మనీలా(ఫిలిప్పిన్స్) : అమెరికాపై మరోసారి ఫిలిప్పిన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె ఘాటైన విమర్శలు చేశారు. అమెరికాకు చైనాతో యుద్ధం చేసేంత సీన్ లేదని తేల్చిచెప్పారు. నిజంగా చైనాను అమెరికా నిలువరించాలి అనుకుంటే తన మిత్రదేశాలను ‘ఎర’గా వాడుకొని చైనాను రెచ్చగొట్టడం ఆపాలని హితవు చెప్పారు. అంతేగాని మాలాంటి దేశాలను ముందు పెట్టి ఆటలాడటం సరికాదన్నారు. మనీలాలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యానించారు. అమెరికా ఎల్లప్పుడూ మనల్ని ముందుంచి చైనాకు వ్యతిరేకంగా ప్రోత్సహిస్తూ ఉంటుంది. మనల్ని వానపాముల్లా ఎరగా వాడుకోవాలని చూస్తుందని పేర్కొన్నారు.
అమెరికాను ఉద్దేశిస్తూ ‘ఇప్పుడు చెప్తున్నాం వినండి, మొదట మీరు వివాదాస్పద దక్షిణచైనా సముద్రంలోకి మీ మిలటరీతో వెళ్లండి, యుద్దం చేయండి, ఈ సారి మీ వెనక మేం ఉంటాం. చైనాపై పేల్చే మొదటి బుల్లెట్ మీదైతే..తర్వాత బుల్లెట్ మాదేనని’ తెలిపారు. ఎలాగైనా చైనాను కట్టడి చేయాలని ఒక పక్క అమెరికా, విస్తరణకాంక్షతో సముద్రంలో కృత్తిమ దీవులను సృష్టిస్తూ మరోపక్క చైనాలు ఘర్షణ పడుతుంటే వీటి మధ్య మేం శాండ్‌విచ్‌లా మారామని విమర్శించారు. ఏం అమెరికాకు జపాన్‌లో ఏడవ నౌకాదళం ఉందిగా, దమ్ముంటే యుద్ధానికి వెళ్లండని ప్రశ్నించారు. ఫిలిప్పిన్స్‌కు మిత్రదేశంగా చెప్పుకునే మీరు అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా చైనా నిర్మాణాలు చేపడుతుంటే ఆపకుండా రాజకీయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఫిలిప్పిన్స్ ఏన్నటికీ చైనాపై యుద్దంలో గెలవలేదని, చైనాపై యుద్ధానికి తమ సైనికులను పంపి వారిని కోల్పోలేనని తెలిపారు. డ్యుటెర్టె తాజా వ్యాఖ్యలను చూస్తుంటే ఈ దేశం అమెరికాకు దూరం జరిగేలా ఉందని పరిశీలకులు అంటున్నారు.
దక్షిణచైనా సముద్రంలోని దీవులపై చైనా, ఫిలిప్పిన్స్‌లకు తగాదా ఉన్న విషయం తెలిసిందే. చైనా అక్కడ కృత్తిమ దీవులను సృష్టిస్తూ తీరప్రాంత దేశాలతో ఘర్షణ వాతారవరణం రేపింది. దీంతో వియత్నాం, ఫిలిప్పిన్స్ తదితర దేశాల తరపున అమెరికా నిలిచింది. గత నెలలో ఫిలిప్పిన్స్, చైనాల మధ్య సముద్ర ప్రయాణ విషయమై ఘర్షణ జరిగింది. దీన్ని చిన్న సముద్ర ప్రమాదంగా డ్యుటెర్టె అభివర్ణించారు. చైనాపై సున్నిత విమర్శలు చేస్తున్న డ్యుటెర్టె ఇదివరకూ కూడా అమెరికా తీరుపై విమర్శలు గప్పించాడు. అమెరికా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందని, తన మిత్రదేశాలపై గౌరవం లేదని అన్నారు.
కాగా డ్యుటెర్టె అమెరికాపై తరచూ ఆగ్రహం వ్యక్తం చేయడాని వేరే కారణం ఉందని పరిశీలకులు అంటున్నారు. డ్యుటెర్టె దేశంలో డ్రగ్స్ ముఠాపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. వేలాదిమందిని డ్రగ్స్ పేరుతో డ్యుటెర్టె చంపుతున్నారని అమెరికా ఆధారిత మానవహక్కుల సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. అలాగే డ్రగ్స్ ముఠాకు వ్యతిరేకంగా రైఫిల్స్‌ను ఫిలిప్పిన్స్‌కు అమ్మడానికి అమెరికా ఒప్పుకోలేదు. ఇవన్నీ మనసులో పెట్టుకున్న ఆయన ఇలా వీలు దొరికినప్పుడల్లా అమెరికాను ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్నాడని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment