ప్రచ్ఛన్నయుద్ధంలో ‘డ్రాగన్’ రంగ ప్రవేశం! | Westward march of Chinese Dragon in Eurasia | Sakshi
Sakshi News home page

ప్రచ్ఛన్నయుద్ధంలో ‘డ్రాగన్’ రంగ ప్రవేశం!

Published Tue, Mar 18 2014 5:12 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

ప్రచ్ఛన్నయుద్ధంలో ‘డ్రాగన్’ రంగ ప్రవేశం! - Sakshi

ప్రచ్ఛన్నయుద్ధంలో ‘డ్రాగన్’ రంగ ప్రవేశం!

ప్రపంచమంతా ఉక్రెయిన్ సంక్షోభంవైపు చూస్తుంటే చైనా కన్ను ఫిలిప్పీన్స్ ఏలుబడిలో ఉన్న దీవులపై పడింది. ఆ దీవులకు వెళ్లే ఫిలిప్పీన్స్ నౌకలను అడ్డగించింది. అమెరికా-ఫిలిప్పీన్స్ మధ్య కుదరబోయే సైనిక ఒప్పందమే ఈ పరిణామానికి కారణం.
 
 క్రిమియా ప్రజాభిప్రాయ సేకరణ ఘట్టం తదుపరి ఉక్రెయిన్ సంక్షోభాన్ని అమెరికా, రష్యాలు ఏ మలుపు తిప్పబోతున్నాయోనని ప్రపంచం ఉత్కంఠగా ఎదురు చూస్తూ మరో కీలక పరిణామాన్ని పట్టించుకోలేదు. ఐదు వేల మైళ్ల దూరంలోని దక్షిణ చైనా సముద్రంలో చైనా డ్రాగన్ అమెరికాపైకి పంజా విసిరింది. ఎప్పుడూ జరిగేట్టుగానే మత్తగజాల పోరు లో నలిగి చస్తున్నది ఫిలిప్పీన్స్. మార్చి 9వ చైనా స్ప్రాట్లీ దీవుల వ్యవహారంలో ఫిలిప్పీన్స్‌తో ఉన్న వివాదాన్ని తేల్చిపారేయడానికి సిద్ధమైంది. ఫిలిప్పీన్స్‌తో ఇంత వరకు ఉన్న యథాతథ పరిస్థితి కొనసాగింపునకు మంగళం పాడేసింది.
 
  ‘సెకండ్ థామస్ షావోల్’ ప్రాంతంలో నౌక దిగ్బంధాన్నివిధించింది. అక్కడి ఫిలిప్పీన్స్ సేనలకు ఆహారం తదితర సరఫరాలను తీసుకుపోతున్న ఓడలను తిప్పి పంపేసింది. ఫిలి ప్పీన్స్ వెంటనే దురాక్రమణకు స్వస్తి పలకాలంటూ హుకుం జారీ చేసింది. అక్కడి సైనికుల మీద ‘కనికరం’ చూపి గగన తలం నుంచి ఆహారాన్ని అందించడాన్ని అనుమతిస్తోంది. ఇకపై అనుమతిస్తుందా అనేది చెప్పడం లేదు. ఉక్రెయిన్ ‘తిరుగుబాటు’ సంబరంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఉత్సాహ భంగం తప్పింది కాదు. వచ్చే నెలలో ఆయన ఫిలిప్పీన్స్‌లో పర్యటించాల్సి ఉంది. ఫిలిప్పీన్స్ అధ్యక్షురాలు బెనిగినో అక్వినోతో కలసి కీలకమైన సైనిక ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంది. నిజానికి జనవరి 27నే చైనా యథాతథ స్థితికి  స్వస్తి పలికింది. షావోల్ నుంచి ఫిలిప్పీన్స్ జాలర్లను చైనా నావికా దళం బెదిరించి పంపే సింది. అప్పటి నుంచి ఫిలిప్పీన్స్ అధ్యక్షురాలు అక్వినోకు చైనాకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌కు పాశ్చాత్య మీడియా తాజాగా ప్రసాదించిన ‘హిట్లర్’ బిరుదును అక్వినో గత నెలలోనే చైనా అధ్యక్షుడు క్సీజింగ్‌పింగ్‌కు ప్రసాదించారు.
 
  చైనాను కట్టడి చేయాలంటూ అమెరికాను గట్టిగా కోరారు. ఆ నేపథ్యంలోనే ఉక్రెయిన్ సంక్షోభం అదను చూసుకొని అమెరికాకు దడిచేది లేదనే సందేశాన్ని చైనా పంపింది. అయితే చైనా సరికొత్త దూకుడుకు అసలు కారణం అమెరికా, ఫిలిప్పీన్స్ మధ్య కుదరబోతున్న సైనిక ఒప్పందమే. 2020 నాటికి అమెరికా తన నావికా బలంలో 60 శాతాన్ని ఇండో-పసిఫిక్ ప్రాంతానికి తరలించబోతోంది. అందులో గణనీయమైన భాగం ఫిలిప్పీన్స్‌లోని అమెరికా  స్థావరాల్లో సమీకరిస్తారు. అందుకు వీలుగా ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక సైనిక ఒడంబడికను విస్తరించి, పొడిగించడానికి అక్వినోను ‘ఒప్పించిన’ తర్వాతే అమెరికా ఆమె మొర ఆలకించింది.  
 
 గత నెలలో మొదటిసారిగా దక్షిణ చైనా సముద్రంలో ‘రక్షిత’ ప్రదేశాన్ని ప్రకటించిన చైనాను ప్రత్యక్షంగా తప్పుబట్టింది. అమెరికా సైనిక వ్యూహంలోని ఈ మౌలిక మార్పు చైనా ఆట కట్టించే తాపత్రయమేననేది చైనాకు తెలుసు. ఆ ఆటలో కీలక భాగస్వామి జపాన్ కాగా, ఫిలిప్పీన్స్ తొలి బలి పశువు.
 
 ఉక్రెయిన్‌లో అమెరికా ఆడుతున్న ఆట 1990 నుంచి అమలవుతున్న రష్యా ‘పని ముగించే’ సుదీర్ఘ వ్యూహంలో చివరి ఘట్టం. 1990 తదుపరి ఏడు ‘వార్సా’ (ఒకప్పటి సోవియట్ యూనియన్ నేతృత్వంలోని కూటమి) దేశాలు, మూడు సోవియట్ రిపబ్లిక్కులు నాటో కూటమిలో భాగమయ్యాయి. ఉక్రెయిన్‌లోని ‘విప్లవ’ ప్రభుత్వం నిలదొక్కుకోవడమే తరువాయి నాటోలో చేరుతుంది.
 
  రష్యాతో బాలిస్టిక్ క్షిపణుల ఒప్పందాన్ని బేఖాతరు చేసి అమెరికా ఇప్పటికే పోలాండ్, లాత్వియా, ఇస్తోనియా తదితర ప్రాంతాల్లో ఖం డాంతర క్షిపణులను మోహరించింది. పశ్చిమ దిశ నుంచి రష్యాను చుట్టుముట్టేసే వ్యూహంలో చిట్టచివరి మెట్టు ఉక్రెయిన్. భద్రంగా చేతిలో ఉన్న రొట్టెను ఎప్పుడైనా ఆరగిం చొచ్చు. ఉక్రెయిన్‌లో అంతా అమెరికా అనుకున్నట్టుగా ముగిసిపోతే రష్యాలో ‘ప్రజాస్వామ్య విప్లవం’ ‘జాతుల స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు’ పట్టంగట్టి తినడానికి వీలుగా  ‘రొట్టె’ను ఏడు ముక్కలు చేసే పథకాన్ని ‘పెంటగాన్’ జార్జి డబ్ల్యూ బుష్ హయాంలోనే సిద్ధం చేసింది. ఉక్రెయిన్ తర్వాత తన వంతేనని చైనాకు బాగా తెలుసు. అందుకే నేటి నయా కోల్డ్‌వార్‌లో రష్యా ఒంటరిగా లేదంటూ అది దక్షిణ చైనా సముద్రం మీదుగా శ్వేతసౌథానికి సందేశం పంపింది.  ఒబామా తేల్చుకోవాల్సింది ఒక్కటే. క్రిమియాలోని 95 శాతం ప్రజలు రష్యాలో భాగంగా ఉండాలంటూ ఇచ్చిన తీర్పును బేఖాతరు చేసి ఇప్పుడే చైనా కొరివితో తలగోక్కోవడమా? లేక అంతర్జాతీయ సేనలంటూ అమెరికా, ఐరాస, రష్యా సేనలను  నిలిపి ఉక్రెయిన్‌ను ‘తటస్థ’ దేశం చేయడ మా? లేక ఉక్రెయిన్‌ను రెండో, మూడో ముక్కలు చేసి రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌తో కలిసి పంచుకోవడమా?    
- పిళ్లా వెంకటేశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement