Intergovernmental Panel on Climate Changes
-
మార్చిలోనే మండుతున్న సూరీడు.. భగభగ పక్కా! తీవ్రమైన వడగాడ్పులు
మార్చిలోనే సూరీడు మండిపోతున్నాడు. ఈ ఏడాది వేసవి భగభగలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మండే ఎండలకు తోడు ఎన్నో సమస్యలు ఎదురు కానున్నాయి. వడగాడ్పులు, విద్యుత్ సంక్షోభం, నీటి ఎద్దడి బాధించనున్నాయి. 1901 తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి అత్యంత వేడి నెలగా రికార్డులకెక్కింది. సగటు ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్‌కు దాటాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కొంకణ్, కచ్ ప్రాంతాల్లో ఫిబ్రవరిలోనే వేడి గాడ్పులపై ప్రభుత్వం ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్చి నుంచి మే వరకు వడగాడ్పులు తీవ్రంగా ఉంటాయని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో వేసవి గండాన్ని ఎలా ఎదుర్కొంటామన్న ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 6న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి వేసవిని ఎదుర్కోవడానికి కావాల్సిన సన్నద్ధతలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్య నిపుణులు, స్థానిక అధికారులు, విపత్తు నిర్వహణ బృందాలతో కలిసి వేసవి కాలాన్ని ఎదుర్కోవడానికి ఏమేం చర్యలు చేపట్టాలన్న దానిపై చర్చించారు. ఏయే ప్రాంతంలో వడగాడ్పులు ఉండబోతున్నాయి మార్చి నుంచి మే వరకు దేశంలో ఉక్కబోత భరించలేనంతగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో ఎండ వేడిమి ఎక్కువగా ఉంటుంది.మధ్య భారతం, వాయవ్య రాష్ట్రాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశాలున్నాయి. ఉత్తరాదితో పోల్చి చూస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా నమోదవుతాయి. ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐపీసీసీ) అంచనాల ప్రకారం వడగాడ్పులు తరచుగా వీస్తాయి. రానున్న సంవత్సరాల్లో ఎండవేడిమి మరింతగా పెరిగిపోతుంది. ఈ ఏడాది ఫసిఫిక్ మహాసముద్రంలో కాలానుగుణంగా వచ్చే మార్పుల కారణంగా ఎల్‌నినో పరిస్థితి ఏర్పడుతుందని అందువల్ల వేసవికాలం మరింత వేడిగా మారుతుందని అంచనాలున్నాయి. ఎల్‌నినో సంవత్సరాల్లో పంట దిగుబడి లేక కరువు కాటకాలు ఏర్పడతాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ఏళ్లు గడుస్తున్న కొద్దీ వేసవి కాలం ఎదుర్కోవడం అత్యంత దుర్లభంగా మారుతోందని హెల్త్ అండ్ క్లైమేట్ రెసిలెన్స్ ఎన్ఆర్డీసీ ఇండియా చీఫ్ అభియంత్ తివారీ చెప్పారు. గత ఏడాది మార్చి 100 ఏళ్లలోనే అత్యంత వేడి మాసంగా నమోదైతే, ఈ ఏడాది ఫిబ్రవరి 122 ఏళ్ల రికార్డుల్ని బద్దలు కొట్టిందని అన్నారు. ఈ సారి వేసవిలో వడగాడ్పులు ఎక్కువగా ఉండడంతో గోధుమ పంటపై తీవ్ర ప్రభావం పడుతుందని, దీంతో ఆహార సంక్షోభం, నిత్యావసర ధరలు పెరిగిపోవడం వంటివి జరగనున్నాయని ఆయన అంచనా వేశారు. విద్యుత్ కోతలు తప్పవా..? గత ఏడాది వేసవి కాలంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకొని సంక్షోభం ఎదురైంది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి పునరావృతమయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో అత్యధికంగా విద్యుత్ డిమాండ్ 229 గిగావాట్లకు చేరుకోవచ్చునని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనా వేసింది. ఇక రాత్రి వేళల్లో కూడా 217 గిగావాట్లకు విద్యుత్ వినియోగం చేరుకునే అవకాశాలున్నాయి. గత ఏడాది ఏప్రిల్‌లో రాత్రిపూట విద్యుత్ వినియోగం కంటే ఇది చాలా ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల వల్ల గ్రిడ్లపై ఒత్తిడి పెరిగిపోతుందని గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తెలిపింది. థర్మల్ విద్యుత్ ప్లాంట్లకి బొగ్గు కొరత, జల విద్యుత్ ప్రాజెక్టులకి నీటి కొరత కారణంగా ఈ సారి వేసవి కూడా పెను విద్యుత్ సంక్షోభానికి దారి తీసే అవకాశాలున్నాయి. ఒడిశా బాటలో... మన దేశంలో ఒడిశా వేసవికాలంలో ఎదురయ్యే సమస్యల్ని ఒక ప్రణాళికా బద్ధంగా ఎదుర్కొని విజయం సాధించింది. ఇప్పటివరకు ఒడిశా మాత్రమే వేసవికాలాన్ని కూడా ఒక ప్రకృతి విపత్తుగా అధికారికంగా ప్రకటించింది. 1998లో వేసవికాంలో వడదెబ్బకు ఏకంగా 2,042 మంది పిట్టల్లా రాలిపోయారు. ఆ తర్వాత ఏడాది వడదెబ్బ మృతుల సంఖ్య 91కి, తర్వాత ఏడాదికి 41కి తగ్గించగలిగింది. దీనికి ఒడిశా ప్రభుత్వం చేసిందల్లా ఎండ తీవ్రత ఉన్నప్పుడు బయట ఎవరూ తిరగకూడదంటూ నిబంధనలు విధించింది. మిట్ట మధ్యాహ్నం సమయంలో ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూసేసింది. రాష్టంలోని వీధివీధిలోనూ చలివేంద్రాలు, పందిళ్లు ఏర్పాటు చేసింది. విద్యుత్ కోతలు లేకుండా, నీటికి ఇబ్బంది లేకుండా ముందుగా ఏర్పాట్లు చేస్తూ వచ్చింది. సూర్యుడు అస్తమించిన తర్వాత రాత్రిపూట పనులు చేసేలా చర్యలు తీసుకుంది. వడదెబ్బతో మరణించే వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటోంది. దీంతో ఇతర రాష్ట్రాలు కూడా ఒడిశా బాటలో నడిస్తే మంచిదన్న అభిప్రాయాలైతే వినిపిస్తూ ఉన్నాయి. వేసవి ప్రభావం ఇలా.. ► ప్రపంచ బ్యాంకు 2022లో ఇచ్చిన నివేదిక ప్రకారం భారత్‌లో వేసవి మరణాలు ఇక అధికం కానున్నాయి. కాంక్రీట్ జంగిళ్లుగా మారిన నగరాలు వడగాడ్పులతో వేడెక్కనున్నాయి. ► ఎండవేడిమికి 2000–04 నుంచి 2017–21 మధ్య 55శాతం మరణాలు పెరిగిపోయాయి. ► 2021లో ఎండలకి 16,700 కోట్ల కార్మికుల పని గంటలు వృథా అయ్యాయి. ► ఎండాకాలంలో కార్మికులు పనుల్లోకి వెళ్లకపోవడం వల్ల దేశ జీడీపీలో గత ఏడాది 5.4% ఆదాయం తగ్గిపోయింది. ► 2022లో దేశవ్యాప్తంగా 203 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో వడగాడ్పులు వీచాయి. వందేళ్ల తర్వాత ఇదే అత్యధికం ► ఉత్తరాఖండ్‌లో అత్యధికంగా 28 రోజులు, రాజస్తాన్‌లో 26 రోజులు, పంజాబ్, హరియాణాలో 34 రోజులు చొప్పున వడగాడ్పులు వీచాయి. ► వేసవికాలం వచ్చిందంటే కార్చిచ్చుల సమస్య వేధిస్తుంది. 2017లో కొండప్రాంతంలో ఉన్న ఉత్తరాఖండ్‌లో 1,244 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని కార్చిచ్చులు దహిస్తే 2021 నాటికి మూడు రెట్లు ఎక్కువగా 3,927 హెక్టార్లు కార్చిచ్చుతో నాశనమయ్యాయి. ► ఇప్పటికే హిమానీనదాలు కరిగిపోతూ ఉండడంతో సముద్ర తీర ప్రాంతాలు ముప్పులో ఉన్నాయి. వేసవిలో ఎండ ఎక్కువగా ఉంటే మరింత మంచు కరిగి ముప్పు తీవ్రత ఎక్కువైపోతుంది ► ఢిల్లీ రాజధాని ప్రాంతంలో గత ఏడాది ఎంత తీవ్రతకి 300 పిట్టలు మృతి చెందాయి. వన్యప్రాణులు దాహార్తిని తీర్చుకోవడానికి ఊళ్లపై పడి బీభత్సం సృష్టించే ఘటనలు పెరిగిపోతాయి. ► వేసవి కాలం ఎండలు ఎక్కువ ఉండడం రబీ సీజన్ పంటలపై తీవ్రంగా ç్రప్రభావం పడుతుంది. ముఖ్యంగా ప్రపంచ గోధుమ ఎగుమతుల్లో రెండో స్థానంలో ఉన్న భారత్‌లో ఈ ఏడాది గోధుమ దిగుబడిపై ప్రభావం ఉంటుందనే ఆందోళనలున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
IPCC: వాతావరణ మార్పులతో దేశాలన్నీ అతలాకుతలం
వాతావరణ మార్పులు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. దీని ప్రభావంతో వచ్చిపడుతున్న అకాల వరదలు, కరువులతో దేశాలకు దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. అపార ఆస్తి, ప్రాణ నష్టాలతో అల్లాడుతున్నాయి.æ అతి తీవ్ర వాతావరణ పరిస్థితులు తరచూ తలెత్తుతాయని, వాటి తీవ్రత కూడా గతం కంటే అత్యంత ఎక్కువగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని వాతావరణ మార్పుల ప్యానల్ (ఐపీసీసీ) వేసిన అంచనాలు నూటికి నూరు శాతం నిజమవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ► వారాంతపు వరదలతో ఆస్ట్రేలియా అల్లాడింది. దేశంలో చాలాచోట్ల ఇంకా కుండపోత కొనసాగుతూనే ఉంది. మరికొన్ని రోజుల పాటు అతి తీవ్ర వర్షాలు తప్పవంటూ వాతావరణ విభాగం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ► మధ్య ఆఫ్రికా దేశమైన చాద్ రిపబ్లిక్‌ది విచిత్ర పరిస్థితి. నిన్నామొన్నటిదాకా దుర్భరమైన కరువుతో దేశమంతా అల్లాడిపోయింది. ఇప్పుడేమో గత 30 ఏళ్లలో ఎన్నడూ కనీవినీ ఎరగని స్థాయిలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. ► థాయ్‌లాండ్‌ను కూడా నెల రోజులుగా భారీ వరదలు ఊపిరి సలపనివ్వడం లేదు. 77 రాష్ట్రాలకు గాను ఏకంగా 59 రాష్ట్రాలు వరద బారిన పడ్డాయి. 4.5 లక్షల ఇళ్లు దెబ్బ తినడమో కూలిపోవడమో జరిగింది. 40 శాతం ప్రాంతాలు ఇంకా మునకలోనే ఉన్నాయి. తాజాగా సోమవారం 8 దక్షిణాది రాష్ట్రాలకు భారీ వరద హెచ్చరికలు జారీ అయ్యాయి! ► ఫిలిప్పీన్స్దీ ఇదే పరిస్థితి. తుఫాను కారణంగా వర్షాలు దేశాన్ని ముంచెత్తుతున్నాయి. ► భారీ వరదలతో మెక్సికో తీరం అల్లాడుతోంది. ► భారత్‌లోనూ తుఫాన్ల దెబ్బకు ఢిల్లీ, బెంగళూరు అల్లాడిపోయాయి. హైదరాబాద్‌నైతే కొన్ని వారాలుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కారణాలెన్నో...! గ్లోబల్ వార్మింగ్ మొదలుకుని మితిమీరిపోయిన శిలాజ ఇంధన వాడకం దాకా తాజా వాతావరణ మార్పులకు కారణాలెన్నో! ప్రధాన కాలుష్య కారణమైన కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలకు 90 శాతం దాకా శిలాజ ఇంధనమే కారణమవుతోంది. అడవుల విచ్చలవిడి నరికివేత, అడ్డూ అదుపు లేకుండా సాగుతున్న పెట్రో ఉత్పత్తుల వెలికితీత వంటివి కూడా ఇందుకు దోహదపడుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు మరో పదేళ్లలో భూమి సగటు ఉష్ణోగ్రత ఏకంగా 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా పెరిగితే ఆశ్చర్యం లేదని ఐపీసీసీ సర్వే హెచ్చరించింది! ‘‘ఇప్పటికైతే వాతావరణ మార్పులు అకాల వర్షాలకు, భారీ వరదలకు కారణంగా మారుతున్నాయి. వర్షపాతపు తీరుతెన్నులను కూడా అవి చాలావరకు మార్చేస్తున్నాయి’’ అని వివరించింది. నైజీరియాలో వరదలు.. 600కు చేరిన మరణాలు అబూజా: ఆఫ్రికా దేశం నైజీరియాలో ఈ సీజన్లో ఆగస్ట్ నుంచి సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా 603 మంది మృతి చెందారు. దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలకు గాను 33 రాష్ట్రాల్లో వరదలతో అతలాకుతలమవుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మారకుంటే మరుభూమే!
ఇంట్లోంచి బయటికెళ్లాలంటే ఒంటి నిండా సూట్.. అదీ ఎయిర్ కూల్ది. చిన్నవాగుల్లా మారిపోయిన పెద్ద నదులు.. మామూలు పొలాలన్నీ మాయం.. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే పంటల సాగు.. వాటికి డ్రోన్లతో నీటి సరఫరా.. ఇదంతా ఆదిత్య 369 చిత్రంలో ‘సింగీతం’ చూపించిన భవిష్యత్ ఊహాలోకం. ఆ సినిమాలోనే కాదు.. నిజంగానే మన భవిష్యత్ అలా ఉండబోతోందని.. మన భూమి మీద మనమే గ్రహాంతర వాసుల్లా జీవించాల్సి వస్తుందని తాజా పరిశోధన చెబుతోంది. ఆ వివరాలేంటో తెలుసుకుందామా.. –సాక్షి, సెంట్రల్‌డెస్క్ ‘2100’ అంచనాలు చాలవు! ఓవైపు అడవుల నరికివేత.. మరోవైపు కాలుష్యం.. పెరిగిపోతున్న కాంక్రీట్ నిర్మాణాలు.. అన్నీ కలగలిసి రోజురోజుకూ వాతావరణం మారిపోతోంది. భూమి వేడెక్కి (గ్లోబల్ వార్మింగ్).. ఓవైపు తీవ్ర కరువు కాటకాలు, మరోవైపు వరదలు, తుపానులు అల్లకల్లోలం చేస్తున్నాయి. అడవుల నరికివేత ఆపడం, మరింతగా అడవులు పెంచడం, భూమి వేడెక్కేందుకు కారణమయ్యే గ్రీన్‌హౌజ్ వాయువుల (కర్బన ఉద్గారాల)ను తగ్గించడమే దీనికి పరిష్కారం. ఈ దిశగానే పారిస్‌లో జరిగిన ‘ఐపీసీసీ (ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్)’ సదస్సు ఇటీవల పలు లక్ష్యాలను నిర్దేశించుకుంది. 2100వ సంవత్సరం నాటికి భూమి ఉష్ణోగ్రతలో పెరుగుదలను గరిష్టంగా 2 డిగ్రీలకు పరిమితం చేయాలని అన్నిదేశాలు ఓ ఒప్పందానికి వచ్చాయి. కానీ ఈ లక్ష్యాలు సరిపోవని.. భూమిపై జీవనం ప్రమాదంలో పడుతుందని ‘యూఎన్ ఎన్డీసీ (యునైటెడ్ నేషన్స్ అసెస్మెంట్ ఆఫ్ నేషనల్ డెటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్)’ నివేదిక స్పష్టం చేస్తోంది. గ్రహాంతర వాసుల్లా బతకాల్సిందే.. 2500 సంవత్సరం నాటికి మన భూమే మనం ఊహించనంతగా మారిపోతుందని.. మనమే గ్రహాంతర వాసుల్లా బతికే పరిస్థితి వస్తుందని పర్యావరణ సామాజిక శాస్త్రవేత్త క్రిస్టోఫర్ లియోన్, ఆయన సహ పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం చల్లగా ఉండే శీతల ప్రాంతాలు వేడెక్కి ఉష్ణమండల ప్రాంతాల్లా మారిపోతాయని.. ఇప్పుడున్న ఉష్ణమండల ప్రాంతాలు మనుషులు జీవించలేని దుర్భర వేడి ప్రాంతాలుగా మారుతాయని స్పష్టం చేశారు. భూమ్మీద వివిధ ప్రాంతాలకు సంబంధించి ఐదు వందల ఏళ్ల కిందటి పరిస్థితులు, ప్రస్తుతమున్న తీరు, 2500 నాటికి పరిస్థితులను చిత్రాలతో సహా వివరించారు. భవిష్యత్తు అత్యంత ప్రమాదకరం వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్‌పై జరుగుతున్న పరిశోధనలు, లక్ష్యాలన్నీ కూడా 2100 సంవత్సరాన్నే అంచనాలకు ఆధారం (బెంచ్ మార్క్)గా తీసుకుంటున్నాయని యూఎన్ ఎన్డీసీ పేర్కొంది. ప్రపంచ దేశాలు ‘ప్యారిస్ ఐపీసీసీ’ ఒప్పందాన్ని అమలు చేసినా.. ప్రయోజనం తక్కువేనని స్పష్టం చేసింది. భూమి సగటు ఉష్ణోగ్రత 2100 నాటికే 2.2 డిగ్రీల మేర పెరిగితే.. అది 2500వ సంవత్సరం నాటికి 4.6 డిగ్రీలకు చేరుతుందని పేర్కొంది. ఇది భూవాతావరణంలో, వృక్ష, జంతుజాలంలో అత్యంత తీవ్రస్థాయిలో మార్పులకు దారితీస్తుందని వెల్లడించింది. అత్యధిక ఉష్ణోగ్రతలు, కరువులు, కార్చిచ్చులు, తుపానులు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు కమ్ముకుంటాయని హెచ్చరించింది. అందువల్ల మన భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని.. 2500వ సంవత్సరాన్ని మన లక్ష్యాలు, అంచనాలకు ఆధారంగా తీసుకోవాలని సూచించింది. ఇవి చూసైనా మారుతారని..: ఐదు శతాబ్దాల తర్వాతి పరిస్థితిని ఇలా చూసి అయినా గ్లోబల్ వార్మింగ్, కర్బన ఉద్గారాల నియంత్రణ విషయంగా ప్రభుత్వాలు, ప్రజల్లో మార్పు వస్తుందేమో అన్నదే ఈ చిత్రాల ముఖ్య ఉద్దేశమట. భారత్‌లో చండ్ర నిప్పులే.. ►ఇక్కడున్న చిత్రాల్లో మొదటిది ఐదు శతాబ్దాల కిందటి భారతదేశంలో పరిస్థితిని చూపుతోంది. గ్రామాల్లో వ్యవసాయం, వరి పంట, పశువుల వినియోగం, జీవావరణం కలిసి ఉన్న దృశ్యమిది. ►రెండో చిత్రం ప్రస్తుత కాలానిది. అడవులు తగ్గిపోయి.. సాగులో సంప్రదాయ, ఆధునిక మౌలిక సదుపాయాల కలబోతగా ఉన్నది. ►మూడోది భవిష్యత్ (2500 ఏడాది)ను చూపుతోంది. పచ్చదనం తగ్గిపోయి.. ఉష్ణోగ్రతలు, ఎండలు విపరీతంగా పెరిగి.. శరీరాన్ని పూర్తిగా కప్పేస్తున్న సూట్లో బయటికి రావాల్సిన పరిస్థితి. పెరిగిన సాంకేతికతతో రోబోటిక్ వ్యవసాయం చేస్తారని అంచనా. అమెజాన్ నది.. చిన్న వాగులా.. ►ఈ చిత్రం అమెజాన్ నది, దానివెంట ఉన్న భారీ అడవిని చూపుతోంది. ఐదు శతాబ్దాల కింద పూర్తిగా పచ్చదనంతో ఆ ప్రాంతం కళకళలాడుతోంది. ►అక్కడ ప్రస్తుతమున్న పరిస్థితి చూపుతున్నది రెండో చిత్రం. అభివృద్ధి పేరిట వేసిన రోడ్లు, ఇతర నిర్మాణాలతో తగ్గిపోయిన పచ్చదనం కనిపిస్తోంది. ►మూడో చిత్రం భవిష్యత్తు భయానక దుస్థితిని చూపుతోంది. ప్రపంచంలోనే పెద్దదైన అమెజాన్ నది చిన్నవాగులా మారిపోవడం, అంత దట్టమైన అడవి నామరూపాల్లేకుండా పోవడం, పంటలు కూడా లేకుండా నిర్జీవంగా మారిన దుస్థితి కనిపిస్తోంది. -
Climate Change: కలిసి కదిలితేనే భూ రక్ష!
అనుమానాలకు తావు లేదిప్పుడు... చూద్దాం.. చేద్దామన్న పోకడనూ మరచిపోండి!! వాతావరణ మార్పులన్నవి ముమ్మాటికీ నిజం. నిజం. నిజం!! ధోరణి మారకుంటే.. భావితరాలు ఈ భూమ్మీద.. బతకడం కష్టమేనని గుర్తుంచుకోండి!! ప్రకృతిని తద్వారా మనల్ని మనం కాపాడుకునేందుకు... ఈ క్షణం నుంచే సంకల్పం చెప్పుకోండి. కంకణం కట్టుకోండి!! వ్యక్తులుగా మీరు చేసే చిన్న చిన్న పనులు ప్రపంచానికొచ్చిన పెనువిపత్తును తప్పించగలవా అన్న సంశయమూ వద్దు!! కెనడాలో 50 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు.. జర్మనీలో అకాల వర్షాలు, వరదలు.. చైనాలో వెయ్యేళ్ల రికార్డులు తిరగరాస్తూ కుంభవృష్టి!! ఇవన్నీ ఏవో కాకతాళీయంగా జరిగిన సంఘటనలని కొందరు అనుకోవచ్చు కానీ.. భూతాపోన్నతితో వచ్చిన వాతావరణ మార్పులకు ప్రత్యక్ష నిదర్శనాలీ ఘటనలన్నవి సుస్పష్టం. వాతావరణ మార్పుల ప్రభావంపై అధ్యయనం చేస్తున్న ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్‌క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) తాజా నివేదిక కూడా.. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం, అటవీ విస్తీర్ణంలో తగ్గుదల, కాలుష్యం తదితర కారణాల వల్ల భూమి సగటు ఉష్ణోగ్రత.. క్రమేపీ పెరిగిపోతోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే... కార్చిచ్చులు, కుంభవృష్టి, అకాల వర్షాల్లాంటి ప్రకృతి విపత్తులు మరింత ఎక్కువ అవడం గ్యారంటీ అని స్పష్టం చేసింది. ఈ విషయం చాలాకాలంగా తెలిసినప్పటికీ ఐపీసీసీ తాజా నివేదిక మరోసారి రూఢీ చేయడమే కాకుండా... తుది ప్రమాద హెచ్చరికల్లాంటివి జారీ చేసింది. భూతాపోన్నతిని తగ్గించే చర్యలు తక్షణం చేపట్టకపోతే 2040 కల్లా సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీ సెల్సియస్ పెరగడం తథ్యమని స్పష్టం చేసింది. ఆ... భూమి మొత్తమ్మీద జరిగే పరిణామాలకు నేనేం చేయగలను? ఆ పాట్లేవో మన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాలు పడతారులే అనుకోనవసరం లేదు. ఎందుకంటే.. వ్యక్తులు తమ జీవనశైలిలో చేసుకునే కొన్ని మార్పులు కూడా ఉడతా సాయంగానైనా ఉపకరిస్తాయి. అదెలాగో చూడండి... ఆహార వృథాను అరికట్టండి... మీకు తెలుసా? శిలాజ ఇంధనాల తరువాత భూతాపోన్నతికి కారణమవుతున్న వాటిల్లో ఆహార పరిశ్రమ అతిపెద్దదని? ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే పాడి, మాంసం అనే రెండు అంశాలు వాతావరణ మార్పులకు ఉన్న కారణాల్లో ప్రధానమైనవి, పాడిపశువుల పెంపకానికి ఫీడ్ నీరు, విద్యుత్తు, నేల వంటి వనరులను వినియోగించుకుని పెరగడం ఒక కారణం. అలాగే మాంసం కోసం పెంచే కొన్ని జంతువులు ప్రమాదకరమైన మీథేన్ వాయువును ఎక్కువగా వదులుతాయి. పశువులు పెంచేందుకు వీలుగా కొన్నిచోట్ల అటవీ భూములను చదును చేయడమూ కద్దు! ఇవన్నీ ఒకఎత్తు అయితే... మనం తినే ఆహారాన్ని వృథా చేయడం ఇంకో ఎత్తు. మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా మానవ వినియోగానికి సిద్ధం చేసిన ఆహారంలో కనీసం మూడొంతులు వృథా అవుతోందని? దీని విలువ ఏడాదికి అక్షరాలా లక్షకోట్ల డాలర్లు! ప్రపంచంలో సగం మంది శాఖాహారులుగా మారిపోతే ఏటా తగ్గే కార్బన్డయాక్సైడ్ మోతాదు 660 కోట్ల టన్నులు మనిషి సగటున ఏడాదికి ఐదు టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదల చేస్తాడని అంచనా. కానీ ఇది దేశాన్ని బట్టి మారుతూంటుంది. అమెరికా, దక్షిణ కొరియా వంటి పారిశ్రామిక దేశాల్లో ఇది 16.5 టన్నులు కాగా.. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది 1.6 టన్నులుగా ఉంది. ప్రత్యామ్నాయాలకు జై కొట్టండి... భూతాపోన్నతిని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అంటే సౌర, పవన, జీవ, జల ఇంధనాల వాడకం కచ్చితంగా పెరగాలి. ఇంట్లో బల్బులు, ఫ్యాన్లు తిరిగేందుకు అవసరమైనంతైనా సరే.. సౌరశక్తిని వాడుకోగలిగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఒకప్పుడు దీని ఖరీదు ఎక్కువే కానీ.. 2010 నాటితో పోలిస్తే ఇప్పుడు 73 శాతం చౌక. రకాన్ని బట్టి ఇప్పుడు భారత్‌లో ఒక్కో వాట్ సోలార్ప్యానెల్కు అయ్యే ఖర్చు రూ.23 నుంచి రూ.140 వరకూ ఉంటోంది. ఇంట్లో 20 వాట్ల ఎల్ఈడీలు ఐదు ఉన్నాయనుకుంటే రూ.2300 ఒక ప్యానెల్ కొనుక్కుని వాడుకుంటే చాలు పైగా మనకు సూర్యరశ్మికి అసలు కొదవే లేదు. ప్లాస్టిక్ బాటిల్ స్థానంలో గాజుబాటిల్ వాడినా. వస్త్రంతో తయారైన సంచీలతో సరుకులు, కాయగూరలు తెచ్చుకున్నా... అవసరానికి మంచి దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు కొనకపోయినా... ఇలా మన దైనందిన జీవితంలో ప్రతి చిన్న మార్పూ భూమికి శ్రీరామరక్షగా నిలుస్తుంది!! ఇంట్లో పొదుపు మంత్రం... భూతాపోన్నతిని తగ్గించేందుకు మనమేమీ అదనంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. పైగా ఈ చర్యలు పాటించడం వల్ల నాలుగు డబ్బులు మిగులుతాయి కూడా. ఇంట్లోని ఏసీలో ఉష్ణోగ్రతను 24 స్థాయి నుంచి 26 డిగ్రీలకు పెంచారనుకోండి. మీకు కరెంటు ఆదా.. వాతావరణంలో చేరే కాలుష్యమూ తగ్గుతుంది. అలాగే సాధారణ బల్బుల స్థానంలో సమర్థమైన, చౌకైన, ఎక్కువ కాలం మన్నే ఎల్ఈడీ బల్బులు వాడటమూ ఉభయ ప్రయోజనకరం. ప్రపంచమంతా ఎల్ఈడీలు వాడితే ఏటా 7,800 కోట్ల కర్బన ఉద్గారాలను అడ్డుకోవచ్చు. సూర్యభగవానుడిచ్చే ఎర్రటి ఎండను కాదని వాషింగ్మెషీన్లో డ్రయింగ్ ఆప్షన్‌ను వాడితే భూమికి చేటు చేయడమే కాకుండా.. మీ జేబుకు పడే చిల్లూ ఎక్కువ అవుతుందని గుర్తించండి. ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువుల (టీవీ, మిక్సీ, వాషింగ్‌మెషీన్, ఓవెన్, గీజర్ లాంటివి)ను అవసరం లేనప్పుడు కేవలం స్విచాఫ్ చేయడం కాకుండా... ప్లగ్ తీసి ఉంచడమూ కరెంటును ఆదా చేస్తుందని తెలుసుకోండి. సమర్థమైన ఎల్ఈడీ బల్బులను అందరూ ఉపయోగించడం మొదలుపెడితే అయ్యే ఆదా ఏడాదికి... తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు. వృక్షో రక్షతి రక్షితః... చెట్లను కాపాడుకుంటే అవి మనల్ని రక్షిస్తాయన్న ఈ సంస్కృత నానుడి ఈ రోజుకూ అక్షర సత్యం. ఇల్లు, అపార్ట్మెంట్, బడి, ఆఫీసు ఇలా వీలైనప్రతి చోట మొక్కలు నాటామనుకోండి. వాతావరణంలోని కార్బన్డ యాక్సైడ్‌ను కొంతమేరకైనా తగ్గించవచ్చు. చెట్లు, మహాసముద్రాలు కార్బన్ డయాక్సైడ్ను పీల్చేసుకుని ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండేలా చేయగలవు. కానీ నిమిషానికి పది ఎకరాలకు పైగా అడవులను వివిధ కారణాలతో నరికేస్తున్న పరిస్థితుల్లో వాతావరణంలో విషవాయువుల మోతాదు పెరిగిపోతోంది! అందుకే,అడవులను కాపాడుకోవడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా కోటానుకోట్ల మొక్కలు నాటడం అత్యవసరం. పెట్రోల్, డీజిల్ వాడకానికి కళ్లెం! భూతాపోన్నతికి పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి సహజసిద్ధ ఇంధన వనరుల విచ్చలవిడి వాడకం ప్రధాన కారణం. వీటిని తగ్గిస్తే తద్వారా వాతావరణంలోకి చేరే విష వాయువుల మోతాదు తగ్గి భూతా పోన్నతిని నియంత్రించవచ్చు. ఇరుగు పొరుగు వీధుల్లో పనులకు బైక్‌ల బదులు సైకిళ్లు వాడినా, కాళ్లకు పని చెప్పినా ఈ భూమికి మనవంతు మేలు చేసినట్లే. దూరా భారమైతే సొంత వాహనాల్లో కాకుండా.. బస్సులు, ట్రైన్లను వాడాలని నిపుణులంటున్నారు. విమానాల్లో వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే.. వీలైనంత వరకూ డైరెక్ట్ ఫ్లైట్లను ఎంచుకోవడం మేలు. ఎందుకంటే... విమానాల నుంచి వెలువడే కార్బన్డయాక్సైడ్ టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లోనే ఎక్కువ. మన ప్రయాణంలో కనెక్టింగ్ ఫ్లైట్లు ఉంటే ల్యాండింగ్, టేకాఫ్ ఒకటి కంటే ఎక్కువసార్లు ఉంటాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
భారత్‌కు కరువు, వడగాల్పుల ముప్పు
న్యూఢిల్లీ: హిందూ మహా సముద్రం వేగంగా వేడెక్కుతోందని వాతావరణ మార్పుపై విడుదల చేసిన ఐపీసీసీ నివేదిక హెచ్చరించింది. ఈ ప్రభావంతో భారత్‌లో వడగాలులు, వరదలు పెచ్చురిల్లుతాయని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ మహాసముద్రం వేడెక్కడంతో దేశం చుట్టూ ఉన్న సముద్ర మట్టాలు పెరుగుతాయని, దీనివల్ల లోతట్టు ప్రాంతాలు భారీ వరదలు, ముంపునకు గురవుతాయని, నేలలో తేమ తగ్గడంతో పలు చోట్ల కరువు సంభవిస్తుందని నివేదిక వెల్లడించింది. ఇండియా లాంటి జనసాంద్రత అధికంగా ఉన్న దేశంలో వడగాలులు పెరగడాన్ని ఏరోసాల్స్(గాలిలో ఉండే సూక్ష్మమైన ధూళి కణాలు) కొంతవరకు అడ్డుకుంటాయని, అయితే దీనివల్ల గాలిలో నాణ్యత లోపిస్తుందని తెలిపింది. రాబోయే రోజుల్లో దేశంలో వానలు, వరదలు పెరగడం, హిమనీ నదాలు కరిగిపోవడం, ఇదే సమయంలో సముద్ర మట్టాలు పెరగడం కలగలిపి భారీ ఇక్కట్లు కలగజేస్తాయని హెచ్చరించింది. ఈ పరిణామాలు అంత తొందరగా ఆగకపోవచ్చని నివేదిక రూపకర్తలో ఒకరైన ఫ్రెడరిక్ ఒట్టో చెప్పారు. దేశీయంగా సముద్ర మట్టాల పెరుగుదలకు 50 శాతం కారణం అధిక ఉష్ణోగ్రతలేనని మరో సైంటిస్టు స్వప్న చెప్పారు. 21 శతాబ్దమంతా భారత్ చుట్టూ సముద్ర మట్టాలు పెరగడాన్ని గమనించవచ్చని, అలాగే వందల సంవత్సరాలకు ఒకమారు వచ్చే సముద్ర బీభత్సాలు ఈ శతాబ్దం చివరకు సంభవించవచ్చని అంచనా వేశారు. వచ్చే 20– 30 ఏళ్లలో భారత్‌లో వర్షపాతం పెద్దగా మారకపోవచ్చని కానీ శతాబ్దాంతానికి తేడా వస్తుందని పేర్కొంది. భారత్, దక్షిణాసియాల్లో అసాధారణ రుతుపవన గమనాలుంటాయని ఐపీసీసీ తెలిపింది. దీనివల్ల స్వల్పకాలిక వర్షపాత దినాలు ఎక్కువైతాయని, దీర్ఘకాలిక వర్షదినాలు తగ్గుతాయని తెలిపింది. పట్టణీకరణ(అర్బనైజేషన్)తో పెరుగుతున్న ప్రమాదాలను వివరించింది. మానవ తప్పిదాలే ఈ పరిస్థితులకు కారణమని నివేదిక తెలిపింది. 1970 నుంచి మానవ చర్యల కారణంగా సముద్ర పర్యావరణంలో మార్పులు వస్తున్నాయని, 1990తో పోలిస్తే ఆర్కిటిక్ సముద్రం 40 శాతం కుంచించుకుపోయిందని తెలిపింది. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను గణనీయంగా తగ్గించకపోతే ఊహించని ప్రమాదాలు తప్పవని, ఇప్పటినుంచే మేల్కొని తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. -
మానవాళికి డేంజర్ బెల్స్.. పరిస్థితి విషమిస్తోంది
ప్రపంచ పర్యావరణం ప్రమాదపు అంచున ఉందని, ప్రపంచదేశాలు తగు చర్యలు తీసుకోకపోతే ప్రజలు పారిపోయేందుకు స్థలముండదని ఐరాస నివేదిక హెచ్చరించింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే దశాబ్దంలో ఉష్ణోగ్రతలు గతంలో అనుకున్న ప్రమాద స్థాయిలను మించి పోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. పర్యావరణ పరిస్థితి చేయిదాటిపోతోందని, ‘కోడ్ రెడ్ ఫర్ హ్యుమానిటీ’ పేరిట ఐరాస విడుదల చేసిన నివేదిక రూపకర్త లిండా మెర్న్స్ చెప్పారు. ఈ ఉత్పాతం నుంచి తప్పుకునే అవకాశం లేదని హెచ్చరించారు. ఐరాసకు చెందిన ఐపీసీసీ(ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్) ఈ నివేదికను విడుదల చేస్తుంది. ప్రపంచ పర్యావరణంలో సంభవిస్తున్న ఈ శీతోష్ణస్థితి మార్పు మానవ తప్పిదాల వల్ల జరుగుతోందనేందుకు సందేహమే లేదని ఐపీసీసీ తెలిపింది. 21వ శతాబ్దంలో ఇంతవరకు ఐపీసీసీ ఇలాంటి సీరియస్ అంచనాలను వెలువరించలేదు. రాబోయే ప్రమాదం తప్పిపోవాలంటే పారిస్ ఒప్పందంలో పేర్కొన్న దానికన్నా రెండింతలు అధికంగా, వేగంగా కర్బన ఉద్గారాలను తగ్గించాల్సిఉంటుందన్నారు. 2015 ప్యారిస్ ఒప్పందం ప్రకారం భూఉపరితల ఉష్ణోగత్ర 19వ శతాబ్దపు స్థాయిలకన్నా 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రపంచ నేతలు అంగీకరించారు. ఇప్పటికే ప్రపంచ ఉష్ణోగత్రలు 19వ శతాబ్దపు గరిష్టస్థాయిల కన్నా 1.1 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉన్నాయి. అంటే ప్రపంచం ముప్పునకు చాలా దగ్గరగా ఉందని తెలుస్తోంది. ఐదు మార్గాలు ప్రపంచ కర్బన ఉద్గారాలను కట్టడి చేసే విధానాన్ని బట్టి ఐదు రకాల భవిష్యత్ అంచనాలను నివేదిక ప్రస్తావించింది. 1. ఊహించనంత వేగంగా, భారీగా దేశాలు కాలుష్య నివారణ చర్యలు చేపట్టడం. 2. తీవ్రమైన కాలుష్య నివారణ చర్యలుంటాయి కానీ భారీగా ఉండవు. 3. ఒక మోస్తరుగా ఉద్గారాల నియంత్రణ చేపట్టడం. 4. ప్రస్తుతమున్న స్వల్పకాలిక ప్రణాళికలను కొనసాగించడం. 5. కర్బన ఉద్గారాలు మరింతగా పెరగడం.. అనే ఐదు రకాల అంచనాలున్నాయని, ఇప్పటివరకు ప్రపంచం ఐదో మార్గంలో పయనిస్తూ వచ్చిందని, ఇటీవల కాలంలో మూడు, నాలుగు మార్గాలకు మధ్యస్థంగా ఉంటోందని నివేదిక వివరించింది. పైన చెప్పిన ఐదు మార్గాల్లో దేనిలోనైనా సరే 2030నాటికి ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ టార్గెట్‌ను దాటటం ఖాయమని నివేదిక హెచ్చరించింది. 3,4 మార్గాలను అనుసరిస్తే ప్రపంచ ఉష్ణోగ్రత అంచనాలను దాటి 2 డిగ్రీల సెల్సియస్ మేర పెరుగుతుందని, ఐదవ మార్గం కొనసాగితే 2100 నాటికి ప్రపంచ ఉష్ణోగ్రత అంచనా కన్నా 3.3 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా పెరుగుతుందని తెలిపింది. కానీ దేశాల దృక్పథంలో వస్తున్న మార్పు వల్ల ఇంత ప్రమాదం జరగకపోవచ్చని నివేదిక అంచనా వేసింది. టిప్పింగ్ పాయింట్లుగా పిలిచే భారీ విధ్వంసాలైన మంచు చరియలు కరిగిపోవడం, సముద్ర ప్రవాహాల్లో అనూహ్య మందగమనం వంటివి జరిగేందుకు అవకాశాలు తక్కువే కానీ, అసలు జరగవని కొట్టిపారేయలేమని హెచ్చరించింది. అందరూ భయపడే అట్లాంటిక్ సముద్ర ప్రవాహాల మందగమనం ఈ శతాబ్దంలో ఉండకపోవచ్చని పేర్కొంది. అయితే ఏమాత్రం పరిస్థితిని అశ్రద్ధ చేయకుండా అందరూ కర్బన ఉద్గారాల కట్టడికి, ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని నివేదిక సూచించింది. దేశాల స్పందన: నవంబర్‌లో జరిగే అంతర్జాతీయ పర్యావరణ సదస్సులో ఈ నివేదిక చర్చకు రానుంది. ఉద్గారాల తగ్గింపు విషయంలో తక్షణ చర్యల అవసరాన్ని నివేదిక నొక్కి చెప్పిందని పలువురు ప్రపంచ నేతలు అభిప్రాయపడ్డారు. ఇది ఒక గట్టి హెచ్చరికగా అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ అభివరి్ణంచారు. మానవాళికి ఇది కోడ్ రెడ్ నివేదికని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ నేతలు ఇప్పటికైనా కనీసం ప్యారిస్ ఒప్పందాన్ని అమలు చేసే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గుటెరెస్ విజ్ఞప్తి చేశారు. నేతలంతా ఈ విషయంలో తప్పక చర్యలు తీసుకోవాలని స్కాటాండ్లో జరగబోయే సదస్సుకు అధ్యక్షత వహించనున్న అలోక్ శర్మ విజ్ఞప్తి చేశారు. మానవ జనిత కార్బన్‌డైఆక్సైడ్‌ను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని వందకు పైగా దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. వేడి పెరిగితే కీడే భూ ఉపరితల ఉష్ణోగ్రతల పెరుగుదలతో వేడి వాయువులు ప్రచండంగా వీయడం, కరువు ఏర్పడడం, అనూహ్య వరదలు సంభవిస్తాయని నివేదిక పేర్కొంది. ఇటీవల కాలంలో శీతోష్ణస్థితిలో వస్తున్న మార్పులు చాలా వేగంగా, తీవ్రంగా, వెయ్యేళ్లలో లేనట్లుగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ పలు నిదర్శనాలను కళ్లముందుంచింది. ► పరిస్థితి విషమిస్తోందనేందుకు సముద్ర మట్టాలు పెరగడం, ఆర్కిటిక్ సముద్రంలో మంచు కరుగుదల స్పీడందుకోవడం, తుఫా నులు తీవ్రంగా మారడం వంటివి సంకేతాలు. ► గతంలో 50 సంవత్సరాలకు ఒకమారు వచ్చే తీవ్ర వడగాలులు ఇప్పుడు పదేళ్లకు ఒకసారి ప్రత్యక్షమవడం శీతోష్ణస్థితిలో ప్రచండ మార్పునకు నిదర్శనం. ప్రపంచ ఉష్ణోగ్రత మరో డిగ్రీ పెరిగితే ఈ గాలులు ప్రతి ఏడేళ్లకు రెండుమార్లు ప్రత్యక్షమవుతాయి. ► ఉష్ణోగ్రతల పెరుగుదలతో కేవలం అనూహ్య శీతోష్ణ మార్పులు కనిపించడమేకాకుండా ఒకేమారు పలు ఉత్పాతాలు సంభవించే అవకాశాలుంటాయి. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు పశ్చిమ యూఎస్‌లో జరుగుతున్నాయి(ఒకేమారు వడగాలులు, కరువు, కార్చిచ్చు ప్రత్యక్షం కావడం). ► గ్రీసు, టరీ్కల్లో తాజా కార్చిచ్చుకు సైతం ఈ ఉష్ణోగ్రతల మార్పు కారణమే. ► పరిస్థితి విషమించే కొద్దీ సముద్రాల్లో ఆక్సిజన్ శాతం తగ్గి అవి ఆమ్లయుతాలుగా మారతాయి, ఇదే జరిగితే కొన్ని వేలసంవత్సరాల పాటు అవి మామూలు స్థితికి చేరలేవు. ► కార్బన్‌డైఆక్సైడ్, మిథేన్ వాయు ఉద్గారాలే ఉష్ణోగ్రతల పెరుగుదలకు ప్రధాన కారణాలు. శిలాజ ఇంధనాల వాడకం, జీవుల్లో జరిగే జీవక్రియల ద్వారా ఈ రెండూ ఉత్పత్తి అవుతుంటాయి. సైంటిస్టులు ఈ పరిణామాలపై 30 ఏళ్లుగా హెచ్చరిస్తున్నా, ఎవరూ పట్టించుకోలేదని నివేదిక వాపోయింది. రాబోయే దశాబ్దాల్లో జరగనున్న ఉత్పాతాన్ని తట్టుకునేందుకు ఇప్పటినుంచే చర్యలు చేపట్టాలని ఐపీసీసీ తెలిసింది. ఇప్పుడున్న ఉష్ణోగ్రతలను తగ్గించలేకున్నా, ఇకపై మరింత పెరగకుండా జాగ్రత్త పడాలని సూచించింది. ఇందుకోసం గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను అదుపు చేయాలని, ముఖ్యంగా కార్బన్‌డైఆక్సైడ్ ఉద్గారాన్ని తగ్గించడం ద్వారా ఉష్ణోగ్రతలు మరింత పెరగకుండా కట్టడి చేయవచ్చని తెలిపింది. -
కళ్లు తెరిపించే హెచ్చరిక
ప్రకృతి ఎంతగా హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతూ ఇష్టానుసారం విధ్వంసాన్ని కొనసాగిస్తున్న మానవాళికి ఐక్యరాజ్యసమితి వాతావరణ అధ్యయన బృందం(ఐపీసీసీ) వెల్లడించిన అంశాలు కను విప్పు కలిగించాలి. రానున్న రోజుల్లో భూతాపం వల్ల మన కోల్‌కతా నగరం, పాకిస్తాన్ నగరం కరాచీ చండప్రచండమైన ఎండల్ని, వడగాలుల్ని చవిచూస్తాయని ఆ సంస్థ విడుదల చేసిన నివేదిక హెచ్చ రించింది. సకాలంలో సరైన చర్యలు తీసుకోవడానికి సిద్ధపడకపోతే కోట్లాదిమంది జీవితాలు అస్త వ్యస్థమవుతాయని వివరించింది. ఒకటిన్నర దశాబ్దాల క్రితం అంకురార్పణ జరిగిన పారిశ్రామికీ కరణ సమస్త సహజ వనరుల్నీ పీల్చి పిప్పి చేస్తోంది. బొగ్గు నిల్వల వాడకం, శిలాజ ఇంధనాల వాడకం విచ్చలవిడిగా పెరిగి వాతావరణం అంతకంతకు నాశనమవుతోంది. దీన్నిలాగే కొనసాగ నిస్తే మున్ముందు ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందో ఐపీసీసీ తెలిపింది. 2030నాటికి ఉష్ణోగ్రత 1.5–2 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగితే విధ్వంసం ఎంత తీవ్రంగా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపింది. ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా కదిలితే, పర్యావరణ హిత చర్యలకు నడుం బిగిస్తే 2030నాటికి దాదాపు 3 లక్షల కోట్ల డాలర్ల మేర ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని, ఆరున్నరకోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, వాయు కాలుష్యం వల్ల కలిగే లక్షలాది మరణాలను అరికట్టడానికి అవకాశం ఏర్పడుతుందని గత నెలలో ఆర్థిక, వాతావరణ విషయాల అంతర్జాతీయ సంస్థ (జీసీఈసీ) తెలియజేసింది. శిలాజ ఇంధనాల వినియోగంపై ఆధారపడే ప్రస్తుత స్థితిని మార్చుకోగలిగితే ఎన్నో లాభాలుంటాయని గణాంక సహితంగా వివరించింది. ఇప్పుడు ఐపీసీసీ నివేదిక చూశాకైనా దేశాలన్నీ ఆ వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని తెలుస్తుంది. 1992లో జరిగిన తొలి ధరిత్రీ సదస్సు పర్యావరణానికి జరుగుతున్న హానిని, దాని పర్యవసానంగా ఏర్పడే దుష్పరిణా మాల్ని వివరించి అందరిలోనూ చైతన్యాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత 1997లో క్యోటో ప్రోటోకాల్ సాకారమైంది. అయితే కర్బన ఉద్గారాలకు నిర్దిష్ట వ్యవధిలో కోత పెట్టి, కాలుష్య నియంత్రణ సాంకే తిక పరిజ్ఞానాన్ని వర్ధమాన దేశాలకు అందుబాటులోకి తెస్తామని ధనిక దేశాలు అంగీకరించినా అప్పట్లో అమెరికా దాన్ని తోసిపుచ్చింది. నిజానికి ప్రపంచంలో అందరికన్నా అధికంగా, విచ్చలవి డిగా సహజ వనరుల్ని వాడేది అమెరికాయే. ఆ తర్వాత 2009లో జరిగిన కోపెన్ హాగన్ సదస్సు నాటికి అది కళ్లు తెరుచుకున్నదన్న అభిప్రాయం కలిగించింది. అప్పటి అధ్యక్షుడు ఒబామా తాము సైతం పర్యావరణ పరిరక్షణకు అంకితమవుతామని ప్రకటించారు. 2005 స్థాయి కర్బన ఉద్గారాల్లో 2020కల్లా 17 శాతం, 2030కల్లా 42 శాతం, 2050నాటికి 83 శాతం తగ్గిస్తామని ఆ దేశం సంసిద్ధత వ్యక్తపరిచింది. 2015లో పారిస్ శిఖరాగ్ర సదస్సులో కర్బన ఉద్గారాల తగ్గింపుపై 200 దేశాల మధ్య ఒడంబడిక కుదిరింది. 2005నాటి కర్బన ఉద్గారాల స్థాయిలో 33 నుంచి 35 శాతాన్ని 2030కల్లా తగ్గించాలని ఆ ఒడంబడిక సారాంశం. దాన్ని సాధించగలిగితే 2050నాటికి భూతాపం పెరుగుద లను కనీసం 1.5 – 2 డిగ్రీల సెంటీగ్రేడ్ స్థాయికి పరిమితం చేయగలమని ఆ సదస్సు అంచనా వేసింది. ఆ ఒడంబడిక అమలుకు సంబంధించిన సాంకేతిక అంశాల నిర్ధారణకు, వివిధ దేశాలు అప్పట్లో హామీ ఇచ్చిన లక్ష్యాల సాధనలో ఇవి ఏవిధంగా తోడ్పడగలవో అంచనా వేయడానికి నిరుడు జర్మనీలోని బాన్‌లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్)–23 సదస్సు కూడా జరిగింది. అయితే నిర్దిష్టమైన మార్గదర్శకాల రూపకల్పనలో ఆ సదస్సు విఫలమైంది. దానికి కొనసాగింపుగా వచ్చే డిసెంబర్లో పోలాండ్లోని కటోవైస్‌లో కాప్–24 సదస్సుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. కానీ అక్కడ ఈ దేశాలన్నీ ఏం సాధించగలవో అనుమానమే. మొత్తానికి 2020నాటికల్లా పారిస్ ఒడంబడిక అమలు ప్రారంభం కావాలని సంకల్పం చెప్పు కున్నా ఆ దిశగా అడుగు ముందుకు పడటం లేదు. ఒక్క అమెరికా మాత్రమే కాదు... మిగిలిన దేశాలు కూడా పర్యావరణానికి ముంచుకొస్తున్న ప్రమాదంపై చిత్తశుద్ధితో కృషి చేయడం లేదని ఈమధ్యే ఫిజీ ప్రధాని బైనిమారమా నిరాశ వ్యక్తం చేశారు. ఐపీసీసీ నివేదిక భయానక భవిష్యత్తును కళ్ల ముందు ఉంచింది. భూతాపం కారణంగా ఊహకందని విధ్వంసం చోటు చేసుకోబోతున్నదని హెచ్చరించింది. 2030నాటికి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు పెరిగితే పంటల దిగుబడి గణనీయంగా తగ్గి పోతుందని, ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధులు, డెంగీ, మలేరియా వంటివి తీవ్ర రూపం దాలు స్తాయని తెలిపింది. నీటి కాలుష్యం, వాయు కాలుష్యం కారణంగా లక్షలాదిమంది మరణిస్తారని వివరించింది. భూతాపం పెరగడం వల్ల ధ్రువ ప్రాంతాల్లో మంచు కరిగి సముద్ర మట్టాలు పెరు గుతాయని, తీర ప్రాంతాలకు ముంపు ముప్పు తప్పదని హెచ్చరించింది. వీటి ప్రభావం అత్యంత నిరుపేద వర్గాలపైనే అధికంగా ఉంటుందని తెలిపింది. ఈ వర్గాలకు జీవనోపాధి దెబ్బతింటుం దని, ఆహార కొరత ఏర్పడుతుందని, అంటువ్యాధులు పీడిస్తాయని అంచనావేసింది. అన్ని అంశాలనూ అధ్యయనం చేసి, పొంచి ఉన్న పర్యావరణ ముప్పును అంచనా వేయమని పారిస్ ఒడంబడిక కుదిరాక ఐక్యరాజ్యసమితి ఐపీసీసీని కోరిన పర్యవసానంగా ప్రస్తుత నివేదిక రూపొందింది. అయితే దీని రూపకల్పన కోసం వివిధ దేశాల్లోని ప్రభుత్వాలను సంప్రదించటం, వారిచ్చిన గణాంకాలు స్వీకరించడం ప్రధాన లోపమనే చెప్పాలి. ప్రభుత్వాలు సహజంగానే పరి స్థితుల తీవ్రతను తగ్గించి చెబుతాయి. తమ లోపాల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఏ దేశమూ తాము రెండేళ్లనాటి పారిస్ ఒడంబడికకు అనుగుణంగా చర్యలు తీసుకోలేకపోయామని ఒప్పుకోదు. అమెరికా, సౌదీ అరేబియా వంటివైతే ఐపీసీసీకి సరిగా సహకరించనే లేదు. అంటే ఈ నివేదిక హెచ్చరిస్తున్న స్థాయికి మించే భూగోళానికి ముప్పు పొంచి ఉన్నదని ప్రపంచ ప్రజలు గుర్తించాలి. తమ తమ ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ప్రకృతి విధ్వంసాన్ని అడ్డుకోవాలి. అంతిమంగా ప్రజానీకంలో ఏర్పడే చైతన్యమే ప్రభుత్వాల మెడలు వంచగలదు. -
గ్లోబల్ వార్మింగ్‌తో పెను వినాశనమే!
ప్రపంచదేశాలు గ్లోబల్‌వార్మింగ్‌ను అరికట్టకపోతే ఊహకు అందని ఉపద్రవాలు సంభవిస్తాయని ఐక్యరాజ్యసమితి(ఐరాస) హెచ్చరించింది. అతివృష్టి, అనావృష్టి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధిని కోల్పోతారని వెల్లడించింది. దీని కారణంగా భారత్, పాకిస్తాన్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితికి చెంది న ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ క్లైమేట్ ఛేంజ్ (ఐపీసీసీ) ప్రత్యేక నివేదికను విడుదల చేసింది. భారత్‌లోని తీరప్రాంత నగరమైన కోల్‌కతాతో పాటు పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీపై గ్లోబల్ వార్మింగ్ ప్రభావం తీవ్రంగా ఉంటుంద ని ఐపీసీసీ తన నివేదికలో తెలిపింది. విచ్చలవిడిగా శిలాజ ఇంధనాల వాడకం, అడవుల నరికి వేత కారణంగా ప్రపంచవ్యాప్తంగా సగటు ఉ ష్ణోగ్రతలో పెరుగుదల 1.5 డిగ్రీ సెల్సియస్ దాటిపోతుందని వెల్లడించింది. తద్వారా భూ తాపం పెరిగి భారత్, పాకిస్తాన్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయంది. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలకు చెందిన 91 మంది నిపుణులు ఈ నివేదిక రూపకల్పనలో పాలుపంచుకున్నారు. అంటువ్యాధుల విజృంభన.. ఒకవేళ 2030 నాటికి ఈ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరిగితే జరిగే విధ్వంసం ఊహకు కూడా అందదని ఐపీసీసీ తెలిపింది. తొలుత వాతావరణ మార్పులతో అతివృష్టి, ఆపై అనావృష్టి సంభవిస్తాయని నివేదికలో వెల్లడించింది. ‘ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో పంటల దిగుబడి తగ్గిపోతుంది. దీనికి తోడుగా ప్రపంచవ్యాప్తంగా కీటకాల ద్వారా వ్యాప్తిచెందే అంటువ్యాధులు, డెంగీ, మలేరియా వంటి జ్వరాలు తీవ్రరూపం దాలుస్తాయి. ఓవైపు ఆహారకొరత, మరోవైపు అనారోగ్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మృత్యువాత పడతారు. భారత్‌లోని మెట్రో నగరాల్లో తీవ్రమైన ఎండకు తోడు ప్రాణాంతకమైన వడగాలులు వీస్తాయి. ఇవి దాదాపు 35 కోట్ల మంది ప్రజలపై ప్రభావం చూపుతాయి. ధ్రువ ప్రాంతాల్లో మంచు కరిగిపోవడంతో సముద్రమట్టాలు భారీగా పెరుగుతాయి. తద్వారా తీరప్రాంతాలు మునిగిపోతాయి. ఉష్ణోగ్రతలు అదుపుకాకపోవడంతో అడవుల్లో కార్చిచ్చులు చెలరేగుతాయి. అతివృష్టి, అనావృష్టితో పాటు అంటువ్యాధుల దెబ్బకు నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతాయి. దీంతో పొట్టపోసుకునేందుకు లక్షలాది మంది ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలస వస్తారు. తద్వారా ప్రజల ఆదాయాలు భారీగా పడిపోతాయి. పట్టణాల్లో ఉపాధి అవకాశాలు సన్నగిల్లిపోతాయి. అంతిమంగా తీవ్ర వినాశనం సంభవిస్తుంది’ అని ఐపీసీసీ తెలిపింది. 1.5 డిగ్రీలు నియంత్రిస్తే... పోలండ్‌లోని కటోవిస్‌లో ఈ ఏడాది డిసెంబర్ 2 నుంచి 14 వరకూ జరిగే వాతావరణ మార్పుల సదస్సులో ఈ నివేదికపై ప్రపంచదేశాలు చర్చించి గ్లోబల్ వార్మింగ్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళిక రూపొందించనున్నాయి. ఒకవేళ సగటు ఉష్ణోగ్రతలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌లోపు నియంత్రించగలిగితే వాతావరణ మార్పుల కారణంగా ప్రభావితమయ్యే కోట్లాది మంది ముప్పు నుంచి బయటపడతారు. అలాగే ఆసియాలోని దేశాల్లో వరి, గోధుమ, మొక్కజొన్న పంటల దిగుబడి నష్టాలు గణనీయంగా తగ్గుతాయి. 2050 నాటికి పేదరికం ఊహించినస్థాయిలో పెరగదు. 2100 నాటికి ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టాల పెరుగుదలను 10 సెం.మీ. మేరకు తగ్గించవచ్చు. కర్బన ఉద్గారాలను 2035 నాటికి 45 శాతానికి తగ్గించాలని ఐపీసీసీ సూచించింది. అప్పుడే గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఎదురయ్యే పెనుముప్పును సమర్ధవంతంగా ఎదుర్కొనగలమని స్పష్టం చేసింది. -
మరి ఆ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినట్లు..!
అక్కడ మంచు పెరుగుతోంది:నాసా గ్లోబల్ వార్మింగ్ పై గగ్గోలు పెట్టేవారు.. భూమికి వచ్చే ప్రమాదాల్లో మొదట చెప్పే ఉదాహరణ.. దృవాల వద్ద కరుగుతున్న మంచు, పెరుగుతున్న సముద్ర మట్టాలు. అయితే వీరికి సమాధానం కాదు కానీ.. ధృవాల వద్ద మంచు కరగటం లేదని నాసా తేల్చేసింది. పై పెచ్చు.. పెరుగుతోందట. ముఖ్యంగా అంటార్కిటికా ఖండంలో భారీగా మంచు నిల్వలు పేరుకుంటున్నాయని నాసా పరిశోధనలు స్పష్టం చేశాయి. నాసాకి చెందిన ఐస్, క్లౌడ్, అండ్ ల్యాండ్ ఎలివేషన్ శాటిలైట్ (ICESat) రాడార్ అల్టీ మీటర్ సాయంతో అంటార్కిటికా వద్ద మంచు పరిమాణం లెక్కగట్టినట్లు నాసా స్పేస్ సెంటర్ గ్లాసియోలజిస్ట్ జే జ్వాలీ వివరించారు. అంటార్కిటికా వద్ద పెద్ద మొత్తంలో మంచు పోగు పడుతోందని ఆయన అన్నారు. 2013లో ఇచ్చిన ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ ఆన్ క్లైమెట్ ఛేంజెస్ (IPCC)రిపోర్టులో ఈ విషయం స్పష్టం చేశారు. శాటిలైట్ అందించిన డేటా ఆధారంగా.. అధ్యయనం చేసిన శాస్త్ర వేత్తలు.. 1992 నుంచి 2001 మధ్య అంటార్కిటికా వద్ద ఏడాదికి 112 బిలియన్ టన్నుల మంచు పోగైందని పేర్కొన్నారు. కాగా.. తర్వాత ఐదేళ్లలో ఈ రేటు కాస్త తగ్గినా.. 2003 నుంచి 2008 వరకూ ఏడాదికి 82 బిలియన్ టన్నుల మంచు వచ్చి చేరిందని తెలిపారు. తమ అధ్యయనాల్లో వెస్ట్ అంటార్కిటికాలోని పైన్ ద్వీపం ప్రాంతంలో మంచు ఉత్సర్గ పెరుగుదల(మంచు కరగటం)నమోదైందని వివరించారు. కానీ ఈస్ట్ అంటార్కిటికా.. వెస్ట్ అంటార్కిటికాలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి దీనికి భిన్నంగా ఉందని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో తాము మంచు పెరగటాన్ని గమనించామని చెప్పారు. ఇది ఇతర ప్రాంతాల్లో మంచు నష్టాలను మించి ఉందని అన్నారు. కానీ.. అంటార్కిటికాలో మునుపటి మంచు గుట్టలను తిరిగి పొందేందుకు కొన్ని దశాబ్దాల సమయం పట్టవచ్చని అభిప్పాయపడ్డారు. మంచు యుగం ముగిసిన తర్వాత ఈ ఖండం మీద వాయువుల ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతం పెరిగాయని తెలిపారు. దీని కారణంగా.. దృవాల వద్ద 50శాతం మంచు కరిగి పోయిందని వివరించారు. సుమారు 10వేల సంవత్సరాల నుంచి దృవాల వద్ద మంచు పోగు పడటం.. గట్టిపడటం మొదలైందని తెలిపారు. మంచు గట్టిపడటానికి శతాబ్దాల సమయం పట్టిందని అన్నారు. తూర్పు అంటార్కిటికా, పశ్చిమ అంటార్కిటికా లోతట్టు ప్రాంతాల్లో ఏటా 0.7 అంగుళాల మేర మంచు గుట్టలు పెరుగుతున్నాయని చెప్పారు. సముద్రమట్టాలు పెరిగేందుకు అంటార్కిటికా మంచు కారణం కాదని ఈపరిశోధనలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. అయితే.. ఏటా సముద్ర మట్టాలు 0.27 మిల్లీ మీటర్ల పెరుగుదల నమోదు చేస్తున్నాయి. వీటికి వేరే ఏదైనా కారణం ఉండి ఉంటుందని అన్నారు. ఈ కారణం ఏంటో తేల్చడం ప్రస్తుతం సైంటిస్టుల ముందున్న పెద్ద సవాలని ఆయన అన్నారు.