దేశంలో కొత్తగా ప్రారంభమైన ‘మిషన్ మౌసం’ ప్రాజెక్ట్
రూ.2 వేల కోట్లతో కొత్త తరం సెన్సార్లు, రాడార్లు, శాటిలైట్ వ్యవస్థల విస్తరణ
కృత్రిమ మేఘాల అభివృద్ధికి ప్రత్యేక లేబొరేటరీ
ఇప్పుడున్న ‘ఫోర్‌కాస్ట్’ స్థానంలో‘నౌకాస్ట్’ అంచనాలు
సంఖ్యా వాతావరణ సూచనల్ని 12 కి.మీ. నుంచి 6 కి.మీ.కి తగ్గించేందుకు చర్యలు
సాక్షి, అమరావతి: వాతావరణ పరిస్థితులను మరింత సమర్థంగా.. కచ్చితంగా అంచనా వేసేందుకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సరికొత్తగా సిద్ధమవుతోంది. ఇందుకోసం ‘మిషన్ మౌసం’ పేరుతో అత్యాధునిక ప్రాజెక్టును ప్రారంభించింది. పర్యావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనూహ్య వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్న విషయం తెలిసిందే.
ఇలాంటి వాతావరణ పరిస్థితులను ముందుగానే గుర్తించి.. కచ్చితమైన అంచనాలను విడుదల చేయడం కోసం ఈ ప్రాజెక్టును చేపట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఈ ప్రాజెక్టును ప్రారంభించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక టెక్నాలజీని ఈ ప్రాజెక్టు కోసం ఉపయోగించుకోవడానికి సన్నద్ధమయ్యారు. ‘మిషన్ మౌసం’ ద్వారా వచ్చే ఐదేళ్లలో రూ.2 వేల కోట్లను ఖర్చు పెట్టాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కచ్చితమైన అంచనా కోసం..
వాతావరణ ప్రక్రియల్లో సంక్లిష్టత, పరిశీలనలు, మోడలింగ్ ప్రక్రియల్లో పరిమితుల కారణంగా ఉష్ణ మండల వాతావరణం ముందస్తుగా అంచనా వేయడం ఇబ్బందికరంగా మారింది. సమాచారం విస్తృతంగా లేకపోవడం, సంఖ్యా వాతావరణ (న్యూమరికల్ వెదర్) పరిధిలో 12 కిలోమీటర్లు మాత్రమే ఉండటంతో స్వల్పకాలిక వాతావరణ మార్పులను అంచనా వేయడం సవాల్‌గా మారిందని వాతావరణ శాఖ భావిస్తోంది.
అందువల్లే భారీ వర్షాలు, వరదలు, కరువు, మేఘాల విస్ఫోటాలు, ఉరుములు, పిడుగుపాట్లు, కుంభవృష్టి వంటి వాటిని కచ్చితంగా అంచనా వేయడం అసాధ్యంగా మారుతోంది. ఇందుకోసమే సంఖ్యా వాతావరణ సూచనల్ని(ఎన్డడబ్ల్యూపీ–న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్) పరిధిని 6 కిలోమీటర్లకు తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
‘ఫోర్‌కాస్ట్’ స్థానంలో ‘నౌకాస్ట్’
కాగా.. గ్రామీణ ప్రాంతాలకు వాతావరణ అంచనాలను చేర్చడం మరో ప్రధాన లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. తద్వారా వ్యవసాయానికి అవసరమైన కచ్చితమైన అంచనాలు అందించాలని భావిస్తున్నారు. ఇప్పుడు ఫోర్‌కాస్ట్ (ముందస్తు అంచనాలు) స్థానంలో నౌకాస్ట్ (తక్షణ అంచనాలు) వ్యవస్థను వచ్చే ఐదేళ్లలో అమల్లోకి తీసుకురానున్నారు.
ప్రస్తుతం నౌకాస్ట్‌ను మూడు గంటలు ముందుగా ఇస్తుండగా.. దాన్ని ఒక గంటకు తగ్గించాలని భావిస్తున్నారు. వాతావరణ మార్పులపై సమర్థ అవగాహన, ముందస్తు అంచనాల నిర్వహణకు సంబంధించి భారత వాతావరణ శాఖ (ఐఎండీ), ఉష్ణమండల వాతావరణ కేంద్రం (ఐఐటీఎం), మధ్యస్థ శ్రేణి వాతావరణ ముందస్తు అంచనాల కేంద్రం (ఎన్‌సీఎంఆర్‌డబ్ల్యూఎఫ్) కలిసి ఈ మిషన్‌లను అమలు చేయనున్నాయి.
కృత్రిమ మేఘాల కోసం ల్యాబ్
మిషన్ మౌసంలో భాగంగా కృత్రిమ మేఘాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక లేబొరేటరీని ఐఎండీ ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ఉన్న రాడార్ల సంఖ్యను భారీగా పెంచడం, కొత్త శాటిలైట్ వ్యవస్థలు, అత్యంత వేగంగా పనిచేసే సూపర్ కంప్యూటర్లు వంటి వాటిని సమకూర్చుకోనుంది. వచ్చే ఐదేళ్లలో ఈ మిషన్‌ను రెండు దశల్లో చేపట్టనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
తొలి దశలో 70 డాప్లర్ రాడార్లు, 10 విండ్ ప్రొఫెలర్లు
తొలి దశలో మార్చి 2026 నాటికి పరిశీలనాత్మక నెట్‌వర్క్‌ను విస్తరించాలని భావిస్తున్నారు. వీటిలో దాదాపు 70 డాప్లర్ రాడార్లు, సూపర్ కంప్యూటర్లు, 10 విండ్ ప్రొఫెలర్లు, 10 రేడియో మీటర్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక
రూపొందించారు. ఇప్పటివరకు 39 డాప్లర్ రాడార్లను ఐఎండీ ఏర్పాటు చేసింది. విండ్ ప్రొఫెలర్లు మాత్రం అందుబాటులో లేవు.
రెండో దశలో పరిశీలనాత్మక కేంద్రాలను మరింత పటిష్టం చేసేందుకు శాటిలైట్లు, విమానాలను ఉపయోగించాలని భావిస్తున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేళ.. మెటీయరాలజీ (ఐఐటీఎం)లో క్లౌడ్ చాంబర్ ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాదిన్నరలో దీన్ని పూర్తి చేయనున్నారు. మధ్యస్థ శ్రేణి వాతావరణ అంచనాల కచ్చితత్వాన్ని ఐదు నుంచి పది శాతానికి పెంచడమే లక్ష్యంగా ఈ మిషన్‌ను చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment