లండన్ : చంద్రుడు కుంచించుకుపోతున్నాడం టూ ఇటీవలే ఓ వార్తను మనమంతా చదివాం. ఇప్పుడు భూమికీ అదే దుస్థితి దాపురిస్తోంది. అయితే చంద్రుడి మీద పరిస్థితికి అక్కడి ప్రకృతే కారణం కాగా... భూమికి ఈ దుస్థితి దాపురించడానికి మాత్రం మానవ చర్యలే కారణమవుతున్నాయి. పెరుగుతున్న వాహనాల వినియోగం, ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న వాయువులు వెరసి రోజురోజుకీ భూతాపం విపరీతంగా పెరిగిపోతుంది. ఫలితంగా ధృవ ప్రాంతాల్లో మంచు వేగంగా కరుగుతోంది. దీనివల్ల సముద్ర మట్టాలు అంచనాలకు మించి పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామం భవిష్యత్తులో ప్రమాదకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారీ మంచు ఫలకాలు కరగడమే కారణం...
గ్రీన్‌లాండ్ ద్వీపం సహా అంటార్కిటికా ఖండంలో ఉండే అతి భారీ మంచు ఫలకాలు వేగంగా కరుగుతుండడమే సముద్ర మట్టాలు పెరగడానికి కారణమని శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది. యూకేలోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన వివరాలను నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. సముద్ర మట్టాలు పెరగడం వల్ల తీర ప్రాంతవాసులకు ముప్పు ఏర్పడడంతోపాటు పర్యావరణ వ్యవస్థకు నష్టం తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో సముద్ర మట్టం పెరుగుదలకు సంబంధించి శాస్త్రీయ అంచనాలు, ప్రణాళిక వ్యూహాలు, చర్యలు తదితర వివరాలు ఈ నివేదికలో వివరించారు.
2100 నాటికి...
స్ట్రక్చర్డ్ ఎక్స్‌పర్ట్ జడ్జిమెంట్ (ఎస్‌ఈజే) అనే పరిజ్ఞానం ఉపయోగించి గ్రీన్‌లాండ్, పశ్చిమ, తూర్పు అంటార్కిటిక్ ప్రాంతాల్లోని మంచు ఫలకాల పరిధిని అంచనా వేశారు. ఈ విషయమై బ్రిస్టల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జొనాథన్ బాంబర్ మాట్లాడుతూ... ‘ఈ పరిజ్ఞానంతో అంచనా వేస్తే.. భవిష్యత్తులో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిన పక్షంలో 2100 నాటికల్లా సముద్ర మట్టం రెండు మీటర్ల మేర పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 1.79 మిలియన్ల చదరపు కిలోమీటర్ల భూమి కోల్పోనున్నట్లు అంచనా. ఇందులో ఉపయోగకరమైన సాగు భూమి కూడా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 187 మిలియన్ల మంది ప్రజలు దీనివల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉంద’ని బాంబర్ తెలిపారు. ఇది మానవాళికి తీవ్రమైన ముప్పేనని ఆయన విశ్లేషించారు.
Comments
Please login to add a commentAdd a comment