ఇక వారానికి రెండు రోజులే పని!! | Venezuela introduces two-day work week | Sakshi
Sakshi News home page

ఇక వారానికి రెండు రోజులే పని!!

Published Wed, Apr 27 2016 1:46 PM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM

వస్త్ర దుకాణాల్లో ఇలా కొవ్వొత్తులతోనే పని కానిస్తున్నారు - Sakshi

వస్త్ర దుకాణాల్లో ఇలా కొవ్వొత్తులతోనే పని కానిస్తున్నారు

పనిభారం ఎక్కువైపోయిందని బాధపడుతున్నారా? అయితే అర్జంటుగా వెనిజువెలా వెళ్లి అక్కడ ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగం చేయండి. ఎందుకంటే, ఆ దేశంలో ప్రభుత్వోద్యోగులకు వారానికి రెండు రోజులే పని!! తీవ్రమైన విద్యుత్ కొరత కారణంగా అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ దేశ ఉపాధ్యక్షుడు అరిస్టోబులో ఇస్తురిజ్ ప్రకటించారు. విద్యుత్ కొరత తీరేవరకు కేవలం సోమ, మంగళ వారాల్లో మాత్రమే ప్రభుత్వోద్యోగులు పనిచేయాలని ఆయన చెప్పారు. ఇటీవలి కాలంలో వెనిజువెలాలో కరువు తాండవిస్తోంది. దాంతో ఆ దేశంలోని ప్రధాన జలవిద్యుత్ కేంద్రం వద్ద కూడా నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. విద్యుత్ ఉత్పత్తి పడిపోవడంతో.. సరఫరాను తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టారు.

దాదాపు 20 లక్షల మంది ఉద్యోగులు వారానికి నాలుగైదు రోజులు రాకపోతే.. ఆ మేరకు విద్యుత్ వాడకం తగ్గుతుందని ఈ ఐడియా వేశారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన అందరికీ బుధ, గురు, శుక్రవారాల్లో కూడా సెలవలు ఇస్తున్నట్లు ఉపాధ్యక్షుడు చెప్పారు. ఏప్రిల్, మే నెలల్లో విద్యుత్ కొరతను అధిగమించేందుకు ఇప్పటికే వెనిజువెలా లోని 28 లక్షల మంది ఉద్యోగులకు శుక్రవారం నాడు సెలవులు ఇస్తున్నట్లు ఇంతకుముందే అధ్యక్షుడు నికొలస్ మదురో ప్రకటించారు. ఎల్‌ నినో కారణంగా అస్సలు వర్షాలు పడటం లేదని, వర్షాలు కురవడం మొదలుపెట్టాక మళ్లీ సాధారణ స్థితి ఏర్పడుతుందని ఆయన అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement