మార్చిలోనే సూరీడు మండిపోతున్నాడు. ఈ ఏడాది వేసవి భగభగలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మండే ఎండలకు తోడు ఎన్నో సమస్యలు ఎదురు కానున్నాయి. వడగాడ్పులు, విద్యుత్ సంక్షోభం, నీటి ఎద్దడి బాధించనున్నాయి. 1901 తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి అత్యంత వేడి నెలగా రికార్డులకెక్కింది. సగటు ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్‌కు దాటాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కొంకణ్, కచ్ ప్రాంతాల్లో ఫిబ్రవరిలోనే వేడి గాడ్పులపై ప్రభుత్వం ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మార్చి నుంచి మే వరకు వడగాడ్పులు తీవ్రంగా ఉంటాయని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో వేసవి గండాన్ని ఎలా ఎదుర్కొంటామన్న ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 6న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి వేసవిని ఎదుర్కోవడానికి కావాల్సిన సన్నద్ధతలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్య నిపుణులు, స్థానిక అధికారులు, విపత్తు నిర్వహణ బృందాలతో కలిసి వేసవి కాలాన్ని ఎదుర్కోవడానికి ఏమేం చర్యలు చేపట్టాలన్న దానిపై చర్చించారు.
ఏయే ప్రాంతంలో వడగాడ్పులు ఉండబోతున్నాయి
మార్చి నుంచి మే వరకు దేశంలో ఉక్కబోత భరించలేనంతగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో ఎండ వేడిమి ఎక్కువగా ఉంటుంది.మధ్య భారతం, వాయవ్య రాష్ట్రాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశాలున్నాయి. ఉత్తరాదితో పోల్చి చూస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా నమోదవుతాయి. ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐపీసీసీ) అంచనాల ప్రకారం వడగాడ్పులు తరచుగా వీస్తాయి. రానున్న సంవత్సరాల్లో ఎండవేడిమి మరింతగా పెరిగిపోతుంది.
ఈ ఏడాది ఫసిఫిక్ మహాసముద్రంలో కాలానుగుణంగా వచ్చే మార్పుల కారణంగా ఎల్‌నినో పరిస్థితి ఏర్పడుతుందని అందువల్ల వేసవికాలం మరింత వేడిగా మారుతుందని అంచనాలున్నాయి. ఎల్‌నినో సంవత్సరాల్లో పంట దిగుబడి లేక కరువు కాటకాలు ఏర్పడతాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ఏళ్లు గడుస్తున్న కొద్దీ వేసవి కాలం ఎదుర్కోవడం అత్యంత దుర్లభంగా మారుతోందని హెల్త్ అండ్ క్లైమేట్ రెసిలెన్స్ ఎన్‌ఆర్‌డీసీ ఇండియా చీఫ్ అభియంత్ తివారీ చెప్పారు. గత ఏడాది మార్చి 100 ఏళ్లలోనే అత్యంత వేడి మాసంగా నమోదైతే, ఈ ఏడాది ఫిబ్రవరి 122 ఏళ్ల రికార్డుల్ని బద్దలు కొట్టిందని అన్నారు. ఈ సారి వేసవిలో వడగాడ్పులు ఎక్కువగా ఉండడంతో గోధుమ పంటపై తీవ్ర ప్రభావం పడుతుందని, దీంతో ఆహార సంక్షోభం, నిత్యావసర ధరలు పెరిగిపోవడం వంటివి జరగనున్నాయని ఆయన అంచనా వేశారు.
విద్యుత్ కోతలు తప్పవా..?
గత ఏడాది వేసవి కాలంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకొని సంక్షోభం ఎదురైంది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి పునరావృతమయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో అత్యధికంగా విద్యుత్ డిమాండ్ 229 గిగావాట్లకు చేరుకోవచ్చునని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనా వేసింది. ఇక రాత్రి వేళల్లో కూడా 217 గిగావాట్లకు విద్యుత్ వినియోగం చేరుకునే అవకాశాలున్నాయి. గత ఏడాది ఏప్రిల్‌లో రాత్రిపూట విద్యుత్ వినియోగం కంటే ఇది చాలా ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల వల్ల గ్రిడ్లపై ఒత్తిడి పెరిగిపోతుందని గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తెలిపింది. థర్మల్ విద్యుత్ ప్లాంట్లకి బొగ్గు కొరత, జల విద్యుత్ ప్రాజెక్టులకి నీటి కొరత కారణంగా ఈ సారి వేసవి కూడా పెను విద్యుత్ సంక్షోభానికి దారి తీసే అవకాశాలున్నాయి.
ఒడిశా బాటలో...
మన దేశంలో ఒడిశా వేసవికాలంలో ఎదురయ్యే సమస్యల్ని ఒక ప్రణాళికా బద్ధంగా ఎదుర్కొని విజయం సాధించింది. ఇప్పటివరకు ఒడిశా మాత్రమే వేసవికాలాన్ని కూడా ఒక ప్రకృతి విపత్తుగా అధికారికంగా ప్రకటించింది. 1998లో వేసవికాంలో వడదెబ్బకు ఏకంగా 2,042 మంది పిట్టల్లా రాలిపోయారు. ఆ తర్వాత ఏడాది వడదెబ్బ మృతుల సంఖ్య 91కి, తర్వాత ఏడాదికి 41కి తగ్గించగలిగింది.
దీనికి ఒడిశా ప్రభుత్వం చేసిందల్లా ఎండ తీవ్రత ఉన్నప్పుడు బయట ఎవరూ తిరగకూడదంటూ నిబంధనలు విధించింది. మిట్ట మధ్యాహ్నం సమయంలో ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూసేసింది. రాష్టంలోని వీధివీధిలోనూ చలివేంద్రాలు, పందిళ్లు ఏర్పాటు చేసింది. విద్యుత్ కోతలు లేకుండా, నీటికి ఇబ్బంది లేకుండా ముందుగా ఏర్పాట్లు చేస్తూ వచ్చింది. సూర్యుడు అస్తమించిన తర్వాత రాత్రిపూట పనులు చేసేలా చర్యలు తీసుకుంది. వడదెబ్బతో మరణించే వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటోంది. దీంతో ఇతర రాష్ట్రాలు కూడా ఒడిశా బాటలో నడిస్తే మంచిదన్న అభిప్రాయాలైతే వినిపిస్తూ ఉన్నాయి.
వేసవి ప్రభావం ఇలా..
► ప్రపంచ బ్యాంకు 2022లో ఇచ్చిన నివేదిక ప్రకారం భారత్‌లో వేసవి మరణాలు ఇక అధికం కానున్నాయి. కాంక్రీట్ జంగిళ్లుగా మారిన నగరాలు వడగాడ్పులతో వేడెక్కనున్నాయి.
► ఎండవేడిమికి 2000–04 నుంచి 2017–21 మధ్య 55శాతం మరణాలు పెరిగిపోయాయి.
► 2021లో ఎండలకి 16,700 కోట్ల కార్మికుల పని గంటలు వృథా అయ్యాయి.
► ఎండాకాలంలో కార్మికులు పనుల్లోకి వెళ్లకపోవడం వల్ల దేశ జీడీపీలో గత ఏడాది 5.4% ఆదాయం తగ్గిపోయింది.
► 2022లో దేశవ్యాప్తంగా 203 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో వడగాడ్పులు వీచాయి. వందేళ్ల తర్వాత ఇదే అత్యధికం
► ఉత్తరాఖండ్‌లో అత్యధికంగా 28 రోజులు, రాజస్తాన్‌లో 26 రోజులు, పంజాబ్, హరియాణాలో 34 రోజులు చొప్పున వడగాడ్పులు వీచాయి.
► వేసవికాలం వచ్చిందంటే కార్చిచ్చుల సమస్య వేధిస్తుంది. 2017లో కొండప్రాంతంలో ఉన్న ఉత్తరాఖండ్‌లో 1,244 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని కార్చిచ్చులు దహిస్తే 2021 నాటికి మూడు రెట్లు ఎక్కువగా 3,927 హెక్టార్లు కార్చిచ్చుతో నాశనమయ్యాయి.
► ఇప్పటికే హిమానీనదాలు కరిగిపోతూ ఉండడంతో సముద్ర తీర ప్రాంతాలు ముప్పులో ఉన్నాయి. వేసవిలో ఎండ ఎక్కువగా ఉంటే మరింత మంచు కరిగి ముప్పు తీవ్రత ఎక్కువైపోతుంది
► ఢిల్లీ రాజధాని ప్రాంతంలో గత ఏడాది ఎంత తీవ్రతకి 300 పిట్టలు మృతి చెందాయి. వన్యప్రాణులు దాహార్తిని తీర్చుకోవడానికి ఊళ్లపై పడి బీభత్సం సృష్టించే ఘటనలు పెరిగిపోతాయి.
► వేసవి కాలం ఎండలు ఎక్కువ ఉండడం రబీ సీజన్ పంటలపై తీవ్రంగా ç్రప్రభావం పడుతుంది. ముఖ్యంగా ప్రపంచ గోధుమ ఎగుమతుల్లో రెండో స్థానంలో ఉన్న భారత్‌లో ఈ ఏడాది గోధుమ దిగుబడిపై ప్రభావం ఉంటుందనే ఆందోళనలున్నాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment