ఉక్రెయిన్‌లో కెర్చ్ ఓడరేవు స్వాధీనం
కవ్వింపు చర్యలు ఆపాలి: అమెరికా
కీవ్ (ఉక్రెయిన్)/వాషింగ్టన్: అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతున్నా ఉక్రెయిన్ విషయంలో రష్యా వెనక్కి తగ్గడంలేదు. ఉక్రెయిన్‌లోకి తన బలగాలను వేగంగా దింపుతోంది. రష్యా అభిమానులు ఉండే ఆ దేశ తూర్పు ప్రాంతం క్రిమియాను పూర్తిగా స్వాధీనంలోకి తెచ్చుకుంది. దీనిపై ఉక్రెయిన్ సోమవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా దండయాత్రకు దిగడంతో తాము వినాశనపు అంచున ఉన్నామన్నామంటూ ఉక్రెయిన్ ప్రధాని అర్సెని యాట్సెన్‌యుక్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తమ చర్యల్ని రష్యా సమర్థించుకుంది. ఉక్రెయిన్‌లో పరిస్థితులు చక్కబడేవరకూ క్రిమియాలో అదనపు బలగాల అవసరం ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీలావ్‌రోవ్ చెప్పారు.
బాయ్‌కాట్ చేస్తామని, ఆంక్షలు విధిస్తామని పాశ్చాత్య దేశాలు హెచ్చరించడాన్ని ఆయన ఆక్షేపించారు. పదవీచ్యుతుడైన ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ ఇప్పటికీ న్యాయబద్ధమైన అధ్యక్షుడని రష్యా ప్రధాని దిమిత్రి మెద్వదెవ్ పేర్కొన్నారు. మరోపక్క తమ దేశానికి 20 కిలోమీటర్ల చేరువలో ఉండే ఉక్రెయిన్ ఓడరేవు పట్టణం కెర్చ్‌ను రష్యా అనుకూల దళాలు అధీనంలోకి తీసుకున్నాయి. ఇప్పటికే క్రిమియాపై పట్టుసాధించిన రష్యా.. కెర్చ్ రేపు ద్వారా మరిన్ని బలగాలను ఉక్రెయిన్‌కు పంపే అవకాశం ఉందంటూ ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఆ చొరబాట్లను నిరోధించి రష్యా దళాలను వెనక్కి పంపే వ్యూహాలు ఆ దేశాలు రచిస్తున్నాయి. ఉద్రిక్తతలను పెంచే చర్యలు ఆపాలని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌ను కోరారు. కాగా, క్రిమియాలో రష్యాకు అనుకూలంగా వ్యవహరించే గవర్నర్లను తొలగించే పనిని ఉక్రెయిన్ చేపట్టింది. అంతేగాక నేవీ చీఫ్‌ను కూడా తొలగించింది. కాగా, తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా దళాలు మోహరించిన ప్రభావం అంతర్జాతీయ ఆయిల్ రేట్లపై పడే అవకాశం కనిపిస్తోంది. మాస్కో స్టాక్ ఎక్చేంజి 13 శాతం నష్టపోయింది. డాలర్‌తో రూబుల్ మారక విలువ తగ్గింది. ఆసియా, యూరప్ మార్కెట్లు ఒడిదుడులకు లోనయ్యాయి.
క్రిమియాపై రష్యా ఆధిపత్యం
Published Tue, Mar 4 2014 3:56 AM | Last Updated on Sat, Sep 2 2017 4:19 AM
Advertisement
Advertisement