యుద్ధ మేఘాలు ఎంతగా కమ్ముకున్నా ఉక్రెయిన్‌పై రష్యా ఇప్పటికిప్పుడు యుద్ధానికి దిగకపోవడానికి సహజ వాయువు అంశం కూడా ఒక ముఖ్య కారణంగా కన్పిస్తోంది. యూరప్‌కు అతి పెద్ద గ్యాస్ సరఫరాదారు రష్యానే. యూరప్ గ్యాస్ అవసరాల్లో 40 శాతానికి పైగా తీరుస్తోంది. యూరప్ ఏటా సుమారు 237 బిలియన్ క్యుబిక్ మీటర్ల (బీసీఎం)కు పైగా గ్యాస్ దిగుమతి చేసుకుంటుంటే 2012లో 168 బీసీ ఎం గ్యాస్‌ను ఒక్క రష్యానే సరఫరా చేసింది. ముఖ్యంగా జర్మనీకి 60 శాతం దాకా గ్యాస్ రష్యా నుంచే అందుతోంది.
ఇక మధ్య, తూర్పు యూరప్‌లోని పలు దేశాలు తమ గ్యాస్ అవసరాల్లో 90 శాతానికి పైగా రష్యా మీదే ఆధారపడ్డాయి! బాల్టిక్ సముద్రం గుండా జర్మనీ దాకా సాగే నార్డ్ స్ట్రీమ్ 1 పైప్ లైన్ ద్వారా యూరప్‌కు ఏటా 55 బీసీఎం గ్యాస్‌ను రష్యా సరఫరా చేస్తోంది. టర్క్ స్ట్రీమ్ లైన్ల ద్వారా మరో 33 బీసీఎం సరఫరా చేస్తోంది. 110 కోట్ల డాలర్ల ఖర్చుతో తలపెట్టిన కీలకమైన నోర్డ్ స్ట్రీమ్ 2 ప్రాజెక్టు పూర్తియితే జర్మనీకి సరఫరాలను రెండింతలు చేయడం రష్యాకు వీలవుతుంది.
యూరప్‌కు చుక్కలే
ఈ శీతాకాలంలో యూరప్ తీవ్ర గ్యాస్ కొరతతో అల్లాడుతోంది. ఈ నేపథ్యంలో యుద్ధమే వస్తే గ్యాస్ సరఫరా పూర్తిగా ఆగిపోయి యూరప్ దేశాలు అల్లాడతాయి. ప్రత్యామ్నాయంగా అమెరికా నుంచి గ్యాస్ దిగుమతి చేసుకునే అవకాశమున్నా దూరాభారం తదితరాలన్నీ కలిసి ధరలు చుక్కలను తాకే ప్రమాదముంది. ఎందుకంటే పెరిగిన డిమాండ్‌తో యూరప్ దిగుమతి చేసుకుంటున్న గ్యాస్ ధర ఇప్పటికే ఏకంగా 8 రెట్లు పెరిగింది. 2021లో మెగావాట్‌కు 19 యూరోలుగా ఉన్నది కాస్తా 80 యూరోలైంది. యుద్ధమే వస్తే రష్యా నుంచి సరఫరా ఆగిపోతుంది. యూఎస్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తే కనీసం మరో మూడు రెట్లు అధికంగా వెచ్చించాల్సి ఉంటుందని అంచనా.
చదవండి: (ఇంకా యుద్ధ మేఘాలే)
యూరప్ దేశాలకు ఇది తలకు మించిన భారమే. మరోవైపు యూరప్‌కు గ్యాస్ సరఫరాను పూర్తిగా ఆపేస్తే రష్యాకు రోజుకు కనీసం 100 కోట్ల డాలర్లకు పైగా నష్టమని అంచనా. పైగా ఒప్పందాలను ఉల్లంఘించినందుకు చెల్లించాల్సి వచ్చే భారీ జరిమానాలు అదనం. అందుకే యుద్ధాన్ని ఎలాగైనా నివారించేందుకు అటు యూరప్ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇటు రష్యా కూడా పైకి దూకుడు ప్రదర్శిస్తున్నా యుద్ధానికి దిగే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. అమెరికా, నాటో కూటమి నుంచి నయానో భయానో తను ఆశించిన హామీలను రాబట్టుకునే ప్రయత్నమే చేస్తోంది.
– నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment