ఉరిమి ఉరిమి ఎక్కడో పడిందని.. రష్యా, అమెరికా పంతాలకు పోవడం తమకు చేటు తెస్తుందని సన్నకారు యూరప్ దేశాలు భయపడుతున్నాయి. ఉక్రెయిన్ వంకతో అమెరికా ఆంక్షలు పెంచితే ప్రతిగా రష్యా సహజవాయువు సరఫరా నిలిపివేయవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆంక్షలకు నిరసనగా యూరప్‌కు రష్యా మొత్తం గ్యాస్ సరఫరా నిలిపివేస్తుందా? అలాంటప్పుడు యూరప్‌లో ఇంధన సంక్షోభం తప్పదా? చూద్దాం..
ఉక్రెయిన్‌ను రష్యా ఆక్రమిస్తే తమకు ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని యూరప్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఉక్రెయిన్‌ను ఆక్రమిస్తే రష్యాపై యూఎస్ ఆంక్షలు తీవ్రతరం చేస్తుందని, ఇందుకు ప్రతిగా యూరప్‌కు సరఫరా అయ్యే సహజవాయువును రష్యా నిలిపివేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యూరప్ దేశాలు సహజవాయువు కోసం రష్యాపై ఆధారపడుతున్నాయి, యూరప్ సహజవాయు అవసరాల్లో మూడింట ఒక వంతు రష్యా సరఫరా తీరుస్తోంది. పైగా ప్రస్తుతం యూరప్ వద్ద సహజవాయు నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. రష్యా గ్యాస్ సరఫరా నిలిపివేస్తే తాము ఎగుమతి చేస్తామని అమెరికా యూరప్‌కు హామీ ఇస్తోంది.
అయితే రష్యా నుంచి సరఫరా అయినంత సులభంగా అమెరికా నుంచి గ్యాస్ దిగుమతి చేసుకోవడం కుదరదు. ఈ నేపథ్యంలో యూరప్‌లో ఇంధన సంక్షోభ భయాలు పెరుగుతున్నాయి. గతేడాది శీతాకాలం తీవ్రత అధికంగా ఉండడంతో యూరప్‌లోని సహజవాయు నిల్వలు చాలావరకు ఖర్చయ్యాయి. పలు దేశాల్లో పునర్వినియోగ ఇంధన ఉత్పత్తి తక్కువగా ఉంది. మరోపక్క అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు దూసుకుపోతున్నాయి. ఇవన్నీ కలిసి తమను అంధకారంలోకి నెట్టవచ్చని పలు చిన్నాచితకా యూరప్ దేశాలు భయపడుతున్నాయి.
పూర్తి నిలుపుదల సాధ్యం కాదా?
ఆంక్షలను వ్యతిరేకిస్తూ రష్యా సహజవాయు సరఫరా నిలిపివేయాలనుకున్నా, పూర్తి ఎగుమతులను నిలిపివేయడం సాధ్యం కాదని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు రష్యా అధికారులు గ్యాస్ సరఫరా నిలిపివేయడంపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రష్యాకు గ్యాస్ ఎగుమతుల వల్ల చాలా ఆదాయం వస్తోంది. ఇటీవలే ఆ దేశం చైనాతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. అయినా యూరప్ నుంచే రష్యాకు అధికాదాయం లభిస్తోంది. అలాంటప్పుడు పూర్తిగా యూరప్‌కు ఎగుమతి ఆపితే అది తిరిగి రష్యా ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీసే ప్రమాదం ఉందన్నది నిపుణుల మాట.
గతేడాది యూరప్‌కు రష్యా 1.75 లక్షల కోట్ల క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను సరఫరా చేసింది. ఇందులో పావుభాగాన్ని పైప్‌లైన్స్ ద్వారా పంపింది. ఆంక్షలు ముమ్మరమైతే ఉక్రెయిన్ నుంచి వెళ్లే పైప్‌లైన్ సరఫరాను మాత్రం రష్యా నిలిపివేయవచ్చని యూఎస్ మాజీ దౌత్యాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇది నేరుగా జర్మనీపై ప్రభావం చూపుతుంది. అప్పుడు జర్మనీకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రష్యా నార్డ్ స్ట్రీమ్ పైప్‌లైన్ గుండా గ్యాస్‌ను సరఫరా చేసేందుకు ముందుకువస్తుందని, ఇది యూఎస్‌కు మరింత కోపాన్ని తెప్పించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
యూఎస్ సాయం
ప్రపంచంలో అత్యధిక సహజవాయువు ఉత్పత్తిదారుల్లో ఒకటైన అమెరికా, గ్యాస్ ఎగుమతుల్లో కూడా ముందంజలో ఉంది. కానీ యూరప్‌కు అమెరికా సాయం పరిమితంగానే ఉండవచ్చని నిపుణుల అంచనా. రష్యా సరఫరాలను మించి యూరప్‌కు అమెరికా గ్యాస్‌ను పంపాలన్నా భౌగోళిక ఇబ్బందులున్నాయి. అందువల్ల ప్రస్తుతం కన్నా కొంతమేర ఎగుమతులను పెంచడం మాత్రమే యూఎస్ చేయగలదు. అందుకే ఉత్తర ఆఫ్రికా, మధ్యాసియా, ఆసియాల్లోని తన మిత్రపక్షాల నుంచి యూరప్‌కు సరఫరా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని బైడెన్ ప్రభుత్వం భావిస్తోంది. అలాగే పేద దేశాలకు ఎగుమతి చేసే నిల్వలను అధిక ధరల ఆశ చూపి యూరప్‌కు మరలిస్తోంది. ఉక్రెయిన్ పైప్‌లైన్ సరఫరాను రష్యా నిలిపివేస్తే యూరప్ దేశాలకు రోజుకు 1.27 షిప్పుల గ్యాస్‌ను యూఎస్ అదనంగా అందించాల్సిఉంటుంది. యూరప్‌కు సరఫరా పెంచితే స్వదేశంలో కొరత ఏర్పడవచ్చని కొందరు అమెరికా సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రష్యా ఇప్పటికే పరోక్షంగా గ్యాస్ సరఫరాను నియంత్రిస్తోందని, అందుకే మార్కెట్లో సహజవాయువు ధర పెరుగుతోందని ఇంధన రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందుకే చాలారోజులుగా యూరప్ దేశాల్లో ఇంధన బిల్లులు పెరిగిపోతున్నాయని చెప్పారు. ఈ సమస్యను ప్రజలపై పడకుండా చూసేందుకు పలు దేశాలు సబ్సిడీలను అందిస్తున్నాయి. పరిస్థితులను చక్కదిద్దేందుకు గ్యాస్ ఉత్పత్తి మరింత పెంచాలని అమెరికా యత్నిస్తోంది. అమెరికా ప్రయత్నాలు ఫలిస్తాయా? రష్యా నిజంగానే గ్యాస్ సరఫరా నిలిపివేస్తుందా? తేలాలంటే ఉక్రెయిన్ పీటముడి వీడాల్సిఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment