ఢిల్లీలోని కుతుబ్ మినార్‌కు విద్యుత్ కాంతులు.. జీ20 శిఖరాగ్రం 2023 లోగో
న్యూఢిల్లీ/వాషింగ్టన్: ప్రపంచంలో శక్తివంతమైన జీ–20(గ్రూప్–20) అధ్యక్ష బాధ్యతలను భారత్ గురువారం లాంఛనంగా చేపట్టింది. ఏడాది పాటు ఈ బాధ్యతలను నిర్వర్తించనుంది. జీ–20 అధినేతగా భారతదేశ లక్ష్యాలను వివరిస్తూ ప్రధాని మోదీ తాజాగా పత్రికలు, వెబ్‌సైట్‌లో ఒక ఆర్టికల్(వ్యాసం) విడుదల చేశారు. పలు ట్వీట్లు చేశారు. ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ స్ఫూర్తితో ప్రపంచదేశాలను ఏకం చేసేందుకు కృషి చేస్తామని ఉద్ఘాటించారు. ఉగ్రవాదం, వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి వంటివి నేడు మానవళికి అతిపెద్ద సవాళ్లుగా మారాయని, అందరం కలిసికట్టుగా వాటిని ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. ప్రపంచంలో కొన్ని దేశాల కంఠశోషను ఎవరూ వినిపించుకోవడం లేదని ఆక్షేపించారు. జీ–20 దేశాలతోపాటు.. నిర్లక్ష్యానికి గురైన దేశాలను కూడా కలుపుకొని ముందుకెళ్తామని, అందరితో చర్చించి, తమ జీ–20 ప్రాధాన్యతలను నిర్ణయించుకుంటామని వివరించారు.
పాత ఆలోచనా ధోరణికి స్వస్తి
‘మానవ కేంద్రీకృత ప్రపంచీకరణ’కు సంబంధించిన ఒక కొత్త నమూనా కోసం ప్రపంచ దేశాల ప్రజలంతా చేతులు కలిపి, ఉమ్మడిగా కృషి చేయాలని సూచించారు. ప్రపంచ దేశాల నడుమ ఆహారం, ఎరువులు, ఔషధ ఉత్పత్తుల సరఫరాను రాజకీయ కోణంలో చూడొద్దని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో మొత్తం మానవళికి మేలు కలిగేలా మన ఆలోచనా విధానం(మైండ్‌సైట్) మార్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. కొరతకు, సంఘర్షణలకు కారణమయ్యే పాత ఆలోచనా ధోరణికి స్వస్తి పలకాలని చెప్పారు. కలిసికట్టుగా ఉంటూ, సవాళ్లను ఎదిరించడానికి గాను మన ఆధ్యాత్మిక సంప్రదాయాల నుంచి స్ఫూర్తిని పొందడానికి ఇదే సరైన సమయమని వివరించారు.
మనకు యుద్ధం అక్కర్లేదు
మొత్తం మానవ జాతికి కనీస అవసరాలను తీర్చగలిగే ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురాగల మార్గాలు ప్రపంచంలో ఉన్నాయని, మనుగడ కోసం ఒకరిపై ఒకరు పోరాటం చేయాల్సిన అవసరం లేదని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రస్తుతం మనకు యుద్ధం ఎంతమాత్రం అవసరం లేదని వ్యాఖ్యానించారు. భవిష్యత్తు తరాల భద్రమైన జీవితాల కోసం సామూహిక జనన హనన ఆయుధాల నిర్మూలన దిశగా శక్తివంతమైన దేశాల నడుమ చర్చలకు చొరవ చూపుతామని వెల్లడించారు. ప్రపంచ శాంతి, రక్షణ కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తామన్నారు.
భారత్‌తో కలిసి నడుస్తాం: అమెరికా
జీ–20 కూటమి అధ్యక్ష హోదాలో ఉన్న భారత్‌కు మద్దతు ఇవ్వడానికి, కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా పేర్కొంది. ఆహారం, ఇంధన భద్రత వంటి పెనుసవాళ్లను పరిష్కరించే విషయంలో భారత్‌తో కలిసి నడవాలని అమెరికా నిర్ణయించకున్నట్లు వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కెరైన్ జీన్–పియర్రీ చెప్పారు. జీ–20 దేశాల అధినేత శిఖరాగ్ర సదస్సు 2023 సెప్టెంబర్ 9, 10న ఇండియా రాజధాని ఢిల్లీలో జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment