ఉక్రెయిన్ సరిహద్దు పరిస్థితులు.. భారత విద్యార్థులకు గండంలా దాపురించాయి. ఏ క్షణమైనా రష్యా దాడి చేసే అవకాశం ఉందంటూ అమెరికా అదే పాట పాడుతోంది. ఈ క్రమంలో అవసరం లేనివాళ్లు.. ముఖ్యంగా విద్యార్థులు అక్కడి నుంచి భారత్కు వచ్చేయాలంటూ.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని భారత ఎంబసీ ద్వారా కేంద్ర విదేశాంగ శాఖ సూచించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ హెచ్చరిక చాలా ఆలస్యంగా వచ్చిందంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అక్కడున్న భారత విద్యార్థులు.
ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్ పట్టుకుని భారత్కు వచ్చేయాలని ప్రయత్నిస్తున్న విద్యార్థులకు.. ఉక్రెయిన్ ఎయిర్పోర్ట్ దగ్గర వరుస షాకులు తగులుతున్నాయి. ఫిబ్రవరి 20 దాకా భారత్కు వెళ్లే విమానాలే లేవని అక్కడి అధికారులు చెప్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఈ కొరతను అదనుగా చూసుకుని ట్రావెల్ ఏజెంట్లు చెలరేగిపోతున్నారు. భారీగా రేట్లు పెంచేసి భారతీయ విద్యార్థుల్ని బెంబేలెత్తిస్తున్నారు.
ఉక్రెయిన్లో ఉన్న భారతీయ విద్యార్థులకు టికెట్ల ధరల రూపంలో షాక్ తగులుతోంది. సాధారణ రోజుల్లో టికెట్ ధర మన కరెన్సీలో 21,000రూ. నుంచి 26,000 రూ. మధ్య ఉంటుంది. కానీ, రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతల నడుమ రేట్లు అమాంతం పెరిగాయి. ఎంతలా అంటే.. ప్రస్తుతం టికెట్ ధర 50 వేల రూ. నుంచి లక్ష మధ్య పలుకుతోంది. అంటే దాదాపు నాలుగు రెట్లు రేట్లు పెరిగాయన్నమాట. మొత్తంగా ఈ సంక్షోభాన్ని క్యాష్ చేసుకునేందుకే ట్రావెల్ ఏజెంట్లు ప్రయత్నిస్తున్నారని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.
వెళ్లిపోమ్మన్నారు సరే..
ఉక్రెయిన్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య.. 18 వేలకు పైనే. ప్రధానంగా మెడిసిన్ కోసం వెళ్లిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. అయితే వెనక్కి వచ్చేయండంటూ చెప్పిన భారత ప్రభుత్వం, పరిస్థితిని పర్యవేక్షిస్తున్న భారత ఎంబసీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై నిరసన వ్యక్తం అవుతోంది. గత కొన్ని వారాలుగా పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్నా.. భారత ప్రభుత్వంలో తమ పౌరుల పట్ల చలనమే లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అసలు ఉక్రెయిన్ నుంచి భారత్కు వారానికి ఉండేది ఒకే ఒక్క ఫ్లైట్. అదీ వన్ స్టాప్ ఫ్లైట్ కావడంతో భారీ డిమాండ్ ఉంటోంది. దీనికి తోడు టికెట్ రేట్లు పెరిగిపోవడంతో.. విద్యార్థుల్లో ఆందోళన నెలకొంటోంది. అందుకే చాలామంది అక్కడే ఉండిపోవాలని అనుకుంటున్నారు. మరోవైపు కొన్ని యూనివర్సిటీలు ఈ సంక్షోభ సమయంలోనూ క్లాసులు నిర్వహిస్తుండడం కొసమెరుపు కాగా.. స్వదేశానికి వచ్చేస్తే తమ చదువు మధ్యలోనే ఆగిపోతుందనే ఆందోళనలో ఉన్నారు మరికొందరు విద్యార్థులు.
పేరెంట్స్ ఆందోళన
ఉక్రెయిన్లోని తమ పిల్లల భద్రతపై భారత్లోని తల్లిదండ్రులు, బంధువుల్లో ఆందోళన నెలకొంటోంది. పరిస్థితి ఏ క్షణమైనా విషమించే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో అది మరింత పెరుగుతోంది. గుజరాత్ సహా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పేరెంట్స్ అసోషియేషన్లు తమ పిల్లలను క్షేమంగా వెనక్కి రప్పించాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నాయి. అయితే కేంద్ర విదేశాంగ శాఖ మాత్రం ఆందోళన చెందొద్దని ధైర్యం చెబుతోంది. మరోవైపు ఉక్రెయిన్లోని భారత ఎంబసీ.. అత్యవసర పరిస్థితుల్లో +380997300483, +380997300428 నెంబర్లను సంప్రదించాలని, అవసరమైతే cons1.kyiv@mea.gov.in మెయిల్ ఐడీ ద్వారా సాయం కోరవచ్చని సూచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment