధి, సుస్థిర పాలనలోనే ఉన్నాయని తేలి్చచెప్పారు. -
మార్చిలోనే మండుతున్న సూరీడు.. భగభగ పక్కా! తీవ్రమైన వడగాడ్పులు
మార్చిలోనే సూరీడు మండిపోతున్నాడు. ఈ ఏడాది వేసవి భగభగలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మండే ఎండలకు తోడు ఎన్నో సమస్యలు ఎదురు కానున్నాయి. వడగాడ్పులు, విద్యుత్ సంక్షోభం, నీటి ఎద్దడి బాధించనున్నాయి. 1901 తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి అత్యంత వేడి నెలగా రికార్డులకెక్కింది. సగటు ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్‌కు దాటాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కొంకణ్, కచ్ ప్రాంతాల్లో ఫిబ్రవరిలోనే వేడి గాడ్పులపై ప్రభుత్వం ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్చి నుంచి మే వరకు వడగాడ్పులు తీవ్రంగా ఉంటాయని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో వేసవి గండాన్ని ఎలా ఎదుర్కొంటామన్న ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 6న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి వేసవిని ఎదుర్కోవడానికి కావాల్సిన సన్నద్ధతలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్య నిపుణులు, స్థానిక అధికారులు, విపత్తు నిర్వహణ బృందాలతో కలిసి వేసవి కాలాన్ని ఎదుర్కోవడానికి ఏమేం చర్యలు చేపట్టాలన్న దానిపై చర్చించారు. ఏయే ప్రాంతంలో వడగాడ్పులు ఉండబోతున్నాయి మార్చి నుంచి మే వరకు దేశంలో ఉక్కబోత భరించలేనంతగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో ఎండ వేడిమి ఎక్కువగా ఉంటుంది.మధ్య భారతం, వాయవ్య రాష్ట్రాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశాలున్నాయి. ఉత్తరాదితో పోల్చి చూస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా నమోదవుతాయి. ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐపీసీసీ) అంచనాల ప్రకారం వడగాడ్పులు తరచుగా వీస్తాయి. రానున్న సంవత్సరాల్లో ఎండవేడిమి మరింతగా పెరిగిపోతుంది. ఈ ఏడాది ఫసిఫిక్ మహాసముద్రంలో కాలానుగుణంగా వచ్చే మార్పుల కారణంగా ఎల్‌నినో పరిస్థితి ఏర్పడుతుందని అందువల్ల వేసవికాలం మరింత వేడిగా మారుతుందని అంచనాలున్నాయి. ఎల్‌నినో సంవత్సరాల్లో పంట దిగుబడి లేక కరువు కాటకాలు ఏర్పడతాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ఏళ్లు గడుస్తున్న కొద్దీ వేసవి కాలం ఎదుర్కోవడం అత్యంత దుర్లభంగా మారుతోందని హెల్త్ అండ్ క్లైమేట్ రెసిలెన్స్ ఎన్ఆర్డీసీ ఇండియా చీఫ్ అభియంత్ తివారీ చెప్పారు. గత ఏడాది మార్చి 100 ఏళ్లలోనే అత్యంత వేడి మాసంగా నమోదైతే, ఈ ఏడాది ఫిబ్రవరి 122 ఏళ్ల రికార్డుల్ని బద్దలు కొట్టిందని అన్నారు. ఈ సారి వేసవిలో వడగాడ్పులు ఎక్కువగా ఉండడంతో గోధుమ పంటపై తీవ్ర ప్రభావం పడుతుందని, దీంతో ఆహార సంక్షోభం, నిత్యావసర ధరలు పెరిగిపోవడం వంటివి జరగనున్నాయని ఆయన అంచనా వేశారు. విద్యుత్ కోతలు తప్పవా..? గత ఏడాది వేసవి కాలంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకొని సంక్షోభం ఎదురైంది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి పునరావృతమయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో అత్యధికంగా విద్యుత్ డిమాండ్ 229 గిగావాట్లకు చేరుకోవచ్చునని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనా వేసింది. ఇక రాత్రి వేళల్లో కూడా 217 గిగావాట్లకు విద్యుత్ వినియోగం చేరుకునే అవకాశాలున్నాయి. గత ఏడాది ఏప్రిల్‌లో రాత్రిపూట విద్యుత్ వినియోగం కంటే ఇది చాలా ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల వల్ల గ్రిడ్లపై ఒత్తిడి పెరిగిపోతుందని గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తెలిపింది. థర్మల్ విద్యుత్ ప్లాంట్లకి బొగ్గు కొరత, జల విద్యుత్ ప్రాజెక్టులకి నీటి కొరత కారణంగా ఈ సారి వేసవి కూడా పెను విద్యుత్ సంక్షోభానికి దారి తీసే అవకాశాలున్నాయి. ఒడిశా బాటలో... మన దేశంలో ఒడిశా వేసవికాలంలో ఎదురయ్యే సమస్యల్ని ఒక ప్రణాళికా బద్ధంగా ఎదుర్కొని విజయం సాధించింది. ఇప్పటివరకు ఒడిశా మాత్రమే వేసవికాలాన్ని కూడా ఒక ప్రకృతి విపత్తుగా అధికారికంగా ప్రకటించింది. 1998లో వేసవికాంలో వడదెబ్బకు ఏకంగా 2,042 మంది పిట్టల్లా రాలిపోయారు. ఆ తర్వాత ఏడాది వడదెబ్బ మృతుల సంఖ్య 91కి, తర్వాత ఏడాదికి 41కి తగ్గించగలిగింది. దీనికి ఒడిశా ప్రభుత్వం చేసిందల్లా ఎండ తీవ్రత ఉన్నప్పుడు బయట ఎవరూ తిరగకూడదంటూ నిబంధనలు విధించింది. మిట్ట మధ్యాహ్నం సమయంలో ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూసేసింది. రాష్టంలోని వీధివీధిలోనూ చలివేంద్రాలు, పందిళ్లు ఏర్పాటు చేసింది. విద్యుత్ కోతలు లేకుండా, నీటికి ఇబ్బంది లేకుండా ముందుగా ఏర్పాట్లు చేస్తూ వచ్చింది. సూర్యుడు అస్తమించిన తర్వాత రాత్రిపూట పనులు చేసేలా చర్యలు తీసుకుంది. వడదెబ్బతో మరణించే వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటోంది. దీంతో ఇతర రాష్ట్రాలు కూడా ఒడిశా బాటలో నడిస్తే మంచిదన్న అభిప్రాయాలైతే వినిపిస్తూ ఉన్నాయి. వేసవి ప్రభావం ఇలా.. ► ప్రపంచ బ్యాంకు 2022లో ఇచ్చిన నివేదిక ప్రకారం భారత్‌లో వేసవి మరణాలు ఇక అధికం కానున్నాయి. కాంక్రీట్ జంగిళ్లుగా మారిన నగరాలు వడగాడ్పులతో వేడెక్కనున్నాయి. ► ఎండవేడిమికి 2000–04 నుంచి 2017–21 మధ్య 55శాతం మరణాలు పెరిగిపోయాయి. ► 2021లో ఎండలకి 16,700 కోట్ల కార్మికుల పని గంటలు వృథా అయ్యాయి. ► ఎండాకాలంలో కార్మికులు పనుల్లోకి వెళ్లకపోవడం వల్ల దేశ జీడీపీలో గత ఏడాది 5.4% ఆదాయం తగ్గిపోయింది. ► 2022లో దేశవ్యాప్తంగా 203 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో వడగాడ్పులు వీచాయి. వందేళ్ల తర్వాత ఇదే అత్యధికం ► ఉత్తరాఖండ్‌లో అత్యధికంగా 28 రోజులు, రాజస్తాన్‌లో 26 రోజులు, పంజాబ్, హరియాణాలో 34 రోజులు చొప్పున వడగాడ్పులు వీచాయి. ► వేసవికాలం వచ్చిందంటే కార్చిచ్చుల సమస్య వేధిస్తుంది. 2017లో కొండప్రాంతంలో ఉన్న ఉత్తరాఖండ్‌లో 1,244 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని కార్చిచ్చులు దహిస్తే 2021 నాటికి మూడు రెట్లు ఎక్కువగా 3,927 హెక్టార్లు కార్చిచ్చుతో నాశనమయ్యాయి. ► ఇప్పటికే హిమానీనదాలు కరిగిపోతూ ఉండడంతో సముద్ర తీర ప్రాంతాలు ముప్పులో ఉన్నాయి. వేసవిలో ఎండ ఎక్కువగా ఉంటే మరింత మంచు కరిగి ముప్పు తీవ్రత ఎక్కువైపోతుంది ► ఢిల్లీ రాజధాని ప్రాంతంలో గత ఏడాది ఎంత తీవ్రతకి 300 పిట్టలు మృతి చెందాయి. వన్యప్రాణులు దాహార్తిని తీర్చుకోవడానికి ఊళ్లపై పడి బీభత్సం సృష్టించే ఘటనలు పెరిగిపోతాయి. ► వేసవి కాలం ఎండలు ఎక్కువ ఉండడం రబీ సీజన్ పంటలపై తీవ్రంగా ç్రప్రభావం పడుతుంది. ముఖ్యంగా ప్రపంచ గోధుమ ఎగుమతుల్లో రెండో స్థానంలో ఉన్న భారత్‌లో ఈ ఏడాది గోధుమ దిగుబడిపై ప్రభావం ఉంటుందనే ఆందోళనలున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆహార, ఇంధన సంక్షోభం పశ్చిమ దేశాల పుణ్యమే: పుతిన్
మాస్కో: ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పెరుగుతున్న ఆహార, ఇంధన సంక్షోభానికి పశ్చమ దేశాలే కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. తప్పులన్నీ అవి చేసి, ఇప్పుడు నెపాన్ని రష్యాపై మోపుతున్నాయంటూ మండిపడ్డారు. రష్యాపై అవి విధించిన ఆంక్షలు ప్రపంచ మార్కెట్లను మరింతగా కుంగదీయడం ఖాయంమని జోస్యం చెప్పారు. యూరప్ దేశాల మతిలేని విధానాల వల్లే రెండేళ్లుగా ద్రవ్యోల్బణం పెరిగిపోతోందన్నారు. ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల ఎగుమతులను రష్యా అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు. ‘‘ఇదంతా పశ్చిమ దేశాల తప్పుడు ప్రచారమే. ఉక్రెయిన్ తన రేవు పట్టణాల్లోని తీర జలాల నుంచి మందుపాతరలను తొలగించే పక్షంలో అక్కడి నుంచి ఆహార ధాన్యాల రవాణాకు భరోసా కల్పిస్తాం’’ అని పునరుద్ఘాటించారు. -
ముంచుకొస్తున్న విద్యుత్ సంక్షోభం
ఎండవేడిమి పెరిగిపోతోంది. ఏసీలు, ఫ్రిజ్‌ల వాడకం ఎక్కువైపోయింది. కరోనా అదుపులోనికి రావడంతో పరిశ్రమల్లో ఉత్పత్తి సాధారణ స్థితికి వచ్చింది. దీంతో విద్యుత్ వాడకం ఎక్కవైపోయింది. డిమాండ్‌కి తగ్గట్టుగా సప్లయ్ చేయడానికి థర్మల్ కేంద్రాలను బొగ్గు కొరత వేధిస్తోంది. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా కోల్ ఇండియా దగ్గర సమృద్ధిగా బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ కేంద్రంలో శాఖల మధ్య సమన్వయ లోపంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి వచ్చిందంటే చాలు ఉక్కబోత, విద్యుత్ కోతతో జనాలు అల్లాడిపోవాల్సిందే. దేశంలోని విద్యుత్ అవసరాలను 70% థర్మల్ పవర్ కేంద్రాలే తీరుస్తూ ఉంటే ఆయా కేంద్రాల్లో బొగ్గుకి కొరత ఏర్పడడంతో చాలా రాష్ట్రాలు పవర్ కట్లు విధిస్తున్నాయి. మహారాష్ట్ర, రాజస్తాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, హరియాణా, బిహార్ జమ్మూ కశ్మీర్, తమిళనాడు, కర్ణాటకలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ విద్యుత్ కోతల ప్రభావం పరిశ్రమలపై పడి ఆర్థిక రంగం కూడా కుదేలైపోతుందన్న ఆందోళనలు ఉన్నాయి. వేసవికాలం కావడంతో హఠాత్తుగా దేశవ్యాప్తంగా పెరిగిపోయిన విద్యుత్ వినియోగంతో పాటు బొగ్గు పంపిణీలో లోపాలు సమస్యని మరింత పెంచాయి. విద్యుత్‌కి డిమాండ్ ఎలా పెరిగింది ? ప్రతీ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు విద్యుత్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్నాళ్లూ రోజుకి సగటున 187 గిగావాట్ల విద్యుత్‌కు డిమాండ్ ఉంటే ఏప్రిల్ 1–12 తేదీ మధ్యలో సగటున రోజుకి 194 గిగావాట్లకు పెరిగిపోయింది. దీంతో కొన్ని రాష్ట్రాల్లో రోజుకి ఎనిమిది గంటలు విద్యుత్ కోతలు విధించే పరిస్థితులు వచ్చాయి. బొగ్గు కొరత ఎలా ఉంది ? దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో రాను రాను బొగ్గుకి కొరత ఏర్పడింది. నేçషనల్ పవర్ పోర్టల్ గణాంకాల ప్రకారం ఇంపోర్టెడ్ కోల్ బేస్డ్ (ఐసీబీ) విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు పాతాళానికి పడిపోయాయి. అదే విధంగా 79 దేశీయ పవర్ ప్లాంట్లు కూడా తీవ్ర బొగ్గు కొరతని ఎదుర్కొంటున్నాయి. ఏప్రిల్ 19 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న 700కిపైగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 2.2 కోట్ల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఇవి కేవలం తొమ్మిది రోజులకే సరిపోతాయి. శాఖల మధ్య సమన్వయ లోపం గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో భారీ వర్షాల కారణంగా బొగ్గు తవ్వకాలు నిలిచిపోవడంతో దేశంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. ఇప్పుడు బొగ్గు తవ్వకాలు సమృద్ధిగా జరుగుతున్నప్పటికీ కేంద్రంలోని శాఖల మధ్య సమన్వయ లోపమే దేశంలో విద్యుత్ కోతలకి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ మొదట్లో కోల్ ఇండియా 27% అదనంగా బొగ్గు తవ్వకాలు జరిపింది. విద్యుత్, బొగ్గు గనులు, రైల్వే శాఖ అధికారులతో కూడిన ఒక అంతర్గత కమిటీ బొగ్గు పంపిణీ వ్యవహారాలు చూస్తుంది. బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ బొగ్గు పంపిణీకి సరిపడనంత రాక్స్‌ని కేటాయించడం లేదని ఆరోపిస్తూ ఉంటే, లోడింగ్, అన్‌లోడింగ్‌లో కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) అవకతవకలకు పాల్పడుతోందని రైల్వే శాఖ ఎదురుదాడికి దిగింది. ► థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో 17 నుంచి 26 రోజులకు సరిపడే నిల్వలుంటేనే అవి పూర్తయ్యేలోగా తిరిగి బొగ్గు నిల్వలు చేరుకుంటాయి. కానీ ప్రస్తుతం తొమ్మిది రోజులకి సరిపడా నిల్వలు మాత్రమే ఉండడం ఆందోళనకరంగా మారింది. ► ప్రతిరోజూ రైల్వే శాఖ 453 రాక్స్‌ను కేటాయిస్తేనే విద్యుత్ ప్లాంట్ల అవసరాలకు సరిపడా బొగ్గు పంపిణీ సాధ్యమవుతుంది. ప్రస్తుతం రైల్వే శాఖ కేవలం 412 రాక్స్ ద్వారా మాత్రమే బొగ్గుని పంపిణీ చేస్తూ ఉండడంతో కొరతకి దారి తీసింది. ► ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్, హరియాణాలలో బొగ్గు నిల్వలు కేవలం ఆరు రోజులకు సరిపడా ఉన్నాయని ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) చైర్మన్ శైలేంద్ర దూబే వెల్లడించారు. ► రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. ఇన్నాళ్లుగా టన్ను బొగ్గుకి 100 డాలర్లు ఇస్తే, ఇప్పుడు అది ఏకంగా 300 డాలర్లకు చేరుకుంది. ► విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గుని వాడే విద్యుత్ ప్లాంట్లలో 6.6 కోట్ల టన్నుల బొగ్గు అవసరమైతే ప్రస్తుతం 2.2 కోట్ల టన్నులు మాత్రమే ఉంది. ► విదేశీ బొగ్గు కొరతని అధిగమించడానికి కేంద్రం రష్యా నుంచి డిస్కౌంట్ ధరలకి బొగ్గుని దిగుమతి చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. ప్రపంచంలో బొగ్గు ఎగుమతుల్లో మూడో స్థానంలో రష్యా ఉక్రెయిన్‌పై దాడికి దిగడంతో యూరప్ దేశాలు బొగ్గు దిగుమతులపై నిషేధం విధించారు. దీంతో భారత్ రష్యా నుంచి బొగ్గుని దిగుమతి చేసుకొని సమస్యను పరిష్కరించాలని భావిస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
శాస్త్ర సాంకేతికతపై యుద్ధం పిడుగు
ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలుపెట్టి నెల రోజులు అవుతోంది. ఈ యుద్ధ ఫలితంగా వేలాదిమంది శరణార్థులుగా మారడంతో అతిపెద్ద మానవీయ సమస్య తలెత్తుతోంది. యుద్ధ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు, ఎరువులు, ఆహారపదార్థాల ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రష్యా దాడుల ప్రభావం ప్రపంచ శాస్త్ర పరిశోధన రంగంపై భారం మోపుతోంది. యుద్ధ కారణంగా కీలక ప్రాజెక్టులు రద్దు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇవన్నీ మానవ శాస్త్ర సాంకేతిక పురోగతిని దెబ్బతీస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధారంభం నుంచి ఇంతవరకు ప్రభావితమైన సైన్సు సంబంధిత అంశాలు ఇలా ఉన్నాయి.. మార్స్ మిషన్ రష్యాతో చేపట్టదలిచిన సంయుక్త మార్స్ మిషన్‌ను నిలిపివేస్తున్నట్లు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ ఏడాదిలో ఇరు పక్షాలు కలిసి కుజగ్రహ యాత్రను చేపట్టాల్సిఉంది. కేవలం ఎక్సోమార్స్ మిషన్ మాత్రమే కాకుండా పలు ఇతర ప్రాజెక్టుల్లో రష్యా స్పేస్ ఏజెన్సీ రోస్కోమాస్‌తో బంధాలను తెంచుకుంటున్నట్లు యూరోపియన్ ఏజెన్సీ తెలిపింది. ఇంధన రంగం ఉక్రెయిన్‌పై దాడితో ముందెన్నడూ చూడనటువంటి అంతర్జాతీయ ఇంధన సంక్షోభం ముంచుకువస్తోందని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ(ఐఈఏ) హెచ్చరించింది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్ల స్థిరీకరణకు ఈ ఏజెన్సీని 1973లో నెలకొల్పారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ సంక్షోభం తొలగిపోవాలంటే మిగిలిన దేశాలు ఉత్పత్తి పెంచితే సరిపోదని, ఇంధన పొదుపును అన్ని దేశాలు పాటించాలని ఏజెన్సీ సూచించింది. ఇందుకోసం ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేయడం, విమానయానాలను తగ్గంచడం, కార్‌పూలింగ్‌ను ప్రోత్సహించడం తదితర చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చింది. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వాడకాన్ని వేగంగా అమలు చేయాలని ప్రభుత్వాలను కోరింది. దీంతోపాటు ఫార్మా, ఆహార రంగాల్లో పలు పరిశోధనలు యుద్ధం కారణంగా అటకెక్కనున్నాయి. ఈ పరిణామాలన్నీ ఇంతవరకు మానవాళి సాధించిన సైన్సు విజయాలను ధ్వంసం చేస్తాయని ప్రపంచ పరిశోధకులు తీవ్ర ఆందోళన వెలిబుచ్చుతున్నారు. ఐఎస్ఎస్ నిర్వహణ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) నిర్మాణంలో రష్యా, అమెరికా కలిసి పనిచేశాయి. తాజా యుద్ధంతో ఇరు దేశాల మధ్య ఆవేశాలు పెరిగాయి. దీని ప్రభావం అంతరిక్ష ప్రయోగాలపై పడనుంది. ఇక మీదట ఇరుదేశాల ఉమ్మడిపాత్రపై అనుమానాలు ఏర్పడ్డాయి. ఐఎస్ఎస్లో ఉన్న అమెరికా ఆస్ట్రోనాట్ మార్క్ వాండే మరో ఇద్దరు రష్యన్ కాస్మోనాట్స్‌తో కలిసి భూమి మీదకు రష్యా అంతరిక్ష వాహనంలో రావాల్సిఉంది. ప్రస్తుతానికి ఈ ప్రయోగం వరకు సహకరించుకునేందుకు రష్యా, అమెరికా అంగీకారానికి వచ్చాయి. కానీ ఇకపై అమెరికాకు రాకెట్ విక్రయాలు చేపట్టమని రష్యా ప్రకటించింది. రష్యా దాడికి నిరసనగా అన్నట్లుగా రష్యన్ వ్యోమగాములు తమ ఐఎస్ఎస్ ప్రయాణంలో పసుపురంగు సూట్లు ధరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. రష్యా దాడికి నిరసనగా ఉక్రెయిన్‌కు చెందిన ఈ రంగును కాస్మోనాట్లు వాడారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే తాము సాధారణంగానే ఈ రంగును ఎంచుకున్నట్లు కాస్మోనాట్లు చెబుతున్నారు. ముందుముందు ఐఎస్ఎస్పై రష్యా పట్టు తొలగిపోవచ్చన్న అనుమానాలున్నాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
రష్యా సహజవాయువు సరఫరా ఆపేస్తే?
ఉరిమి ఉరిమి ఎక్కడో పడిందని.. రష్యా, అమెరికా పంతాలకు పోవడం తమకు చేటు తెస్తుందని సన్నకారు యూరప్ దేశాలు భయపడుతున్నాయి. ఉక్రెయిన్ వంకతో అమెరికా ఆంక్షలు పెంచితే ప్రతిగా రష్యా సహజవాయువు సరఫరా నిలిపివేయవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆంక్షలకు నిరసనగా యూరప్‌కు రష్యా మొత్తం గ్యాస్ సరఫరా నిలిపివేస్తుందా? అలాంటప్పుడు యూరప్‌లో ఇంధన సంక్షోభం తప్పదా? చూద్దాం.. ఉక్రెయిన్ను రష్యా ఆక్రమిస్తే తమకు ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని యూరప్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఉక్రెయిన్ను ఆక్రమిస్తే రష్యాపై యూఎస్ ఆంక్షలు తీవ్రతరం చేస్తుందని, ఇందుకు ప్రతిగా యూరప్‌కు సరఫరా అయ్యే సహజవాయువును రష్యా నిలిపివేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యూరప్ దేశాలు సహజవాయువు కోసం రష్యాపై ఆధారపడుతున్నాయి, యూరప్ సహజవాయు అవసరాల్లో మూడింట ఒక వంతు రష్యా సరఫరా తీరుస్తోంది. పైగా ప్రస్తుతం యూరప్ వద్ద సహజవాయు నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. రష్యా గ్యాస్ సరఫరా నిలిపివేస్తే తాము ఎగుమతి చేస్తామని అమెరికా యూరప్‌కు హామీ ఇస్తోంది. అయితే రష్యా నుంచి సరఫరా అయినంత సులభంగా అమెరికా నుంచి గ్యాస్ దిగుమతి చేసుకోవడం కుదరదు. ఈ నేపథ్యంలో యూరప్‌లో ఇంధన సంక్షోభ భయాలు పెరుగుతున్నాయి. గతేడాది శీతాకాలం తీవ్రత అధికంగా ఉండడంతో యూరప్‌లోని సహజవాయు నిల్వలు చాలావరకు ఖర్చయ్యాయి. పలు దేశాల్లో పునర్వినియోగ ఇంధన ఉత్పత్తి తక్కువగా ఉంది. మరోపక్క అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు దూసుకుపోతున్నాయి. ఇవన్నీ కలిసి తమను అంధకారంలోకి నెట్టవచ్చని పలు చిన్నాచితకా యూరప్ దేశాలు భయపడుతున్నాయి. పూర్తి నిలుపుదల సాధ్యం కాదా? ఆంక్షలను వ్యతిరేకిస్తూ రష్యా సహజవాయు సరఫరా నిలిపివేయాలనుకున్నా, పూర్తి ఎగుమతులను నిలిపివేయడం సాధ్యం కాదని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు రష్యా అధికారులు గ్యాస్ సరఫరా నిలిపివేయడంపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రష్యాకు గ్యాస్ ఎగుమతుల వల్ల చాలా ఆదాయం వస్తోంది. ఇటీవలే ఆ దేశం చైనాతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. అయినా యూరప్ నుంచే రష్యాకు అధికాదాయం లభిస్తోంది. అలాంటప్పుడు పూర్తిగా యూరప్‌కు ఎగుమతి ఆపితే అది తిరిగి రష్యా ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీసే ప్రమాదం ఉందన్నది నిపుణుల మాట. గతేడాది యూరప్‌కు రష్యా 1.75 లక్షల కోట్ల క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను సరఫరా చేసింది. ఇందులో పావుభాగాన్ని పైప్‌లైన్స్ ద్వారా పంపింది. ఆంక్షలు ముమ్మరమైతే ఉక్రెయిన్ నుంచి వెళ్లే పైప్‌లైన్ సరఫరాను మాత్రం రష్యా నిలిపివేయవచ్చని యూఎస్ మాజీ దౌత్యాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇది నేరుగా జర్మనీపై ప్రభావం చూపుతుంది. అప్పుడు జర్మనీకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రష్యా నార్డ్ స్ట్రీమ్ పైప్‌లైన్ గుండా గ్యాస్‌ను సరఫరా చేసేందుకు ముందుకువస్తుందని, ఇది యూఎస్‌కు మరింత కోపాన్ని తెప్పించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. యూఎస్ సాయం ప్రపంచంలో అత్యధిక సహజవాయువు ఉత్పత్తిదారుల్లో ఒకటైన అమెరికా, గ్యాస్ ఎగుమతుల్లో కూడా ముందంజలో ఉంది. కానీ యూరప్‌కు అమెరికా సాయం పరిమితంగానే ఉండవచ్చని నిపుణుల అంచనా. రష్యా సరఫరాలను మించి యూరప్‌కు అమెరికా గ్యాస్‌ను పంపాలన్నా భౌగోళిక ఇబ్బందులున్నాయి. అందువల్ల ప్రస్తుతం కన్నా కొంతమేర ఎగుమతులను పెంచడం మాత్రమే యూఎస్ చేయగలదు. అందుకే ఉత్తర ఆఫ్రికా, మధ్యాసియా, ఆసియాల్లోని తన మిత్రపక్షాల నుంచి యూరప్‌కు సరఫరా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని బైడెన్ ప్రభుత్వం భావిస్తోంది. అలాగే పేద దేశాలకు ఎగుమతి చేసే నిల్వలను అధిక ధరల ఆశ చూపి యూరప్‌కు మరలిస్తోంది. ఉక్రెయిన్ పైప్‌లైన్ సరఫరాను రష్యా నిలిపివేస్తే యూరప్ దేశాలకు రోజుకు 1.27 షిప్పుల గ్యాస్‌ను యూఎస్ అదనంగా అందించాల్సిఉంటుంది. యూరప్‌కు సరఫరా పెంచితే స్వదేశంలో కొరత ఏర్పడవచ్చని కొందరు అమెరికా సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్యా ఇప్పటికే పరోక్షంగా గ్యాస్ సరఫరాను నియంత్రిస్తోందని, అందుకే మార్కెట్లో సహజవాయువు ధర పెరుగుతోందని ఇంధన రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందుకే చాలారోజులుగా యూరప్ దేశాల్లో ఇంధన బిల్లులు పెరిగిపోతున్నాయని చెప్పారు. ఈ సమస్యను ప్రజలపై పడకుండా చూసేందుకు పలు దేశాలు సబ్సిడీలను అందిస్తున్నాయి. పరిస్థితులను చక్కదిద్దేందుకు గ్యాస్ ఉత్పత్తి మరింత పెంచాలని అమెరికా యత్నిస్తోంది. అమెరికా ప్రయత్నాలు ఫలిస్తాయా? రష్యా నిజంగానే గ్యాస్ సరఫరా నిలిపివేస్తుందా? తేలాలంటే ఉక్రెయిన్ పీటముడి వీడాల్సిఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కాంక్రీట్ దిమ్మెలే.. బ్యాటరీలు!
ఫొటో చూస్తే ఏమనిపిస్తోంది? భవన నిర్మాణం కోసం ఉంచిన కాంక్రీట్ దిమ్మెలు అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడ్డట్లే! ఎందుకంటే.. ఇవి స్విట్జర్లాండ్ కంపెనీ ‘ఎనర్జీ వాల్ట్’ గతేడాది సిద్ధం చేసిన 8 మెగావాట్ల బ్యాటరీలు!! కాంక్రీట్‌తో బ్యాటరీ ఏమిటని అనుకోకండి. నిజానికి ఇది చాలా సింపుల్. ఎలాగంటే డ్యామ్‌లలో ఉన్న నీళ్లు వేగంగా కిందకు జారుతూ టర్బయిన్లను తిప్పడం ద్వారా విద్యుదుత్పత్తి అవడం మనకు తెలుసు కదా. ఇది కూడా అలాగే కాకపోతే ఒక్క చిన్న తేడా ఉంది. విద్యుత్‌కు రాత్రిపూట డిమాండ్ ఎక్కువగా ఉంటే సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా పగటిపూట ఎక్కువ విద్యుదుత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. ఈ అదనపు విద్యుత్ సాయంతో ఒక్కో కాంక్రీట్ దిమ్మెను క్రేన్ల ద్వారా పైకి ఎత్తుతారు. ఒక క్రమంలో పేర్చుకుంటూ వస్తారు. రాత్రిపూట విద్యుత్‌కు డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కో దిమ్మెను కిందకు జారవిడిచి గతి శక్తిని కాస్తా విద్యుచ్ఛక్తిగా మారుస్తారు. ఐడియా బాగుంది కదూ! ఎప్పుడో మూడేళ్ల క్రితమే ఈ ఐడియా వచ్చినా అన్ని అడ్డంకులను దాటుకొని వాణిజ్య స్థాయిలో ఓ టవర్‌ను ప్రారంభించేందుకు ‘ఎనర్జీ వాల్ట్’కు కొంత సమయం పట్టింది. చిత్రంలో ఉన్న ఏర్పాటు ద్వారా దాదాపు 8 మెగావాట్ల విద్యుత్‌ను నిల్వ చేసుకోవచ్చు. -
ఇక వారానికి రెండు రోజులే పని!!
పనిభారం ఎక్కువైపోయిందని బాధపడుతున్నారా? అయితే అర్జంటుగా వెనిజువెలా వెళ్లి అక్కడ ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగం చేయండి. ఎందుకంటే, ఆ దేశంలో ప్రభుత్వోద్యోగులకు వారానికి రెండు రోజులే పని!! తీవ్రమైన విద్యుత్ కొరత కారణంగా అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ దేశ ఉపాధ్యక్షుడు అరిస్టోబులో ఇస్తురిజ్ ప్రకటించారు. విద్యుత్ కొరత తీరేవరకు కేవలం సోమ, మంగళ వారాల్లో మాత్రమే ప్రభుత్వోద్యోగులు పనిచేయాలని ఆయన చెప్పారు. ఇటీవలి కాలంలో వెనిజువెలాలో కరువు తాండవిస్తోంది. దాంతో ఆ దేశంలోని ప్రధాన జలవిద్యుత్ కేంద్రం వద్ద కూడా నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. విద్యుత్ ఉత్పత్తి పడిపోవడంతో.. సరఫరాను తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టారు. దాదాపు 20 లక్షల మంది ఉద్యోగులు వారానికి నాలుగైదు రోజులు రాకపోతే.. ఆ మేరకు విద్యుత్ వాడకం తగ్గుతుందని ఈ ఐడియా వేశారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన అందరికీ బుధ, గురు, శుక్రవారాల్లో కూడా సెలవలు ఇస్తున్నట్లు ఉపాధ్యక్షుడు చెప్పారు. ఏప్రిల్, మే నెలల్లో విద్యుత్ కొరతను అధిగమించేందుకు ఇప్పటికే వెనిజువెలా లోని 28 లక్షల మంది ఉద్యోగులకు శుక్రవారం నాడు సెలవులు ఇస్తున్నట్లు ఇంతకుముందే అధ్యక్షుడు నికొలస్ మదురో ప్రకటించారు. ఎల్ నినో కారణంగా అస్సలు వర్షాలు పడటం లేదని, వర్షాలు కురవడం మొదలుపెట్టాక మళ్లీ సాధారణ స్థితి ఏర్పడుతుందని ఆయన అన్నారు. -
తరగని ఇంధనం... సౌర వికిరణం
శక్తి సంక్షోభం ఆధునిక సాంకేతిక ప్రపంచానికి సవాల్ విసురుతోంది. ఓవైపు క్షీణిస్తున్న సంప్రదాయ ఇంధన వనరుల లభ్యత... మరోవైపు పర్యావరణ విషతుల్యత... ప్రకృతి ప్రసాదితమైన సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రాధాన్యతను గుర్తుచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచం సౌర వెలుగులవైపు చూస్తోంది. భానుని కిరణాలే భవిష్యత్ శక్తి వనరుగా భావిస్తూ వడివడిగా అడుగులేస్తోంది. తరగని వనరుగా... సమస్త జీవకోటి మనుగడకు మూలాధారమైన సౌర శక్తితో పరిస్థితిని చక్కదిద్దుకుంటోంది. ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న శక్తి సంక్షోభానికి ప్రత్యామ్నాయం... సౌరకిరణమే. దేశ ఆర్థిక, సామాజిక ప్రగతికి శక్తి వెన్నెముక. ఒక దేశ తలసరి శక్తి వినియోగం ఆధారంగా ఆ దేశ అభివృద్ధిని పరిగణిస్తారు. ప్రస్తుతం భారత్‌లో శక్తి సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉంది. గుజరాత్, ఛత్తీస్గడ్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ విద్యుత్ లోటు కనిపిస్తోంది. ఇక దక్షిణాది విషయానికి వస్తే... ఐదు రాష్ట్రాల్లోనూ విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. దీనికి కారణం కేవలం బొగ్గు వంటి సంప్రదాయ శక్తి వనరులపై ఆధారపడటమే. ప్రస్తుత, భవిష్యత్ తరాల అవసరాలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని శక్తి భద్రతను సాధించాలంటే సౌరశక్తి వంటి పునర్వినియోగ శక్తి వనరులపై ఆధారపడటం తప్పనిసరి. సౌర శక్తే ఎందుకంటే? ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకారం భారత్‌లో స్థాపిత శక్తి సామర్థ్యం 2.54 లక్షల మెగావాట్లు. డిమాండు 3.50 లక్షల మెగావాట్లకుపైనే ఉంది. స్థాపిత సామర్థ్యంలో బొగ్గు ఆధారిత వాటా 60.2 శాతం. ఈ స్థాయిలో బొగ్గు మీద ఆధారపడటమే శక్తి లోటుకు కారణం. బొగ్గును అవసరాలకు తగ్గట్టుగా వెలికితీయలేక దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. భారత్‌లో విద్యుత్ సరఫరాలో సంభవించే నష్టం సుమారు 24 శాతం. జల విద్యుత్ ఉత్పాదనకు మెరుగైన అవకాశాలు ఉన్నా పర్యావరణ నష్టం, ప్రజల వ్యతిరేకత నేపథ్యంలో ఆశించిన రీతిలో విస్తరణ లేదు. అదే విధంగా సహజ వాయువు, దాని రూపాంతర షేల్ గ్యాస్, కోల్బెడ్ మీథేన్ (సీబీఎం) నిల్వలు అధికంగా ఉన్నప్పటికీ వెలికితీతలో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక అణుశక్తి విషయానికి వస్తే... మూడు దశల్లో అణుశక్తి కార్యక్రమాన్ని రూపొందించినప్పటికీ యురేనియం నిల్వల కొరత, రియాక్టర్ల నిర్మాణం-వాటి పరిశోధనల్లో జాప్యం కారణంగా ఆశించిన రీతిలో ఉత్పాదన లేదు. రియాక్టర్ల నిర్మాణం ఆలస్యమవుతుండటం, విదేశీ రియాక్టర్లపై ఆధారపడే విధానాన్ని అవలంబించడం కూడా అణుశక్తి ఉత్పాదనకు ఆటంకం ఏర్పడుతోంది. 2011, మార్చి 11న జపాన్‌లోని ఫుకుషిమా రియాక్టరు ప్రమాదం తర్వాత అణుశక్తి భద్రతపై అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. జర్మనీ, స్విట్జర్లాండ్ లాంటి దేశాలు 2022, 2035 నాటికి అణుశక్తి ఉత్పత్తిని పూర్తిగా నిలిపేయాలని నిర్ణయించాయి. ఇక భారత్‌లోనైతే వీటి విస్తరణకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సంప్రదాయేతర శక్తి వనరులు: సంప్రదాయ శక్తి వనరుల ద్వారా లక్ష్యాలను చేరుకోలేని కారణంగా పునర్వినియోగ, నవీన శక్తి వనరుల ఆవశ్యకత పెరిగింది. సౌరశక్తి, పవన శక్తి, జీవ శక్తి, చిన్న తరహా జల విద్యుత్ వంటివి ప్రధాన పునర్వినియోగ శక్తి వనరులు. జియో థర్మల్, హైడ్రోజన్, సముద్ర తరంగ శక్తులు ప్రధాన నవీన శక్తి వనరులు. మన దేశంలో ఈ రెండు రకాల సంప్రదాయేతర శక్తి వనరుల అభివృద్ధి వినియోగానికి మంచి అవకాశాలు ఉన్నాయి. భారత్‌లో 33 శాతం గ్రామీణ జనాభా, 6 శాతం పట్టణ జనాభాలో విద్యుత్ సరఫరా లేదు. ఇలాంటి తరుణంలో శక్తి అవసరాలను దృష్టిలో పెట్టుకొని నవీన పునర్వినియోగశక్తి వనరులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పల్లె ప్రాంతాల్లో కేవలం గృహ, వ్యవసాయ అవసరాలకు మాత్రమే కాకుండా గ్రామీణ నేపథ్య పరిశ్రమల అభివృద్ధికి కూడా విద్యుత్ సరఫరా అవసరం. వీటిని సాధించడంలో నవీన పునర్వినియోగ శక్తి వనరుల పాత్ర కీలకం అని చెప్పొచ్చు. సోలార్ శక్తి-రకాలు: ఇది అపారమైంది. అత్యధిక సౌర వికిరణం గుజరాత్, రాజస్థాన్, లడఖ్ ప్రాంతాలలో లభిస్తుంది. అతి తక్కువగా ఈశాన్య భారతంలో చేరుతుంది. సౌరశక్తిని రెండు రకాలుగా విభజిస్తారు. మొదటిది, సౌరశక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చే సాంకేతిక పరిజ్ఞానం (సోలార్ ఫోటో వోల్టాయిక్స్). సౌర లాంతర్లు, సౌర విద్యుత్ వీధి దీపాలు, గ్రిడ్ ఆధారిత సౌరశక్తి, సౌర ఫ్యాన్లు మొదలైనవి సోలార్ ఫోటో వోల్టాయిక్స్ పరిధిలోకి వస్తాయి. రెండోది, సౌరశక్తిని ఉష్ణశక్తిగా మార్చే టెక్నాలజీ (సోలార్ థర్మల్). సౌర కుక్కర్లు, సోలార్ స్టీమ్ కుకింగ్ సిస్టమ్, సోలార్ డ్రయర్లు, సోలార్ హీటర్లు మొదలైనవి సోలార్ థర్మల్ పరికరాలు. ఇలాంటి పరికరాలను విస్తృత వినియోగంలోకి తీసుకొచ్చే కొద్దీ సంప్రదాయ శక్తి వనరులపై భారం తగ్గుతుంది. ఖరీదే... అయినా: సౌర వికిరణం నుంచి ఉత్పత్తి చేయగల శక్తినే సౌరశక్తి అంటారు. ఏడాదిలో 300 రోజులపాటు భారత భూభా గంపై 5000 ట్రిలియన్ కిలోవాట్ అవర్ల సౌరశక్తి వచ్చి చేరుతుంది. బహుశా సౌరశక్తిని ఏడాదిపాటు పొందగలిగే అవకాశం ఉన్న అరుదైన దేశం మనదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. సౌరశక్తి రంగంలో అపార అవకాశాలు దేశానికి ఉన్నాయి. ఈ శక్తి ద్వారా ఎలాంటి పర్యావరణ కాలుష్యం సంభవించదు. బొగ్గు వంటి శక్తి వనరులతో పోలిస్తే సౌర శక్తి ఖరీదైంది. అయినప్పటికీ సాంకేతిక సమీకరణ, సామర్థ్యం పెంపుదల చర్యల ద్వారా అందుబాటు ధరల్లోకి సౌర యంత్రాలను, గ్రిడ్ ఆధారిత ఉత్పత్తిని తీసుకురావడం సాధ్యమవుతుంది. అమెరికా వంటి సమశీతోష్ణ ప్రాంత దేశాలు సౌర శక్తిని అత్యధిక ప్రాధాన్యతతో ఉత్పత్తి చేస్తున్నప్పుడు భారత్‌కు ఇదేం కష్టం కాదు. 1980 నుంచి క్రమంగా సౌరశక్తి ఉత్పాదన, పరికరాల ధర తగ్గుతూనే ఉన్నాయి. ఈ రంగంలో పెట్టుబడులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. జేఎన్‌ఎన్‌ఎస్‌ఎం: సౌరశక్తి సామర్థ్యాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం 2010, జనవరి 11న జవహర్లాల్ నెహ్రూ జాతీయ సౌర మిషన్ (ఒూూక)ను ప్రారంభించింది. 2022 నాటికి 20వేల మెగావాట్ల గ్రిడ్ ఆధారిత సౌరశక్తిని ఉత్పత్తి చేయడంతో పాటు, 20 మిలియన్ చదరపు మీటర్ల సౌర థర్మల్ సంగ్రహణ ప్రాంతం (సోలార్ థర్మల్ కలెక్టర్ ఏరియా) ను అభివృద్ధి చేయాలన్నది ఈ మిషన్ లక్ష్యం. సౌరశక్తి ఉత్పాదన ఖర్చును తగ్గించి, దీర్ఘ కాలిక సౌర విధానాన్ని అవలంబించింది. దేశ వ్యాప్తంగా సౌరశక్తి విస్తరణ, వేగవంతంగా పరిశోధన అభివృద్ధి కార్యక్రమాల ప్రోత్సాహం, దేశీయ ముడి పరికరాల, ఉత్పత్తుల తయారీని పెంచడం మొదలైనవి ఈ మిషన్ ఇతర లక్ష్యాలు. ఈ మిషన్‌ను మూడు దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశ -లక్ష్యాలు: కాలం 2010-13 1000 మెగావాట్ల సౌరశక్తి ఉత్పాదన 7 మిలియన్ చదరపు మీటర్ల సౌర థర్మల్ సంగ్రహణ ప్రాంతం సాధించడం రెండో దశ - లక్ష్యాలు: కాలం 2013-17 3,000 మెగావాట్ల సౌరశక్తి ఉత్పాదన 15 మిలియన్ చదరపు మీటర్లకు సౌరథర్మల్ సంగ్రహణ ప్రాంతం విస్తరణ మూడో దశ-లక్ష్యాలు: కాలం: 2017-22 20,000 మెగావాట్లకు సౌరశక్తి ఉత్పాదన 20 మిలియన్ చదరపు మీటర్లకు సౌర థర్మల్ సంగ్రహణ ప్రాంతాన్ని సాధించడం ఈ మూడు దశల్లోనూ చివర్లో, మధ్యలో విశ్లేషణ చేసుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా లక్ష్యాల్లో మార్పులు జరుగుతాయి. కేంద్రీకృత, వికేంద్రీకృత పద్ధతుల్లో దేశ వ్యాప్తంగా సౌర శక్తి ఉత్పాదన, వినియోగం, విస్తరణతో పాటు వాణిజ్య విద్యుత్ అందించలేని ప్రాంతాల్లో ఆఫ్‌గ్రిడ్ తరహా సౌరశక్తిని విస్తరించడానికి ఈ మిషన్ కృషి చేస్తుంది. మిషన్‌లో భాగంగా గ్రిడ్ ఆధారిత కొత్త సౌర ప్రాజెక్టుల ఎంపికకు మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ మిషన్‌కు ముందున్న కార్యక్రమాలను నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా పొందుపరిచారు. మెగావాట్ స్థాయి సౌర ప్రాజెక్టులను 2011లో ప్రారంభించారు. ఆఫ్‌గ్రిడ్ తరహా సౌరశక్తి విస్తరణ ద్వారా ఎక్కువ మందికి లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతో మినీ ఎస్పీవీ వ్యవస్థలను ఆమెదించారు. దీనిలో భాగంగా ఎస్పీవీతో నీటి పంపింగ్ వ్యవస్థలను, కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్స్ (సీఎఫ్ఎల్) ఆధారిత ఎస్పీవీ లైటింగ్ వ్యవస్థలు (ఉదాహరణకు సోలార్ లాంతర్లు, హోంలైటింగ్, వీధి దీపాలు), ఎల్ఈడీ (లైట్ ఎమిటింగ్ డయోడ్స్) ఆధారిత లైటింగ్ వ్యవస్థల అభివృద్ధి సాంకేతిక పరమైన నిబంధనలను విడుదల చేశారు. బాంబే ఐఐటీ సౌర సేవలు: దేశ వ్యాప్తంగా సౌర వెలుగులు పంచేందుకు బాంబే ఐఐటీ తనవంతు సేవలనందించేందుకు ముందుకు వచ్చింది. తన ఆధ్వర్యంలో 10 లక్షల సోలార్ స్టడీ ల్యాంపులను అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అదే విధంగా కిలోవాట్ సామర్థ్యం ఉన్న 23,500 ఎస్పీవీ వ్యవస్థలను గృహ అవసరాల కోసం రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అందించే కార్యక్రమాన్ని ఇటీవల చేపట్టింది. సోలార్ థర్మల్‌లో భాగంగా 2011లో సోలార్ వాటర్ హీటింగ్ వ్యవస్థల రూపకల్పనకు సాంకేతిక నిబంధనలు జారీ చేయాల్సి ఉంది. సౌర మిషన్ రెండో దశలో ఆఫ్‌గ్రిడ్ అండ్ డీసెంట్రలైజ్డ్ సోలార్ అప్లికేషన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సోలార్ సిటీ: నగరాల్లో గ్రీన్హౌస్ ఉద్గారాలను తగ్గించి శక్తి సుస్థిరత సాధించే క్రమంలో అనేక దేశాల్లోని నగరాలు పునర్విని యోగ శక్తి లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో డెవలప్మెంట్ ఆఫ్ సోలార్ సిటీస్ కార్యక్రమాన్ని కేంద్ర నవీన ఇంధన పునర్వినియోగ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. పురపాలక సంఘాల భాగస్వామ్యంతో సౌరశక్తిని విస్తరించడం దీని ప్రధాన లక్ష్యం. కనీసం 10 శాతం శక్తి డిమాండ్‌ను సౌరశక్తి ద్వారా వచ్చే ఐదేళ్లలో భర్తీ చేయడానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుంది. సోలార్ సిటీలో సౌరశక్తి మాత్రమే కాకుండా, పవన, జీవశక్తి, చిన్న తరహా జలవిద్యుత్, వ్యర్థాల నుంచి శక్తి ఉత్పత్తిని కూడా ప్రోత్సహిస్తారు. అక్షయ ఊర్జా దుకాణాలు, సోలార్ బిల్డింగ్ డిజైన్ వంటి వాటిని ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ప్రోత్సహిస్తున్నారు. 60 నగరాల్లో ఇలా అభివృద్ధి చేయనున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనల ఆధారంగా ఇప్పటివరకు 48 నగరాలను ఎంపిక చేశారు. నవీన పునర్వినియోగ శక్తి మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరు 30 నాటికి సాధించిన గ్రిడ్ ఆధారిత సౌరశక్తి స్థాపిత సామర్థ్యం 2765.81 మెగావాట్లు. ఆఫ్ గ్రిడ్ సౌరశక్తి (ఎస్పీవీ వ్యవస్థల) స్థాపిత సామర్థ్యం 209.89 మెగావాట్లు. 619 మిలియన్ చదరపు మీటర్లతో సౌర థర్మల్ సంగ్రహణ ప్రాంతం ఏర్పాటైంది. శక్తి స్వయం సమృద్ధి: దేశ వ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో శక్తి స్వయం సమృద్ధి సాధించడానికి సౌరశక్తి విస్తరణ చాలా కీలకం. ఆఫ్‌గ్రిడ్ సౌర పరికరాల ద్వారా ప్రతి ఇంటిలో శక్తి లభ్యత పెరుగుతుంది. సౌర ఇంటి దీపాలు, వీధి దీపాలు, సోలార్ కుక్కర్లు, వాటర్ హీటర్ల వినియోగాన్ని విస్తరించగలిగితే చాలు, శక్తి సమృద్ధిలో ఎంతో మెరుగుదల నమోదవుతుంది. ఇందుకోసం ప్రజల్లో సౌరశక్తి పట్ల అవగాహనతో పాటు చైతన్యం తీసుకురావడం తప్పనిసరి. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక బృందాలు, సూక్ష్మ రుణాల ద్వారా మరింత విస్తరించవచ్చు. పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రజల్లో చైతన్యం తప్పనిసరి. ప్రధానంగా వాణిజ్య సముదాలు, స్కూళ్లు, పార్కుల్లో సౌరశక్తిని మరింత ప్రోత్సహించాలి. ఈ రంగాల్లో టెక్నాలజీ, పరికరాల కోసం ఇతర దేశాలపై ప్రస్తుతం అధికంగా ఆధారపడుతున్నాం. కాబట్టి ఈ రంగానికి కావల్సిన పరికరాలను దేశీయంగా అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యతనివ్వడంతోపాటు ఈ రంగంలో విద్యా కోర్సులను కూడా ప్రారంభించాలి. అవరోధాలు: 20-60 మెగావాట్ల సౌరశక్తి ఉత్పత్తికి చదరపు కిలోమీటరు భూమి కావాలి. ఇది 250 ఎకరాలతో సమానం. అసలే స్థలాభావ సమస్య దేశాన్ని పట్టిపీడిస్తోంది. స్థలం కొనుగోలు చేయాలంటే ఆర్థిక భారం. ఒకవేళ తప్పనిసరిగా కొన్నా ఆ స్థలం విలువను మించి అధికంగా సౌర శక్తి ఉత్పత్తి చేయాలి. ఇది మన ముందున్న ప్రధాన అవరోధం. అవకాశాలు: గ్రామీణ భారతదేశంలో ఇప్పటికీ పూర్తిస్థాయిలో విద్యుత్ సౌకర్యం లేదు. ఉన్నా నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందడం లేదు. 2004 నాటికి దేశంలో 80 వేలకు పైగా గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదు. వీటిలో 18 వేల గ్రామాలకు విద్యుత్‌ను అందించలేని పరిస్థితి. ఇలాంటి పల్లెలకు సౌర వెలుగులే ప్రత్యామ్నాయం. సర్కారు చొరవే తారకమంత్రం: సోలార్ శక్తిని అందరికీ దరిచేర్చే లక్ష్యంతో భారత ప్రభుత్వం పలు రూపాల్లో వ్యూహాలను అనుసరిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి చాలవు. సామాన్యుడు సైతం సోలార్ వెలుగుల్లో విహరించేలా చర్యలు చేపట్టాలి. గృహ సముదాయాల పైకప్పులపై ఫోటో వోల్టాయిక్ ప్యానల్లను అమర్చుకునే దిశగా ప్రోత్సహించాలి. ఇప్పుడు టె లికమ్యూనికేషన్లో విప్లవం సాధించినట్లే సోలార్ పరిశ్రమను విస్తృతం చేయాలి. సోలార్ శక్తి వినియోగంలో అగ్ర దేశాలు దేశం సామర్థ్యం గిగావాట్లలో జర్మనీ 35.5 చైనా 18.3 ఇటలీ 17.6 జపాన్ 13.6 అమెరికా 12 స్పెయిన్ 5.6 ఫ్రాన్స్ 4.6 ఆస్ట్రేలియా 3.3 బెల్జియం 3 యూకే 2.9 భారత్ 2.3 సోలార్ శక్తి వినియోగంలో అగ్ర రాష్ట్రాలు రాష్ట్రం సామర్థ్యం మెగావాట్లలో గుజరాత్ 860.40 రాజస్థాన్ 666.75 మహారాష్ట్ర 237. 25 మధ్యప్రదేశ్ 195.315 ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి) 92.9 సౌర శక్తి ఉత్పత్తి లక్ష్యం (మెగావాట్లలో) 2005 6.4 2010 10 2011 468.3 2014 జనవరి 2,208.36 2022 20 వేలు - సి. హరికృష్ణ సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్