అనుమానాలకు తావు లేదిప్పుడు... చూద్దాం.. చేద్దామన్న పోకడనూ మరచిపోండి!! వాతావరణ మార్పులన్నవి ముమ్మాటికీ నిజం. నిజం. నిజం!! ధోరణి మారకుంటే.. భావితరాలు ఈ భూమ్మీద.. బతకడం కష్టమేనని గుర్తుంచుకోండి!! ప్రకృతిని తద్వారా మనల్ని మనం కాపాడుకునేందుకు... ఈ క్షణం నుంచే సంకల్పం చెప్పుకోండి. కంకణం కట్టుకోండి!! వ్యక్తులుగా మీరు చేసే చిన్న చిన్న పనులు ప్రపంచానికొచ్చిన పెనువిపత్తును తప్పించగలవా అన్న సంశయమూ వద్దు!!
కెనడాలో 50 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు.. జర్మనీలో అకాల వర్షాలు, వరదలు.. చైనాలో వెయ్యేళ్ల రికార్డులు తిరగరాస్తూ కుంభవృష్టి!! ఇవన్నీ ఏవో కాకతాళీయంగా జరిగిన సంఘటనలని కొందరు అనుకోవచ్చు కానీ.. భూతాపోన్నతితో వచ్చిన వాతావరణ మార్పులకు ప్రత్యక్ష నిదర్శనాలీ ఘటనలన్నవి సుస్పష్టం. వాతావరణ మార్పుల ప్రభావంపై అధ్యయనం చేస్తున్న ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్‌క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) తాజా నివేదిక కూడా.. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం, అటవీ విస్తీర్ణంలో తగ్గుదల, కాలుష్యం తదితర కారణాల వల్ల భూమి సగటు ఉష్ణోగ్రత.. క్రమేపీ పెరిగిపోతోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే... కార్చిచ్చులు, కుంభవృష్టి, అకాల వర్షాల్లాంటి ప్రకృతి విపత్తులు మరింత ఎక్కువ అవడం గ్యారంటీ అని స్పష్టం చేసింది. ఈ విషయం చాలాకాలంగా తెలిసినప్పటికీ ఐపీసీసీ తాజా నివేదిక మరోసారి రూఢీ చేయడమే కాకుండా... తుది ప్రమాద హెచ్చరికల్లాంటివి జారీ చేసింది. భూతాపోన్నతిని తగ్గించే చర్యలు తక్షణం చేపట్టకపోతే 2040 కల్లా సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీ సెల్సియస్ పెరగడం తథ్యమని స్పష్టం చేసింది. ఆ... భూమి మొత్తమ్మీద జరిగే పరిణామాలకు నేనేం చేయగలను? ఆ పాట్లేవో మన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాలు పడతారులే అనుకోనవసరం లేదు. ఎందుకంటే.. వ్యక్తులు తమ జీవనశైలిలో చేసుకునే కొన్ని మార్పులు కూడా ఉడతా సాయంగానైనా ఉపకరిస్తాయి. అదెలాగో చూడండి...
ఆహార వృథాను అరికట్టండి...
మీకు తెలుసా? శిలాజ ఇంధనాల తరువాత భూతాపోన్నతికి కారణమవుతున్న వాటిల్లో ఆహార పరిశ్రమ అతిపెద్దదని? ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే పాడి, మాంసం అనే రెండు అంశాలు వాతావరణ మార్పులకు ఉన్న కారణాల్లో ప్రధానమైనవి, పాడిపశువుల పెంపకానికి ఫీడ్ నీరు, విద్యుత్తు, నేల వంటి వనరులను వినియోగించుకుని పెరగడం ఒక కారణం. అలాగే మాంసం కోసం పెంచే కొన్ని జంతువులు ప్రమాదకరమైన మీథేన్ వాయువును ఎక్కువగా వదులుతాయి. పశువులు పెంచేందుకు వీలుగా కొన్నిచోట్ల అటవీ భూములను చదును చేయడమూ కద్దు! ఇవన్నీ ఒకఎత్తు అయితే... మనం తినే ఆహారాన్ని వృథా చేయడం ఇంకో ఎత్తు. మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా మానవ వినియోగానికి సిద్ధం చేసిన ఆహారంలో కనీసం మూడొంతులు వృథా అవుతోందని? దీని విలువ ఏడాదికి అక్షరాలా లక్షకోట్ల డాలర్లు!
ప్రపంచంలో సగం మంది శాఖాహారులుగా మారిపోతే ఏటా తగ్గే కార్బన్‌డయాక్సైడ్ మోతాదు 660 కోట్ల టన్నులు మనిషి సగటున ఏడాదికి ఐదు టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదల చేస్తాడని అంచనా. కానీ ఇది దేశాన్ని బట్టి మారుతూంటుంది. అమెరికా, దక్షిణ కొరియా వంటి పారిశ్రామిక దేశాల్లో ఇది 16.5 టన్నులు కాగా.. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది 1.6 టన్నులుగా ఉంది.
ప్రత్యామ్నాయాలకు జై కొట్టండి...
భూతాపోన్నతిని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అంటే సౌర, పవన, జీవ, జల ఇంధనాల వాడకం కచ్చితంగా పెరగాలి. ఇంట్లో బల్బులు, ఫ్యాన్లు తిరిగేందుకు అవసరమైనంతైనా సరే.. సౌరశక్తిని వాడుకోగలిగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఒకప్పుడు దీని ఖరీదు ఎక్కువే కానీ.. 2010 నాటితో పోలిస్తే ఇప్పుడు 73 శాతం చౌక. రకాన్ని బట్టి ఇప్పుడు భారత్‌లో ఒక్కో వాట్ సోలార్‌ప్యానెల్‌కు అయ్యే ఖర్చు రూ.23 నుంచి రూ.140 వరకూ ఉంటోంది. ఇంట్లో 20 వాట్ల ఎల్‌ఈడీలు ఐదు ఉన్నాయనుకుంటే రూ.2300 ఒక ప్యానెల్ కొనుక్కుని వాడుకుంటే చాలు పైగా మనకు సూర్యరశ్మికి అసలు కొదవే లేదు. ప్లాస్టిక్ బాటిల్ స్థానంలో గాజుబాటిల్ వాడినా. వస్త్రంతో తయారైన సంచీలతో సరుకులు, కాయగూరలు తెచ్చుకున్నా... అవసరానికి మంచి దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు కొనకపోయినా... ఇలా మన దైనందిన జీవితంలో ప్రతి చిన్న మార్పూ భూమికి శ్రీరామరక్షగా నిలుస్తుంది!!
ఇంట్లో పొదుపు మంత్రం...
భూతాపోన్నతిని తగ్గించేందుకు మనమేమీ అదనంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. పైగా ఈ చర్యలు పాటించడం వల్ల నాలుగు డబ్బులు మిగులుతాయి కూడా. ఇంట్లోని ఏసీలో ఉష్ణోగ్రతను 24 స్థాయి నుంచి 26 డిగ్రీలకు పెంచారనుకోండి. మీకు కరెంటు ఆదా.. వాతావరణంలో చేరే కాలుష్యమూ తగ్గుతుంది. అలాగే సాధారణ బల్బుల స్థానంలో సమర్థమైన, చౌకైన, ఎక్కువ కాలం మన్నే ఎల్‌ఈడీ బల్బులు వాడటమూ ఉభయ ప్రయోజనకరం. ప్రపంచమంతా ఎల్‌ఈడీలు వాడితే ఏటా 7,800 కోట్ల కర్బన ఉద్గారాలను అడ్డుకోవచ్చు. సూర్యభగవానుడిచ్చే ఎర్రటి ఎండను కాదని వాషింగ్‌మెషీన్‌లో డ్రయింగ్ ఆప్షన్‌ను వాడితే భూమికి చేటు చేయడమే కాకుండా.. మీ జేబుకు పడే చిల్లూ ఎక్కువ అవుతుందని గుర్తించండి. ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువుల (టీవీ, మిక్సీ, వాషింగ్‌మెషీన్, ఓవెన్, గీజర్ లాంటివి)ను అవసరం లేనప్పుడు కేవలం స్విచాఫ్ చేయడం కాకుండా... ప్లగ్ తీసి ఉంచడమూ కరెంటును ఆదా చేస్తుందని తెలుసుకోండి. సమర్థమైన ఎల్‌ఈడీ బల్బులను అందరూ ఉపయోగించడం మొదలుపెడితే అయ్యే ఆదా ఏడాదికి... తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు.
వృక్షో రక్షతి రక్షితః...
చెట్లను కాపాడుకుంటే అవి మనల్ని రక్షిస్తాయన్న ఈ సంస్కృత నానుడి ఈ రోజుకూ అక్షర సత్యం. ఇల్లు, అపార్ట్‌మెంట్, బడి, ఆఫీసు ఇలా వీలైనప్రతి చోట మొక్కలు నాటామనుకోండి. వాతావరణంలోని కార్బన్‌డ యాక్సైడ్‌ను కొంతమేరకైనా తగ్గించవచ్చు. చెట్లు, మహాసముద్రాలు కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చేసుకుని ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండేలా చేయగలవు. కానీ నిమిషానికి పది ఎకరాలకు పైగా అడవులను వివిధ కారణాలతో నరికేస్తున్న పరిస్థితుల్లో వాతావరణంలో విషవాయువుల మోతాదు పెరిగిపోతోంది! అందుకే,అడవులను కాపాడుకోవడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా కోటానుకోట్ల మొక్కలు నాటడం అత్యవసరం.
పెట్రోల్, డీజిల్ వాడకానికి కళ్లెం!
భూతాపోన్నతికి పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి సహజసిద్ధ ఇంధన వనరుల విచ్చలవిడి వాడకం ప్రధాన కారణం. వీటిని తగ్గిస్తే తద్వారా వాతావరణంలోకి చేరే విష వాయువుల మోతాదు తగ్గి భూతా పోన్నతిని నియంత్రించవచ్చు. ఇరుగు పొరుగు వీధుల్లో పనులకు బైక్‌ల బదులు సైకిళ్లు వాడినా, కాళ్లకు పని చెప్పినా ఈ భూమికి మనవంతు మేలు చేసినట్లే. దూరా భారమైతే సొంత వాహనాల్లో కాకుండా.. బస్సులు, ట్రైన్లను వాడాలని నిపుణులంటున్నారు. విమానాల్లో వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే.. వీలైనంత వరకూ డైరెక్ట్ ఫ్లైట్లను ఎంచుకోవడం మేలు. ఎందుకంటే... విమానాల నుంచి వెలువడే కార్బన్‌డయాక్సైడ్ టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లోనే ఎక్కువ. మన ప్రయాణంలో కనెక్టింగ్ ఫ్లైట్లు ఉంటే ల్యాండింగ్, టేకాఫ్ ఒకటి కంటే ఎక్కువసార్లు ఉంటాయి.
– నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment