ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన వార్త. మరోసారి అందరినీ అప్రమత్తం చేసిన విషయం. మనం చేస్తున్న తప్పులనూ, ఇప్పటికైనా చేయాల్సిన మన కర్తవ్యాన్నీ గుర్తు చేసిన సుదీర్ఘమైన శాస్త్ర నివేదిక. ‘వాతావరణ మార్పులపై ఏర్పాటైన అంతర్ ప్రభుత్వ సభ్యమండలి’ (ఐపీసీసీ) విడుదల చేసిన 6వ అంచనా నివేదిక (ఎఆర్)ను అభివర్ణించాలంటే ఇలాంటి మాటలెన్నో. ‘వాతావరణ మార్పు 2021 – ది ఫిజికల్ సైన్స్ బేసిస్’ పేరిట వచ్చిన ఈ నివేదిక ముందున్నది ముసళ్ళ పండగ అని గుర్తు చేసింది. ఈ నివేదిక వెలువడ్డ సమయం, సందర్భం కీలకం. ఇటీవల గ్రీసులో, క్యాలిఫోర్నియాలో కార్చిచ్చులు చూశాం, జర్మనీలో వరదలతో వేలమంది నిరాశ్రయులై, నీళ్ళు – విద్యుత్ లేని వైనం తెలుసు. మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో మండిన ఎండలు, ఆపై కుండపోత వానలు, వరదలు, కొండచరియలు విరిగిపడడాలూ చూశాం. వాతావరణ మార్పులతో మానవాళికి ముంచుకొస్తున్న ముప్పును గుర్తుచేసిన ఈ ఘటనల నేపథ్యంలో తాజా నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది.
పారిశ్రామిక విప్లవం మొదలు మానవ కార్యకలాపాల వల్ల పోగుబడ్డ ప్రభావమే వాతావరణంలో శరవేగంగా మార్పు తెస్తోంది. ఉష్ణోగ్రతలో పెరుగుదల, వడగాడ్పులు, అనూహ్య వర్షాలు, కార్చిచ్చులు – ఇలా ఉత్పాతాల దిశగా నడిపిస్తోంది. ఇలాగే సాగితే ఈ 21వ శతాబ్దంలో ప్రపంచ ఉష్ణోగ్రత 1.5 నుంచి 2 డిగ్రీలు పెరిగి, శాశ్వత పర్యవసానాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మానవాళికి ఇది కరోనాను మించిన ముప్పు. ఆ సంగతే స్పష్టం చేస్తూ, ఎక్కడెక్కడ, ఎలాంటి అనూహ్య మార్పులు రానున్నాయో చెబుతున్న ఈ నివేదిక మానవాళికి ఓ ముందస్తు హెచ్చరిక.
ఎనిమిదేళ్ళ శ్రమతో, ప్రపంచ శ్రేణి శాస్త్రవేత్తలు 234 మంది రూపొందించగా, 195 జాతీయ ప్రభుత్వాలు ఆమోదించిన నివేదిక ఇది. గతంతో పోలిస్తే, మరింత కచ్చితమైన పద్ధతులతో అధ్యయనం చేసి మరీ, 3 వేల పైచిలుకు పేజీల తొలి విడత నివేదికలో నిర్దిష్టమైన అంచనాలు వేశారు. అందుకే, ఈ శాస్త్రీయ జోస్యాన్ని ఆషామాషీగా తీసుకోలేం. భారతీయ నమూనాలను కూడా భాగం చేసుకొని మరీ ఈ అధ్యయనం సాగించారన్నది గమనార్హం. మన దేశంలోనూ అనూహ్యమైన వాతావరణ మార్పులు చోటుచేసుకోనున్నాయని ‘రెడ్ కోడ్’ చూపిందీ నివేదిక. సముద్రమట్టాలు పెరిగి, ముంబయ్, చెన్నై, కొచ్చి, విశాఖపట్నం లాంటి 12 తీరప్రాంత పట్నాలకు ముప్పు తప్పదని హెచ్చరించింది.దక్షిణ భారతావనిలో ఊహించని వర్షాలు ముంచేస్తాయంది. అందుకే, మానవాళిగా మనం చేపట్టాల్సిన చర్యలలో ఇప్పటికే కాలాతీతమైంది అంటున్నారు శాస్త్రవేత్తలు.
మూడు దశాబ్దాల క్రితం ఐపీసీసీ తొలి నివేదికను వెలువరించింది. ఈ 30 ఏళ్ళలో ఇది కీలకమైన 6వ నివేదిక. కానీ, వాతావరణ మార్పులను అరికట్టేలా మనం తగిన చర్యలు చేపట్టామా అన్నది ప్రశ్నార్థకం. భూతాపాన్ని పెంచే వాయువుల విడుదలను రానున్న పదేళ్ళలో తక్షణమే తగ్గించకపోతే కష్టమే. భూతాపం 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ మించి పెరగకుండా జాగ్రత్త పడాలన్నది 2015 నాటి ప్యారిస్ వాతావరణ ఒప్పందం లక్ష్యం. కానీ, కర్బన ఉద్గారాల్ని తగ్గించాలి, అలా తగ్గించే సాంకేతికతను అన్ని దేశాలకూ అందుబాటులోకి తేవడంలో దేశాల మధ్య ఏకాభిప్రాయం, త్రికరణశుద్ధి ప్రయత్నం ఇవాళ్టికీ కానరావడం లేదు. ప్యారిస్ లక్ష్యం విఫలమైతే మళ్ళీ తగ్గించలేని రీతిలో దుష్ప్రభావాలు పడతాయి. తరచూ వరదలు, భరించలేనంత వడగాడ్పులు, విధ్వంసకర దుర్భిక్షాలు తప్పవన్నది శాస్త్రవేత్తల తీవ్ర హెచ్చరిక. ఇప్పటికే అంతరిస్తున్న బ్రిటన్‌లోని పఫిన్ లాంటి చిన్న పక్షుల మొదలు ప్రపంచంలో ఎన్నెన్ని జీవరాశులు అరుదైపోతాయో లెక్కలేదు.
ప్రకృతి ఇస్తున్న ఈ సంకేతాలను ప్రపంచ రాజకీయ నేతలు పట్టించుకోకుంటే కష్టం, నష్టం మనకే. పుడమి తల్లి కష్టాల కూడలిలో ఉన్న వేళ బాధ్యత భుజానికి ఎత్తుకోవాల్సింది ఈ తరమే. రానున్న పదేళ్ళ కాలం అందుకు కీలకం. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్న పడికట్టు మాటలతో సరిపెట్టకుండా, విధానపరమైన కృతనిశ్చయం చూపాలి. 2060 నాటికి కర్బన ఉద్గారాలే లేకుండా చేస్తానంటూనే, మరోపక్క దేశవిదేశాల్లో బొగ్గుతో నడిచే విద్యుత్కేంద్రాలు చైనా కడుతూనే ఉంది. ‘వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి భాగస్వామ్య పక్షాల 26వ సదస్సు’ (సీఓపీ–26) ఈ అక్టోబర్ – నవంబర్‌లో జరగాల్సి ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ గడ్డపై అత్యంత కీలకమైన సమాలోచనగా భావిస్తున్న ఈ సదస్సుకు అక్కడి బోరిస్ జాన్సన్ ప్రభుత్వం ఏ మేరకు సిద్ధంగా ఉన్నదీ అనుమానమే. మాటకూ, చేతకూ పొంతన లేని అంశాలు ఇలా ఎన్నో!
అయితే, అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ చర్యలు అవసరమని కరోనా అనుభవం ప్రపంచానికి రుజువు చేసింది. వాతావరణ మార్పులపై నివేదిక అలాంటి అవసరమే ఉందని మనకు ‘రెడ్ కోడ్’ సాక్షిగా చెబుతోంది. ఆలస్యం చేసినా, వాయిదా వేసినా తిప్పలు తప్పవు. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు ముందడుగు వేసి, వర్ధమాన దేశాలకూ సాంకేతిక పరిజ్ఞానంలో చేయందించాలి. భారత్ కూడా భూతాపోన్నతి పెంచే వాయువులనూ, కార్బన్ డయాక్సైడ్‌ను వాతావరణం నుంచి తగ్గించాలి. ఇది పర్యావరణ శాఖల బరువే కాదు... ప్రజల జీవనశైలి మార్పుల బాధ్యత కూడా! ఎందుకంటే, కళ్ళెదుటి మార్పుల గురించి ఐపీసీసీ నివేదిక మోగించిన ప్రమాద ఘంటికలు... అక్షరాలా శ్రీశ్రీ అన్న ‘యముని మహిషపు లోహఘంటల’ చప్పుడే! ఇది ప్రపంచం పెనునిద్దర వదలాల్సిన శబ్దం. పెడచెవిన పెట్టేసి, మాటలతో పొద్దుబుచ్చితే– ఫలితం అనుభవించేది మనమే!
కరోనాను మించిన ముప్పు!
Published Wed, Aug 11 2021 12:08 AM | Last Updated on Wed, Aug 11 2021 12:08 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment