ఆంక్షలతో రష్యాను ఇరకాటంలో పెట్టాలని అమెరికా, పాశ్చాత్య దేశాలు(ఈయూ దేశాలతో కలిపి) తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కానీ, తగ్గేదే లే అనుకుంటూ ఉక్రెయిన్‌పై మిలిటరీ చర్యలను కొనసాగిస్తూనే ఉంది రష్యా. ఈ క్రమంలో.. రష్యా ఆర్థిక స్థితి కొద్దికొద్దిగా దిగజారుతోంది.
తాజాగా పుతిన్ ‘మిత్రపక్షంలో లేని దేశాలకు’ పెద్ద షాకే ఇచ్చాడు. సహజ వాయువుల ఉత్పత్తులు కావాలంటే చెల్లింపులను రష్యన్ కరెన్సీ రూబుల్స్‌లో మాత్రమే చెల్లించాలంటూ కండిషన్ విధించాడు. లేదంటే ఉత్పత్తిని ఆపేస్తానని హెచ్చరించాడు. క్రెమ్లిన్‌ను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు, రష్యన్ ఆస్తులను ఫ్రీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో..
యూరోపియన్ దేశాల కరెన్సీ విశ్వసనీయతపై ప్రభావవంతంగా ఒక గీతను గీయడం, ఆ కరెన్సీల నమ్మకాన్ని దెబ్బతీయడం ద్వారా.. తన దారికి తెచ్చుకోవాలన్నది పుతిన్ ఫ్లాన్ అయి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే యూరోలు, డాలర్లకు బదులు.. రష్యన్ రూబుల్స్‌లోనే రష్యన్ గ్యాస్ కోసం చెల్లింపు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. పైగా ఈ షరతు పుతిన్‌కు పెద్ద అడ్వాంటేజే. ఒకవేళ ఈ షరతు.. రష్యాకు మునుముందు ఇబ్బందికరంగా గనుక మారితే వెంటనే ఎత్తేసే ఆలోచనలోనూ పుతిన్ ఉన్నట్లు తెలుస్తోంది.
యూరోపియన్ యూనియన్ మొత్తం 90 శాతం సహజ వాయువుల్ని దిగుమతి చేసుకుంటున్నాయి. కరెంట్ తయారీకి, ఇళ్ల వెచ్చదనానికి, పరిశ్రమల కోసం ఈ గ్యాస్‌లనే ఉపయోగించుకుంటున్నాయి. అందులో 40 శాతం ఉత్పత్తి రష్యా నుంచి కావడంతోనే.. ఈయూ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
రూబుల్ ఎలా ఉంటుందో తెలీదు
ఇదిలా ఉంటే పుతిన్ రూబుల్ షరతుపై యూరోపియన్ యూనియన్ దేశాలు గగ్గోలు మొదలుపెట్టాయి. ‘నాకు తెలిసి యూరప్‌లో.. ఏ దేశానికీ రష్యా రూబుల్ ఎలా ఉంటుందో తెలిసి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు రూబుల్స్‌లో ఎలా చెల్లిస్తారు?’ అని స్వోవేనియా ప్రధాని జనెజ్ జన్‌సా అంటున్నారు.
జర్మన్ ఛాన్స్‌లర్ ఒలాఫ్ స్కోల్జ్, ఇటలీ ప్రధాని మరియో డ్రాఘి తదితరులు కూడా ఇవే అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బెల్జియం లాంటి దేశం.. ఆకాశాన్ని అంటిన గ్యాస్ ధరలపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఒకవేళ పుతిన్ గనుక ఇదే ధోరణితో ముందుకు వెళ్తే గనుక.. కాంట్రాక్ట్ ఉల్లంఘనల కింద చర్యలకు దిగుతామని కొన్ని దేశాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment