
జెన్స్ స్టోల్టెన్‌బర్గ్; బలగాల మోహరింపును చూపే శాటిలైట్ చిత్రం
కీవ్: ఉక్రెయిన్ సరిహద్దుల్లో సైనిక బలగాల కదలికలపై ప్రపంచాన్ని రష్యా తప్పుదోవ పట్టిస్తోందని నాటో కూటమి దేశాలు ఆరోపించాయి. సరిహద్దుల నుంచి కొన్ని బలగాలను వెనక్కు పంపుతామని అసత్యాలు ప్రచారం చేస్తోందని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ విమర్శించారు. బలగాలు ఉపసంహరిస్తామని చెబుతూ మరో 7వేలకు పైగా బలగాలను సరిహద్దుల్లోకి రష్యా తరలించిందని యూఎస్, మిత్రపక్షాలు ఆరోపించాయి.
శాటిలైట్ చిత్రాల్లో రష్యా బలగాల మోహరింపు పెరిగినట్లు తెలుస్తోందని మాక్సర్ టెక్నాలజీస్ అనే వాణిజ్య సంస్థ తెలిపింది. మరోవైపు ఉక్రెయిన్ సరిహద్లుల్లో ఉద్రిక్తతలు గురువారం కూడా కొనసాగాయి. ఉక్రెయిన్ బలగాలకు, రష్యా మద్దతున్న వేర్పాటువాదులకు మధ్య ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో దాడులు జరిగాయి. ఉక్రెయిన్ సరిహద్దుల్లో దాదాపు 1.5 లక్షల మంది బలగాలను రష్యా మోహరించింది. అయితే చర్చలకు తాము సిద్ధమని, ఆక్రమణ ఉద్దేశాలు లేవని, కొంతమేర బలగాలను ఉపసంహరిస్తున్నామని రష్యా వారం ఆరంభంలో పక్రటించింది.
అయితే రష్యా మాటలు కార్యరూపం దాల్చలేదని నాటో చీఫ్ ఆరోపించారు. రష్యా చెప్పేదానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, తాజాగా 7వేల బలగాలను సరిహద్దుకు తరలించిందని బ్రిటన్ డిఫెన్స్ సెక్రటరీ బెన్ వాలెస్ చెప్పారు. ఎలాంటి బలప్రయోగం జరిగినా రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలని హెచ్చరించారు. రష్యా బలగాల ఉపసంహరణ తప్పుడు సమాచారమని బ్రిటన్ సాయుధ బలగాల మంత్రి జేమ్స్ హ్యాపీ విమర్శించారు. ఇప్పటికీ ఉక్రెయిన్ ఆక్రమణ అవకాశాలు అధికంగానే ఉన్నాయని నాటోదేశాలు భావిస్తున్నాయి. అందుకే ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు బలగాలను తరలిస్తున్నాయి. ఉక్రెయిన్ మాత్రం చర్చలతో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. నాటోలో తమ చేరికను కొన్ని సభ్యదేశాలు అంగీకరించడంలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు చెప్పారు.
ఏ క్షణమైనా ఉక్రెయిన్ ఆక్రమణ
ఉక్రెయిన్‌ను రష్యా ఆక్రమించడం ఏ క్షణమైనా జరగవచ్చని వైట్‌హౌస్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. మాస్కోకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలను ఏకం చేసేందుకు ఉద్దేశించిన మ్యూనిచ్ సదస్సుకు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్‌ను అధ్యక్షడు బైడెన్ పంపిస్తారని తెలిపాయి. ఈనెల 18– 20లో మ్యూనిచ్ సదస్సు జరగనుంది.
రష్యా వ్యతిరేక ప్రదర్శనలు
ఉక్రెయిన్‌ను రష్యా ఆక్రమించడం ఖాయమని పాశ్చాత్య దేశాలు చెబుతున్న నేపథ్యంలో ఉక్రేనీయులు రష్యాకు వ్యతిరేకంగా తమ దేశ జెండాలతో ప్రదర్శనలు నిర్వహించారు. ఉక్రెయిన్ బలగాలు ప్రజలను చంపేస్తున్నాయని, అమెరికాతో కలిసి ఉక్రెయిన్ సొంత ప్రజలపై రసాయన ఆయుధాలు ప్రయోగిస్తోందని రష్యా మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఉక్రెయిన్‌ను ఆక్రమించే ముందు రంగం సిద్ధం చేయడానికి రష్యా ఇలాంటి కథనాలు వెలువరిస్తోందని యూఎస్ ఆరోపించింది. రష్యాతో బలమైన మిలటరీ భాగస్వామ్యం కొనసాగిస్తామని వెనిజులా ప్రకటించింది.
ఇండియా మద్దతు మాకే..
ఒకవేళ రష్యా గనుక ఉక్రెయిన్‌పై దాడికి పాల్పడితే భారత్ తమ పక్షానే నిలుస్తుందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘క్వాడ్’ దేశాల విదేశాంగ మంత్రుల సదస్సులో రష్యా, ఉక్రెయిన్ అంశంపై విస్తృతంగా చర్చ జరిగిందని, దౌత్యమార్గాల ద్వారా శాంతియుత పరిష్కారం అవసరమని ఏకాభిప్రాయానికి వచ్చామన్నారు.
ఉక్రెయిన్ నుంచి తక్షణ తరలింపుల్లేవు!
ఉక్రెయిన్ నుంచి భారతీయులను తక్షణమే స్వదేశానికి తరలించే యోచన లేదని భారత విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. ఉక్రెయిన్‌లో నివసిస్తున్న భారతీయుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని, ప్రస్తుతం దానిపైనే దృష్టి పెట్టామని తెలిపింది. నాటో, రష్యా మధ్య చర్చలతోనే ఈ సమస్యకు పరిష్కారమని విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ చెప్పారు. కీవ్‌లోని భారతీయ ఎంబసీ అక్కడి భారతీయ విద్యార్థులతో టచ్‌లో ఉందనిచెప్పారు.
ఉక్రెయిన్‌లో నివసించే భారతీయులు తాత్కాలికంగా ఆ దేశాన్ని వీడాలని గత మంగళవారం భారత్ సూచించింది. మరోవైపు ఉక్రెయిన్, భారత్ మధ్య తిరిగే విమానాల సంఖ్యపై విధించిన పరిమితులను పౌరవిమాన యాన శాఖ తొలగించింది. ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా ఇరు దేశాల మధ్య తిరిగే విమనాలు, వాటిలో సీట్ల సంఖ్యపై ఇంతవరకు పరిమితులున్నాయి. వీటిని తాజాగా తొలగించారు. వీలైనంత మంది భారతీయులు స్వదేశానికి తొందరగా వచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment