Ukraine crisis
-
ఆ ఆలోచన తక్షణం మానుకోవాలి.. రష్యాకు బైడెన్ తీవ్ర హెచ్చరికలు
మాస్కో: యుద్ధ భయాలు కాస్త నెమ్మదించినా ఉక్రెయిన్ కేంద్రంగా ఇటు రష్యా, అటు నాటో, అమెరికా, పశ్చిమ దేశాల మధ్య మాటల మంటలు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్‌కు మూడువైపులా లక్షన్నర దాకా సైన్యాన్ని మోహరించి యుద్ధ భయాలను అమాంతం పెంచేసిన రష్యా, సరిహద్దుల నుంచి మరిన్ని దళాలను, ఆయుధాలను వెనక్కు మళ్లిస్తున్నట్టు బుధవారం పేర్కొంది. సాయుధ వాహనాలతో కూడిన రైళ్లు క్రిమియా నుంచి వెనుదిరుగుతున్న వీడియోలను ఆ దేశ రక్షణ శాఖ విడుదల చేసింది. కానీ అలాంటిదేమీ జరుగుతున్నట్టు కన్పించడం లేదని నాటో, అమెరికా, ఇంగ్లండ్ సహా యూరప్ దేశాలు పెదవి విరుస్తున్నాయి. కోలుకోలేనంతటి తీవ్ర ఆంక్షలు: బైడెన్ ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగే ఆలోచనలను రష్యా తక్షణం మానుకోవాలని బైడెన్ అన్నారు. దాడికి దిగితే ఎదుర్కొనేందుకు ప్రపంచమంతటినీ కూడగడతామని స్పష్టం చేశారు. ‘‘నిర్ణాయక రీతిలో స్పందించి తీరతాం. సుదీర్ఘకాలం పాటు తేరుకోలేనంతగా రష్యాపై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తాం’’ అంటూ ఘాటుగా హెచ్చరించారు. ‘‘యుద్ధ ముప్పు అలాగే ఉంది. కనీసం లక్షన్నరకు పైగా రష్యా దళాలు ఉక్రెయిన్ సరిహద్దుల్లోనే ఉన్నాయి. అందుకే పరిస్థితులు దిగజారకముందే ఉక్రెయిన్ నుంచి వచ్చేయాలని అక్కడున్న అమెరికన్లకు సూచించా. మా రాయబార కార్యాలయాన్ని కీవ్ నుంచి పశ్చిమ ఉక్రెయిన్‌కు మార్చాం. రష్యా ఎలాంటి చర్యకు దిగినా దీటుగా ఎదుర్కొనేందుకు అమెరికా సిద్ధంగా ఉంది’’ అని స్పష్టం చేశారు. అయితే యూరప్ భద్రత, సుస్థిరతను మెరుగుపరిచేందుకు రష్యాతో, అక్కడి మా మిత్రపక్షాలతో మాట్లాడేందుకు ఎప్పుడూ సిద్ధమేనన్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకే చివరిదాకా ప్రయత్నిస్తామంటూ ముక్తాయించారు. చదవండి: (భీకర వర్షాలు.. 58 మంది మృతి) అది పిచ్చితనం: రష్యా రష్యా మాత్రం ఉక్రెయిన్‌పై తాము దాడి చేస్తామన్న పశ్చిమ దేశాల అనుమానాలను ‘పిచ్చితనం’గా అభివర్ణించింది. తమకా ఉద్దేశమే లేదని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు రష్యా ఫైటర్ జెట్లు బుధవారం ఉక్రెయిన్ పొరుగు దేశమైన బెలారస్లో జోరుగా సంయుక్త యుద్ధ విన్యాసాలు జరిపాయి. అయితే ఆదివారం విన్యాసాలు ముగుస్తూనే రష్యా దళాలన్నీ తమ దేశం వీడతాయని బెలారస్ అంటోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమ దేశాలతో చర్చల కోసం అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ యూరప్ బయల్దేరి వెళ్లారు. ఢిల్లీలో కంట్రోల్ రూమ్ న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లోని భారతీయులు ఆందోళన పడాల్సిన పని లేదని కేంద్రం పేర్కొంది. వారందరినీ వెనక్కు తీసుకొచ్చేందుకు అవసరమైతే అదనపు విమానాలు ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం ఎయిరిండియాతో పాటు పలు ఎయిర్‌లైన్స్‌ను ఇప్పటికే సంప్రదిస్తున్నట్టు తెలిపింది. ఈ విషయమై అవసరమైన సాయం అందించేందుకు బుధవారం ఢిల్లీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. తమను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు, మెయిల్ ఐడీ తదితరాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ కూడా నిరంతరం అందుబాటులో ఉండే హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. ఉక్రెయిన్‌లో 18 వేల మంది దాకా భారత స్టూడెంట్లు ఉన్నట్టు 2020 అధికారిక లెక్కలు చెబు తున్నా కరోనా నేపథ్యంలో వీరిలో చాలా మంది స్వదేశం వచ్చేసి ఉంటారని భావిస్తున్నారు. -
Ukraine Crisis: వచ్చేయ్ అంటున్నారు.. ఎలా రమ్మంటారు?
ఉక్రెయిన్ సరిహద్దు పరిస్థితులు.. భారత విద్యార్థులకు గండంలా దాపురించాయి. ఏ క్షణమైనా రష్యా దాడి చేసే అవకాశం ఉందంటూ అమెరికా అదే పాట పాడుతోంది. ఈ క్రమంలో అవసరం లేనివాళ్లు.. ముఖ్యంగా విద్యార్థులు అక్కడి నుంచి భారత్‌కు వచ్చేయాలంటూ.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని భారత ఎంబసీ ద్వారా కేంద్ర విదేశాంగ శాఖ సూచించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ హెచ్చరిక చాలా ఆలస్యంగా వచ్చిందంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అక్కడున్న భారత విద్యార్థులు. ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్ పట్టుకుని భారత్‌కు వచ్చేయాలని ప్రయత్నిస్తున్న విద్యార్థులకు.. ఉక్రెయిన్ ఎయిర్పోర్ట్ దగ్గర వరుస షాకులు తగులుతున్నాయి. ఫిబ్రవరి 20 దాకా భారత్‌కు వెళ్లే విమానాలే లేవని అక్కడి అధికారులు చెప్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఈ కొరతను అదనుగా చూసుకుని ట్రావెల్ ఏజెంట్లు చెలరేగిపోతున్నారు. భారీగా రేట్లు పెంచేసి భారతీయ విద్యార్థుల్ని బెంబేలెత్తిస్తున్నారు. ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులకు టికెట్ల ధరల రూపంలో షాక్ తగులుతోంది. సాధారణ రోజుల్లో టికెట్ ధర మన కరెన్సీలో 21,000రూ. నుంచి 26,000 రూ. మధ్య ఉంటుంది. కానీ, రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతల నడుమ రేట్లు అమాంతం పెరిగాయి. ఎంతలా అంటే.. ప్రస్తుతం టికెట్ ధర 50 వేల రూ. నుంచి లక్ష మధ్య పలుకుతోంది. అంటే దాదాపు నాలుగు రెట్లు రేట్లు పెరిగాయన్నమాట. మొత్తంగా ఈ సంక్షోభాన్ని క్యాష్ చేసుకునేందుకే ట్రావెల్ ఏజెంట్లు ప్రయత్నిస్తున్నారని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. వెళ్లిపోమ్మన్నారు సరే.. ఉక్రెయిన్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య.. 18 వేలకు పైనే. ప్రధానంగా మెడిసిన్ కోసం వెళ్లిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. అయితే వెనక్కి వచ్చేయండంటూ చెప్పిన భారత ప్రభుత్వం, పరిస్థితిని పర్యవేక్షిస్తున్న భారత ఎంబసీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై నిరసన వ్యక్తం అవుతోంది. గత కొన్ని వారాలుగా పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్నా.. భారత ప్రభుత్వంలో తమ పౌరుల పట్ల చలనమే లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అసలు ఉక్రెయిన్ నుంచి భారత్‌కు వారానికి ఉండేది ఒకే ఒక్క ఫ్లైట్. అదీ వన్ స్టాప్ ఫ్లైట్ కావడంతో భారీ డిమాండ్ ఉంటోంది. దీనికి తోడు టికెట్ రేట్లు పెరిగిపోవడంతో.. విద్యార్థుల్లో ఆందోళన నెలకొంటోంది. అందుకే చాలామంది అక్కడే ఉండిపోవాలని అనుకుంటున్నారు. మరోవైపు కొన్ని యూనివర్సిటీలు ఈ సంక్షోభ సమయంలోనూ క్లాసులు నిర్వహిస్తుండడం కొసమెరుపు కాగా.. స్వదేశానికి వచ్చేస్తే తమ చదువు మధ్యలోనే ఆగిపోతుందనే ఆందోళనలో ఉన్నారు మరికొందరు విద్యార్థులు. పేరెంట్స్ ఆందోళన ఉక్రెయిన్‌లోని తమ పిల్లల భద్రతపై భారత్‌లోని తల్లిదండ్రులు, బంధువుల్లో ఆందోళన నెలకొంటోంది. పరిస్థితి ఏ క్షణమైనా విషమించే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో అది మరింత పెరుగుతోంది. గుజరాత్ సహా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పేరెంట్స్ అసోషియేషన్లు తమ పిల్లలను క్షేమంగా వెనక్కి రప్పించాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నాయి. అయితే కేంద్ర విదేశాంగ శాఖ మాత్రం ఆందోళన చెందొద్దని ధైర్యం చెబుతోంది. మరోవైపు ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ.. అత్యవసర పరిస్థితుల్లో +380997300483, +380997300428 నెంబర్లను సంప్రదించాలని, అవసరమైతే cons1.kyiv@mea.gov.in మెయిల్ ఐడీ ద్వారా సాయం కోరవచ్చని సూచిస్తోంది. -
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం.. అనూహ్య పరిణామం!
Ukraine Border Crisis: ఉక్రెయిన్ సరిహద్దు పరిణామాలు ఒక్కసారిగా వేడేక్కాయి. రేపు ఏం జరగబోతుందో అనే ఆందోళన ప్రపంచమంతా నెలకొంది. ఉక్రెయిన్ ఆక్రమణలో భాగంగా బుధవారం రష్యా బలగాలు దాడికి దిగుతాయని తమకు పక్కా సమాచారం అందినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలన్ స్కీ ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు అమెరికా సైతం ఇదే హెచ్చరికను జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ సరిహద్దులోని కొన్ని రష్యన్ దళాలు వెనక్కి వచ్చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ కాసేపటి క్రితం అధికారిక ప్రకటన వెలువరించింది. అయితే ఇది వెనక్కి తగ్గే చర్యలో భాగమా? లేదా? అనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు డ్రిల్ పూర్తైందని, బలగాలు కొన్నింటిని వెనక్కి రప్పించామని మాత్రమే రష్యా రక్షణ శాఖ ప్రతినిధి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సరిహద్దు ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ పశ్చిమ భాగంలో లక్షకు పైగా సైన్యంతో మోహరించిన రష్యా.. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం ఉదయం నుంచి చాలావరకు సైన్యాన్ని? బేస్‌కు రప్పించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంత మేర సైన్యాన్ని వెనక్కి రప్పించింది, ఎందుకు రప్పించింది అనే విషయాలపై రాత్రికల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జర్మనీ చర్చల నేపథ్యంలో? ఇదిలా ఉండగా.. దౌత్యపరమైన చర్చల్లో భాగంగానే రష్యా ఈ నిర్ణయం తీసుకుందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రష్యాకు గత మూడు రోజులుగా ఈ వ్యవహారంలో జర్మనీ మెత్తగా హెచ్చరికలు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. జర్మన్ ఛాన్స్లర్ ఒలప్ స్కోల్జ్ ఇవాళ మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే దళాల వెనక్కి నిర్ణయం తీసుకుందేమోనన్న వాదనా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ సరిహద్దు పరిణామాలు రష్యా చేష్టలతో వేడేక్కుతున్నాయి. ఒకవైపు రష్యా బలగాల మోహరింపు చేస్తుంటే.. అమెరికా, బ్రిటన్ ఇతర దేశాలు మాత్రం దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయి. అప్రమత్తమైన భారత్ India Alert It's Citizens In Ukraine: ఉక్రెయిన్‌లో పరిస్థితులు వేడెక్కిన తరుణంలో.. భారతీయులు స్వదేశానికి వచ్చేయాలని పేర్కొంది. ప్రధానంగా ఉక్రెయిన్‌లో ఉండడం తప్పనిసరికాని భారతీయులు వెంటనే భారత్ వచ్చేయాలని సూచించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి ఈ ప్రకటన విడుదలయింది. రేపు(బుధవారం) ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశం ఉందని అమెరికా కూడా ఇప్పటికే ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో యూనిటీ డేగా శాంతి ర్యాలీలు నిర్వహించాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒక ప్రకటన సైతం వెలువరించడం గమనార్హం. ఉక్రెయిన్‌తో సహా మాజీ సోవియట్ యూనియన్ దేశాలకు నాటో సభ్యత్వం ఇవ్వకూడదంటూ పశ్చిమ దేశాలను రష్యా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే.. ఉక్రెయిన్ ఆక్రమణకు రష్యా సిద్ధపడింది. -
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగకపోవడానికి అదే కారణమా..?
యుద్ధ మేఘాలు ఎంతగా కమ్ముకున్నా ఉక్రెయిన్‌పై రష్యా ఇప్పటికిప్పుడు యుద్ధానికి దిగకపోవడానికి సహజ వాయువు అంశం కూడా ఒక ముఖ్య కారణంగా కన్పిస్తోంది. యూరప్‌కు అతి పెద్ద గ్యాస్ సరఫరాదారు రష్యానే. యూరప్ గ్యాస్ అవసరాల్లో 40 శాతానికి పైగా తీరుస్తోంది. యూరప్ ఏటా సుమారు 237 బిలియన్ క్యుబిక్ మీటర్ల (బీసీఎం)కు పైగా గ్యాస్ దిగుమతి చేసుకుంటుంటే 2012లో 168 బీసీ ఎం గ్యాస్‌ను ఒక్క రష్యానే సరఫరా చేసింది. ముఖ్యంగా జర్మనీకి 60 శాతం దాకా గ్యాస్ రష్యా నుంచే అందుతోంది. ఇక మధ్య, తూర్పు యూరప్‌లోని పలు దేశాలు తమ గ్యాస్ అవసరాల్లో 90 శాతానికి పైగా రష్యా మీదే ఆధారపడ్డాయి! బాల్టిక్ సముద్రం గుండా జర్మనీ దాకా సాగే నార్డ్ స్ట్రీమ్ 1 పైప్ లైన్ ద్వారా యూరప్‌కు ఏటా 55 బీసీఎం గ్యాస్‌ను రష్యా సరఫరా చేస్తోంది. టర్క్ స్ట్రీమ్ లైన్ల ద్వారా మరో 33 బీసీఎం సరఫరా చేస్తోంది. 110 కోట్ల డాలర్ల ఖర్చుతో తలపెట్టిన కీలకమైన నోర్డ్ స్ట్రీమ్ 2 ప్రాజెక్టు పూర్తియితే జర్మనీకి సరఫరాలను రెండింతలు చేయడం రష్యాకు వీలవుతుంది. యూరప్‌కు చుక్కలే ఈ శీతాకాలంలో యూరప్ తీవ్ర గ్యాస్ కొరతతో అల్లాడుతోంది. ఈ నేపథ్యంలో యుద్ధమే వస్తే గ్యాస్ సరఫరా పూర్తిగా ఆగిపోయి యూరప్ దేశాలు అల్లాడతాయి. ప్రత్యామ్నాయంగా అమెరికా నుంచి గ్యాస్ దిగుమతి చేసుకునే అవకాశమున్నా దూరాభారం తదితరాలన్నీ కలిసి ధరలు చుక్కలను తాకే ప్రమాదముంది. ఎందుకంటే పెరిగిన డిమాండ్‌తో యూరప్ దిగుమతి చేసుకుంటున్న గ్యాస్ ధర ఇప్పటికే ఏకంగా 8 రెట్లు పెరిగింది. 2021లో మెగావాట్‌కు 19 యూరోలుగా ఉన్నది కాస్తా 80 యూరోలైంది. యుద్ధమే వస్తే రష్యా నుంచి సరఫరా ఆగిపోతుంది. యూఎస్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తే కనీసం మరో మూడు రెట్లు అధికంగా వెచ్చించాల్సి ఉంటుందని అంచనా. చదవండి: (ఇంకా యుద్ధ మేఘాలే) యూరప్ దేశాలకు ఇది తలకు మించిన భారమే. మరోవైపు యూరప్‌కు గ్యాస్ సరఫరాను పూర్తిగా ఆపేస్తే రష్యాకు రోజుకు కనీసం 100 కోట్ల డాలర్లకు పైగా నష్టమని అంచనా. పైగా ఒప్పందాలను ఉల్లంఘించినందుకు చెల్లించాల్సి వచ్చే భారీ జరిమానాలు అదనం. అందుకే యుద్ధాన్ని ఎలాగైనా నివారించేందుకు అటు యూరప్ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇటు రష్యా కూడా పైకి దూకుడు ప్రదర్శిస్తున్నా యుద్ధానికి దిగే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. అమెరికా, నాటో కూటమి నుంచి నయానో భయానో తను ఆశించిన హామీలను రాబట్టుకునే ప్రయత్నమే చేస్తోంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఉక్రెయిన్‌పై దండెత్తితే...భారీ మూల్యం తప్పదు
మాస్కో/వాషింగ్టన్: ఉక్రెయిన్ సంక్షోభం ముదురు పాకాన పడుతున్న సూచనలు కన్పిస్తున్నాయి. ఉద్రిక్తతలను చల్లార్చేందుకు అమెరికా, రష్యా అధ్యక్షులు జో బైడెన్, వ్లాదిమిర్ పుతిన్ శనివారం జరిపిన ఫోన్ సంభాషణలు వాడివేడిగా సాగాయి. ఉక్రెయిన్‌పై దాడికి దిగితే రష్యా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని పుతిన్‌ను బైడెన్ తీవ్రస్థాయిలో హెచ్చరించారని వైట్‌హౌస్ వెల్లడించింది. కఠినాతి కఠినమైన ఆర్థిక ఆంక్షలు తదితరాలను ఎదుక్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసినట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. అంతేగాక యుద్ధానికి దిగితే అంతర్జాతీయంగా రష్యా స్థాయి కూడా బాగా దిగజారుతుందని బైడెన్ అభిప్రాయపడ్డట్టు చెప్పింది. ఉక్రెయిన్‌పై దాడికి బుధవారాన్నిముహూర్తంగా రష్యా నిర్ణయించుకుందని యూఎస్ నిఘా వర్గాలు పేర్కొన్న విషయం తెలిసిందే. వీలైనంత త్వరలో మరోసారి పుతిన్‌కు కాల్ చేయాలని బైడెన్ నిర్ణయించినట్టు వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. ఏ క్షణంలోనైనా రష్యా దాడి: సలివన్ ఉక్రెయిన్‌పై రష్యా ఏ క్షణంలోనైనా దాడికి దిగవచ్చన్న వార్తల నేపథ్యంలో పోలండ్‌కు మరో 3,000 మంది సైనికులను తరలించనున్నట్టు అమెరికా శనివారం ప్రకటించింది. వీరంతా వారంలోపు ఇప్పటికే పోలండ్‌లో ఉన్న 1,700 మంది సైనికులతో కలుస్తారు. అలాగే జర్మనీలో ఉన్న 1,000 తమ సైనికులను రొమేనియాకు యూఎస్ తరలించనుంది. 18వ ఎయిర్‌బోర్న్ కారŠప్స్‌కు చెందిన 300 మంది సైనికులు కూడా తాజాగా జర్మనీ చేరుకున్నారు. యూరప్‌లో ఇప్పటికే 80 మంది అమెరికా సైనికులున్నారు. మరోవైపు యుద్ధ భయాల నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని తమ రాయబార కార్యాలయ సిబ్బందిని అమెరికా హుటాహుటిన వెనక్కు పిలుచుకుంటోంది. రాజధాని కీవ్‌లోని యూఎస్ ఎంబసీ సిబ్బందిని కుటుంబంతో సహా వచ్చేయాలని ఆదేశించినట్టు సమాచారం. ఇంగ్లండ్‌తో సహా పలు యూరప్ దేశాలు ఉక్రెయిన్‌లో నుంచి తమ రాయబార సిబ్బందిని వెనక్కు రప్పిస్తున్నాయి. అమెరికా పౌరులు కూడా తక్షణం దేశం వీడాలని అధ్యక్షుని జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ అంతకుముందు సూచించారు. ఉక్రెయిన్‌పై దాడికి పుతిన్ ఏ క్షణంలోనైనా ఆదేశాలివ్వవచ్చని ఆయన అన్నారు. -
‘పైపులైను’లో రెండు కత్తుల బంధం
ఉక్రెయిన్ సంక్షోభం ఫలితంగా రష్యా, చైనాల మధ్య రెండు దశాబ్దాలుగా నలుగుతున్న భారీ గ్యాస్ పైప్‌లైన్ ఒప్పందం కొలిక్కి వచ్చింది. విరుద్ధ ప్రయోజనాలను కలిగిన ప్రత్యర్థి దేశాల మధ్య ఈ ఒప్పందంతో దీర్ఘకాలిక ఆర్థిక, సైనిక, వ్యూహాత్మక బంధానికి రంగం సిద్ధమైంది. అపనమ్మకం, అవిశ్వాసం అంతర్జాతీయ సంబంధాలకు మారుపేరుగా మారిన కాలంలో... ఒక్క ఒరలో ఇమడని కత్తుల్లాంటి ప్రపంచాధిపత్య శక్తులు రష్యా, చైనాల మధ్య దీర్ఘకాలిక ద్వైపాక్షిక ‘సమగ్ర వ్యూహాత్మక సమన్వయ భాగస్వామ్య ఒప్పందం’ కుదిరి, సుదీర్ఘ మైత్రికి పునాదులు పడటం విడ్డూరమే. అయితే ఆ ఖ్యాతి మాత్రం... చైనాను ఏకాకిని చేసే ‘ఆసియా వ్యూహాన్నీ’, రష్యా తోక కత్తిరించే ‘యూరోపియన్ వ్యూహాన్నీ’ ఏక కాలంలో అమలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాదే. ఉక్రెయిన్ కొరివితో తల గోక్కున్నది చాలక ఆయన... ఇంధన అవసరాల కోసం రష్యాపై ఆధారపడే స్థితి నుంచి బయటపడాలని యూరోపియన్ దేశాలకు ఆదేశాలు జారీ చేశారు. వాటికి ఈయూలోనే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. అవి అమలవుతాయో లేదో గానీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం ముందుచూపుతో వ్యవహరించారు. 20 ఏళ్లుగా చైనాతో తెగకుండా, ముడిపడకుండా ఉన్న లక్ష కోట్ల డాలర్ల భారీ గ్యాస్ పైప్‌లైన్ ఒప్పందం కుదుర్చుకోడానికి సిద్ధమయ్యారు. ఈ నెల మే 20న చైనా వెళ్లిన పుతిన్ సంతకాలు చేయడం మినహా ఒప్పందాన్ని దాదాపు ఖరారు చేసుకున్నారు. ఈయూ దేశాలకు సరఫరా చేస్తున్నట్టే గ్యాస్ ధరను చమురు ధరతో ముడిపెట్టే పద్ధతిలో ఎల్పీజీని కొనడానికి చైనా ఇంతకాలంగా ససేమిరా అంటోంది. చైనా ప్రధాన షరతులన్నిటికీ అంగీకరించడానికి పుతిన్ నేడు సిద్ధమయ్యారు. రష్యా ప్రభుత్వ సంస్థ ‘గాజ్ప్రోమ్’ సైబీరియాలోని నాలుగు గ్యాస్ క్షేత్రాల నుంచి 2018 నుంచి రోజుకు 375 కోట్ల చదరపు ఘనపు అడుగుల గ్యాస్‌ను చైనాకు కనీసం 30 ఏళ్ల పాటూ సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈయూ దేశాలకు వెయ్యి క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను సగటున 380 డాలర్ల ధరకు విక్రయిస్తుండగా చైనాకు 350 డాలర్ల ధరకే అందించనున్నట్టు సమాచారం. పైగా ఈ ఒప్పందం ప్రపంచంలో ‘గ్యాసో యువాన ్ల’ శకానికి తెరదీసింది. రష్యాకు చెల్లింపులన్నీ చైనా యువాన్లలోనే జరుగుతాయి. రష్యా ఇక గ్యాసో యువాన్ల దిగుమతులకు ప్రాధాన్యం ఇవ్వక తప్పదు. అంటే చైనా, హాంకాంగ్‌ల నుంచి దిగుమతులకు రష్యా దారులు తెరుచుకుంటాయి. హాంకాంగ్‌లోని అంతర్జాతీయ బ్యాంకులన్నీ ఇప్పటికే యువాన్లలో చెల్లింపులు జరుపుతూ దానికి డాలర్, యూరోల సరసన అంతర్జాతీయ మారక ద్రవ్యంగా పీట వేశాయి. చైనా నుంచి వచ్చే రాబడులు ఆర్థిక తిరోగమనంలో ఉన్న రష్యా వృద్ధి బాటపట్టడానికి తోడ్పడతాయి. అంతకు మించి అది సైబీరియాను భారీ అంతర్జాతీయ గ్యాస్ కేంద్రంగా మార్చనుంది. చైనాకు నిర్మిస్తున్న పైపులైను ద్వారానే జపాన్, దక్షిణ కొరియాలకు గ్యాస్ సరఫరా చేయడానికి ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయి. సైబీరియా తూర్పు కొసన ఉన్న సఖాలిన్ గ్యాస్ క్షేత్రం నుంచి ఆ రెండు అమెరికా మిత్ర దేశాలకు రష్యా గ్యాస్ సరఫరా చేస్తోంది. ఆ పాత పైప్లైన్లను నూతన నిర్మాణంతో అనుసంధానించడమే గాక, దక్షిణ కొరియా ద్వారా నైరుతి ఆసియానంత టినీ రష్యా తన గ్యాస్ వలలోకి తేనుంది. ఉక్రేనియన్ సంక్షోభంలో రష్యాను ఏకాకిని చేయడంలో జపాన్ సహా ఏ ఒక్క ఆసియా దేశం అమెరికాకు మద్దతు పలకక పోవడంలో విడ్డూరం లేదు! ప్రపంచాధిపత్య శక్తిగా ఎదగాలని తపిస్తున్న చైనా, ఇంకా అగ్రరాజ్యాన్ననే భావిస్తున్న రష్యా విడివిడిగా ఆసియాపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూ వచ్చాయి. చైనా, జపాన్ తదితర దేశాలతో కయ్యానికి కాలు దువ్వి దారికి రప్పించుకునే వ్యూహం అనుసరిస్తోంది. ఆ దేశాలతో గ్యాస్ బంధం పటిష్టం చేసుకుని చైనా, అమెరికాలకు వ్యతిరేకంగా రష్యా కూటమిని నిర్మించే దూరదృష్టితో రష్యా పావులు కదుపుతోంది. అలాగే చైనా అజర్బైజాన్, తుర్క్‌మెనిస్థాన్‌లతో నెయ్యం నెరపుతోంది. ఇలా ఉండగా అమెరికా ఆసియాలో చైనాను ఏకాకిని చేసే ఆసియా వ్యూహాన్ని మొదలు పెట్టింది. అది చాలదని ‘ఉక్రెయిన్’ దుస్సాహసానికి పాల్పడింది. దీంతో భావి ప్రత్యర్థులు ఒద్దికగా కలిసి కాపురం చేయడానికి సిద్ధపడక తప్పలేదు. రష్యా, చైనాకు సరఫరా చేయబోయే గ్యాస్ ఆ దేశం మొత్తం గ్యాస్, చమురు దిగుమతుల్లో 30 శాతం. అంటే కనీసం మూడు దశాబ్దాల పాటూ ఒకరి పిలక ఒకరికి చిక్కిందనే అర్థం. కాబట్టే 2018 నాటికి సిద్ధం కానున్న రష్యన్ ‘స్టార్‌వార్’ క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్-500ల కోసం బేరసారాలు మొదలయ్యాయి. ఆలోగా అత్యాధునికమైన సుఖోయ్ సు-35 జెట్‌ఫైటర్ల అమ్మకం తుది దశకు చేరింది. చైనా ఏవియేషన్ పరిశ్రమలో రష్యా భాగస్వామి కాబోతోంది. ఇక వాణిజ్య ఒప్పందాల గురించి చెప్పనవసరం లేదు. ఒబామా జోడు గుళ్ల తుపాకీ తుస్సుమన్నా ఇష్టంలేని పెళ్లికి రష్యా, చైనాలను ఠక్కున ఒప్పించేసింది పి. గౌతమ్ -
మే ఎఫెక్ట్ సందేహమే
ముంబై: స్టాక్ మార్కెట్ తీరుతెన్నుల్లో ఎన్నో భిన్న పోకడలుంటాయి. వాటిలో తరచుగా విన్పించేది ‘మేలో అమ్మేయాలి’ అనే సిద్ధాంతం. చరిత్రను పరిశీలిస్తే.. మే నెలలో ఈక్విటీలపై నష్టాలొచ్చాయి. జపాన్ మినహా ఆసియా మార్కెట్లలో ఈ సిద్ధాంతం వాస్తవమని రుజువైంది. గత నాలుగేళ్లలో ఏప్రిల్ 30 - జూన్ 30 మధ్యకాలంలో ఈక్విటీల్లో 5-10 శాతం కరెక్షన్ జరిగిందని క్రెడిట్ సూసీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈసారి కరెక్షన్ జరిగే అవకాశాలు లేకపోవచ్చు. జపాన్ మినహా... జపాన్ మినహా ఆసియా ఈక్విటీల్లో ర్యాలీని మనం ఇప్పటికే చూశాం. ప్రస్తుత స్థాయిల్లో వాల్యుయేషన్లు ఇప్పటికీ చాలా చౌకగానే ఉన్నాయి. జపాన్ మినహా ఎంఎస్సీఐ (మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్) ఆసియా సూచీ ప్రకారం కరెంట్ ప్రైస్ - టు - బుక్ 1.55గా ఉంది. గత ఐదేళ్లలో ఇదే అతి తక్కువ స్థాయి. పన్నెండు నెలల ప్రాతిపదికన చూస్తే నికర విదేశీ కొనుగోళ్లు గత ఐదేళ్లలో తక్కువ స్థాయిలో ఉన్నాయి. అంటే, స్థూల ఆర్థిక వాతావరణం మరింత మెరుగుపడితే విదేశీ ఫండ్ల కొనుగోళ్లు పెరిగి ఈక్విటీలు బుల్లిష్‌గా మారతాయి. ఆసియా మార్కెట్లు నిలకడగా ఉండి, అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ) నుంచి ఈ వారంలో ప్రతికూల వ్యాఖ్యానాలేవీ విన్పించకపోతే భారత్‌లో ఎన్నికల ముందు మార్కెట్ల ర్యాలీ కొనసాగుతుంది. ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్‌తో సహా దిగువ స్థాయిలో ఉన్న కొన్ని సైక్లికల్ స్టాకులపై దృష్టిసారించడం మేలు. 2008 సంక్షోభం తర్వాత నుంచీ దిగువ స్థాయిలో ఉన్న ఆ ఈక్విటీల్లో ఇటీవలే కొంతమేర కొనుగోళ్లు జరుగుతున్నాయి. వచ్చే నెలలో కేంద్రంలో అధికారం చేపట్టనున్న కొత్త ప్రభుత్వం తగిన విధాన సంస్కరణలను అమలుచేస్తే వీటిని కొనుగోలు చేయడం లాభదాయకమవుతుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మే 16న వెలువడనున్నందున వచ్చే రెండు వారాల్లో నిఫ్టీ కదలికలు అటూ ఇటూ ఉండవచ్చు, లేదా పెరగనూ వచ్చు. ఇవన్నీ గమనిస్తే గత నాలుగేళ్ల మాదిరిగా ఈసారి మే ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. -
స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న జోష్
ముంబయి : స్టాక్ మార్కెట్లలో జోష్ కొనసాగుతోంది. నిఫ్టీ సరికొత్త జీవిత కాల గరిష్ఠ స్థాయిని తాకింది. 6574 పాయింట్లను చూసింది. ప్రస్తుతం 45 పాయింట్లు లాభపడుతూ 6,550కి సమీపంలో ట్రేడవుతోంది. సెన్సెక్స్ 160 పాయింట్లు పెరుగుతూ 21,970కి సమీపంలో కొనసాగుతోంది. క్రిమియా రష్యాలో కలిసేందుకు సిద్ధపడటం మార్కెట్లకు కలిసి వస్తోంది. ఎన్డీఏ కూటమి మెజార్టీకి చేరువ అవుతుందనే అంచనా రావడం కూడా మార్కెట్లు లాభపడటానికి కారణమవుతోంది. ఐటీ, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్సులు తప్పించి మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లో ఉన్నాయి. మారుతీ షేరు ఈవాళ దుమ్ము రేపుతోంది. గుజరాత్లో ప్లాంటు ఏర్పాటుపై మైనార్టీ షేర్‌హోల్డర్ల అభిప్రాయం తీసుకుంటామని మారుతీ మేనేజ్మెంట్ ప్రకటించడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లు పెద్ద యెత్తున కొనుగోళ్లు చేస్తున్నారు. ప్రస్తుతం మారుతీ షేరు ధర 8 శాతం దాకా లాభడపతూ 1740 రూపాయలకు సమీపంలో ట్రేడవుతోంది. మరోవైపు బంగారం ధర తగ్గుతోంది. ప్రస్తుతం ఎంసీక్స్లో 10 గ్రాముల ధర 200 రూపాయలు నష్టపోతూ 30,180లకు సమీపంలో ట్రేడవుతోంది. ఔన్స్ బంగారం ధర 1360 డాలర్లకు సమీపంలో కొనసాగుతోంది. -
ప్రచ్ఛన్నయుద్ధంలో ‘డ్రాగన్’ రంగ ప్రవేశం!
ప్రపంచమంతా ఉక్రెయిన్ సంక్షోభంవైపు చూస్తుంటే చైనా కన్ను ఫిలిప్పీన్స్ ఏలుబడిలో ఉన్న దీవులపై పడింది. ఆ దీవులకు వెళ్లే ఫిలిప్పీన్స్ నౌకలను అడ్డగించింది. అమెరికా-ఫిలిప్పీన్స్ మధ్య కుదరబోయే సైనిక ఒప్పందమే ఈ పరిణామానికి కారణం. క్రిమియా ప్రజాభిప్రాయ సేకరణ ఘట్టం తదుపరి ఉక్రెయిన్ సంక్షోభాన్ని అమెరికా, రష్యాలు ఏ మలుపు తిప్పబోతున్నాయోనని ప్రపంచం ఉత్కంఠగా ఎదురు చూస్తూ మరో కీలక పరిణామాన్ని పట్టించుకోలేదు. ఐదు వేల మైళ్ల దూరంలోని దక్షిణ చైనా సముద్రంలో చైనా డ్రాగన్ అమెరికాపైకి పంజా విసిరింది. ఎప్పుడూ జరిగేట్టుగానే మత్తగజాల పోరు లో నలిగి చస్తున్నది ఫిలిప్పీన్స్. మార్చి 9వ చైనా స్ప్రాట్లీ దీవుల వ్యవహారంలో ఫిలిప్పీన్స్‌తో ఉన్న వివాదాన్ని తేల్చిపారేయడానికి సిద్ధమైంది. ఫిలిప్పీన్స్‌తో ఇంత వరకు ఉన్న యథాతథ పరిస్థితి కొనసాగింపునకు మంగళం పాడేసింది. ‘సెకండ్ థామస్ షావోల్’ ప్రాంతంలో నౌక దిగ్బంధాన్నివిధించింది. అక్కడి ఫిలిప్పీన్స్ సేనలకు ఆహారం తదితర సరఫరాలను తీసుకుపోతున్న ఓడలను తిప్పి పంపేసింది. ఫిలి ప్పీన్స్ వెంటనే దురాక్రమణకు స్వస్తి పలకాలంటూ హుకుం జారీ చేసింది. అక్కడి సైనికుల మీద ‘కనికరం’ చూపి గగన తలం నుంచి ఆహారాన్ని అందించడాన్ని అనుమతిస్తోంది. ఇకపై అనుమతిస్తుందా అనేది చెప్పడం లేదు. ఉక్రెయిన్ ‘తిరుగుబాటు’ సంబరంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఉత్సాహ భంగం తప్పింది కాదు. వచ్చే నెలలో ఆయన ఫిలిప్పీన్స్‌లో పర్యటించాల్సి ఉంది. ఫిలిప్పీన్స్ అధ్యక్షురాలు బెనిగినో అక్వినోతో కలసి కీలకమైన సైనిక ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంది. నిజానికి జనవరి 27నే చైనా యథాతథ స్థితికి స్వస్తి పలికింది. షావోల్ నుంచి ఫిలిప్పీన్స్ జాలర్లను చైనా నావికా దళం బెదిరించి పంపే సింది. అప్పటి నుంచి ఫిలిప్పీన్స్ అధ్యక్షురాలు అక్వినోకు చైనాకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌కు పాశ్చాత్య మీడియా తాజాగా ప్రసాదించిన ‘హిట్లర్’ బిరుదును అక్వినో గత నెలలోనే చైనా అధ్యక్షుడు క్సీజింగ్పింగ్కు ప్రసాదించారు. చైనాను కట్టడి చేయాలంటూ అమెరికాను గట్టిగా కోరారు. ఆ నేపథ్యంలోనే ఉక్రెయిన్ సంక్షోభం అదను చూసుకొని అమెరికాకు దడిచేది లేదనే సందేశాన్ని చైనా పంపింది. అయితే చైనా సరికొత్త దూకుడుకు అసలు కారణం అమెరికా, ఫిలిప్పీన్స్ మధ్య కుదరబోతున్న సైనిక ఒప్పందమే. 2020 నాటికి అమెరికా తన నావికా బలంలో 60 శాతాన్ని ఇండో-పసిఫిక్ ప్రాంతానికి తరలించబోతోంది. అందులో గణనీయమైన భాగం ఫిలిప్పీన్స్‌లోని అమెరికా స్థావరాల్లో సమీకరిస్తారు. అందుకు వీలుగా ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక సైనిక ఒడంబడికను విస్తరించి, పొడిగించడానికి అక్వినోను ‘ఒప్పించిన’ తర్వాతే అమెరికా ఆమె మొర ఆలకించింది. గత నెలలో మొదటిసారిగా దక్షిణ చైనా సముద్రంలో ‘రక్షిత’ ప్రదేశాన్ని ప్రకటించిన చైనాను ప్రత్యక్షంగా తప్పుబట్టింది. అమెరికా సైనిక వ్యూహంలోని ఈ మౌలిక మార్పు చైనా ఆట కట్టించే తాపత్రయమేననేది చైనాకు తెలుసు. ఆ ఆటలో కీలక భాగస్వామి జపాన్ కాగా, ఫిలిప్పీన్స్ తొలి బలి పశువు. ఉక్రెయిన్‌లో అమెరికా ఆడుతున్న ఆట 1990 నుంచి అమలవుతున్న రష్యా ‘పని ముగించే’ సుదీర్ఘ వ్యూహంలో చివరి ఘట్టం. 1990 తదుపరి ఏడు ‘వార్సా’ (ఒకప్పటి సోవియట్ యూనియన్ నేతృత్వంలోని కూటమి) దేశాలు, మూడు సోవియట్ రిపబ్లిక్కులు నాటో కూటమిలో భాగమయ్యాయి. ఉక్రెయిన్‌లోని ‘విప్లవ’ ప్రభుత్వం నిలదొక్కుకోవడమే తరువాయి నాటోలో చేరుతుంది. రష్యాతో బాలిస్టిక్ క్షిపణుల ఒప్పందాన్ని బేఖాతరు చేసి అమెరికా ఇప్పటికే పోలాండ్, లాత్వియా, ఇస్తోనియా తదితర ప్రాంతాల్లో ఖం డాంతర క్షిపణులను మోహరించింది. పశ్చిమ దిశ నుంచి రష్యాను చుట్టుముట్టేసే వ్యూహంలో చిట్టచివరి మెట్టు ఉక్రెయిన్. భద్రంగా చేతిలో ఉన్న రొట్టెను ఎప్పుడైనా ఆరగిం చొచ్చు. ఉక్రెయిన్‌లో అంతా అమెరికా అనుకున్నట్టుగా ముగిసిపోతే రష్యాలో ‘ప్రజాస్వామ్య విప్లవం’ ‘జాతుల స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు’ పట్టంగట్టి తినడానికి వీలుగా ‘రొట్టె’ను ఏడు ముక్కలు చేసే పథకాన్ని ‘పెంటగాన్’ జార్జి డబ్ల్యూ బుష్ హయాంలోనే సిద్ధం చేసింది. ఉక్రెయిన్ తర్వాత తన వంతేనని చైనాకు బాగా తెలుసు. అందుకే నేటి నయా కోల్డ్‌వార్‌లో రష్యా ఒంటరిగా లేదంటూ అది దక్షిణ చైనా సముద్రం మీదుగా శ్వేతసౌథానికి సందేశం పంపింది. ఒబామా తేల్చుకోవాల్సింది ఒక్కటే. క్రిమియాలోని 95 శాతం ప్రజలు రష్యాలో భాగంగా ఉండాలంటూ ఇచ్చిన తీర్పును బేఖాతరు చేసి ఇప్పుడే చైనా కొరివితో తలగోక్కోవడమా? లేక అంతర్జాతీయ సేనలంటూ అమెరికా, ఐరాస, రష్యా సేనలను నిలిపి ఉక్రెయిన్ను ‘తటస్థ’ దేశం చేయడ మా? లేక ఉక్రెయిన్ను రెండో, మూడో ముక్కలు చేసి రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌తో కలిసి పంచుకోవడమా? - పిళ్లా వెంకటేశ్వరరావు -
నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్
ఫిబ్రవరి టోకు ధరల ద్రవ్యోల్బణం 9 నెలల కనిష్టస్థాయికి తగ్గిందన్న వార్తలతో శుక్రవారం ముగింపులో స్టాక్ సూచీలు తొలి నష్టాల నుంచి కోలుకుని ముగిసాయి. ఉక్రయిన్-రష్యాల ఉద్రిక్తతల ఫలితంగా ప్రపంచమార్కెట్లకు అనుగుణంగా ట్రేడింగ్ తొలిదశలో బీఎస్ఈ సెన్సెక్స్ 200 పాయింట్ల వరకూ నష్టపోయి 21,573 పాయింట్ల కనిష్టస్థాయిని తాకింది. తదుపరి ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లతో పాటు రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, మెటల్ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో చివరకు 35 పాయింట్ల లాభంతో 21,810 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. 6,430 పాయింట్ల స్థాయి నుంచి కోలుకున్న ఎన్ఎస్ఈ నిఫ్టీ 11 పాయింట్ల పెరుగుదలతో 6,504 పాయింట్ల వద్ద ముగిసింది. బీహెచ్ఈఎల్, లార్సన్ అండ్ టుబ్రోలు 2.5 శాతం ర్యాలీ జరపగా, డీఎల్ఎఫ్, జేపీ అసోసియేట్స్ షేర్లు 3.5 శాతంపైగా పెరిగాయి. టాటా స్టీల్, జిందాల్ స్టీల్‌లు 1.5 శాతం, డాక్టర్ రెడ్డీస్ లాబ్, సిప్లాలు 1.5 శాతం చొప్పున ఎగిసాయి. విప్రో 3 శాతం క్షీణించగా, భారతి ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్‌లు 2 శాతం మేర తగ్గాయి. సూచీల్లో ఎక్కువ వెయిటేజి వున్న రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీలు 1 శాతం పెరగ్గా, క్రితం రోజు భారీగా తగ్గిన ఇన్ఫోసిస్ తాజాగా 1 శాతం మేర కోలుకుంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 982 కోట్లు పెట్టుబడిచేయగా, దేశీయ సంస్థలు రూ. 866 కోట్లు వెనక్కు తీసుకున్నాయి. -
ఆరునెలల గరిష్ట స్థాయికి చేరిన పసిడి
ముంబయి : బంగారం ధర ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త వాతావరణం చల్లబడకపోవడం, చైనా ఆర్థిక వ్యవస్థలో మందగమనం వస్తుందనే వార్తల నేపథ్యంలో బంగారం ధర పెరగడానికి కారణమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1370 డాలర్లకు చేరింది. వారం కిందటితో పోలిస్తే ఔన్స్ ధర 20 డాలర్లకు పైగా పెరిగింది. నెల రోజుల కాలాన్ని తీసుకుంటే 50 డాలర్ల దాకా పెరిగింది. గత ఆరు వారాలుగా పసిడి ధర పెరుగుతూ వస్తోంది. ఎంసీక్స్లో 10 గ్రాముల ధర 30,500ల రూపాయలు అధిగమించింది. ఎంసీక్స్ కంటే హైదరాబాద్ ధర కొంత తక్కువగా ఉంది. హైదరాబాద్‌లో ధర 30,260లుగా ఉందని ఇండియన్గోల్డ్రేట్ డాట్ కామ్ అనే వెబ్సైట్ చెబుతోంది. ఆర్నమెంట్ గోల్డ్ ధర 28,340 రూపాయలుగా ఉంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తత కొనసాగితే బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ధర అధికంగా ఉన్నందున ఫిజికల్ గోల్డ్ డిమాండ్ తగ్గుతోందని వర్తకులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా బంగారం కొంటున్న చైనాలో కూడా డిమండ్ తగ్గుతోందని వార్తలు వస్తున్నాయి. -
ఉక్రెయిన్‌పై పాశ్చాత్య దౌత్యం!
కీవ్/వాషింగ్టన్/పారిస్: ఉక్రెయిన్ ఉద్రిక్తతలను దౌత్యపరంగా పరిష్కరించడానికి పాశ్చాత్య దేశాలు, రష్యా నడుంకట్టాయి. ఉక్రెయిన్ సంక్షోభం మొదలైన తర్వాత తొలిసారి రష్యా, అమెరికా విదేశాంగ మంత్రులు చర్చలు జరపనున్నారు. లెబనాన్‌పై పారిస్‌లో సమావేశం సందర్భంగా అమెరికా మంత్రి జాన్ కెర్రీ, రష్యా మంత్రి సెర్గీ లావ్రోవ్ ఈ సమస్యపై చర్చకు ఉద్యుక్తమవుతున్నారు. ఇదేసమయంలో స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాల విదేశాంగ మంత్రులతో లావ్రోవ్ భేటీ కానున్నారు. మరోపక్క ఉక్రెయిన్ సమస్య పరిష్కారానికి ఐక్యరాజ్యసమితి బ్రస్సెల్స్‌లో అత్యవసర సమావేశం నిర్వహించనుంది. క్రిమియా విషయంలో రష్యా ఎవర్నీ వెర్రివాళ్లను చేయలేదని ఒబామా మంగళవారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. రష్యాతో సైనిక సహకారాన్ని ఉపసంహరించుకుంటామని ఒబామా హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా క్రిమియాను తమ సైనికులు ఆక్రమించుకోలేదని, తమకు యుద్ధకాంక్షలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో చర్చలకు తెరలేచింది. తాము కూడా రష్యాతో సత్సంబంధాలనే కోరుకుంటున్నామని, యుద్ధాన్ని కాదని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ప్రకటించారు. క్రిమియా తమ దేశంలోనే భాగంగా ఉంటుందని, స్థానికులకు మరిన్ని అధికారాలు కట్టబెడతామని ఆదేశ ప్రధాని ఆర్సెనీ యట్సెన్యుక్ కూడా చెప్పారు. క్రిమియాలో మిజోరం విద్యార్థులు క్షేమంగా ఉన్నారని ఉక్రెయిన్‌లో భారత రాయభారి తెలిపారు. -
ఆల్ టైమ్ రికార్డు చేరువలో సెన్సెక్స్!
అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు లాభాలతో ముగిసాయి. ఉక్రెయిన్ సంక్షోభం తీవ్రత తగ్గడం, చైనా ఎకనామిక్ డేటా ప్రభావంతో సెన్సెక్స్ 67 పాయింట్లు లాభపడి 21276 పాయింట్ల వద్ద ముగిసింది. ఆల్ టైమ్ రికార్డుకు చేరువలో సెన్సెక్స్ ముగియడం గమనార్హం. మరో ప్రధాన సూచీ నిఫ్టీ 6300 మార్కుపైనే క్లోజైంది. చివరకు 30 పాయింట్లు లాభపడి 6328 పాయింట్ల వద్ద ముగిసింది. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో అత్యధికంగా బ్యాంక్ ఆఫ్ బరోడా 6.29 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 4.60, డీఎల్ఎఫ్ 3.50, ఐడీఎఫ్ సీ 3.22, ఏసీసీ 3 శాతం లాభపడ్డాయి. టాటాపవర్ 3.25 శాతం, భారతీ ఎయిర్ టెల్, గెయిల్, కెయిర్న్ ఇండియా, హెచ్ సీఎల్ టెక్ స్వల్పంగా నష్టపోయాయి. యూరప్ మార్కెట్లలో ఎఫ్ టీఎస్ ఈ 29, కాక్ 16, డాక్స్ 33 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. -
రష్యాతో సైనిక సహకారం కట్
ఉక్రెయిన్‌పై సైనిక జోక్యానికి నిరసనగా అమెరికా ప్రతిచర్య ఉక్రెయిన్‌కు రూ. 6 వేల కోట్ల ఇంధ న రాయితీ ప్యాకేజీ కీవ్ చేరుకున్న అమెరికా మంత్రి ఉక్రెయిన్ సరిహద్దులోని సైన్యాన్ని వెనక్కి పిలిచిన రష్యా వాషింగ్టన్/మాస్కో: ఉక్రెయిన్ సంక్షోభం అంతర్జాతీయ సమస్యగా మారింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక జోక్యానికి నిరసనగా అమెరికా రష్యాతో సైనిక సహకారాన్ని నిలిపివేసింది. సైనిక విన్యాసాలు, భేటీలు, పర్యటనలను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్‌కు వంద కోట్ల డాలర్ల(రూ. 6 వేల కోట్లు)ఇంధన రాయితీని కూడా ప్రకటించింది. తాజా పరిస్థితిపై ఉక్రెయిన్ నేతలతో చ ర్చించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ మంగళవారం కీవ్ చేరుకున్నారు. మరోపక్క.. ఉక్రెయిన్ సరిహద్దులో కవాతు చేస్తున్న తమ 1.50 లక్షల మంది సైనికులను తిరిగి స్థావరాలకు చేరుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించా రు. అయితే ఉక్రెయిన్‌లోని రష్యన్ జాతీయులను కాపాడుకోవడానికి సైన్యాన్ని వాడే హక్కు తమకున్నదని, కానీ ఆ అవసరం రాకూడదని ఆశిస్తున్నానన్నారు. పరారీలో ఉన్న యానుకోవిచే ఆ దేశానికి నిజమైన అధ్యక్షుడని పునరుద్ఘాటించారు. పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌లో రాజ్యాంగ విరుద్ధ తిరుగుబాటుకు ఊతమిస్తూ, ఆ దేశాన్ని అరాచకం దిశగా తీసుకెళ్తున్నాయని దుయ్యబట్టారు. తమపై పాశ్చాత్య దేశాలు ఆర్థిక ఆంక్షలు విధిస్తే అవి వాటికే బెడిసికొడతాయన్నారు. రష్యాది చారిత్రక తప్పిదం: ఒబామా ఉక్రెయిన్‌పైకి రష్యా దండెత్తి చారిత్రక తప్పిదం చేస్తోందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆరోపించారు. వెంటనే వెనక్కి తగ్గకపోతే రష్యాను శిక్షించేందుకు దౌత్య, ఆర్థిక చర్యలు చేపట్టే అవకాశాలను పరిశీలిస్తున్నానన్నారు. ఉక్రెయిన్ల భవితను వారే నిర్ణయించుకోవాలన్నది తమ అభిమతమన్నారు. ఉక్రెయిన్‌కు ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గించేందుకు వందకోట్ల డాల్లర్ల రాయితీ ప్యాకేజీకి ఆయన ఆమోదం తెలిపారు. దీంతోపాటు ఆర్థిక, ఎన్నికల సంస్థలకు శిక్షణలో సాయం చేయనున్నట్లు వైట్‌హౌస్ తెలిపింది. క్రిమియాలో ఉద్రిక్తత ఉక్రెయిన్‌లోని స్వయంప్రతిపత్తి ప్రాంతమైన క్రిమియాలోని రష్యా అనుకూల సైనికులు మంగళవారం బెల్బెక్ వైమానిక స్థావరాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమ ఉద్యోగాలు తమికివ్వాలని అక్కడ పనిచేసిన 300 మంది ఉక్రెయిన్ సైనికులు డిమాండ్ చేస్తూ ముందుకురాగా హెచ్చరికగా రష్యా జవాన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. క్రిమియాలోని సెవస్తపోల్ రేవులో రెండు ఉక్రె యిన్ యుద్ధనౌకలను రష్యా నౌకలు దిగ్బంధించాయి. యానుకోవిచ్ కోరితేనే పంపాం: రష్యా క్రిమియాలో 16 వేల మంది రష్యా సైనికులు ఉన్నారని ఉక్రెయిన్ ప్రతినిధి ఐక్యరాజ్య సమితికి చెప్పగా, శాంతిభద్రతల కోసం వారిని అక్కడికి పంపాలని యానుకోవిచ్ పుతిన్‌ను కోరడంతోనే మోహరించామని రష్యా చెప్పింది. అయితే పరారీ ఉన్న యానుకోవిచ్‌కు విదేశీ సాయం కోరే అధికారం లేదని ఉక్రెయిన్ ప్రతినిధి అన్నారు. సంక్షోభాన్ని నివారించకపోతే రష్యాపై దౌత్య, ఆర్థిక ఆంక్షలు విధిస్తామని, జీ-8 నుంచి తప్పిస్తామని యూరోపియన్ యూనియన్, కెనడా తదితర దేశాలు హెచ్చరించాయి. ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా యూరో విలువ డాలర్‌తో పోలిస్తే 1.38 నుంచి 1.37కు పడిపోయింది. ‘మిజో విద్యార్థులకు భద్రత కల్పించండి’ ఉక్రెయిన్‌లో చిక్కుకున్న దాదాపు 40 మంది మిజో విద్యార్థుల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని మిజోరం ముఖ్యమంత్రి లాల్ తన్హవ్లా భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రి వయలార్ రవిలకు లేఖ రాశారు. -
క్రిమియాపై రష్యా ఆధిపత్యం
ఉక్రెయిన్‌లో కెర్చ్ ఓడరేవు స్వాధీనం కవ్వింపు చర్యలు ఆపాలి: అమెరికా కీవ్ (ఉక్రెయిన్)/వాషింగ్టన్: అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతున్నా ఉక్రెయిన్ విషయంలో రష్యా వెనక్కి తగ్గడంలేదు. ఉక్రెయిన్‌లోకి తన బలగాలను వేగంగా దింపుతోంది. రష్యా అభిమానులు ఉండే ఆ దేశ తూర్పు ప్రాంతం క్రిమియాను పూర్తిగా స్వాధీనంలోకి తెచ్చుకుంది. దీనిపై ఉక్రెయిన్ సోమవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా దండయాత్రకు దిగడంతో తాము వినాశనపు అంచున ఉన్నామన్నామంటూ ఉక్రెయిన్ ప్రధాని అర్సెని యాట్సెన్యుక్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తమ చర్యల్ని రష్యా సమర్థించుకుంది. ఉక్రెయిన్‌లో పరిస్థితులు చక్కబడేవరకూ క్రిమియాలో అదనపు బలగాల అవసరం ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీలావ్రోవ్ చెప్పారు. బాయ్‌కాట్ చేస్తామని, ఆంక్షలు విధిస్తామని పాశ్చాత్య దేశాలు హెచ్చరించడాన్ని ఆయన ఆక్షేపించారు. పదవీచ్యుతుడైన ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ ఇప్పటికీ న్యాయబద్ధమైన అధ్యక్షుడని రష్యా ప్రధాని దిమిత్రి మెద్వదెవ్ పేర్కొన్నారు. మరోపక్క తమ దేశానికి 20 కిలోమీటర్ల చేరువలో ఉండే ఉక్రెయిన్ ఓడరేవు పట్టణం కెర్చ్ను రష్యా అనుకూల దళాలు అధీనంలోకి తీసుకున్నాయి. ఇప్పటికే క్రిమియాపై పట్టుసాధించిన రష్యా.. కెర్చ్ రేపు ద్వారా మరిన్ని బలగాలను ఉక్రెయిన్‌కు పంపే అవకాశం ఉందంటూ ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ చొరబాట్లను నిరోధించి రష్యా దళాలను వెనక్కి పంపే వ్యూహాలు ఆ దేశాలు రచిస్తున్నాయి. ఉద్రిక్తతలను పెంచే చర్యలు ఆపాలని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌ను కోరారు. కాగా, క్రిమియాలో రష్యాకు అనుకూలంగా వ్యవహరించే గవర్నర్లను తొలగించే పనిని ఉక్రెయిన్ చేపట్టింది. అంతేగాక నేవీ చీఫ్‌ను కూడా తొలగించింది. కాగా, తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా దళాలు మోహరించిన ప్రభావం అంతర్జాతీయ ఆయిల్ రేట్లపై పడే అవకాశం కనిపిస్తోంది. మాస్కో స్టాక్ ఎక్చేంజి 13 శాతం నష్టపోయింది. డాలర్‌తో రూబుల్ మారక విలువ తగ్గింది. ఆసియా, యూరప్ మార్కెట్లు ఒడిదుడులకు లోనయ్యాయి. -
బంగారం, క్రూడ్ ధరలు రయ్...
న్యూయార్క్/ముంబై: రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో బంగారం, వెండి, చమురు ధరలకు రెక్కలొచ్చాయి. న్యూయార్క్ మర్కంటైల్ ఎక్స్ఛేంజ్ కమోడిటీ డివిజన్లో ఔన్స్(31.1గ్రా) బంగారం ధర సోమవారం రాత్రి క్రితం ముగింపుతో పోల్చితే 33 డాలర్లు(2.5%) ఎగసి 1,354 డాలర్లకు చేరింది. ఇది 4 నెలల గరిష్ట స్థాయి. వెండి కూడా1.66% ఎగసి 22 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. దేశీయంగా: కాగా అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో కూడా కనబడుతోంది. సోమవారం రాత్రి కడపటి సమాచారం అందే సరికి చురుగ్గా ట్రేడవుతున్న కాంట్రాక్ట్ 10 గ్రాముల బంగారం ధర 1.5 శాతానికి పైగా ఎగసి రూ. 30,573 వద్ద ట్రేడవుతోంది. వెండి కేజీ ధర కూడా 2 శాతానికి పైగా ఎగసి, రూ.47,300 వద్ద ట్రేడవుతోంది. బంగారం, వెండి ధరలు ఇదే రీతిలో ముగిస్తే, మంగళవారం స్పాట్ మార్కెట్లో (రూపాయి కదలికలకు లోబడి) ఈ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. క్రూడ్ ఇలా: నెమైక్స్‌లో లైట్ స్వీట్ బ్యారల్ ధర కడపటి సమాచారం అందే సరికి శుక్రవారం ముగింపు ధరతో పోల్చితే 2 శాతానికి పైగా ఎగసి 105 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బ్రెంట్ అయిల్ ధర కూడా ఇదే స్థాయిలో పెరిగి 112 డాలర్ల వద్ద ట్రేడింగ్ జరుగుతోంది.