IPCC
-
IPCC: వాతావరణ మార్పులతో దేశాలన్నీ అతలాకుతలం
వాతావరణ మార్పులు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. దీని ప్రభావంతో వచ్చిపడుతున్న అకాల వరదలు, కరువులతో దేశాలకు దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. అపార ఆస్తి, ప్రాణ నష్టాలతో అల్లాడుతున్నాయి.æ అతి తీవ్ర వాతావరణ పరిస్థితులు తరచూ తలెత్తుతాయని, వాటి తీవ్రత కూడా గతం కంటే అత్యంత ఎక్కువగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని వాతావరణ మార్పుల ప్యానల్ (ఐపీసీసీ) వేసిన అంచనాలు నూటికి నూరు శాతం నిజమవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ► వారాంతపు వరదలతో ఆస్ట్రేలియా అల్లాడింది. దేశంలో చాలాచోట్ల ఇంకా కుండపోత కొనసాగుతూనే ఉంది. మరికొన్ని రోజుల పాటు అతి తీవ్ర వర్షాలు తప్పవంటూ వాతావరణ విభాగం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ► మధ్య ఆఫ్రికా దేశమైన చాద్ రిపబ్లిక్‌ది విచిత్ర పరిస్థితి. నిన్నామొన్నటిదాకా దుర్భరమైన కరువుతో దేశమంతా అల్లాడిపోయింది. ఇప్పుడేమో గత 30 ఏళ్లలో ఎన్నడూ కనీవినీ ఎరగని స్థాయిలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. ► థాయ్‌లాండ్‌ను కూడా నెల రోజులుగా భారీ వరదలు ఊపిరి సలపనివ్వడం లేదు. 77 రాష్ట్రాలకు గాను ఏకంగా 59 రాష్ట్రాలు వరద బారిన పడ్డాయి. 4.5 లక్షల ఇళ్లు దెబ్బ తినడమో కూలిపోవడమో జరిగింది. 40 శాతం ప్రాంతాలు ఇంకా మునకలోనే ఉన్నాయి. తాజాగా సోమవారం 8 దక్షిణాది రాష్ట్రాలకు భారీ వరద హెచ్చరికలు జారీ అయ్యాయి! ► ఫిలిప్పీన్స్దీ ఇదే పరిస్థితి. తుఫాను కారణంగా వర్షాలు దేశాన్ని ముంచెత్తుతున్నాయి. ► భారీ వరదలతో మెక్సికో తీరం అల్లాడుతోంది. ► భారత్‌లోనూ తుఫాన్ల దెబ్బకు ఢిల్లీ, బెంగళూరు అల్లాడిపోయాయి. హైదరాబాద్‌నైతే కొన్ని వారాలుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కారణాలెన్నో...! గ్లోబల్ వార్మింగ్ మొదలుకుని మితిమీరిపోయిన శిలాజ ఇంధన వాడకం దాకా తాజా వాతావరణ మార్పులకు కారణాలెన్నో! ప్రధాన కాలుష్య కారణమైన కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలకు 90 శాతం దాకా శిలాజ ఇంధనమే కారణమవుతోంది. అడవుల విచ్చలవిడి నరికివేత, అడ్డూ అదుపు లేకుండా సాగుతున్న పెట్రో ఉత్పత్తుల వెలికితీత వంటివి కూడా ఇందుకు దోహదపడుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు మరో పదేళ్లలో భూమి సగటు ఉష్ణోగ్రత ఏకంగా 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా పెరిగితే ఆశ్చర్యం లేదని ఐపీసీసీ సర్వే హెచ్చరించింది! ‘‘ఇప్పటికైతే వాతావరణ మార్పులు అకాల వర్షాలకు, భారీ వరదలకు కారణంగా మారుతున్నాయి. వర్షపాతపు తీరుతెన్నులను కూడా అవి చాలావరకు మార్చేస్తున్నాయి’’ అని వివరించింది. నైజీరియాలో వరదలు.. 600కు చేరిన మరణాలు అబూజా: ఆఫ్రికా దేశం నైజీరియాలో ఈ సీజన్లో ఆగస్ట్ నుంచి సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా 603 మంది మృతి చెందారు. దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలకు గాను 33 రాష్ట్రాల్లో వరదలతో అతలాకుతలమవుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విపత్తులు సరే... నివారణ ఎలా?
ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ఏటా 560 ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని అంచనా. అంటే రెండు రోజులకు మూడు విపత్తులన్నమాట! వీటి పరిధి, తీవ్రత కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఆసియా, ప్రత్యేకించి దక్షిణాసియా ప్రపంచంలోనే అన్ని ప్రాంతాల కంటే ఎక్కువ బాధితురాలిగా ఉంటున్నందున, భారత్ ఈ ఆకస్మిక విపత్తుల పట్ల తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఎందుకంటే ప్రకృతి విపత్తు ప్రమాద సూచికలో అత్యధిక స్థాయిల సమాచారాన్ని నమోదుచేసే నాలుగో అతిపెద్ద దేశం భారతదేశమే. ఈ సూచికకు సంబంధించి భారత్ స్కోర్ 7.7గా ఉంది. దేశ జనాభాలో 32 శాతంమంది జాతీయ దారిద్య్ర రేఖకు దిగువనే ఉన్నారన్న వాస్తవం మర్చిపోకూడదు. మునుపటి అయిదేళ్ల కాలంకంటే ప్రస్తుత అయిదేళ్ల కాలంలోనే ఎక్కువ మంది ప్రజలు చనిపోయారు లేదా విపత్తుల బారిన పడ్డారు. విపత్తుల ప్రమాదాన్ని అర్థం చేసుకోవడం, లేదా అంచనా వేయడంలో సమకాలీన పద్ధతులు యథాతథ స్థితినే తరచుగా పరిగణిస్తున్నాయి తప్ప వ్యవస్థల్లో ప్రమాదాలు ఎలా రూపొందుతున్నాయి అనే అంశాన్ని అసలు పట్టించుకోవడం లేదు. ఉదాహరణకు, కోవిడ్–19 నేప థ్యంలో అహ్మదాబాద్ ఓల్డ్ సిటీలో, ఒకే గది ఉన్న ఇంట్లో నివసిస్తున్న వారు లేదా ఒకే ఇంట్లో అయిదుమందికి పైగా నివసిస్తున్న వారే ఎక్కువగా కరోనా వైరస్‌ని వ్యాపింపజేస్తున్నట్లు కనిపించింది. ఇవి చారిత్రక, సామాజికార్థిక వాస్తవికతలు. కాబట్టి, సామాజిక దుర్బలత్వాలను పరిష్కరించకపోతే, ఇలాంటి ఆకస్మిక వ్యాధులు పదేపదే పునరావృతమవుతూ ఒకేరకమైన పర్యవసానాలకు దారి తీస్తుంటాయి. దీనికి సంబంధించి విధాన నిర్ణేతలు– సామాజిక, ఆర్థిక దౌర్బల్యాలకు వెనుక గల సమకాలీన, చారిత్రక కారణాలను పరిశోధించాలి. విపత్తు ప్రమాద తగ్గింపుపై అంతర్జాతీయ అంచనా నివేదిక, కోవిడ్–19 ప్రపంచం ముందు సంధించిన సవాలును చర్చిస్తూనే ఆరోగ్య వ్యవస్థలలో ఉనికిలో ఉన్న దుర్బలత్వాలని మహమ్మారి ఎత్తిచూపిన కోణాన్ని ప్రపంచానికి గుర్తు చేసింది. అంతకుమించి అది అసమా నత్వం, నిరుద్యోగితను బలంగా ప్రదర్శించి చూపింది. ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లో విద్య, పోషకాహారం, ఆహార భద్రత వంటి విషయాల్లో ప్రజల పరిస్థితి దయనీయంగా తయారైంది. మహమ్మారి వ్యవస్థీకృత ప్రభావాలు, దాని క్రమాలను భారత్‌లోని ప్రపంచ చారిత్రక నగరమైన అహమ్మదాబాద్ ఓల్డ్ సిటీలో నిర్వహించిన తాజా నివేదిక (2022) వెల్లడించింది. శరవేగంతో జరుగుతున్న పట్టణీకరణ ప్రమాదాలను ఈ నివేదిక ఎత్తిచూపింది. పట్టణీకరణ వేగ ప్రక్రియే వాతావరణ మార్పు ప్రభావాలకు ప్రజలను బలిజీవులుగా మారుస్తోందని నివేదిక తెలిపింది. తీర ప్రాంతంలోని అతిపెద్ద నగరాల్లో జనాభా సాంద్రీకరణ కారణంగా సముద్ర మట్టాల పెరుగుదలపై ప్రభావం చూపుతోంది. ఐపీసీసీ తాజా నివేదిక ప్రకారం 2006 నుంచి సగటు సముద్ర మట్టం పెరుగుదల రేటు సంవత్సరానికి 3.7 మిల్లీ మీటర్లుగా ఉంటోందని వెల్లడయింది. ఈ లెక్కన 2100 నాటికి 20 కోట్లమంది ప్రజలు దీని ప్రభావానికి గురవుతారని ఈ నివేదిక తెలుపుతోంది. ఆసియా ప్రజలే ప్రధానంగా దీని బారిన పడనున్నారని, ప్రత్యేకించి చైనాలో (4 కోట్ల 30 లక్షల మంది), బంగ్లాదేశ్‌లో (3 కోట్ల 20 లక్షలమంది), భారతదేశంలో (2 కోట్ల 70 లక్షలమంది) దీని ప్రభావానికి గురవుతారని ఈ నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుత ధోరణులు ఇలాగే కొనసాగితే, 2015 నుంచి 2030 నాటికి, ప్రతి సంవత్సరం విపత్తుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 40 శాతం మేరకు పెరగవచ్చు. ఇక కరువుల విషయానికి వస్తే 2001 నుంచి 2030 నాటికి 30 శాతం పెరుగుతాయని ప్రస్తుత ధోరణులు సూచిస్తున్నాయి. అలాగే అత్యంత అధిక ఉష్ణోగ్రతలు సంభవిస్తున్న ఘటనల సంఖ్య కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. విపత్తుల వల్ల ఎక్కువమంది దెబ్బ తినడమే కాకుండా, దారిద్య్రం కూడా పెరుగుతుంది. 1990లలో విపత్తుల వల్ల ఆర్థిక నష్టాలు సగటున 70 మిలియన్ డాలర్లమేరకు సంభవించగా, 2020 నాటికి సంవత్సరానికి 170 మిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ ఆర్థిక నష్టాలకు సంబంధించి బహుశా 40 శాతానికి మాత్రమే బీమా సౌకర్యం ఉంది. అయితే ఈ బీమా రక్షణ కూడా అభివృద్ధి చెందిన దేశాల్లోనే చాలావరకు కేంద్రీ కృతం అయింది. (చదవండి: ఎంత వేసవైనా ఇంత వేడేమిటి!) వాతావరణ అత్యవసర పరిస్థితి, కోవిడ్–19 మహమ్మారి వ్యవస్థీకృత ప్రభావాలు ఒక కొత్త వాస్తవికతను ముందుకు తీసుకొచ్చాయి. ఇలాంటి అనిశ్చిత ప్రపంచంలో, నిజమైన, నిలకడైన అభివృద్ధిని సాధించటానికి నష్టభయాన్ని అవగాహన చేసుకోవడమే ప్రధానం. భవిష్యత్తు షాక్‌లకు వ్యతిరేకంగా ఉత్తమమైన రక్షణ ఏమిటంటే, ఇప్పుడు వ్యవస్థలను పరివర్తన చెందించి, వాతా వరణ మార్పు, తదితర అవరోధాలను పరిష్కరిస్తూ స్థితిస్థాపకతను నిర్మించుకోవడమే. హానికర పరిస్థితులను తగ్గించి, విపత్తులవైపు నెట్టే అసమానత్వాన్ని తగ్గించే ప్రయత్నం కూడా దీంట్లో భాగమే. ఇలా చేయగలిగితేనే కార్యాచరణ సాధ్యం అవుతుంది. (చదవండి: సామాజిక పరివర్తనే సంఘ్ లక్ష్యం) తప్పుల నుంచి నేర్చుకోవడానికీ, అనిశ్చితి పట్ల మరింత స్పష్టంగా కమ్యూనికేట్ కావడం ఎలాగో తిరిగి అంచనా వేసుకోవడానికీ పాలనా వ్యవస్థలు లక్ష్యాల సాధనకు అవసరమైన పద్ధతులను తక్షణం అలవర్చు కోవాలి. పాలనా వ్యవస్థలు తప్పుడు విషయాలను మదిస్తూ వాటి విలువను లెక్కిస్తున్నాయి. మానవ మనస్సు – వ్యవస్థలు ఎలా నిర్ణయాలు తీసుకుంటాయి, ఉత్పత్తి – సేవలు ఎలా పనిచేస్తాయి, నష్టభయాన్ని అర్థం చేసుకుని వాటిని నిర్వహించడంలో ప్రస్తుత పద్ధతులు ఎలా విఫలమయ్యాయనే అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ప్రభావిత ప్రజలతో సంప్రదింపుల ద్వారా మన పాలనా, ఆర్థిక వ్యవస్థలను పునర్నిర్మించడం అవసరం. - డాక్టర్ జ్ఞాన్ పాఠక్ ప్రసిద్ధ కాలమిస్ట్ -
మనమే రాస్తున్న మరణ శాసనం
భవిష్యత్ తరాల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకుని, ప్రస్తుత తరాలు ప్రకృతి వనరులను సమర్థంగా వినియోగించుకున్నప్పుడే అది సుస్థిరాభివృద్ధి అవుతుంది. కానీ అలా చేస్తున్నామా? భూతాపోన్నతిని అనుకున్నట్టుగా రెండు డిగ్రీల లోపు నియంత్రించకపోతే, మూడో వంతు జీవరాశి అంతమయ్యే ప్రమాదముంది. ఐక్యరాజ్యసమితి ‘పర్యావరణ మార్పు’పై ఏర్పరచిన అంతర్ ప్రభుత్వాల బృందం (ఐపీసీసీ) నివేదిక కూడా ఇదే నిజాన్ని మరోమారు నొక్కి చెప్పింది. అయినా మన ప్రభుత్వాలు నిష్క్రియాపరత్వం వీడటం లేదు. ఈ నివేదిక సిఫారసుల్ని పాటించే సంకల్పం తీసుకోవడానికి ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ కొత్త సమీకృత హరిత అజెండాతో ముందుకు రావాలి. ప్రతి పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇది అజెండా కావాలి. పరిశోధన పత్రాలు పనికిరావు... అధ్యయన నివేదికలు ఆలోచనకు ఆనవు... శాస్త్రవేత్తల హెచ్చరికలు నెత్తికెక్కవు... మరెప్పుడు మేల్కొనేది? ఇంకెప్పుడు ముంచుకొస్తున్న పర్యావరణ ముప్పు నుంచి మనల్ని మనం కాపాడు కునేది? ఇది ఇప్పుడు భారత పౌరసమాజం ముందున్న కోటి రూకల ప్రశ్న. సరైన సమయంలో తగు రీతిన స్పందించని నిష్క్రియాపర త్వమే సమస్యను మరింత జటిలం చేస్తోందని పలు అధ్యయన నివేది కలు తరచూ చెబుతున్నాయి! అసలు సమస్యకు పెరుగుతున్న భూతా పోన్నతి మూల కారణమైతే, ఎన్నో హెచ్చరికల తర్వాత కూడా కద లని మన ప్రభుత్వాల వైఖరే సమస్యను మరింత తీవ్రం చేస్తోంది. ఐక్యరాజ్యసమితి ‘పర్యావరణ మార్పు’పై ఏర్పరచిన అంతర్ ప్రభు త్వాల బృందం (ఐపీసీసీ) నివేదిక కూడా ఇదే నిజాన్ని మరోమారు నొక్కి చెప్పింది. ఐపీసీసీ ఆరో అంచనా నివేదికలో భాగంగా ‘వర్కింగ్ గ్రూప్’ ఇచ్చిన 2022 తాజా (రెండో భాగం) నివేదిక ఎన్నో హెచ్చరికలు చేస్తోంది. గత సంవత్సరం విడుదల చేసిన నివేదిక (తొలి భాగం) లోనే, అంచనాలకు మించిన వేగంతో వాతావరణ సంక్షోభం ముంచుకువస్తోందని హెచ్చరించిన ఈ బృందం, ప్రమాదం మరింత బహుముఖీనంగా ఉందని తాజా నివేదికలో గణాంకాలతో సహా వివరించింది. భూగ్రహం మొత్తానికి సంబంధించిన సమస్యను నివేదికలో పేర్కొన్నా... ఆసియా ఖండానికి సంబంధించి, ముఖ్యంగా భారత్‌కు వర్తించే హెచ్చరికలు ఈ నివేదికలో తీవ్రంగా ఉన్నాయి. అయినా దీనికి సంబంధించిన కీలక చర్చ ఎక్కడా జరగటం లేదు. భారత్‌కే హెచ్చు ప్రమాదం హిమాలయాల దిగువన, మూడు సముద్రాల మధ్యనున్న ద్వీప కల్పమవడంతో వాతావరణ మార్పు ప్రతికూల ప్రభావం భారత్‌పైన ఎక్కువగా ఉన్నట్టు స్పష్టమౌతోంది. హెచ్చు తేమ, వేడి వల్ల తలెత్తే దుష్పరిణామాలు (వెట్ బల్బ్ సిండ్రోమ్), నగర, పట్టణ ప్రాంతాల్లో తీవ్రంగా ఉంటాయని తాజా నివేదిక నిర్దిష్టంగా పేర్కొంది. అహ్మదా బాద్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించినప్పటికీ హైదరాబాద్‌తో సహా చాలా మెట్రో నగరాలదీ ఇదే దుఃస్థితి! ఫలితంగా వడదెబ్బ మరణాలు మితిమీరతాయి. మిగతా సముద్రాల కన్నా హిందూ మహాసముద్రం వేగంగా వేడెక్కుతోందని ఐపీసీసీ ఆరో నివేదిక తొలిభాగంలోనే పేర్కొన్నారు. దాంతో సముద్ర గాలులు పెరిగి, దక్షిణాసియా దేశాల్లో ముఖ్యంగా భారత్‌లో తుపాన్లు, వర్షాలు, వరదలు, కరవులు సాధా రణం కన్నా ఎక్కువవుతాయని నివేదించారు. నివేదిక తొలి భాగం ప్రధానంగా ‘వాతావరణ మార్పు’ తాలూకు శాస్త్ర, సాంకేతిక, సామా జికార్థికాంశాలతో ఉంది. రెండో భాగం ముఖ్యంగా ‘వాతావరణ మార్పు ప్రభావాలు, సర్దుబాటు (అడాప్టేషన్), ప్రమాద ఆస్కారం’ కోణంలో విషయాలను నివేదించింది. వచ్చే ఏప్రిల్‌లో రానున్న మూడో భాగం ఏ రకమైన దిద్దుబాటు (మిటిగేషన్) చర్యలు అవసర మౌతాయో స్పష్టం చేస్తుంది. దీంతో, ఐపీసీసీ ఆరో అంచనా నివేదిక పూర్తవుతుంది. భూతాపోన్నతి వల్ల పుడమి ధ్రువాల్లోనే కాకుండా మన హిమాలయాల్లో ఉన్న మంచు అసాధారణంగా కరిగి కింద ఉండే భూభాగాల్లోనూ, నదుల పైనా ఒత్తిడి పెరుగుతుంది. అముదర్య (మధ్యాసియా నది), సింధు, గంగ, బ్రహ్మపుత్ర నదీ లోయ ప్రాంతాల్లో వరదలు పెరిగి తీవ్ర ప్రతికూల పరిణామాలుంటాయని నివేదిక చెబుతోంది. ‘వెట్ బల్బ్ టెంపరేచర్’ (అంటే, గాలిలో తేమ శాతం అసాధారణంగా పెరిగినపుడు 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కూడా తీవ్రంగా ఉంటుంది; 30–35 డిగ్రీల మధ్య వేడి అత్యంత ప్రమాదకారి) ఇప్పటికే 30 డిగ్రీలను దాటుతున్నట్టు నివేదిక చెబు తోంది. మనది స్థూలంగా వ్యవసాయాధారిత జీవనం, ఆర్థిక వ్యవస్థ అయినందున వాతావరణ ప్రతికూల పరిస్థితులు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయనేది నివేదిక సారాంశం. సాధారణ జీవనంతో పాటు వ్యవసాయం, ఆహారోత్పత్తి, పంపిణీ వంటివి తీవ్రంగా ప్రభావితం అవుతాయి. ఐపీసీసీ ఛైర్మన్ హీసంగ్ లీ చెప్పినట్టు ‘నష్ట నివారణ, దిద్దుబాటు, సర్దుబాటు చర్యల తర్వాత కూడా 300 నుంచి 350 కోట్ల మంది విశ్వజనుల జీవితాలపై ప్రతికూల ప్రభావం ఉండేటప్పుడు... స్థానికంగా ఎక్కడికక్కడ ప్రభుత్వాల నిష్క్రియాపరత్వం చేసే నష్టం మరింత అపారం’ అన్నది కఠోరసత్యం! ‘కోడ్ రెడ్’ కన్నా తీవ్రం విశ్వవ్యాప్తంగా వచ్చే రెండు దశాబ్దాలు తీవ్రమైన వాతావరణ ప్రతికూల పరిస్థితుల్ని జీవరాశి ఎదుర్కోవాల్సి వస్తుందని ఐపీసీసీ నివేదిక చెబుతోంది. ఆరో అంచనా నివేదిక తొలిభాగంలోనే, ఇది మానవాళికి తీవ్రమైన ‘కోడ్ రెడ్’ ప్రమాదమని హెచ్చరించిన అధ్య యన బృందం, పరిస్థితులు మరింత తీవ్రంగా ఉండబోతున్నాయని తాజా నివేదికలో చెప్పింది. ప్రపంచ స్థాయిలో సత్వర నివారణ, దిద్దుబాటు, సర్దుబాటు చర్యలు చేపట్టకపోతే ‘జీవయోగ్య, నిలకడైన భవితను పరిరక్షించుకునే అవకాశాన్ని మనం చేజేతులా జారవిడుచు కున్న వారమవుతాం’ అని హెచ్చరిస్తోంది. ప్రధానంగా అరడజను అంశాల్లో పరిస్థితులు విషమించే ఆస్కారాన్ని నొక్కి చెప్పింది. 1. మితిమీరిన కర్బన ఉద్గారాల వల్ల భూతాపోన్నతి పెరిగి జీవన పరిస్థితులు సంక్లిష్టమౌతాయి. వెట్ బల్బ్ సిండ్రోమ్‌తో, ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలు దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొం టాయి. అసాధారణ సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటాయి. 2. పెరిగే తుపాన్లు, అతి వర్షాలు, వరదలు, కరవులు వంటి అతివృష్టి, అనా వృష్టి పరిణామాల కారణంగా ఆహారోత్పత్తి రమారమి తగ్గిపోతుంది. 2050 నాటికి భారత్‌లో 40 శాతం జనాభా నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. తిండి గింజలు ఖరీదై పెద్ద సంఖ్యలో పేదలు తిండి కోసం అల్లాడుతారు. పిల్లల ఎదుగుదలపై పౌష్టికాహార లోపం ప్రతికూల ప్రభావం చూపుతుంది. 3. భూతాపోన్నతి వల్ల ధ్రువాల మంచు కరిగి, సముద్ర జల మట్టాలు 44–76 సెం.మీ. పెరగటం వల్ల దీవులు, తీర నగరాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటాయి. ప్యారిస్‌లో చేసిన ప్రతిజ్ఞలకు ప్రపంచ దేశాలు కట్టుబడ్డా ఈ దుఃస్థితి తప్పదు. ఉద్గారాల్ని ఇంకా వేగంగా నియంత్రించగలిగితే... సముద్ర జల మట్టాల పెరుగుదలను 28–55 సెం.మీ. మేర నిలువరించవచ్చు. తీరనగరాల మునక, నగరాల్లో వరద సంక్షోభం, భూక్షయం, తీరాలు ఉప్పుగా మారి వ్యవసాయ అయోగ్యత వంటి వాటిని కొంతలో కొంత అదుపు చేయొచ్చు, 4. అతి వేడి, వడగాలులు, అసాధారణ వాతా వరణ పరిస్థితుల వల్ల జబ్బులు పెరిగి అనారోగ్యం తాండవిస్తుంది. శ్వాస, రక్తప్రసరణ, చర్మ సంబంధ రోగాలతో పాటు మధుమేహం వంటివి అధికమౌతాయి. 5. సీసీ (క్లైమేట్ ఛేంజ్)తో విద్యుత్తు వంటి ఇంధన వినియోగంలో అసాధారణ మార్పులు వస్తాయి. 6. అటవీ, సముద్ర తదితర అన్ని రకాల జీవావరణాలు (ఎకోసిస్టమ్స్) దెబ్బతిని జీవవైవిధ్యం అంతరిస్తుంది. భూతాపోన్నతిని అనుకున్నట్టు 2 డిగ్రీల కన్నా లోపు నియంత్రించకపోతే, మూడో వంతు జీవరాశి అంత మయ్యే ప్రమాదముంది. సానుకూల మార్పే నిర్ణాయక శక్తి అభివృద్ధి నిర్వచనంతో పాటు సమకాలీన రాజకీయాల దశ, దిశ మారాల్సిన అవసరం ఎంతో ఉంది. ఐరాస నిర్వచించినట్టు సుస్థిరా భివృద్ధి అంటే, ‘భవిష్యత్తరాల ప్రయోజనాల్నీ పరిగణనలోకి తీసు కొని, వాటిని పరిరక్షిస్తూ... ప్రస్తుత తరాలు తమ అవసరాల్ని తీర్చు కునేలా ప్రకృతి వనరుల్ని సమర్థంగా వినియోగించుకోవడం’. ఐపీసీసీ వంటి ముఖ్యనివేదికల సిఫారసుల్ని పాటించే సంకల్పం తీసుకోవ డానికి ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ కొత్త సమీకృత హరిత అజెండాతో రావాలి. ప్రతి పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇది అజెండా కావాలి. సంబంధిత వర్గాలన్నీ సత్వరం నడుం కడితే తప్ప జీవరాశి మనుగడకు భరోసా లేదు. ఇదే మనందరి తక్షణ కర్తవ్యం. వ్యాసకర్త: దిలీప్ రెడ్డి సీనియర్ పాత్రికేయులు -
మన పాపం! ప్రకృతి శాపం!!
కొరడాతో కొట్టినట్టు చెబితే కానీ కొన్ని విషయాల తీవ్రత అర్థం కాకపోవచ్చు. ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఆధ్వర్యంలో వాతావరణ మార్పులపై పనిచేస్తున్న ‘ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్’ (ఐపీసీసీ) బృందం తాజా నివేదిక సోమవారం వెల్లడించిన అంశాలు పరిస్థితి తీవ్రత తెలిపాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రపంచం ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అగత్యాన్ని మరోసారి గుర్తుచేశాయి. ప్రపంచ మానవాళిలో 40 శాతం మంది, అంటే సుమారు 350 కోట్ల మంది డేంజర్ జోన్లో జీవిస్తున్నారనీ, మన పర్యావరణ వ్యవస్థల్లో అనేకం సరిదిద్దడానికి వీలు లేనంతగా ఇప్పటికే పాడయ్యాయనీ ఐపీసీసీ చెప్పినమాట ప్రపంచ దేశాలు కచ్చితంగా కలవరపడాల్సిన విషయం. 67 దేశాలకు చెందిన 270 మంది శాస్త్రవేత్తలు కలసి రూపొందించగా, 195 ప్రభుత్వాలు ఆమోదించిన కీలక నివేదిక ఇది. వాతావరణంలోని మార్పులతో ప్రపంచ వ్యాప్తంగా మొక్కలతో సహా ఈ భూగోళం మీది సమస్త ప్రాణికోటికీ ముప్పు ముంచుకొస్తోందని ఈ నివేదిక సారాంశం. వడగాలులు, కరవులు, వరదల లాంటి పర్యావరణ ప్రమాదాలు మరింత పెరగవచ్చట. ఆఫ్రికా, ఆసియా, మధ్య – దక్షిణ అమెరికా సహా అనేక ప్రాంతాల్లో ఆహారం, నీటికి ఇబ్బందులు తలెత్తవ చ్చట. ఇక, మన దేశంలోనూ మరికొన్నేళ్ళలోనే అనేక ప్రాంతాలు ఎంతటి దుర్భర నివాసాలుగా తయారవుతాయన్నది వింటే నిష్ఠురంగా అనిపించవచ్చు. కానీ, నిజాలు గ్రహించి, నిద్ర నుంచి మేలుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని అర్థం చేసుకోవాలి. అహ్మదాబాద్ ఓ ఉష్ణ ద్వీపమైతే, సముద్ర మట్టం పెరిగి ముంబయ్ వరద బాధిత నగరమవుతుంది. చెన్నై, భువనేశ్వర్, పాట్నా, లక్నో లాంటి నగరాలు ఉక్కపోతకు నిలయాలవుతాయని ఐపీసీసీ పారాహుషార్ చెబుతోంది. మానవాళి అందరికీ ఏకైక నివాసమైన ఈ భూగోళం పట్ల బాధ్యతను అగ్రరాజ్యాలు విస్మరిస్తు న్నాయి. ఆదర్శంగా ముందుండి నడపడం మానేసి, పెద్దయెత్తున కాలుష్యానికి కారణమవుతున్న ప్రపంచ శక్తులన్నీ ఇందులో ‘నేరస్థులే’ అని ఐరాస ప్రధాన కార్యదర్శి కుండబద్దలు కొట్టారు. కటు వుగా తోచినా, అది అక్షరసత్యం. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత మహా అయితే 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ మించకుండా చూడాలనేది ప్యారిస్ వాతావరణ ఒప్పందం పెట్టుకున్న లక్ష్యం. కానీ, అసలంటూ భూతాపంలో పెరుగుదలే సురక్షితం కాదని ఐపీసీసీ నివేదిక హెచ్చరిస్తోంది. లక్ష్యంగా పెట్టుకు న్నట్టు 1.5 డిగ్రీల పెంపునకే కట్టడి చేయగలిగినా సరే, ఈ పుడమి మీది జీవజాతుల్లో దాదాపు 14 శాతం అంతరించిపోయే ప్రమాదం ఉందట. ఒకవేళ అత్యధికంగా 3 డిగ్రీలు పెరిగితే, ఈ భూస్థలి మీది ప్రాణుల్లో దాదాపు మూడోవంతు కథ ముగిసిపోతుందట. ఒక రకంగా ఈ నివేదిక తుది హెచ్చరిక. శాస్త్రవేత్తలు తమ తదుపరి నివేదికను ఈ దశాబ్ది చివరలో వెల్లడిస్తారు. ఇప్పుడు గనక కళ్ళు తెరవకుంటే, అప్పటికి పరిస్థితి చేయి దాటి, చేయడానికి ఏమీ లేకుండా పోతుంది. పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను గమనిస్తే, గ్రీన్హౌస్ వాయువులు సహా అనేక అంశాల్లో ప్రస్తుతం ప్రపంచ దేశాలు చేసిన వాగ్దానాలు ఇందుకు ఏ మాత్రం సరిపోవు. ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నా సరే... ఉద్గారాలు దాదాపు 14 శాతం పెరిగి, సంక్షోభం తప్పదని నిపు ణుల హెచ్చరిక. కాబట్టి, ప్రపంచ దేశాలు మరింత ఉన్నత లక్ష్యాలను పెట్టుకోక తప్పదు. ఐరాస లక్షించినట్టుగా వచ్చే 2030 నాటి కల్లా ప్రపంచవ్యాప్తంగా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను 45 శాతం మేర తగ్గించాలి. 2050 కల్లా ఉద్గారాలలో ‘నెట్ జీరో’ స్థాయిని సాధించాలి. ఈ ఐరాస లక్ష్యాలకు ఇక నుంచైనా కట్టుబడి ఉండడం ప్రపంచ శ్రేయస్సుకు కీలకం. పరిస్థితి ఇవాళ ఇంత ముంచుకొచ్చిందంటే, దానికి కారణం... మనమే! గతంలోని నిష్క్రియా పరత్వం, ముందుగానే మేల్కొని ఉద్గారాలను గణనీయంగా తగ్గించేందుకు కృషి చేయడంలో వైఫల్యం – ఇవన్నీ ఇప్పుడు కట్టికుడుపుతున్నాయి. శిలాజ ఇంధనాల నుంచి తక్కువ కర్బన ప్రత్యామ్నాయాలకు క్రమంగా మారాలనే ఆలోచన ఇప్పుడిక చాలేలా లేదు. ఆర్కిటిక్ దగ్గరి శాశ్వత ఘనీభవన మంచు పూర్తిగా కరిగిపోయే ప్రమాదం ఉందనీ, అమెజాన్ వర్షారణ్యం కాస్తా గడ్డిపరకల సవానా భూమిగా మారుతుందనీ ఆందోళన కనిపిస్తోంది. అంటే, ఐపీసీసీ అంచనాల కన్నా ముందే పర్యావరణ ఉత్పాతాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. పర్యావరణాన్ని వేడెక్కించే గ్రీన్హౌస్ వాయువులంటే ఒక్క కార్బన్ డయాక్సైడే కాకపోయినా, దానితో సహా అన్నిటికీ అడ్డుకట్ట వేయాలి. శిలాజ ఇంధనాలను పట్టుకొని వదలని నేరస్థ దేశాలన్నీ సత్వరం తమ పద్ధతులు మార్చుకోవాలి. మన దేశమూ కొన్నేళ్ళుగా వాతావరణ సంక్షోభాన్ని చవిచూస్తోంది. మొత్తం 75 శాతం జిల్లాలు వాతావరణంలో అతి మార్పులకు అడ్డాలయ్యా యని ‘కౌన్సిల్ ఫర్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్’ చేసిన 2021 నాటి అధ్యయనం. పునరు త్పాదక ఇంధనాల వైపు మనం ఎంత త్వరగా కదిలితే అంత మంచిది. కానీ, కనుచూపు మేరలో అది జరిగేలా కనిపించకపోవడమే దురదృష్టం. తాజా ఉక్రెయిన్ యుద్ధంతో జర్మనీ లాంటివి తాజాగా తమ విదేశాంగ విధానాన్ని మార్చుకొని, 10 వేల కోట్ల యూరో కరెన్సీని సైనిక సంపత్తిపై ఖర్చు పెడుతున్నాయి. అదే దశాబ్దకాలంగా ప్రకృతి యుద్ధం ప్రకటించినా, అండగా నిలిచేందుకు చేతులు రాకపోవడం దురదృష్టం. ఇక, చేతులు కాలక ముందే మనం తప్పులు సరిదిద్దుకోవడం అవసరం. పర్యావరణ అనుకూల విధానాలతో జీవించేమార్గాన్ని అలవరచుకోవడమే ప్రపంచానికి శ్రీరామరక్ష. -
Climate Change: కలిసి కదిలితేనే భూ రక్ష!
అనుమానాలకు తావు లేదిప్పుడు... చూద్దాం.. చేద్దామన్న పోకడనూ మరచిపోండి!! వాతావరణ మార్పులన్నవి ముమ్మాటికీ నిజం. నిజం. నిజం!! ధోరణి మారకుంటే.. భావితరాలు ఈ భూమ్మీద.. బతకడం కష్టమేనని గుర్తుంచుకోండి!! ప్రకృతిని తద్వారా మనల్ని మనం కాపాడుకునేందుకు... ఈ క్షణం నుంచే సంకల్పం చెప్పుకోండి. కంకణం కట్టుకోండి!! వ్యక్తులుగా మీరు చేసే చిన్న చిన్న పనులు ప్రపంచానికొచ్చిన పెనువిపత్తును తప్పించగలవా అన్న సంశయమూ వద్దు!! కెనడాలో 50 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు.. జర్మనీలో అకాల వర్షాలు, వరదలు.. చైనాలో వెయ్యేళ్ల రికార్డులు తిరగరాస్తూ కుంభవృష్టి!! ఇవన్నీ ఏవో కాకతాళీయంగా జరిగిన సంఘటనలని కొందరు అనుకోవచ్చు కానీ.. భూతాపోన్నతితో వచ్చిన వాతావరణ మార్పులకు ప్రత్యక్ష నిదర్శనాలీ ఘటనలన్నవి సుస్పష్టం. వాతావరణ మార్పుల ప్రభావంపై అధ్యయనం చేస్తున్న ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్‌క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) తాజా నివేదిక కూడా.. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం, అటవీ విస్తీర్ణంలో తగ్గుదల, కాలుష్యం తదితర కారణాల వల్ల భూమి సగటు ఉష్ణోగ్రత.. క్రమేపీ పెరిగిపోతోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే... కార్చిచ్చులు, కుంభవృష్టి, అకాల వర్షాల్లాంటి ప్రకృతి విపత్తులు మరింత ఎక్కువ అవడం గ్యారంటీ అని స్పష్టం చేసింది. ఈ విషయం చాలాకాలంగా తెలిసినప్పటికీ ఐపీసీసీ తాజా నివేదిక మరోసారి రూఢీ చేయడమే కాకుండా... తుది ప్రమాద హెచ్చరికల్లాంటివి జారీ చేసింది. భూతాపోన్నతిని తగ్గించే చర్యలు తక్షణం చేపట్టకపోతే 2040 కల్లా సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీ సెల్సియస్ పెరగడం తథ్యమని స్పష్టం చేసింది. ఆ... భూమి మొత్తమ్మీద జరిగే పరిణామాలకు నేనేం చేయగలను? ఆ పాట్లేవో మన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాలు పడతారులే అనుకోనవసరం లేదు. ఎందుకంటే.. వ్యక్తులు తమ జీవనశైలిలో చేసుకునే కొన్ని మార్పులు కూడా ఉడతా సాయంగానైనా ఉపకరిస్తాయి. అదెలాగో చూడండి... ఆహార వృథాను అరికట్టండి... మీకు తెలుసా? శిలాజ ఇంధనాల తరువాత భూతాపోన్నతికి కారణమవుతున్న వాటిల్లో ఆహార పరిశ్రమ అతిపెద్దదని? ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే పాడి, మాంసం అనే రెండు అంశాలు వాతావరణ మార్పులకు ఉన్న కారణాల్లో ప్రధానమైనవి, పాడిపశువుల పెంపకానికి ఫీడ్ నీరు, విద్యుత్తు, నేల వంటి వనరులను వినియోగించుకుని పెరగడం ఒక కారణం. అలాగే మాంసం కోసం పెంచే కొన్ని జంతువులు ప్రమాదకరమైన మీథేన్ వాయువును ఎక్కువగా వదులుతాయి. పశువులు పెంచేందుకు వీలుగా కొన్నిచోట్ల అటవీ భూములను చదును చేయడమూ కద్దు! ఇవన్నీ ఒకఎత్తు అయితే... మనం తినే ఆహారాన్ని వృథా చేయడం ఇంకో ఎత్తు. మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా మానవ వినియోగానికి సిద్ధం చేసిన ఆహారంలో కనీసం మూడొంతులు వృథా అవుతోందని? దీని విలువ ఏడాదికి అక్షరాలా లక్షకోట్ల డాలర్లు! ప్రపంచంలో సగం మంది శాఖాహారులుగా మారిపోతే ఏటా తగ్గే కార్బన్డయాక్సైడ్ మోతాదు 660 కోట్ల టన్నులు మనిషి సగటున ఏడాదికి ఐదు టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదల చేస్తాడని అంచనా. కానీ ఇది దేశాన్ని బట్టి మారుతూంటుంది. అమెరికా, దక్షిణ కొరియా వంటి పారిశ్రామిక దేశాల్లో ఇది 16.5 టన్నులు కాగా.. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది 1.6 టన్నులుగా ఉంది. ప్రత్యామ్నాయాలకు జై కొట్టండి... భూతాపోన్నతిని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అంటే సౌర, పవన, జీవ, జల ఇంధనాల వాడకం కచ్చితంగా పెరగాలి. ఇంట్లో బల్బులు, ఫ్యాన్లు తిరిగేందుకు అవసరమైనంతైనా సరే.. సౌరశక్తిని వాడుకోగలిగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఒకప్పుడు దీని ఖరీదు ఎక్కువే కానీ.. 2010 నాటితో పోలిస్తే ఇప్పుడు 73 శాతం చౌక. రకాన్ని బట్టి ఇప్పుడు భారత్‌లో ఒక్కో వాట్ సోలార్ప్యానెల్కు అయ్యే ఖర్చు రూ.23 నుంచి రూ.140 వరకూ ఉంటోంది. ఇంట్లో 20 వాట్ల ఎల్ఈడీలు ఐదు ఉన్నాయనుకుంటే రూ.2300 ఒక ప్యానెల్ కొనుక్కుని వాడుకుంటే చాలు పైగా మనకు సూర్యరశ్మికి అసలు కొదవే లేదు. ప్లాస్టిక్ బాటిల్ స్థానంలో గాజుబాటిల్ వాడినా. వస్త్రంతో తయారైన సంచీలతో సరుకులు, కాయగూరలు తెచ్చుకున్నా... అవసరానికి మంచి దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు కొనకపోయినా... ఇలా మన దైనందిన జీవితంలో ప్రతి చిన్న మార్పూ భూమికి శ్రీరామరక్షగా నిలుస్తుంది!! ఇంట్లో పొదుపు మంత్రం... భూతాపోన్నతిని తగ్గించేందుకు మనమేమీ అదనంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. పైగా ఈ చర్యలు పాటించడం వల్ల నాలుగు డబ్బులు మిగులుతాయి కూడా. ఇంట్లోని ఏసీలో ఉష్ణోగ్రతను 24 స్థాయి నుంచి 26 డిగ్రీలకు పెంచారనుకోండి. మీకు కరెంటు ఆదా.. వాతావరణంలో చేరే కాలుష్యమూ తగ్గుతుంది. అలాగే సాధారణ బల్బుల స్థానంలో సమర్థమైన, చౌకైన, ఎక్కువ కాలం మన్నే ఎల్ఈడీ బల్బులు వాడటమూ ఉభయ ప్రయోజనకరం. ప్రపంచమంతా ఎల్ఈడీలు వాడితే ఏటా 7,800 కోట్ల కర్బన ఉద్గారాలను అడ్డుకోవచ్చు. సూర్యభగవానుడిచ్చే ఎర్రటి ఎండను కాదని వాషింగ్మెషీన్లో డ్రయింగ్ ఆప్షన్‌ను వాడితే భూమికి చేటు చేయడమే కాకుండా.. మీ జేబుకు పడే చిల్లూ ఎక్కువ అవుతుందని గుర్తించండి. ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువుల (టీవీ, మిక్సీ, వాషింగ్‌మెషీన్, ఓవెన్, గీజర్ లాంటివి)ను అవసరం లేనప్పుడు కేవలం స్విచాఫ్ చేయడం కాకుండా... ప్లగ్ తీసి ఉంచడమూ కరెంటును ఆదా చేస్తుందని తెలుసుకోండి. సమర్థమైన ఎల్ఈడీ బల్బులను అందరూ ఉపయోగించడం మొదలుపెడితే అయ్యే ఆదా ఏడాదికి... తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు. వృక్షో రక్షతి రక్షితః... చెట్లను కాపాడుకుంటే అవి మనల్ని రక్షిస్తాయన్న ఈ సంస్కృత నానుడి ఈ రోజుకూ అక్షర సత్యం. ఇల్లు, అపార్ట్మెంట్, బడి, ఆఫీసు ఇలా వీలైనప్రతి చోట మొక్కలు నాటామనుకోండి. వాతావరణంలోని కార్బన్డ యాక్సైడ్‌ను కొంతమేరకైనా తగ్గించవచ్చు. చెట్లు, మహాసముద్రాలు కార్బన్ డయాక్సైడ్ను పీల్చేసుకుని ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండేలా చేయగలవు. కానీ నిమిషానికి పది ఎకరాలకు పైగా అడవులను వివిధ కారణాలతో నరికేస్తున్న పరిస్థితుల్లో వాతావరణంలో విషవాయువుల మోతాదు పెరిగిపోతోంది! అందుకే,అడవులను కాపాడుకోవడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా కోటానుకోట్ల మొక్కలు నాటడం అత్యవసరం. పెట్రోల్, డీజిల్ వాడకానికి కళ్లెం! భూతాపోన్నతికి పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి సహజసిద్ధ ఇంధన వనరుల విచ్చలవిడి వాడకం ప్రధాన కారణం. వీటిని తగ్గిస్తే తద్వారా వాతావరణంలోకి చేరే విష వాయువుల మోతాదు తగ్గి భూతా పోన్నతిని నియంత్రించవచ్చు. ఇరుగు పొరుగు వీధుల్లో పనులకు బైక్‌ల బదులు సైకిళ్లు వాడినా, కాళ్లకు పని చెప్పినా ఈ భూమికి మనవంతు మేలు చేసినట్లే. దూరా భారమైతే సొంత వాహనాల్లో కాకుండా.. బస్సులు, ట్రైన్లను వాడాలని నిపుణులంటున్నారు. విమానాల్లో వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే.. వీలైనంత వరకూ డైరెక్ట్ ఫ్లైట్లను ఎంచుకోవడం మేలు. ఎందుకంటే... విమానాల నుంచి వెలువడే కార్బన్డయాక్సైడ్ టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లోనే ఎక్కువ. మన ప్రయాణంలో కనెక్టింగ్ ఫ్లైట్లు ఉంటే ల్యాండింగ్, టేకాఫ్ ఒకటి కంటే ఎక్కువసార్లు ఉంటాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
కరోనాను మించిన ముప్పు!
ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన వార్త. మరోసారి అందరినీ అప్రమత్తం చేసిన విషయం. మనం చేస్తున్న తప్పులనూ, ఇప్పటికైనా చేయాల్సిన మన కర్తవ్యాన్నీ గుర్తు చేసిన సుదీర్ఘమైన శాస్త్ర నివేదిక. ‘వాతావరణ మార్పులపై ఏర్పాటైన అంతర్ ప్రభుత్వ సభ్యమండలి’ (ఐపీసీసీ) విడుదల చేసిన 6వ అంచనా నివేదిక (ఎఆర్)ను అభివర్ణించాలంటే ఇలాంటి మాటలెన్నో. ‘వాతావరణ మార్పు 2021 – ది ఫిజికల్ సైన్స్ బేసిస్’ పేరిట వచ్చిన ఈ నివేదిక ముందున్నది ముసళ్ళ పండగ అని గుర్తు చేసింది. ఈ నివేదిక వెలువడ్డ సమయం, సందర్భం కీలకం. ఇటీవల గ్రీసులో, క్యాలిఫోర్నియాలో కార్చిచ్చులు చూశాం, జర్మనీలో వరదలతో వేలమంది నిరాశ్రయులై, నీళ్ళు – విద్యుత్ లేని వైనం తెలుసు. మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో మండిన ఎండలు, ఆపై కుండపోత వానలు, వరదలు, కొండచరియలు విరిగిపడడాలూ చూశాం. వాతావరణ మార్పులతో మానవాళికి ముంచుకొస్తున్న ముప్పును గుర్తుచేసిన ఈ ఘటనల నేపథ్యంలో తాజా నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. పారిశ్రామిక విప్లవం మొదలు మానవ కార్యకలాపాల వల్ల పోగుబడ్డ ప్రభావమే వాతావరణంలో శరవేగంగా మార్పు తెస్తోంది. ఉష్ణోగ్రతలో పెరుగుదల, వడగాడ్పులు, అనూహ్య వర్షాలు, కార్చిచ్చులు – ఇలా ఉత్పాతాల దిశగా నడిపిస్తోంది. ఇలాగే సాగితే ఈ 21వ శతాబ్దంలో ప్రపంచ ఉష్ణోగ్రత 1.5 నుంచి 2 డిగ్రీలు పెరిగి, శాశ్వత పర్యవసానాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మానవాళికి ఇది కరోనాను మించిన ముప్పు. ఆ సంగతే స్పష్టం చేస్తూ, ఎక్కడెక్కడ, ఎలాంటి అనూహ్య మార్పులు రానున్నాయో చెబుతున్న ఈ నివేదిక మానవాళికి ఓ ముందస్తు హెచ్చరిక. ఎనిమిదేళ్ళ శ్రమతో, ప్రపంచ శ్రేణి శాస్త్రవేత్తలు 234 మంది రూపొందించగా, 195 జాతీయ ప్రభుత్వాలు ఆమోదించిన నివేదిక ఇది. గతంతో పోలిస్తే, మరింత కచ్చితమైన పద్ధతులతో అధ్యయనం చేసి మరీ, 3 వేల పైచిలుకు పేజీల తొలి విడత నివేదికలో నిర్దిష్టమైన అంచనాలు వేశారు. అందుకే, ఈ శాస్త్రీయ జోస్యాన్ని ఆషామాషీగా తీసుకోలేం. భారతీయ నమూనాలను కూడా భాగం చేసుకొని మరీ ఈ అధ్యయనం సాగించారన్నది గమనార్హం. మన దేశంలోనూ అనూహ్యమైన వాతావరణ మార్పులు చోటుచేసుకోనున్నాయని ‘రెడ్ కోడ్’ చూపిందీ నివేదిక. సముద్రమట్టాలు పెరిగి, ముంబయ్, చెన్నై, కొచ్చి, విశాఖపట్నం లాంటి 12 తీరప్రాంత పట్నాలకు ముప్పు తప్పదని హెచ్చరించింది.దక్షిణ భారతావనిలో ఊహించని వర్షాలు ముంచేస్తాయంది. అందుకే, మానవాళిగా మనం చేపట్టాల్సిన చర్యలలో ఇప్పటికే కాలాతీతమైంది అంటున్నారు శాస్త్రవేత్తలు. మూడు దశాబ్దాల క్రితం ఐపీసీసీ తొలి నివేదికను వెలువరించింది. ఈ 30 ఏళ్ళలో ఇది కీలకమైన 6వ నివేదిక. కానీ, వాతావరణ మార్పులను అరికట్టేలా మనం తగిన చర్యలు చేపట్టామా అన్నది ప్రశ్నార్థకం. భూతాపాన్ని పెంచే వాయువుల విడుదలను రానున్న పదేళ్ళలో తక్షణమే తగ్గించకపోతే కష్టమే. భూతాపం 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ మించి పెరగకుండా జాగ్రత్త పడాలన్నది 2015 నాటి ప్యారిస్ వాతావరణ ఒప్పందం లక్ష్యం. కానీ, కర్బన ఉద్గారాల్ని తగ్గించాలి, అలా తగ్గించే సాంకేతికతను అన్ని దేశాలకూ అందుబాటులోకి తేవడంలో దేశాల మధ్య ఏకాభిప్రాయం, త్రికరణశుద్ధి ప్రయత్నం ఇవాళ్టికీ కానరావడం లేదు. ప్యారిస్ లక్ష్యం విఫలమైతే మళ్ళీ తగ్గించలేని రీతిలో దుష్ప్రభావాలు పడతాయి. తరచూ వరదలు, భరించలేనంత వడగాడ్పులు, విధ్వంసకర దుర్భిక్షాలు తప్పవన్నది శాస్త్రవేత్తల తీవ్ర హెచ్చరిక. ఇప్పటికే అంతరిస్తున్న బ్రిటన్‌లోని పఫిన్ లాంటి చిన్న పక్షుల మొదలు ప్రపంచంలో ఎన్నెన్ని జీవరాశులు అరుదైపోతాయో లెక్కలేదు. ప్రకృతి ఇస్తున్న ఈ సంకేతాలను ప్రపంచ రాజకీయ నేతలు పట్టించుకోకుంటే కష్టం, నష్టం మనకే. పుడమి తల్లి కష్టాల కూడలిలో ఉన్న వేళ బాధ్యత భుజానికి ఎత్తుకోవాల్సింది ఈ తరమే. రానున్న పదేళ్ళ కాలం అందుకు కీలకం. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్న పడికట్టు మాటలతో సరిపెట్టకుండా, విధానపరమైన కృతనిశ్చయం చూపాలి. 2060 నాటికి కర్బన ఉద్గారాలే లేకుండా చేస్తానంటూనే, మరోపక్క దేశవిదేశాల్లో బొగ్గుతో నడిచే విద్యుత్కేంద్రాలు చైనా కడుతూనే ఉంది. ‘వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి భాగస్వామ్య పక్షాల 26వ సదస్సు’ (సీఓపీ–26) ఈ అక్టోబర్ – నవంబర్‌లో జరగాల్సి ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ గడ్డపై అత్యంత కీలకమైన సమాలోచనగా భావిస్తున్న ఈ సదస్సుకు అక్కడి బోరిస్ జాన్సన్ ప్రభుత్వం ఏ మేరకు సిద్ధంగా ఉన్నదీ అనుమానమే. మాటకూ, చేతకూ పొంతన లేని అంశాలు ఇలా ఎన్నో! అయితే, అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ చర్యలు అవసరమని కరోనా అనుభవం ప్రపంచానికి రుజువు చేసింది. వాతావరణ మార్పులపై నివేదిక అలాంటి అవసరమే ఉందని మనకు ‘రెడ్ కోడ్’ సాక్షిగా చెబుతోంది. ఆలస్యం చేసినా, వాయిదా వేసినా తిప్పలు తప్పవు. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు ముందడుగు వేసి, వర్ధమాన దేశాలకూ సాంకేతిక పరిజ్ఞానంలో చేయందించాలి. భారత్ కూడా భూతాపోన్నతి పెంచే వాయువులనూ, కార్బన్ డయాక్సైడ్ను వాతావరణం నుంచి తగ్గించాలి. ఇది పర్యావరణ శాఖల బరువే కాదు... ప్రజల జీవనశైలి మార్పుల బాధ్యత కూడా! ఎందుకంటే, కళ్ళెదుటి మార్పుల గురించి ఐపీసీసీ నివేదిక మోగించిన ప్రమాద ఘంటికలు... అక్షరాలా శ్రీశ్రీ అన్న ‘యముని మహిషపు లోహఘంటల’ చప్పుడే! ఇది ప్రపంచం పెనునిద్దర వదలాల్సిన శబ్దం. పెడచెవిన పెట్టేసి, మాటలతో పొద్దుబుచ్చితే– ఫలితం అనుభవించేది మనమే! -
భారత్‌కు కరువు, వడగాల్పుల ముప్పు
న్యూఢిల్లీ: హిందూ మహా సముద్రం వేగంగా వేడెక్కుతోందని వాతావరణ మార్పుపై విడుదల చేసిన ఐపీసీసీ నివేదిక హెచ్చరించింది. ఈ ప్రభావంతో భారత్‌లో వడగాలులు, వరదలు పెచ్చురిల్లుతాయని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ మహాసముద్రం వేడెక్కడంతో దేశం చుట్టూ ఉన్న సముద్ర మట్టాలు పెరుగుతాయని, దీనివల్ల లోతట్టు ప్రాంతాలు భారీ వరదలు, ముంపునకు గురవుతాయని, నేలలో తేమ తగ్గడంతో పలు చోట్ల కరువు సంభవిస్తుందని నివేదిక వెల్లడించింది. ఇండియా లాంటి జనసాంద్రత అధికంగా ఉన్న దేశంలో వడగాలులు పెరగడాన్ని ఏరోసాల్స్(గాలిలో ఉండే సూక్ష్మమైన ధూళి కణాలు) కొంతవరకు అడ్డుకుంటాయని, అయితే దీనివల్ల గాలిలో నాణ్యత లోపిస్తుందని తెలిపింది. రాబోయే రోజుల్లో దేశంలో వానలు, వరదలు పెరగడం, హిమనీ నదాలు కరిగిపోవడం, ఇదే సమయంలో సముద్ర మట్టాలు పెరగడం కలగలిపి భారీ ఇక్కట్లు కలగజేస్తాయని హెచ్చరించింది. ఈ పరిణామాలు అంత తొందరగా ఆగకపోవచ్చని నివేదిక రూపకర్తలో ఒకరైన ఫ్రెడరిక్ ఒట్టో చెప్పారు. దేశీయంగా సముద్ర మట్టాల పెరుగుదలకు 50 శాతం కారణం అధిక ఉష్ణోగ్రతలేనని మరో సైంటిస్టు స్వప్న చెప్పారు. 21 శతాబ్దమంతా భారత్ చుట్టూ సముద్ర మట్టాలు పెరగడాన్ని గమనించవచ్చని, అలాగే వందల సంవత్సరాలకు ఒకమారు వచ్చే సముద్ర బీభత్సాలు ఈ శతాబ్దం చివరకు సంభవించవచ్చని అంచనా వేశారు. వచ్చే 20– 30 ఏళ్లలో భారత్‌లో వర్షపాతం పెద్దగా మారకపోవచ్చని కానీ శతాబ్దాంతానికి తేడా వస్తుందని పేర్కొంది. భారత్, దక్షిణాసియాల్లో అసాధారణ రుతుపవన గమనాలుంటాయని ఐపీసీసీ తెలిపింది. దీనివల్ల స్వల్పకాలిక వర్షపాత దినాలు ఎక్కువైతాయని, దీర్ఘకాలిక వర్షదినాలు తగ్గుతాయని తెలిపింది. పట్టణీకరణ(అర్బనైజేషన్)తో పెరుగుతున్న ప్రమాదాలను వివరించింది. మానవ తప్పిదాలే ఈ పరిస్థితులకు కారణమని నివేదిక తెలిపింది. 1970 నుంచి మానవ చర్యల కారణంగా సముద్ర పర్యావరణంలో మార్పులు వస్తున్నాయని, 1990తో పోలిస్తే ఆర్కిటిక్ సముద్రం 40 శాతం కుంచించుకుపోయిందని తెలిపింది. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను గణనీయంగా తగ్గించకపోతే ఊహించని ప్రమాదాలు తప్పవని, ఇప్పటినుంచే మేల్కొని తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. -
చిన్న విషయం... పెద్ద గొడవ
సాక్షి, హైదరాబాద్: చిన్న పార్కింగ్ విషయం ఇద్దరు వ్యక్తులు కొట్టుకొని హాస్పటల్ పాలయ్యేలా చేసింది. హైదరాబాద్‌లోని మొయినబాగ్లో పార్కింగ్ విషయంలో ఇద్దరు ఇరుగు పొరుగు వారి మధ్య అర్ధరాత్రి సమయంలో గొడవజరిగింది. ఆ గొడవ కాస్తా చినికి చినికి గాలి వానలా మారి కొట్టుకొని గాయాలపాలయ్యి ఆసుపత్రిలో చేరాలా చేసింది. భవని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. దీనిపై సంతోష్ నగర్ డివిజన్ ఏసీపీ శివరామ్ శర్మ మాట్లాడుతూ...‘ గొడవ తరువాత ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నారు. దీంతో అక్కడ ఉంటున్న వారందరూ గొడవ చూడటానికి గుమిగూడారు. ఇండియన్ పీనల్ కోడ్ కింద దీనికి సంబంధించిన కేసు నమోదు చేశాం. ఇద్దరికి గాయాలు కావడంతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై మరింత దర్యాప్తు చేపడతాం ’అని తెలిపారు. (వలస కార్మికుల బస్సుకు తప్పిన ప్రమాదం) -
ముంచుతున్న మంచు!
లండన్ : చంద్రుడు కుంచించుకుపోతున్నాడం టూ ఇటీవలే ఓ వార్తను మనమంతా చదివాం. ఇప్పుడు భూమికీ అదే దుస్థితి దాపురిస్తోంది. అయితే చంద్రుడి మీద పరిస్థితికి అక్కడి ప్రకృతే కారణం కాగా... భూమికి ఈ దుస్థితి దాపురించడానికి మాత్రం మానవ చర్యలే కారణమవుతున్నాయి. పెరుగుతున్న వాహనాల వినియోగం, ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న వాయువులు వెరసి రోజురోజుకీ భూతాపం విపరీతంగా పెరిగిపోతుంది. ఫలితంగా ధృవ ప్రాంతాల్లో మంచు వేగంగా కరుగుతోంది. దీనివల్ల సముద్ర మట్టాలు అంచనాలకు మించి పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామం భవిష్యత్తులో ప్రమాదకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ మంచు ఫలకాలు కరగడమే కారణం... గ్రీన్లాండ్ ద్వీపం సహా అంటార్కిటికా ఖండంలో ఉండే అతి భారీ మంచు ఫలకాలు వేగంగా కరుగుతుండడమే సముద్ర మట్టాలు పెరగడానికి కారణమని శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది. యూకేలోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన వివరాలను నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. సముద్ర మట్టాలు పెరగడం వల్ల తీర ప్రాంతవాసులకు ముప్పు ఏర్పడడంతోపాటు పర్యావరణ వ్యవస్థకు నష్టం తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో సముద్ర మట్టం పెరుగుదలకు సంబంధించి శాస్త్రీయ అంచనాలు, ప్రణాళిక వ్యూహాలు, చర్యలు తదితర వివరాలు ఈ నివేదికలో వివరించారు. 2100 నాటికి... స్ట్రక్చర్డ్ ఎక్స్పర్ట్ జడ్జిమెంట్ (ఎస్ఈజే) అనే పరిజ్ఞానం ఉపయోగించి గ్రీన్లాండ్, పశ్చిమ, తూర్పు అంటార్కిటిక్ ప్రాంతాల్లోని మంచు ఫలకాల పరిధిని అంచనా వేశారు. ఈ విషయమై బ్రిస్టల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జొనాథన్ బాంబర్ మాట్లాడుతూ... ‘ఈ పరిజ్ఞానంతో అంచనా వేస్తే.. భవిష్యత్తులో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిన పక్షంలో 2100 నాటికల్లా సముద్ర మట్టం రెండు మీటర్ల మేర పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 1.79 మిలియన్ల చదరపు కిలోమీటర్ల భూమి కోల్పోనున్నట్లు అంచనా. ఇందులో ఉపయోగకరమైన సాగు భూమి కూడా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 187 మిలియన్ల మంది ప్రజలు దీనివల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉంద’ని బాంబర్ తెలిపారు. ఇది మానవాళికి తీవ్రమైన ముప్పేనని ఆయన విశ్లేషించారు. -
మరి ఆ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినట్లు..!
అక్కడ మంచు పెరుగుతోంది:నాసా గ్లోబల్ వార్మింగ్ పై గగ్గోలు పెట్టేవారు.. భూమికి వచ్చే ప్రమాదాల్లో మొదట చెప్పే ఉదాహరణ.. దృవాల వద్ద కరుగుతున్న మంచు, పెరుగుతున్న సముద్ర మట్టాలు. అయితే వీరికి సమాధానం కాదు కానీ.. ధృవాల వద్ద మంచు కరగటం లేదని నాసా తేల్చేసింది. పై పెచ్చు.. పెరుగుతోందట. ముఖ్యంగా అంటార్కిటికా ఖండంలో భారీగా మంచు నిల్వలు పేరుకుంటున్నాయని నాసా పరిశోధనలు స్పష్టం చేశాయి. నాసాకి చెందిన ఐస్, క్లౌడ్, అండ్ ల్యాండ్ ఎలివేషన్ శాటిలైట్ (ICESat) రాడార్ అల్టీ మీటర్ సాయంతో అంటార్కిటికా వద్ద మంచు పరిమాణం లెక్కగట్టినట్లు నాసా స్పేస్ సెంటర్ గ్లాసియోలజిస్ట్ జే జ్వాలీ వివరించారు. అంటార్కిటికా వద్ద పెద్ద మొత్తంలో మంచు పోగు పడుతోందని ఆయన అన్నారు. 2013లో ఇచ్చిన ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ ఆన్ క్లైమెట్ ఛేంజెస్ (IPCC)రిపోర్టులో ఈ విషయం స్పష్టం చేశారు. శాటిలైట్ అందించిన డేటా ఆధారంగా.. అధ్యయనం చేసిన శాస్త్ర వేత్తలు.. 1992 నుంచి 2001 మధ్య అంటార్కిటికా వద్ద ఏడాదికి 112 బిలియన్ టన్నుల మంచు పోగైందని పేర్కొన్నారు. కాగా.. తర్వాత ఐదేళ్లలో ఈ రేటు కాస్త తగ్గినా.. 2003 నుంచి 2008 వరకూ ఏడాదికి 82 బిలియన్ టన్నుల మంచు వచ్చి చేరిందని తెలిపారు. తమ అధ్యయనాల్లో వెస్ట్ అంటార్కిటికాలోని పైన్ ద్వీపం ప్రాంతంలో మంచు ఉత్సర్గ పెరుగుదల(మంచు కరగటం)నమోదైందని వివరించారు. కానీ ఈస్ట్ అంటార్కిటికా.. వెస్ట్ అంటార్కిటికాలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి దీనికి భిన్నంగా ఉందని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో తాము మంచు పెరగటాన్ని గమనించామని చెప్పారు. ఇది ఇతర ప్రాంతాల్లో మంచు నష్టాలను మించి ఉందని అన్నారు. కానీ.. అంటార్కిటికాలో మునుపటి మంచు గుట్టలను తిరిగి పొందేందుకు కొన్ని దశాబ్దాల సమయం పట్టవచ్చని అభిప్పాయపడ్డారు. మంచు యుగం ముగిసిన తర్వాత ఈ ఖండం మీద వాయువుల ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతం పెరిగాయని తెలిపారు. దీని కారణంగా.. దృవాల వద్ద 50శాతం మంచు కరిగి పోయిందని వివరించారు. సుమారు 10వేల సంవత్సరాల నుంచి దృవాల వద్ద మంచు పోగు పడటం.. గట్టిపడటం మొదలైందని తెలిపారు. మంచు గట్టిపడటానికి శతాబ్దాల సమయం పట్టిందని అన్నారు. తూర్పు అంటార్కిటికా, పశ్చిమ అంటార్కిటికా లోతట్టు ప్రాంతాల్లో ఏటా 0.7 అంగుళాల మేర మంచు గుట్టలు పెరుగుతున్నాయని చెప్పారు. సముద్రమట్టాలు పెరిగేందుకు అంటార్కిటికా మంచు కారణం కాదని ఈపరిశోధనలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. అయితే.. ఏటా సముద్ర మట్టాలు 0.27 మిల్లీ మీటర్ల పెరుగుదల నమోదు చేస్తున్నాయి. వీటికి వేరే ఏదైనా కారణం ఉండి ఉంటుందని అన్నారు. ఈ కారణం ఏంటో తేల్చడం ప్రస్తుతం సైంటిస్టుల ముందున్న పెద్ద సవాలని ఆయన అన్నారు.