కీవ్/వాషింగ్టన్/పారిస్: ఉక్రెయిన్ ఉద్రిక్తతలను దౌత్యపరంగా పరిష్కరించడానికి పాశ్చాత్య దేశాలు, రష్యా నడుంకట్టాయి. ఉక్రెయిన్ సంక్షోభం మొదలైన తర్వాత తొలిసారి రష్యా, అమెరికా విదేశాంగ మంత్రులు చర్చలు జరపనున్నారు. లెబనాన్‌పై పారిస్‌లో సమావేశం సందర్భంగా అమెరికా మంత్రి జాన్ కెర్రీ, రష్యా మంత్రి సెర్గీ లావ్‌రోవ్ ఈ సమస్యపై చర్చకు ఉద్యుక్తమవుతున్నారు. ఇదేసమయంలో స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాల విదేశాంగ మంత్రులతో లావ్‌రోవ్ భేటీ కానున్నారు. మరోపక్క ఉక్రెయిన్ సమస్య పరిష్కారానికి ఐక్యరాజ్యసమితి బ్రస్సెల్స్‌లో అత్యవసర సమావేశం నిర్వహించనుంది. క్రిమియా విషయంలో రష్యా ఎవర్నీ వెర్రివాళ్లను చేయలేదని ఒబామా మంగళవారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. రష్యాతో సైనిక సహకారాన్ని ఉపసంహరించుకుంటామని ఒబామా హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా క్రిమియాను తమ సైనికులు ఆక్రమించుకోలేదని, తమకు యుద్ధకాంక్షలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో చర్చలకు తెరలేచింది. తాము కూడా రష్యాతో సత్సంబంధాలనే కోరుకుంటున్నామని, యుద్ధాన్ని కాదని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ప్రకటించారు. క్రిమియా తమ దేశంలోనే భాగంగా ఉంటుందని, స్థానికులకు మరిన్ని అధికారాలు కట్టబెడతామని ఆదేశ ప్రధాని ఆర్సెనీ యట్సెన్‌యుక్ కూడా చెప్పారు. క్రిమియాలో మిజోరం విద్యార్థులు క్షేమంగా ఉన్నారని ఉక్రెయిన్‌లో భారత రాయభారి తెలిపారు.