మాస్కో: యుద్ధ భయాలు కాస్త నెమ్మదించినా ఉక్రెయిన్ కేంద్రంగా ఇటు రష్యా, అటు నాటో, అమెరికా, పశ్చిమ దేశాల మధ్య మాటల మంటలు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్‌కు మూడువైపులా లక్షన్నర దాకా సైన్యాన్ని మోహరించి యుద్ధ భయాలను అమాంతం పెంచేసిన రష్యా, సరిహద్దుల నుంచి మరిన్ని దళాలను, ఆయుధాలను వెనక్కు మళ్లిస్తున్నట్టు బుధవారం పేర్కొంది. సాయుధ వాహనాలతో కూడిన రైళ్లు క్రిమియా నుంచి వెనుదిరుగుతున్న వీడియోలను ఆ దేశ రక్షణ శాఖ విడుదల చేసింది. కానీ అలాంటిదేమీ జరుగుతున్నట్టు కన్పించడం లేదని నాటో, అమెరికా, ఇంగ్లండ్ సహా యూరప్ దేశాలు పెదవి విరుస్తున్నాయి.
కోలుకోలేనంతటి తీవ్ర ఆంక్షలు: బైడెన్
ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగే ఆలోచనలను రష్యా తక్షణం మానుకోవాలని బైడెన్ అన్నారు. దాడికి దిగితే ఎదుర్కొనేందుకు ప్రపంచమంతటినీ కూడగడతామని స్పష్టం చేశారు. ‘‘నిర్ణాయక రీతిలో స్పందించి తీరతాం. సుదీర్ఘకాలం పాటు తేరుకోలేనంతగా రష్యాపై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తాం’’ అంటూ ఘాటుగా హెచ్చరించారు. ‘‘యుద్ధ ముప్పు అలాగే ఉంది. కనీసం లక్షన్నరకు పైగా రష్యా దళాలు ఉక్రెయిన్ సరిహద్దుల్లోనే ఉన్నాయి. అందుకే పరిస్థితులు దిగజారకముందే ఉక్రెయిన్ నుంచి వచ్చేయాలని అక్కడున్న అమెరికన్లకు సూచించా.
మా రాయబార కార్యాలయాన్ని కీవ్ నుంచి పశ్చిమ ఉక్రెయిన్‌కు మార్చాం. రష్యా ఎలాంటి చర్యకు దిగినా దీటుగా ఎదుర్కొనేందుకు అమెరికా సిద్ధంగా ఉంది’’ అని స్పష్టం చేశారు. అయితే యూరప్ భద్రత, సుస్థిరతను మెరుగుపరిచేందుకు రష్యాతో, అక్కడి మా మిత్రపక్షాలతో మాట్లాడేందుకు ఎప్పుడూ సిద్ధమేనన్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకే చివరిదాకా ప్రయత్నిస్తామంటూ ముక్తాయించారు.
చదవండి: (భీకర వర్షాలు.. 58 మంది మృతి)
అది పిచ్చితనం: రష్యా
రష్యా మాత్రం ఉక్రెయిన్‌పై తాము దాడి చేస్తామన్న పశ్చిమ దేశాల అనుమానాలను ‘పిచ్చితనం’గా అభివర్ణించింది. తమకా ఉద్దేశమే లేదని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు రష్యా ఫైటర్ జెట్లు బుధవారం ఉక్రెయిన్ పొరుగు దేశమైన బెలారస్‌లో జోరుగా సంయుక్త యుద్ధ విన్యాసాలు జరిపాయి. అయితే ఆదివారం విన్యాసాలు ముగుస్తూనే రష్యా దళాలన్నీ తమ దేశం వీడతాయని బెలారస్ అంటోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమ దేశాలతో చర్చల కోసం అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ యూరప్ బయల్దేరి వెళ్లారు.
ఢిల్లీలో కంట్రోల్ రూమ్
న్యూఢిల్లీ: ఉక్రెయిన్లోని భారతీయులు ఆందోళన పడాల్సిన పని లేదని కేంద్రం పేర్కొంది. వారందరినీ వెనక్కు తీసుకొచ్చేందుకు అవసరమైతే అదనపు విమానాలు ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం ఎయిరిండియాతో పాటు పలు ఎయిర్‌లైన్స్‌ను ఇప్పటికే సంప్రదిస్తున్నట్టు తెలిపింది. ఈ విషయమై అవసరమైన సాయం అందించేందుకు బుధవారం ఢిల్లీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. తమను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు, మెయిల్ ఐడీ తదితరాలను ఆన్‌లైన్లో అందుబాటులో ఉంచింది. ఉక్రెయిన్లోని భారత ఎంబసీ కూడా నిరంతరం అందుబాటులో ఉండే హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. ఉక్రెయిన్‌లో 18 వేల మంది దాకా భారత స్టూడెంట్లు ఉన్నట్టు 2020 అధికారిక లెక్కలు చెబు తున్నా కరోనా నేపథ్యంలో వీరిలో చాలా మంది స్వదేశం వచ్చేసి ఉంటారని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment