నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్
ఫిబ్రవరి టోకు ధరల ద్రవ్యోల్బణం 9 నెలల కనిష్టస్థాయికి తగ్గిందన్న వార్తలతో శుక్రవారం ముగింపులో స్టాక్ సూచీలు తొలి నష్టాల నుంచి కోలుకుని ముగిసాయి. ఉక్రయిన్-రష్యాల ఉద్రిక్తతల ఫలితంగా ప్రపంచమార్కెట్లకు అనుగుణంగా ట్రేడింగ్ తొలిదశలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 200 పాయింట్ల వరకూ నష్టపోయి 21,573 పాయింట్ల కనిష్టస్థాయిని తాకింది. తదుపరి ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లతో పాటు రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, మెటల్ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో చివరకు 35 పాయింట్ల లాభంతో 21,810 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. 6,430 పాయింట్ల స్థాయి నుంచి కోలుకున్న ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11 పాయింట్ల పెరుగుదలతో 6,504 పాయింట్ల వద్ద ముగిసింది.
బీహెచ్‌ఈఎల్, లార్సన్ అండ్ టుబ్రోలు 2.5 శాతం ర్యాలీ జరపగా, డీఎల్‌ఎఫ్, జేపీ అసోసియేట్స్ షేర్లు 3.5 శాతంపైగా పెరిగాయి. టాటా స్టీల్, జిందాల్ స్టీల్‌లు 1.5 శాతం, డాక్టర్ రెడ్డీస్ లాబ్, సిప్లాలు 1.5 శాతం చొప్పున ఎగిసాయి. విప్రో 3 శాతం క్షీణించగా, భారతి ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్‌లు 2 శాతం మేర తగ్గాయి. సూచీల్లో ఎక్కువ వెయిటేజి వున్న రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీలు 1 శాతం పెరగ్గా, క్రితం రోజు భారీగా తగ్గిన ఇన్ఫోసిస్ తాజాగా 1 శాతం మేర కోలుకుంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 982 కోట్లు పెట్టుబడిచేయగా, దేశీయ సంస్థలు రూ. 866 కోట్లు వెనక్కు తీసుకున్నాయి.