తరగని ఇంధనం... సౌర వికిరణం | General Essay: Solar Energy to prepare for Group exams | Sakshi
Sakshi News home page

తరగని ఇంధనం... సౌర వికిరణం

Published Thu, Nov 27 2014 1:06 AM | Last Updated on Mon, Oct 22 2018 8:31 PM

General Essay: Solar Energy to prepare for Group exams

శక్తి సంక్షోభం ఆధునిక సాంకేతిక ప్రపంచానికి సవాల్ విసురుతోంది. ఓవైపు క్షీణిస్తున్న సంప్రదాయ ఇంధన వనరుల లభ్యత... మరోవైపు పర్యావరణ విషతుల్యత...  ప్రకృతి ప్రసాదితమైన సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రాధాన్యతను గుర్తుచేస్తున్నాయి.  ఈ నేపథ్యంలో ప్రపంచం సౌర వెలుగులవైపు చూస్తోంది. భానుని కిరణాలే భవిష్యత్ శక్తి వనరుగా భావిస్తూ వడివడిగా అడుగులేస్తోంది. తరగని వనరుగా...  సమస్త జీవకోటి మనుగడకు మూలాధారమైన సౌర శక్తితో పరిస్థితిని చక్కదిద్దుకుంటోంది. ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న శక్తి సంక్షోభానికి ప్రత్యామ్నాయం... సౌరకిరణమే.  
 
 దేశ ఆర్థిక, సామాజిక ప్రగతికి శక్తి వెన్నెముక. ఒక దేశ తలసరి శక్తి వినియోగం ఆధారంగా ఆ దేశ అభివృద్ధిని పరిగణిస్తారు. ప్రస్తుతం భారత్‌లో శక్తి సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉంది. గుజరాత్, ఛత్తీస్‌గడ్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ విద్యుత్ లోటు కనిపిస్తోంది. ఇక దక్షిణాది విషయానికి వస్తే... ఐదు రాష్ట్రాల్లోనూ విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. దీనికి కారణం కేవలం బొగ్గు వంటి సంప్రదాయ శక్తి వనరులపై ఆధారపడటమే. ప్రస్తుత, భవిష్యత్ తరాల అవసరాలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని శక్తి భద్రతను సాధించాలంటే సౌరశక్తి వంటి పునర్వినియోగ శక్తి వనరులపై ఆధారపడటం తప్పనిసరి.
 
 సౌర శక్తే ఎందుకంటే?
 ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకారం భారత్‌లో స్థాపిత శక్తి సామర్థ్యం 2.54 లక్షల మెగావాట్లు. డిమాండు 3.50 లక్షల మెగావాట్లకుపైనే ఉంది. స్థాపిత సామర్థ్యంలో బొగ్గు ఆధారిత వాటా 60.2 శాతం. ఈ స్థాయిలో బొగ్గు మీద ఆధారపడటమే శక్తి లోటుకు కారణం. బొగ్గును అవసరాలకు తగ్గట్టుగా వెలికితీయలేక దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. భారత్‌లో విద్యుత్ సరఫరాలో సంభవించే నష్టం సుమారు 24 శాతం. జల విద్యుత్ ఉత్పాదనకు మెరుగైన అవకాశాలు ఉన్నా పర్యావరణ నష్టం, ప్రజల వ్యతిరేకత నేపథ్యంలో ఆశించిన రీతిలో విస్తరణ లేదు. అదే విధంగా సహజ వాయువు, దాని రూపాంతర షేల్ గ్యాస్, కోల్‌బెడ్ మీథేన్ (సీబీఎం) నిల్వలు అధికంగా ఉన్నప్పటికీ వెలికితీతలో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక అణుశక్తి విషయానికి వస్తే... మూడు దశల్లో అణుశక్తి కార్యక్రమాన్ని రూపొందించినప్పటికీ యురేనియం నిల్వల కొరత, రియాక్టర్ల నిర్మాణం-వాటి పరిశోధనల్లో జాప్యం కారణంగా ఆశించిన రీతిలో ఉత్పాదన లేదు. రియాక్టర్ల నిర్మాణం ఆలస్యమవుతుండటం, విదేశీ రియాక్టర్లపై ఆధారపడే విధానాన్ని అవలంబించడం కూడా అణుశక్తి ఉత్పాదనకు ఆటంకం ఏర్పడుతోంది. 2011, మార్చి 11న జపాన్‌లోని ఫుకుషిమా రియాక్టరు ప్రమాదం తర్వాత అణుశక్తి భద్రతపై అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. జర్మనీ, స్విట్జర్లాండ్ లాంటి దేశాలు 2022, 2035 నాటికి అణుశక్తి ఉత్పత్తిని పూర్తిగా నిలిపేయాలని నిర్ణయించాయి. ఇక భారత్‌లోనైతే వీటి విస్తరణకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
 
 సంప్రదాయేతర శక్తి వనరులు:
 సంప్రదాయ శక్తి వనరుల ద్వారా లక్ష్యాలను చేరుకోలేని కారణంగా పునర్వినియోగ, నవీన శక్తి వనరుల ఆవశ్యకత పెరిగింది. సౌరశక్తి, పవన శక్తి, జీవ శక్తి, చిన్న తరహా జల విద్యుత్ వంటివి ప్రధాన పునర్వినియోగ శక్తి వనరులు. జియో థర్మల్, హైడ్రోజన్, సముద్ర తరంగ శక్తులు ప్రధాన నవీన శక్తి వనరులు. మన దేశంలో ఈ రెండు రకాల సంప్రదాయేతర శక్తి వనరుల అభివృద్ధి వినియోగానికి మంచి అవకాశాలు ఉన్నాయి. భారత్‌లో 33 శాతం గ్రామీణ జనాభా, 6 శాతం పట్టణ జనాభాలో విద్యుత్ సరఫరా లేదు. ఇలాంటి తరుణంలో శక్తి అవసరాలను దృష్టిలో పెట్టుకొని నవీన పునర్వినియోగశక్తి వనరులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పల్లె ప్రాంతాల్లో కేవలం గృహ, వ్యవసాయ అవసరాలకు మాత్రమే కాకుండా గ్రామీణ నేపథ్య పరిశ్రమల అభివృద్ధికి కూడా విద్యుత్ సరఫరా అవసరం. వీటిని సాధించడంలో నవీన పునర్వినియోగ శక్తి వనరుల పాత్ర కీలకం అని చెప్పొచ్చు.
 
 సోలార్ శక్తి-రకాలు:
 ఇది అపారమైంది. అత్యధిక సౌర వికిరణం గుజరాత్, రాజస్థాన్, లడఖ్ ప్రాంతాలలో లభిస్తుంది. అతి తక్కువగా ఈశాన్య భారతంలో చేరుతుంది. సౌరశక్తిని రెండు రకాలుగా విభజిస్తారు. మొదటిది, సౌరశక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చే సాంకేతిక పరిజ్ఞానం (సోలార్ ఫోటో వోల్టాయిక్స్). సౌర లాంతర్లు, సౌర విద్యుత్ వీధి దీపాలు, గ్రిడ్ ఆధారిత సౌరశక్తి, సౌర ఫ్యాన్‌లు మొదలైనవి సోలార్ ఫోటో వోల్టాయిక్స్ పరిధిలోకి వస్తాయి. రెండోది, సౌరశక్తిని ఉష్ణశక్తిగా మార్చే టెక్నాలజీ (సోలార్ థర్మల్). సౌర కుక్కర్లు, సోలార్ స్టీమ్ కుకింగ్ సిస్టమ్, సోలార్ డ్రయర్లు, సోలార్ హీటర్లు మొదలైనవి సోలార్ థర్మల్ పరికరాలు. ఇలాంటి పరికరాలను విస్తృత వినియోగంలోకి తీసుకొచ్చే కొద్దీ సంప్రదాయ శక్తి వనరులపై భారం తగ్గుతుంది.
 
 ఖరీదే... అయినా:
 సౌర వికిరణం నుంచి ఉత్పత్తి చేయగల శక్తినే సౌరశక్తి అంటారు. ఏడాదిలో 300 రోజులపాటు భారత భూభా గంపై 5000 ట్రిలియన్ కిలోవాట్ అవర్‌ల సౌరశక్తి వచ్చి చేరుతుంది. బహుశా సౌరశక్తిని ఏడాదిపాటు పొందగలిగే అవకాశం ఉన్న అరుదైన దేశం మనదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. సౌరశక్తి రంగంలో అపార అవకాశాలు దేశానికి ఉన్నాయి. ఈ శక్తి ద్వారా ఎలాంటి పర్యావరణ కాలుష్యం సంభవించదు. బొగ్గు వంటి శక్తి వనరులతో పోలిస్తే సౌర శక్తి ఖరీదైంది. అయినప్పటికీ సాంకేతిక సమీకరణ, సామర్థ్యం పెంపుదల చర్యల ద్వారా అందుబాటు ధరల్లోకి సౌర యంత్రాలను, గ్రిడ్ ఆధారిత ఉత్పత్తిని తీసుకురావడం సాధ్యమవుతుంది. అమెరికా వంటి సమశీతోష్ణ ప్రాంత దేశాలు సౌర శక్తిని అత్యధిక ప్రాధాన్యతతో ఉత్పత్తి చేస్తున్నప్పుడు భారత్‌కు ఇదేం కష్టం కాదు. 1980 నుంచి క్రమంగా సౌరశక్తి ఉత్పాదన, పరికరాల ధర తగ్గుతూనే ఉన్నాయి. ఈ రంగంలో పెట్టుబడులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.
 
 జేఎన్‌ఎన్‌ఎస్‌ఎం:
 సౌరశక్తి సామర్థ్యాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం 2010, జనవరి 11న జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ సౌర మిషన్ (ఒూూక)ను ప్రారంభించింది. 2022 నాటికి 20వేల మెగావాట్ల గ్రిడ్ ఆధారిత సౌరశక్తిని ఉత్పత్తి చేయడంతో పాటు, 20 మిలియన్ చదరపు మీటర్ల సౌర థర్మల్ సంగ్రహణ ప్రాంతం (సోలార్ థర్మల్ కలెక్టర్ ఏరియా) ను అభివృద్ధి చేయాలన్నది ఈ మిషన్ లక్ష్యం. సౌరశక్తి ఉత్పాదన ఖర్చును తగ్గించి, దీర్ఘ కాలిక సౌర విధానాన్ని అవలంబించింది. దేశ వ్యాప్తంగా సౌరశక్తి విస్తరణ, వేగవంతంగా పరిశోధన అభివృద్ధి కార్యక్రమాల ప్రోత్సాహం, దేశీయ ముడి పరికరాల, ఉత్పత్తుల తయారీని పెంచడం మొదలైనవి ఈ మిషన్ ఇతర లక్ష్యాలు. ఈ మిషన్‌ను మూడు దశల్లో నిర్వహిస్తారు.
 
 మొదటి దశ -లక్ష్యాలు:
     కాలం 2010-13
     1000 మెగావాట్ల సౌరశక్తి ఉత్పాదన
     7 మిలియన్ చదరపు మీటర్ల సౌర థర్మల్ సంగ్రహణ ప్రాంతం సాధించడం
 
 రెండో దశ - లక్ష్యాలు:
     కాలం 2013-17
     3,000 మెగావాట్ల సౌరశక్తి ఉత్పాదన
     15 మిలియన్ చదరపు మీటర్లకు సౌరథర్మల్ సంగ్రహణ ప్రాంతం విస్తరణ
 
 మూడో దశ-లక్ష్యాలు:
     కాలం: 2017-22
     20,000 మెగావాట్లకు సౌరశక్తి ఉత్పాదన
     20 మిలియన్ చదరపు మీటర్లకు సౌర థర్మల్ సంగ్రహణ ప్రాంతాన్ని సాధించడం
 ఈ మూడు దశల్లోనూ చివర్లో, మధ్యలో విశ్లేషణ చేసుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా లక్ష్యాల్లో మార్పులు జరుగుతాయి. కేంద్రీకృత, వికేంద్రీకృత పద్ధతుల్లో దేశ వ్యాప్తంగా సౌర శక్తి ఉత్పాదన, వినియోగం, విస్తరణతో పాటు వాణిజ్య విద్యుత్ అందించలేని ప్రాంతాల్లో ఆఫ్‌గ్రిడ్ తరహా సౌరశక్తిని విస్తరించడానికి ఈ మిషన్ కృషి చేస్తుంది.
 మిషన్‌లో భాగంగా గ్రిడ్ ఆధారిత కొత్త సౌర ప్రాజెక్టుల ఎంపికకు మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ మిషన్‌కు ముందున్న కార్యక్రమాలను నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా పొందుపరిచారు. మెగావాట్ స్థాయి సౌర ప్రాజెక్టులను 2011లో ప్రారంభించారు. ఆఫ్‌గ్రిడ్ తరహా సౌరశక్తి విస్తరణ ద్వారా ఎక్కువ మందికి లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతో మినీ ఎస్‌పీవీ వ్యవస్థలను ఆమెదించారు. దీనిలో భాగంగా ఎస్‌పీవీతో నీటి పంపింగ్ వ్యవస్థలను, కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్స్ (సీఎఫ్‌ఎల్) ఆధారిత ఎస్‌పీవీ లైటింగ్ వ్యవస్థలు (ఉదాహరణకు సోలార్ లాంతర్లు, హోంలైటింగ్, వీధి దీపాలు), ఎల్‌ఈడీ (లైట్ ఎమిటింగ్ డయోడ్స్) ఆధారిత లైటింగ్ వ్యవస్థల అభివృద్ధి సాంకేతిక పరమైన నిబంధనలను విడుదల చేశారు.
 
 బాంబే ఐఐటీ సౌర సేవలు:
 దేశ వ్యాప్తంగా సౌర వెలుగులు పంచేందుకు బాంబే ఐఐటీ తనవంతు సేవలనందించేందుకు ముందుకు వచ్చింది. తన ఆధ్వర్యంలో 10 లక్షల సోలార్ స్టడీ ల్యాంపులను అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అదే విధంగా కిలోవాట్ సామర్థ్యం ఉన్న 23,500 ఎస్‌పీవీ వ్యవస్థలను గృహ అవసరాల కోసం రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అందించే కార్యక్రమాన్ని ఇటీవల చేపట్టింది. సోలార్ థర్మల్‌లో భాగంగా 2011లో సోలార్ వాటర్ హీటింగ్ వ్యవస్థల రూపకల్పనకు సాంకేతిక నిబంధనలు జారీ చేయాల్సి ఉంది. సౌర మిషన్ రెండో దశలో ఆఫ్‌గ్రిడ్ అండ్ డీసెంట్రలైజ్డ్ సోలార్ అప్లికేషన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
 
 సోలార్ సిటీ:
 నగరాల్లో గ్రీన్‌హౌస్ ఉద్గారాలను తగ్గించి శక్తి సుస్థిరత సాధించే క్రమంలో అనేక దేశాల్లోని నగరాలు పునర్విని యోగ శక్తి లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో డెవలప్‌మెంట్ ఆఫ్ సోలార్ సిటీస్ కార్యక్రమాన్ని కేంద్ర నవీన ఇంధన పునర్వినియోగ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. పురపాలక సంఘాల భాగస్వామ్యంతో సౌరశక్తిని విస్తరించడం దీని ప్రధాన లక్ష్యం. కనీసం 10 శాతం శక్తి డిమాండ్‌ను సౌరశక్తి ద్వారా వచ్చే ఐదేళ్లలో భర్తీ చేయడానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుంది. సోలార్ సిటీలో సౌరశక్తి మాత్రమే కాకుండా, పవన, జీవశక్తి, చిన్న తరహా జలవిద్యుత్, వ్యర్థాల నుంచి శక్తి ఉత్పత్తిని కూడా ప్రోత్సహిస్తారు. అక్షయ ఊర్జా దుకాణాలు, సోలార్ బిల్డింగ్ డిజైన్ వంటి వాటిని ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ప్రోత్సహిస్తున్నారు. 60 నగరాల్లో ఇలా అభివృద్ధి చేయనున్నారు. ఈ క్రమంలో  రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనల ఆధారంగా ఇప్పటివరకు 48 నగరాలను ఎంపిక చేశారు. నవీన పునర్వినియోగ శక్తి మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరు 30 నాటికి సాధించిన గ్రిడ్ ఆధారిత సౌరశక్తి స్థాపిత సామర్థ్యం 2765.81 మెగావాట్లు. ఆఫ్ గ్రిడ్ సౌరశక్తి (ఎస్‌పీవీ వ్యవస్థల) స్థాపిత సామర్థ్యం 209.89 మెగావాట్లు. 619 మిలియన్ చదరపు మీటర్లతో సౌర థర్మల్ సంగ్రహణ ప్రాంతం ఏర్పాటైంది.
 
 శక్తి స్వయం సమృద్ధి:
 దేశ వ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో శక్తి స్వయం సమృద్ధి సాధించడానికి సౌరశక్తి విస్తరణ చాలా కీలకం. ఆఫ్‌గ్రిడ్ సౌర పరికరాల ద్వారా ప్రతి ఇంటిలో శక్తి లభ్యత పెరుగుతుంది. సౌర ఇంటి దీపాలు, వీధి దీపాలు, సోలార్ కుక్కర్లు, వాటర్ హీటర్ల వినియోగాన్ని విస్తరించగలిగితే చాలు, శక్తి సమృద్ధిలో ఎంతో మెరుగుదల నమోదవుతుంది. ఇందుకోసం ప్రజల్లో సౌరశక్తి పట్ల అవగాహనతో పాటు చైతన్యం తీసుకురావడం తప్పనిసరి. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక బృందాలు, సూక్ష్మ రుణాల ద్వారా మరింత విస్తరించవచ్చు. పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రజల్లో చైతన్యం తప్పనిసరి. ప్రధానంగా వాణిజ్య సముదాలు, స్కూళ్లు, పార్కుల్లో సౌరశక్తిని మరింత ప్రోత్సహించాలి. ఈ రంగాల్లో టెక్నాలజీ, పరికరాల కోసం ఇతర దేశాలపై ప్రస్తుతం అధికంగా ఆధారపడుతున్నాం. కాబట్టి ఈ రంగానికి కావల్సిన పరికరాలను దేశీయంగా అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యతనివ్వడంతోపాటు ఈ రంగంలో విద్యా కోర్సులను కూడా ప్రారంభించాలి.
 
 అవరోధాలు:
 20-60 మెగావాట్ల సౌరశక్తి ఉత్పత్తికి చదరపు కిలోమీటరు భూమి కావాలి. ఇది 250 ఎకరాలతో సమానం. అసలే స్థలాభావ సమస్య దేశాన్ని పట్టిపీడిస్తోంది.  స్థలం కొనుగోలు చేయాలంటే ఆర్థిక భారం. ఒకవేళ తప్పనిసరిగా కొన్నా ఆ స్థలం విలువను మించి అధికంగా సౌర శక్తి ఉత్పత్తి చేయాలి. ఇది మన ముందున్న ప్రధాన అవరోధం.
 
 అవకాశాలు:
 గ్రామీణ భారతదేశంలో ఇప్పటికీ పూర్తిస్థాయిలో విద్యుత్ సౌకర్యం లేదు. ఉన్నా నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందడం లేదు. 2004 నాటికి దేశంలో 80 వేలకు పైగా గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదు. వీటిలో 18 వేల గ్రామాలకు విద్యుత్‌ను అందించలేని పరిస్థితి. ఇలాంటి పల్లెలకు సౌర వెలుగులే ప్రత్యామ్నాయం.
 
 సర్కారు చొరవే తారకమంత్రం:
 సోలార్ శక్తిని అందరికీ దరిచేర్చే లక్ష్యంతో భారత ప్రభుత్వం పలు రూపాల్లో వ్యూహాలను అనుసరిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి చాలవు. సామాన్యుడు సైతం సోలార్ వెలుగుల్లో విహరించేలా చర్యలు చేపట్టాలి. గృహ సముదాయాల పైకప్పులపై ఫోటో వోల్టాయిక్ ప్యానల్‌లను అమర్చుకునే దిశగా ప్రోత్సహించాలి. ఇప్పుడు టె లికమ్యూనికేషన్‌లో విప్లవం సాధించినట్లే సోలార్ పరిశ్రమను విస్తృతం చేయాలి.
 
 సోలార్ శక్తి వినియోగంలో  అగ్ర దేశాలు
 దేశం    సామర్థ్యం  గిగావాట్లలో
 జర్మనీ    35.5
 చైనా    18.3
 ఇటలీ    17.6
 జపాన్    13.6
 అమెరికా    12
 స్పెయిన్    5.6
 ఫ్రాన్స్    4.6
 ఆస్ట్రేలియా    3.3
 బెల్జియం    3
 యూకే    2.9
 భారత్    2.3
 
 సోలార్ శక్తి వినియోగంలో అగ్ర రాష్ట్రాలు
 రాష్ట్రం    సామర్థ్యం  మెగావాట్లలో
 గుజరాత్    860.40
 రాజస్థాన్    666.75
 మహారాష్ట్ర    237. 25
 మధ్యప్రదేశ్    195.315
 ఆంధ్రప్రదేశ్
 (ఉమ్మడి)    92.9
 
 సౌర శక్తి ఉత్పత్తి లక్ష్యం    (మెగావాట్లలో)
 2005    6.4
 2010    10
 2011    468.3
 2014 జనవరి    2,208.36
 2022    20 వేలు
- సి. హరికృష్ణ
 సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement