Ukraine Border Crisis: ఉక్రెయిన్ సరిహద్దు పరిణామాలు ఒక్కసారిగా వేడేక్కాయి. రేపు ఏం జరగబోతుందో అనే ఆందోళన ప్రపంచమంతా నెలకొంది. ఉక్రెయిన్ ఆక్రమణలో భాగంగా బుధవారం రష్యా బలగాలు దాడికి దిగుతాయని తమకు పక్కా సమాచారం అందినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలన్ స్కీ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు అమెరికా సైతం ఇదే హెచ్చరికను జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఉక్రెయిన్ సరిహద్దులోని కొన్ని రష్యన్ దళాలు వెనక్కి వచ్చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ కాసేపటి క్రితం అధికారిక ప్రకటన వెలువరించింది. అయితే ఇది వెనక్కి తగ్గే చర్యలో భాగమా? లేదా? అనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు డ్రిల్ పూర్తైందని, బలగాలు కొన్నింటిని వెనక్కి రప్పించామని మాత్రమే రష్యా రక్షణ శాఖ ప్రతినిధి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సరిహద్దు ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ పశ్చిమ భాగంలో లక్షకు పైగా సైన్యంతో మోహరించిన రష్యా.. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం ఉదయం నుంచి చాలావరకు సైన్యాన్ని? బేస్‌కు రప్పించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంత మేర సైన్యాన్ని వెనక్కి రప్పించింది, ఎందుకు రప్పించింది అనే విషయాలపై రాత్రికల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
జర్మనీ చర్చల నేపథ్యంలో?
ఇదిలా ఉండగా.. దౌత్యపరమైన చర్చల్లో భాగంగానే రష్యా ఈ నిర్ణయం తీసుకుందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రష్యాకు గత మూడు రోజులుగా ఈ వ్యవహారంలో జర్మనీ మెత్తగా హెచ్చరికలు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. జర్మన్ ఛాన్స్లర్ ఒలప్ స్కోల్జ్ ఇవాళ మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే దళాల వెనక్కి నిర్ణయం తీసుకుందేమోనన్న వాదనా వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ సరిహద్దు పరిణామాలు రష్యా చేష్టలతో వేడేక్కుతున్నాయి. ఒకవైపు రష్యా బలగాల మోహరింపు చేస్తుంటే.. అమెరికా, బ్రిటన్ ఇతర దేశాలు మాత్రం దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయి.
అప్రమత్తమైన భారత్
India Alert It's Citizens In Ukraine: ఉక్రెయిన్‌లో పరిస్థితులు వేడెక్కిన తరుణంలో.. భారతీయులు స్వదేశానికి వచ్చేయాలని పేర్కొంది. ప్రధానంగా ఉక్రెయిన్‌లో ఉండడం తప్పనిసరికాని భారతీయులు వెంటనే భారత్ వచ్చేయాలని సూచించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి ఈ ప్రకటన విడుదలయింది. రేపు(బుధవారం) ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశం ఉందని అమెరికా కూడా ఇప్పటికే ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో యూనిటీ డేగా శాంతి ర్యాలీలు నిర్వహించాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒక ప్రకటన సైతం వెలువరించడం గమనార్హం.
ఉక్రెయిన్‌తో సహా మాజీ సోవియట్ యూనియన్ దేశాలకు నాటో సభ్యత్వం ఇవ్వకూడదంటూ పశ్చిమ దేశాలను రష్యా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే.. ఉక్రెయిన్ ఆక్రమణకు రష్యా సిద్ధపడింది.
Comments
Please login to add a commentAdd a comment