బంగారం, క్రూడ్ ధరలు రయ్...
న్యూయార్క్/ముంబై: రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో బంగారం, వెండి, చమురు ధరలకు రెక్కలొచ్చాయి. న్యూయార్క్ మర్కంటైల్ ఎక్స్ఛేంజ్ కమోడిటీ డివిజన్‌లో ఔన్స్(31.1గ్రా) బంగారం ధర సోమవారం రాత్రి క్రితం ముగింపుతో పోల్చితే 33 డాలర్లు(2.5%) ఎగసి 1,354 డాలర్లకు చేరింది. ఇది 4 నెలల గరిష్ట స్థాయి. వెండి కూడా1.66% ఎగసి 22 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది.
దేశీయంగా: కాగా అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో కూడా కనబడుతోంది. సోమవారం రాత్రి కడపటి సమాచారం అందే సరికి చురుగ్గా ట్రేడవుతున్న కాంట్రాక్ట్ 10 గ్రాముల బంగారం ధర 1.5 శాతానికి పైగా ఎగసి రూ. 30,573 వద్ద ట్రేడవుతోంది.
వెండి కేజీ ధర కూడా 2 శాతానికి పైగా ఎగసి, రూ.47,300 వద్ద ట్రేడవుతోంది. బంగారం, వెండి ధరలు ఇదే రీతిలో ముగిస్తే, మంగళవారం స్పాట్ మార్కెట్‌లో (రూపాయి కదలికలకు లోబడి) ఈ ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
క్రూడ్ ఇలా: నెమైక్స్‌లో లైట్ స్వీట్ బ్యారల్ ధర కడపటి సమాచారం అందే సరికి శుక్రవారం ముగింపు ధరతో పోల్చితే 2 శాతానికి పైగా ఎగసి 105 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బ్రెంట్ అయిల్ ధర కూడా ఇదే స్థాయిలో పెరిగి 112 డాలర్ల వద్ద ట్రేడింగ్ జరుగుతోంది.